భర్త యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి?
భార్య తన తల్లిదండ్రులను, తన వాళ్ళను, తన ఇంటి పేరును, గోత్రాన్ని వదులుకుని భర్తనే తన సర్వస్వమని భావిస్తుంది. అట్టి భార్య 'హృదయంతే దదామి" అంటుంది. అనగా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానని అర్ధం. భర్త 'తవచిత్త మనుచిత్తం భవతు' అంటాడు. నీ హృదయం నన్ను అనుసరించుగాక అని అర్ధం.
భౌతికమైన ఆకర్షణలకే పరిమితం కాకుండా ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవరచుకోవాలి. ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి యుండాలి. భార్యను అర్ధాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తెరిగి గృహానికి యజమానిగా తనవంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి.
భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి?
భర్త యొక్క మనోభావాలకు, అభిరుచులకనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానములతో సేవించడం వంటి ఉన్నత విలువలు గల భార్య కుటుంబంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పుతుంది. అందుకే 'భార్యామూలమిదంగృహం" అన్నారు.
పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంత సేపూ బాగుండడం, ఏదైనా తేడా వస్తే వారి మీద కోపగించడం, ద్వేషించడం వంటి చర్యలు పనికిరావు. పరిస్థితులు బాగా లేనపుడు కూడా వాటిని అవగాహనతో పరిష్కరించుకో గలిగే సామర్ధ్యాలను పెంపొందించుకుంటూ అన్యొన్యతతో, సదవగాహనతో వ్యవహరించాలి.
గృహస్థుల పాత్ర కేవలం దాంపత్యమునకే పరిమితం చెందక సంతానం పట్ల సరైన అవగాహనతో తల్లి, తండ్రి అనే అత్యంత కీలకమైన పాత్రలతో సమర్ధవంతంగా వ్యవహరించాలి.