Grihastha ashram |
గృహస్థాశ్రమం అంటే ఏమిటి?
బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడాన్ని గృహస్థాశ్రమం అంటారు. ఈ గృహస్తు ఎంతసేపూ ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, సుఖాల వరకే పరిమితం కాకూడదు. మోక్షమనే చివరి పురుషార్ధమైన జీవిత లక్ష్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. అర్ధ, కామములను ధర్మబద్ధంగా నెరవేర్చుకునే వ్యక్తికి క్రమేపీ మోక్షరూపమైన పరమాత్మను పొందేందుకు అవకాశాన్ని కల్పించేదే గృహస్థాశ్రమం.
ఈ దశలో స్తీ పురుషులు ఇరువురిని హిందూ ధర్మ శాస్త్రాలలో వివరించిన విధంగా పవిత్రమైన వైవాహిక వ్యవస్థతో కలుపుతారు. అనంతరం వారిరువురూ భార్య, భర్త అనే బాధ్యతాయుతమైన పాత్రలతో జీవితంలో ప్రధానమైన ఘట్టంలోకి అడుగిడుతారు. వారికి కేవలం విలాసము, సుఖ భోగాలే లక్ష్యం కాకూడదు.
విలాసవంతమైన పాలరాతి మేడలలో కుటుంబ సభ్యులు నవగ్రహాల్లాగా తలొక దిక్కుకీ చూస్తూ ఎడమొహం, పెదమొహం తో జీవిస్తుంటే అది గృహస్థాశ్రమం అనబడదు. ఆకలిలేని వాడికి పంచభక్ష్య పరమాన్న భోజనం ఎంత నిరుపయోగమో మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత లోపించిన కుటుంబాలలో ఎన్ని మేడలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అంతే. కుటుంబం లోని వారు కలసి మెలసి అన్యోన్యతతో తమ ధర్మాలను, బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వర్తించే విధానాన్నే గృహస్థాశ్రమం అంటారు.