హిందూ బాలుడు |
హిందూ అంటే?
సంస్కృత వ్యాకరణంలో 'హిమ' అనే ధాతువుకు పాపము అని అర్ధము. 'దూ' అనగా దూషయతి, ఖండయతి. కనుక హిందువనగా పాపరహితుడని అర్ధం. సింధు నదికి, హిందూ మహాసముద్రానికి మధ్య భాగంలో నివసించే వారిని హిందువులని, వీరి విశిష్టమైన ఆచారవ్యవహారాలతో కూడిన సంస్కృతిని హిందూ ధర్మమని చెప్పబడింది.
హిందూ ధర్మం అని పిలవడం తప్పా?
తప్పే లేదు. సనాతన ధర్మంగా పిలవబడే మన ధర్మానికి హిందూ ధర్మమనే పేరుతొ పిలవడం తప్పుగా ఎలా భావించ వచ్చు? పేరు గురించి పెద్ద రాద్దాంతం చేసుకోవలసిన పనిలేదు కానీ, మన ఆచార వ్యవహారాలను మరచిపోయి, దిగజారిపోకుండా హిందూ అనే పేరుతొ వ్యవహరించడం దోషమేమీ కాదు.
నేటి ధర్మ ప్రచారకులు ఈ విషయాన్ని గుర్తించాలి. అందుకై మన ప్రాచీన ఆచారాలను, ధార్మిక భావాలను, శాస్తాలను పరిరక్షించి రాబోవు తరం వారికి అందించే యోగ్యులైన అనుసంధాన కర్తలు కావాలి.
A holy man worships God within, during the 2019 Kumbh Mela—a major Hindu festival in India |
మతం అన్నా, ధర్మం అన్నా ఒకే అర్ధాన్ని సూచిస్తుందా?
మనిషి యుక్క మతి (మనసు)లో కలిగిన భావననే మతమంటారు. వ్యక్తిని ఆలంబనగా చేసుకుని ఉద్భవించినవే మతాలు. మనం అత్యంత ప్రమాణంగా భావించే వేదాలను వ్యక్తులు ఊహించి చెప్పినవి కావు. త్యాగమూర్తులైన బుషులు తపమాచరించి దర్శించిన సత్యాలను వేదములంటాము. అట్టి వేదములు నిర్దేశించిన మార్గమే ధర్మమార్గం. అందుకే మనది మతం కాదు. సనాతన ధర్మమని గ్రహించాలి. ధర్మమే మనకు ప్రధానం. శాస్త్రం సూచించిన మార్గాన్ని అనుసరించడమే ధర్మం. అట్టి శాస్తాన్ని ప్రామాణికంగా అంగీకరించే మన సంస్కృతిలో వ్యక్తిగతమైన ఆలోచనలకు, రాగద్వేషాలకు తావు లేదు.
సనాతన ధర్మం అన్నారు. సనాతనం అంటే ఏమిటి?
సనాతనం అంతే శాశ్వతంగా ఉండేదని అర్ధం. సనాతన ధర్మంలోని ఆచారాలను పాటించడం వల్ల లాభమేమిటి?
సనాతనధర్మశాస్తాలు మానవుని శ్రేయస్సుకై ప్రధానంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి.
- జీవన విధానం,
- జీవిత లక్ష్యం.
ఇవి రెండూ అర్ధం కాని వారి జన్మ వ్యర్థమే. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పురుషార్థాల ద్వారా పొంద వచ్చని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి.