Black Hindu family! |
తల్లిదండ్రుల యొక్క బాధ్యత?
సుపుత్రో సప్తమోరస: అనే నానుడి. అన్యోన్యమైన దాంపత్యంలో కలిగే సుఖం కన్నా ఉత్తమ సంతానం వలన కలిగే ఆనందం వర్ణనాతీతం. పిల్లలు మీ ప్రతిబింబాలని మరువకండి. మీలో కలిగే ప్రతీ భావాలు, గుణాలు, సంస్కార రూపంలో వారిలో దాగుంటాయి. కనుక మీ భావాలను, గుణాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుండాలి. మీ ప్రవర్తన వారికి ఆదర్శవంతం కావాలి.
మీ తదనంతరం ఈ భూమిపై కొనసాగే మీ వారసులు ఎలా జీవిస్తే మీ వంశానికి, సమాజానికి హితం చేకూరుతుందో గ్రహించి ఆ మార్గంలో వారిని తీర్చి దిద్దేందుకై కృషి చేయండి. స్వార్ధంతో రాగ ద్వేషాలకు లోబడి మానసిక వత్తిడికి, ఘర్షణకు గురికాకుండా సమర్ధవంతులైన తల్లిదండ్రులు గా యోగ్యమైన భావితరానికి మార్గదర్శకులై మీ బాధ్యతలను నెరవేర్చుకోవాలి.
కుటుంబంలో కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవలసినపుడు ఎలా ప్రవర్తించాలి?
జీవితంలో ప్రతి ఒక్కరూ కొన్ని ఒడి దుడుకులను ఎదుర్కోక తప్పదు . అవగాహనా రాహిత్యం వలన కుటుంబంలో స్పర్ధలు తలెత్తుతూ ఉంటాయి. పరిష్కరించుటకు సరియైన ఆలోచనా మార్గాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ మీ చేతులు దాటితే వాటంతట అవి సర్దుకునేందుకు కాలానికే అవకాశం ఇవ్వాలి. సర్దుకోకపోతే అవి పరమేశ్వరుని ఆజ్ఞగా భావించి వాటిని తట్టుకొనేందుకు మనసును సంసిద్ధ పరుచుకోవాలి.
నన్ను మాటలతోనో, చేతలతోనో బాధపెట్టే వారిని చూడగానే నాలో ద్వేషం కలుగుతోంది. ఇటువంటి వ్యతిరేక భావాల నుండి ఎలా బయటపడాలి?
బాధపెట్టే వారు తటస్టించినపుడు మనలో వ్యతిరేక భావాలు ఉదయిస్తాయి. పెనుగాలి తాకిడికి చెట్టు పడిపోకుండా నిలబడ గలగడం ఆ చెట్టు యొక్క బలాన్ని సూచిస్తుంది. అలాగే, కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొన గలిగిన స్థాయి వారి మానసిక స్టెర్యాన్ని సూచిస్తుంది. ఈ స్థాయి కేవలం భగవదనుగ్రహంతోనే సిద్ధిస్తుంది. కనుక ప్రతీ గృహస్థు అనుక్షణం తనకు లభించిన దానిని భగవత్రసాదంగానే స్వీకరించ గలిగే స్థాయిని అలవరచుకోవాలి. అట్టి వ్యక్తిలో రాగద్వేషాలు తొలగి క్రమేపీ వ్యతిరేకభావాల నుండి బయట పడగలిగే స్ధితి చేకూరుతుంది.
నన్ను బాధ పెట్టే వ్యక్తి పరాయి వారైతే ఉపేక్షించవచ్చు. కానీ వారు మనతోనే కలసిఉండే వారైతే? నా కుటుంబ సభ్యులే అయితే? నేనేం చేయాలి?
వారి అవగాహనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. అలా మారకపోతే మనమే మన దృక్పథాన్ని మార్చుకోగలగాలి. మంచి రుచికరమైన పదార్థాన్ని తింటున్నపుడు పొరపాటున ఒక్కోసారి నాలుకను కరుచుకుంటాం.
ఆ బాధ వర్ణనాతీతం. దాన్ని భరించలేం. అంతమాత్రం చేత నాలుకను బాధ పెట్టిన పళ్ళను రాలగొట్టం కదా! ఆ బాధను ఓర్చుకుంటాం. కారణం పళ్ళు, నాలుక రెండూ మనలో భాగాలే. అలాగే కుటుంబ వ్యవస్థలో అందరూ భాగాలేనని గ్రహిస్తే ఇతరుల వల్ల కలిగే దుఃఖాలను, బాధలను కూడా పరిపక్వ దృష్టితో అంగీకరించి సర్దుకు పోగలం.
ఈ అవగాహనతోనే మన వాక్కు, ఆలోచనలు సంస్కరించ బడతాయి. రాగద్వేష రహిత స్ధితి ఏర్పడుతుంది. క్రమేపి మనసుకి శాంతి కలిగి అలజడి తగ్గుతుంది.