Telugu language |
తెలుగువాడి మాతృభాష తెలుగేనా?
..రావు తల్లాప్రగడ
ఎంత పల్కిన కాదురా - నీవెంత నేర్చిన కాదురా!
నేత సహితం జాతి మొత్తం కలసి పల్కిన కాదురా!
మాత పలుకని భాష నీకు మాతృభాషెట్లగునురా?- నీది భాషెట్లగునురా!
మూతి దగ్గిర ముద్ద పెడుతూ మాత అన్నదె మాటరా!- మాతృభాషన అదియెరా!
మమ్మీ డాడీలవంటి పదాలతో పెరిగిన పిల్లలకు మాతృభాష ఏమిటి? తెలుగు అని అనాలా ఆంగ్లమనాలా? లేక వారికి అసలు మాతృభాషే లేదనాలా? తెలుగు తల్లితండ్రులకు పుట్టినంత మాత్రాన మన మాతృభాష తెలుగైపోదు కదా! మన మాతృభాష తెలుగు అని మనం గర్వంగా చెప్పుకొని తిరగాలీ అంటే, మనం ఎంత నేర్చుకున్నామని కానీ, ఎంత భాషా ప్రావీణ్యాన్ని సాధించామని కానీ, ఎంత మంది తెలుగువారి మద్యలోవున్నామని కానీ నిర్ణయించలేవు. దానికి కూడా కొన్ని అర్హతలను మనం సాధించుకోవాలి. ముందుగా తల్లి ఆ బిడ్డతో తెలుగులోనే మాట్లాడివుండాలి. బిడ్డకు అలా తెలుగు వచ్చి వుండాలి. బిడ్డ పలికిన తొలిమాటలు ముద్దుముద్దుగా తెలుగులోనే వుండివుండాలి. తల్లి పెట్టిన గోరుముద్దలు తింటూ తెలుగులోనే ఆలోచిస్తూ నేర్చుకుంటూ పెరిగి పెద్ద అయ్యివుండాలి.
అప్పుడవుతుంది తెలుగు వాడి అది మాతృభాష. లేకుంటే అది ఒక కులంలో పుట్టినంత మాత్రాన ఆ కులస్తుడనని చెప్పుకున్నట్టు వుంటుంది, వాడి మాతృభాష కూడా. తెలుగులో మాటలాడటమే ఫాషను కాదనుకునే తల్లితండ్రుల వద్ద పెరిగిన ఈ నాటి బిడ్డలకు మాతృభాష తెలుగు ఎలా అవుతుంది?
చాతుర్వర్ణ్యం మయా సృష్టం
గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం
విద్ధ్యకర్తారమవ్యయమ్|| 4-13 ||(శ్రీమద్భగవద్గీత)
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్ణములు సత్త్వాది గుణముల యొక్కయు, ఆ గుణములచే చేయబడు కర్మలయొక్కయు, విభాగము ననుసరించి నాచే సృజింపబడినవి. వారికి నేను కర్తనైనప్పటికిని (ప్రకృతికి అతీతుడనగుటచే) వాస్తవముగ నన్ను అకర్తగను, నాశరహితునిగను (నిర్వికారునిగను) ఎఱుఁగుము.
సత్యం దానమథాద్రోహ అనృశంస్యం త్రపా ఘృణా
తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతీరితః - (మహాభారతం శాంతిపర్వం)
ఎవనిలో సత్యము, దానము, ఇతరులకు అపకారం చెయ్యకపోవడం, మృదుత్వం, సిగ్గు (ఎవరేమనుకుంటారో అన్న జంకు), జాలి, తపస్సు ఉంటాయో అతను బ్రాహ్మణుడు.
అంటే, బ్రాహ్మణకులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడని పైన చెప్పిన శ్లోకాల ద్వారా తెలుస్తోంది. మనం చేసే కర్మలను బట్టి, మన గుణాల బట్టి, మనం బ్రాహ్మణుడా కాదా అని నిర్ణయించబడుతుందట. అలాగే, తల్లి దగ్గిర తెలుగు నేర్చుకోకుండా తెలుగువాడిగా చెలామణి అవ్వచ్చునేమో గానీ, … మాతృభాష మాత్రం తెలుగు ఖచ్చితంగా కాలేదు.
ఐక్యరాజ్యసమితి సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషలలో 13 స్థానంలో తెలుగు వుందట. కానీ…. అంతరించే భాషలో కూడా తెలుగును చేర్పించాల్సి వస్తోందట! కారణం.. ఆంధ్రదేశంలో తెలుగుకన్నా ఆంగ్లమే ఎక్కువగా చలామణీ అవుతోందట.
అయితే ఆంధ్రదేశంలో చదువురాని వారే ఎక్కువగా వుండటం చేత, ఆ అదృష్టవశాత్తూ, వారికి తెలుగు తప్ప మరొక భాష రాదని, మొన్న ఒక పెద్దమనిషి అంటే ఒక పిచ్చి సంతృప్తి దక్కింది. అంటే భాష ఇప్పుడే అంతరించదట, ఇంకొన్నేళ్ళు పడుతుందట. అంటే అందరూ చదువుకునే దాకా,… అందరూ కాస్త డబ్బు సంపాదించుకుని ఎదిగేదాకా,… అప్పటిదాకా మనకు టైము వుందన్న మాట. బాగుంది! అంటే అందరూ తెలుగు నేర్చుకోవాలని కోరుకోవాలా? లేక మనవారు నిరక్షరాస్యులుగానే మిగిలిపోవాలని కోరుకోవాలా? మొదటిది ఆశ అడియాశగానే కనిపిస్తున్నది. రెండవది ఇష్టంకాకపోయినా, నష్టమే అయినా, కొంచెం మంచే చేస్తున్నది! దీనినే Blessing in Disguise అంటారేమో!
