The spiritual path |
ఆధ్యాత్మిక మార్గంలో గురువులను ఆశ్రయించే సాధకులు రెండు రకాలుగా ఉంటారు. తమ విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తూ భగవత్సంబంధమైన విషయాలను తెలుసుకోడానికి గురువును ఆశ్రయించే వారు ఒక రకమైతే, కేవలం భౌతిక వాంఛలను తీర్చుకొనేందుకే ఆధ్యాత్మిక మార్గాన్ని, గురువును ఆశ్రయించేవారు ఇంకో రకం. ఈ రెండవ రకం వ్యక్తులకే పై ప్రశ్నలు ఉదయిస్తాయి. బ్రహ్మవిద్య లేక ఆధ్యాత్మ విద్య అనేది లౌకిక విద్య వలే సులభమైనది కాదు.
తాత్కాలికంగా మీదపడిన సమస్యల వల్లనో లేక వయసు మీద పడుతోందనే భావనతోనో గురువును ఆశ్రయించి ప్రవచనాలు విన్నంత మాత్రాన వైరాగ్యం కలిగి జ్ఞానులైపోరు. గురువు బోధించే వాక్యాలను శ్రద్ధతో గ్రహించి సాధన ద్వారా అవరోధాలను దాటవచ్చు. ఈ సాధన వల్ల మానసిక దృక్పథంలో మార్పు కలిగి, భగవత్ చింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
భగవత్ చింతన పట్ల ఆసక్తి పెరిగితే మరి ఉద్యోగాలకు, వ్యాపారాలకు, యితరత్రా వ్యవహారాలకు దూరమౌతామేమో?
అది సరి కాదు. తల్లి ఎన్ని పనులను నిర్వర్తిస్తున్నప్పటికి, ఉయ్యాలలో పడుకున్న శిశువుపై తన మనస్సు నిమగ్నమై యుంటుంది. అలాగని తను నిర్వర్తించే పనులలో అవకతవకలు ఉండవు. అలానే ఉద్యోగ ధర్మంలో గాని, వ్యాపారాలలో గాని, తన పోషణకై ఇతరత్రా వ్యవహారాలను నిర్వర్తిస్తున్నప్పటికి సాధకుడి హృదయం లో మాత్రం భగవత్ చింతన నిరంతరం = సాగుతుంటుంది.
మరి తాదాత్మ్యం చెందకుండా ఈ లౌకిక ప్రపంచంలో వ్యవహారం చేయడం సాధ్యమేనా?
సాధ్యమే. ఈ స్థితి కేవలం విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన మనకు కలగదు. మనం ట్రైన్ లో ప్రయాణం చేయడం కోసం బెర్తు రిజర్వు చేసుకుంటాం. మనకు కేటాయించిన బెర్తును ఉపయోగించుకుని మన గమ్యం చేరగానే విడిచి పెట్టేస్తాము. అలానే ఈ లోకంలో మనకు సమకుర్చబడినవన్నింటిని ఏదో ఒకరోజున విడిచి వెళ్ళాలనే సత్యాన్ని గ్రహించి మానసిక సంసిద్ధతను అలవరుచుకోవాలి.
అట్టి వ్యక్తి చేసే ప్రతి పనిని ఈశ్వర నిర్ణయమేనని సంపూర్ణంగా భావిస్తాడు. తద్వారా లభించే ఫలాలను కూడా ఈశ్వర ప్రసాదంగానే స్వీకరిస్తాడు. ఈ భావననే కర్మయోగమంటుంది శాస్తం. ఈ వ్యక్తిలో లక్ష్య సాధనకు ఎదురుపడే అవరోధాలను అధిగమించే సామర్థ్యం భగవదనుగ్రహం వల్ల సిద్ధిస్తుంది. గృహస్థు కేవలం భోగబుద్ధితో కాకుండా తన ధర్మాలను, కర్తవ్యాలను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించి బుణవిముక్తి పొందే ప్రయత్నం చేయాలి.
బుణాలు ఎన్ని రకాలు?
- దేవ బుణం;
- బుషి బుణం;
- పితృ బుణం;
- భూత బుణం;
- అతిథి బుణం
వీటిని తీర్చుకోవాల్సిన పూర్తి బాధ్యతా గృహస్థులకు ఉన్నది.
దేవ బుణం అంటే?
మనం పీల్చుకోవడానికి ప్రాణవాయువు, మనల్ని మోస్తూ పంటలివ్వడానికి భూమి, మన అవసరాలను, దప్పికను తీర్చే జలము మొదలగు ఈ పంచ భూతాలే మన జీవితానికి ఆధారములు. ఇవి భగవంతుని సృష్టిలో భాగముల. అట్టి ఈ పంచభూతాలే మనకు ప్రత్యక్ష దేవతలు. వాటికి మనం ఎంతో బుణపడి ఉన్నాం. నీటి నిచ్చినందుకు జలం, వెలుగునిచ్చి నందుకు సూర్యుడు, ప్రాణాన్నిచ్చినందుకు గాలి మననుండి ప్రతిఫలం ఆశించడం లేదు కదా!! కనుక వాటిపట్ల కృతజ్ఞతా భావనతో ప్రతినిత్యం గృహంలో భగవదారాధనను నిర్వర్తించుటచే దేవ బుణం తీరుతుంది.
బుషి బుణం అంటే?
