బోనాల పండుగ |
భాగ్యనగరంలో బోనాల పండగ సందడి నేటి నుంచి మొదలు కానుంది. గోల్కొండలో తొట్టెల ఊరేగింపుతో బోనాలు ప్రారంభమవుతాయి. బోనాల ఉత్సవాలతో నెల రోజులపాటు జంట నగరాలు సందడిగా మారనున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో నేటి నుంచి ఆషాఢ బోనాల జాతర ప్రారంభం కానుంది. మొట్టమొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఆషాడ బోనాల పండుగతో జంటనగరాలు నెల రోజులపాటు కోలాహలంగా మారనున్నాయి. బోనాల పండుగను ఆషాఢమాసంలో నిర్వహిస్తారు. బోనాల్లో భాగంగా.. ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. బోనాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది.
ఇక.. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవం ప్రారంభం కానుండగా.. జులై 10న ఊరేగింపు నిర్వహిస్తారు. మరోవైపు పాతబస్తీలో బోనాల ఉత్సవం జులై 16న ప్రారంభం కానుండగా.. మరుసటి రోజు జులై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నారు.
బోనాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా.. బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేలా బోనాల పండగ నిర్వహిస్తామని మంత్రి తలసాని చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..