ఆంగ్లము లేక హిందీ నేర్చుకోరాదని కాదు. నిజానికి ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. అది ఎంత మంచిదీ అంటే… అది మన మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు.
అక్కడ "బహుభాషా అధ్యయనం-మానసిక ప్రభావం" అన్న అంశంపై ఎన్నో వివరాలు దొరుకుతాయి. ప్రపంచ భాషలు నేర్చుకోవాలి. కానీ అవి మాతృభాష నేర్చుకున్న తరువాతనే అని శాస్త్రజ్ఞులు ఘోషిస్తున్నారు. అప్పుడే బహుభాషా అధ్యయనంలో ఉపయోగాలు కనిపిస్తాయి అని వాదిస్తున్నారు. ఎప్పటికి మనం వారి వేదనను అర్థం చేసుకోగలుగుతామో తెలియదు. ఏది యేమైనా ఈ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగానైనా మనం మన తెలుగు భాష నిజంగా మన మాతృభాష అయ్యేటట్లు జాగ్రత్తపడాలి. ప్రతి తల్లీ తన బిడ్దతో తెలుగులోనే మాట్లాడి తెలుగుని మాతృభాషగా భావి తరానికి అందించాలి. పిల్లలకు సరైన తెలుగు వాతావరణం అందించాలి. అప్పటికీ వాడు నేర్చుకోపోతే అది వాడి ఖర్మ. కానీ తల్లితండ్రులు మనం మన బాధ్యతలను విస్మరించకుండా, తప్పుడు మార్గాలనెంచుకోకుండా జాగ్రత్తపడితే చాలు. అదే మనం చేయగలిగింది. చేయవలసింది.
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం
1952లో అలనాటి పాకిస్తానులో భాగమైన ఢాకా (ఈనాడు బాంగ్లాదేశ్) నగరంలో తమ బాంగ్లా భాషను సైతం ఉర్దూ భాషతో పాటూ సమానంగా గుర్తించాలి అని అంటూ అక్కడి విద్యార్థులు జరిపిన ఆందోళనను విశ్మరించి వారిపై ప్రభుత్వం కాల్పులు జరిపి విరుచుకు పడింది. ఆ నాడు మరణించిన ఆందోళనకారులను స్మరిస్తూ ఆ దినాన్ని "అంతర్జాతీయ మాతృభాషాదినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అలా 2000 సంవత్సరం నాటి నుంచీ ప్రతి ఫిబ్రవరి 21వ తారీఖునీ అంతర్జాతీయ మాతృభాషాదినం గా మనం జరుపుకుంటు వస్తున్నాము.
తరువాత మే 16, 2009 నాడు ఐక్యరాజ్యసమితి అన్ని దేశాలకూ తమ తమ ప్రజల భాషలను పరిరక్షించవలసిందిగా కోరుతూ ఒక తీర్మానాన్ని జారీ చేసింది. ఆ తీర్మానంలోనే 2008వ సంవత్సరాన్ని అంతర్జాతీయ భాషా సంవత్సరంగా గుర్తించవలసింది కూడా ప్రతిపాదిస్తూ విభిన్నభాషలతో ఏకత్వాని సాధించమని విజ్ఞప్తి చేసింది. మన మాతృభాషలు కేవలం భాషలే కావు, వాటితో కలసి పెరిగిన అనేక సనాతన సంస్కృతీ సంస్కారాల పట్ల మనకు అవగాహన లభిస్తుంది అని వారు ప్రబోధించారు. భాష ఒక దేశ చరిత్రలో భాగమే కాదు, ఆ దేశ సంస్కృతికి చెందిన ఒక వారసత్వాన్ని, ఒక సాహితీ నిధిని అందిస్తుంది. ఒక భాష పతనమైపోతే అది పరభాషేయైనా అది తక్కినవారందరికి కూడా తీరని నష్టాన్ని తెస్తుందనీ గుర్తుచేసింది. ప్రపంచభాషలను బ్రతికించుకోవడం ఆందరి బాధ్యత అని విజ్ఞప్తి చేసింది.
ఏది ఏమైనా మన భాష అందరూ నేర్చుకుంటేనే బాగుంటుంది. అదే మనకు గౌరవం. మన పిల్లలు మన భాష నేర్చుకోవాలంటే ముందు మనం తెలుగు నేర్చుకోవాలి. తెలుగులో మాట్లాడాలి. తెలుగులో ఆలోచించాలి. అసలు మాతృభాషంటేనే తల్లి మాట్లాడే భాష అని అర్థం. అందుకని ఆ బాధ్యత ముఖ్యంగా తల్లులపైనే వుంటుంది. ఆలోచించండి….
---- ---- ----
ఆది శంకరాచార్యుల వారిది మళయాల దేశమే ఐనా, నిజానికి వారు తెలుగు వారేనట తెలుసా? (పైన చెప్పిన విధంగా ఆయన మాతృభాష తెలుగు కాకపోవచ్చు కానీ, కనీసం జాతి అన్నా మనదేనని గర్వించవచ్చు.) జ్వాలా నరసింహారావు గారి "అతిరాత్రం" వ్యాసం చదవండి. వివరాలు మీకే తెలుస్తాయి.
...సిలికాంద్ర - మర్చి 2011