మన శాస్తాలకు, సంస్కృతికి మూలం బుషులు. వాటిని ప్రసాదించిన వారికి బుణపడి యున్నాము. భౌతికంగా వారు మన ముందు లేకపోయినా, మన గురువును వారి ప్రతిరూపంగా భావించి, సద్భుద్ధితో వారిని సేవించాలి. వారు మనకందించిన శాస్తములను అధ్యయనం చేసి దానిని ఆచరించడం ద్వారా బుషి బుణాన్ని తీర్చుకోవచ్చు.
పితృ బుణం అంటే?
మన జన్మకు కారకులైన తల్లి దండ్రులకు మనం బుణపడి వున్నాం. వారు జీవించి ఉన్నంత కాలం కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. మన వలన వారు ఏనాడూ కష్టపడకూడదు. ఎన్నడూ బాధ పడకూడదు. అంతేకాదు వారు మరణించిన పిదప శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు వంటి కర్మలను ఆ తిథినాడు విధిగా నిర్వర్తిస్తూ పితృ బుణం తీర్చుకోవాలి.
మరణించిన తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు చేయాలా?
తల్లిదండ్రుల బుణాన్ని శ్రాద్ధ కర్మలను ఆచరించుట ద్వారానే తీర్చుకోగలము. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధమంటారు. మన జన్మకు కారకులై, మనలను పెంచి పోషించినందుకు కృతజ్ఞతగా వారు జీవించి యున్నంతవరకు వారికి కావలసినవసతి సౌకర్యాలను ఏర్పరచి సుఖ పెట్టాలి. అనంతరం వారికి శ్రాద్ధ విధులు నిర్వహించి బుణం తీర్చుకోవాలి.
మనం నిర్వహించే శ్రాద్ధకర్మలు చనిపోయిన వారికి ఎలా అందుతాయి?
“బుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ'" బుణానుబంధ రూపమే ఈ జన్మ. ప్రతి వ్యక్తికీ ఈ లోకంతో బుణముంటుంది. తల్లిదండ్రుల బుణాన్ని కొడుకు తీర్చడమే మన హిందూ సంస్కృతిలో విశిష్టమైన అంశం. వారి బుణాన్ని తీర్చేందుకై కొడుకు నిర్వహించే శ్రాద్ధ కర్మలను పితృలోకంలో వసించే పితృదేవతలు స్వీకరిస్తారు. తద్వారా బుణ విముక్తులై వంశాబివుద్ధిని, శాంతిని పొందుతారు.
స్వర్గస్థులైన తల్లిదండ్రులకు బ్రహ్మకపాలంలో శ్రాద్ధకర్మలు చేస్తే మరింక ఎప్పుడూ చేయనవసరం లేదని అంటారు. అది నిజమేనా?
మహాదోషం. అది బద్ధకానికి, సోమరితనానికి నిదర్శనం. అనుకోని అవాంతరం ఎదురై శ్రాద్దకర్మ చేయలేకపోతే అప్పుడు బ్రహ్మకపాలంలో చేసిన తీర్ధవిధి రక్షిస్తుంది. అంతేకాని మనం ఇంట్లో మూడు పుటలు సుష్టుగా తింటూ, సంవత్సరానికి ఒక్కసారి పెట్టే శ్రాద్ధాన్ని విస్మరించడం దోషం. బ్రహ్మకపాలం పేరు చెప్పుకుని మీ కపాలాన్ని సోమరితనానికి గురి కానివ్వకండి.
భూత బుణం అంటే?
మనకు నిత్యజీవితంలో ఎన్నో జీవరాశులు సహకరిస్తున్నాయి. కనుక వాటిపట్ల మనం బుణపడి ఉన్నాము. క్రిమి, కీటకాల వంటి అల్పజీవుల పట్ల కూడా దయ, జాలి గలిగి మెలగాలి. ఈ ప్రకృతిలో మనతో పాటు జీవించే సర్వహక్కులు వాటికీ ఉన్నాయి. వాటిని హింసించడం, చంపడం వంటి క్రూరమైన చర్యలు మానుకుని వాటి జీవనానికి సహకరించుట ద్వారా భూతబుణం తీర్చుకోవచ్చు.
అతిథి బుణం అంటే?
“అతిథీదేవోభవ" తిథి, వార నక్షత్రాలు చూడకుండా వచ్చే వాడే అతిథి. అట్టి అతిథిగా మన ఇంటికి విచ్చేసే వారిని సత్కరించాలి. వారిని చులకనగా చూడడం, తూలనాడడం చేయకూడదు. వారిని తగు రీతిలో సత్కరించుటయే గృహస్థుల ధర్మం.
అతిథులను సత్కరించుకునే భాగ్యం మనకు కలిగించినందుకు అతిథిని అభినందించాలి. తక్కిన ఆశ్రమవాసులైన బ్రహ్మచారులను, వానప్రస్థ్టులను, సన్యాసులను గృహస్తులే పోషించి ఆదరించాలి. ఈ రకంగా పంచ బుణాలను తీర్చుకుంటూ పిల్లలను సంస్కార వంతులుగా తీర్చిదిద్ది, పెద్దల పట్ల బాధ్యతలను నెరవేరుస్తూ, సద్గురువు నాశ్రయించి, గురువు ఉపదేశించిన వాక్యాలతో జీవితాన్ని సంస్కరించుకునే సాధకుడు ధన్యుడు, కృతకృత్యుడు.