ఆధ్యాత్మిక జీవనం |
తల్లిదండ్రుల యెడల ఎలా ప్రవర్తించాలి?
తల్లిదండ్రులు ఇంట్లో ఓ గౌరవ స్థానాన్ని అలంకరిస్తారు. జీవితంలో ఎంతో అనుభవాన్ని పొందియున్న వీరు, కుటుంబంలో సమస్యలను పరిష్కరించడంలో సమర్ధవంతమైన పాత్రను పోషిస్తారు. బిడ్డలకు ఆపద సంభవిస్తే బాధపడేదీ వీరే. బిడ్డలు వృద్ధిలోకి వచ్చినా మనస్పూర్తిగా ఆనందించేది వీరే. అటువంటి పెద్దల పట్ల వృద్ధులనే న్యూనభావన పనికిరాదు.
ఒక మొక్క సక్రమంగా ఎదగడానికి ఆధారంగా కర్రను వాడతాం. ఆ కర్ర ఎక్కడిది? చెట్టులోని భాగమే కదా! ఆ కర్ర ఎండి పోయి పూలు, పండ్లు ఇవ్వలేకపోయినా ఎదిగే మొక్కకు ఆధారంగా నిలబడి రక్షణ కల్పిస్తుంది. అలానే వృద్ధులు కుటుంబానికి ఓ రక్షణ మరియు ఆధారమనే చెప్పుకోవాలి. కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా భావనతో వారిని ఆదరించి, గౌరవించే సంస్కారం పెంపొందించుకోవాలి. అట్టి ఆచరణ మీ పిల్లలకు మార్గదర్శకమౌతుంది.
వృద్ధాప్యంలో బిడ్డల పట్ల ఎలా వ్యవహరించాలి?
ప్రతి విషయానికి తీవ్రంగా స్పందించి, అనవసరంగా సలహాలు ఇవ్వకండి. మిమ్మల్ని అడిగితె ఆచితూచి పరిష్కారం చెప్పండి. ఎంతసేపూ వృద్ధుల దృష్టి వారి "వడ్డీ' మీద వుండాలి. వడ్డీ అంటే? మనుమలు, మనుమరాళ్ళు. వాళ్ళని మచ్చిక చేసుకోండి. తల్లిలా వారిని ప్రేమించండి.
సంస్కారాలు నేర్పండి. ఈ కాలపు చదువులతో మానసిక వత్తిడికి లోనవుతున్న పిల్లలకు మీరు ఊరటనివ్వాలి. రామాయణ, భారతాది కథలు వినిపించాలి. ఆలయానికి వెళ్ళేటప్పుడు వారిని తోడు తీసుకుని వెళ్ళాలి. ఆథ్యాత్మిక వాతావరణాన్ని, పవిత్రతను, ప్రశాంతతను వారికి అలవాటు చేస్తూ వారిలో ఆథ్యాత్మిక బీజాలను నాటాలి.
రిటైరయ్యాక శేషజీవితాన్ని ఏ విధంగా మలచుకోవాలి?
ఏ వృత్తిలో పనిచేసి రిటైరయ్యారో ఆ వృత్తితోనే సమాజానికి ఉచితంగా సేవను అందజేయ వచ్చు. ఉదాహరణకు ఇంజనీరుగానో, డాక్టరుగానో రిటైరయితే ఆ వ్యక్తి ఏదో ఒక సేవా సంస్థ ద్వారా లేక ఆశ్రమం ద్వారా అంకితభావంతో తన సేవను సమాజానికి అందించవచ్చు. ఇటువంటి సేవలు సమాజంలో ఎందరో దీనులకు, అభాగ్యులకు ఉపయోగపడతాయి.
ధనంతో ప్రేమను, గౌరవాన్నీ పొందలేము. మన పలకరింపు, మన ప్రవర్తనలన్నీ ఎదుటి వ్యక్తిని ఆకర్షించేలా వారికి ఆనందాన్ని పంచేలా ఉండాలి. ఇంతవరకూ జీవితం ఎలా గడిచినా కనీసం రిటైరయ్యాకవైనా మనిషి యొక్క ఆలోచనా సరళిలో మార్పు రావాలి. శేషజీవితాన్ని న్యూస్ పేపర్ కు, టీవీ చానల్స్ కు అంకితం చేయక ప్రేమాభిమానాలతో, సేవా దృక్పథంతో జీవిస్తే వృద్ధాప్యంలో సంతృప్తిని, శాంతిని తప్పక పొందవచ్చు.
వానప్రస్థం అంటే ఏమిటి?
పూర్వం గృహస్థులు వారి సంతతి ఎదిగి, వివాహమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపగల స్థితికి చేరుకున్నాక వారికి తమ ఆస్తితోపాటు ధర్మాన్ని, వంశాచారాలను, కర్తవ్యాలను, అప్పజెప్పి వనాలకు వెళ్లి గురువు ద్వారా పొందిన మంత్ర జపానుష్టానములతోను, వేదాంత చింతనతోను, మనోనిగ్రహముతోను గడిపే ఆథ్యాత్మిక జీవన విధానాన్నే వానప్రస్థం అంటారు.
అందరూ వనాలకో, ఆశ్రమాలకో వెళ్లి వానప్రస్థ జీవితం గడపడం కుదరదు కదా?
ఆశ్రమ జీవితం గడపడం సాధ్యం కాకపోతే ఇంటినే ఆశ్రమంగా మార్చుకోవచ్చు. ఇంటిలో ఒక గదిని తమకోసం కేటాయించుకుని అందులో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచుకో, 'వాలి. వీలైనంత సమయాన్ని ఆధ్యాత్మిక గ్రంధాలతో, జప అనుష్టానాలతో గడపాలి. రాత్రి సమయంలో తిసుకునే ఆహారం స్వల్పంగాను, సాత్వికంగాను వుండాలి.
ఉదయమే మెలకువ వచ్చేలా ఆరోగ్యానికి అవరోధం కలిగించని పండ్లు, పాలు వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తకాలములొ లేచి యోగా, వాకింగ్, ప్రాణాయామం, ధ్యానం వంటివి అలవరచుకోవాలి. నిత్యం ఆలయ సందర్శనం, మంత్ర జప అనుష్టానము, స్తోత్ర పారాయణం వంటి సత్కర్మాచరణలో మనసును లగ్నపరచాలి.