Guru |
1. ఏ కాలమందు ఏ దేహమందు
ఏ కాలమందు, ఏ దేశమందు, ఏ వేషమందున జీవించు
సోహం హంస, సోహం హంస, సోహం హంస భావించు - 2
ఏ గ్రామమందు, ఏ ధామ మందు, ఏ కర్మ మందున జీవించు
నాహం కర్త, నాహం కర్త, నాహం కర్త భావించు - 2
ఏ రోగమందు, ఏ భోగమందు, ఏ యోగమందున జీవించు
నాహం భోక్త, నాహం భోక్త, నాహం భోక్త భావించు - 2
ఏ కాలమందు, ఏ దేశమందు, ఏ వేషమందున జీవించు
సోహం హంస, సోహం హంస, సోహం హంస భావించు
బ్రహ్మము మాత్రమే సత్యమురా
ఈ జీవులు జగము స్వప్నమురా - 2
సృష్టికి పూర్వము పరబ్రహ్మం
వ్యష్టి సమిష్టులు లేని సత్యం - 2
ఏకమై నిర్లోకమై - 2 వెలుగొందెను
బ్రహ్మము మాత్రమే సత్యమురా
ప్రళయము నందున సర్వము
పరమున విలయము నొందగా
పరబ్రహ్మమే పరిపూర్ణమై వెలుగొందును
బ్రహ్మము మాత్రమే సత్యమురా
ఇప్పుడు తోచెడి భేదము
ఈశ జగములు జీవులు - 2
సర్వ శూన్యమే, స్వప్న తుల్యమే కావా?
బ్రహ్మము మాత్రమే సత్యమురా
జాగ్రత తోచు వస్తువులు
స్వప్న సుషుప్తుల లేవుగా - 2
అవి యెల్లను కన కల్లయే కావా? - 2
బ్రహ్మము మాత్రమే సత్యమురా
నిఖిలము లీనము చెందగా
నిదురలో మిగిలిన సత్యమే - 2
ఆనందమై నిర్బంధమై స్ఫురియించును - 2
బ్రహ్మము మాత్రమే సత్యమురా
మూడవస్థల మారని తెలివి
మూడు తనువుల మారని ఉనికి - 2
ఆ స్ఫూర్తియే సన్మూర్తియే నేనైతిని - 2
బ్రహ్మము మాత్రమే సత్యమురా
ఈ జీవులు జగము స్వప్నమురా
ఈ జీవులు జగము
2. ఏదేమైతే బెదురేమున్నది...
ఏదేమైతే బెదురేమున్నది?
ఎరిగిన శ్రీ గురుదాసులకు - 2
దాసులకు గురుదాసులకు
బోధానంద విలాసులకు
ఏదేమైతే బెదురేమున్నది?
ఎరిగిన శ్రీ గురుదాసులకు
నీరు క్రమ్మినను, నిప్పు చెలగినను,
నింగి నేల ఏకమైనను
మారునదంతయు స్వప్నతుల్యమని
సారమెరింగిన ధీరులకు
ఏదేమైతే బెదురేమున్నది?
జనములు ధనములు నష్టమైనను
జగమున బహు అవమానమైనను -2
ఘనమగు తెలివికి లోపము లేదని
కలవరమందని ప్రాజ్ఞులకు
ఏదేమైతే బెదురేమున్నది?
తినుటకు ఏమియును దొరుకకున్నను
తీవ్రరోగములు కలచుచున్నను - 2
తనువు దుఃఖములు తనకు తగులవని
తత్వమరయు సత్పురుషలకు
ఏదేమైతే బెదురేమున్నది?
ఎరిగిన శ్రీ గురుదాసులకు
వాదభేదముల విధమును వీడి
సాధన పథమున సాగుచును - 2
వేదాంతర్థమును సదా హృదయమున
విమర్శించు విజ్ఞానులకు
ఏదేమైతే బెదురేమున్నది?
ఎరిగిన శ్రీ గురుదాసులకు - 2
3. ఏమి హాయి ఏమి హాయి
ఏమి హాయి ఏమి హాయి
ఏమి హాయి ఏమి హాయి
మరణభయము మాపగలుగు
మార్గ మెరుగలేని వేళ
అభయమిచ్చు ప్రభుడు గురుడు
అరువు తెంచి తెరువు చూప
ఏమి హాయి ఏమి హాయి
కుమతి లోకుల కూటమి నందు
చింతలెన్నో చెంది చెంది
బ్రహ్మవిదుల సంఘమునందు
పరమతత్త్వము నెరుగువేళ
ఏమి హాయి ఏమి హాయి
దేహమందు మోహమంది
శాంతి విడిన సమయమందు
దేహమందు మోహమంది
శాంతి విడిన సమయమందు
తనువు నేను కాదనుచును
తరచి తరచి చూచినంత
ఏమి హాయి ఏమి హాయి
దృశ్యమందు ద్వేషరాగ
భయములందు సమయమందు
చూడబడెడి భేదమంతా
శూన్యమనుచు తెలిసినంతా
ఏమి హాయి ఏమి హాయి
నీదినాదను భేద దృష్టిచే
బాధలెన్నో పొంది పొంది
అదియు ఇదియు నేనే యనుచు
తుదకు తెలిసినట్టివేళ
ఏమి హాయి ఏమి హాయి
జనన మరణ చక్రమునందు
తెంపులేక తిరిగి తిరిగి
చివరిజన్మము ఇదియె అనుచు
స్వానుభవము కలిగినంత
చివరిజన్మ మిదియె అనుచు
స్వానుభవము కలిగినంత
ఏమి హాయి ఏమి హాయి
ఏమి హాయి ఏమి హాయి
4. ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదికేవు...
ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదికేవు
నీయందె ఉన్నదే మనసా
వెదికేది నీయందె ఉన్నదే మనసా
సుఖము నీయందె ఉన్నదే మనసా !!
|| ఎందెందో తిరిగేవు ||
విషయాలలో సుఖము వెదకులాడుచు నీవు
వెర్రివై తిరిగేవు మనసా
కారణము లేకయే గాఢనిదురలొ నీకు
ఘనసుఖము కలుగదా మనసా !!
|| ఎందెందో తిరిగేవు ||
దేహమందున దూరి దేహమే నేననుచు
దీనతను చెందేవు మనసా
కట్టెలతో కాల్చేటి కాయంబుతో పొత్తు
కష్టాలనే తెచ్చు మనసా !!
|| ఎందెందో తిరిగేవు ||
నేను నేనంటావు, నాది నాదంటావు
నేనెవరో చూడవే మనసా
నిను నీవు తెలియక, నిఖిలమ్ము పొందిన
నిశ్చింత కలుగదే మనసా !!
|| ఎందెందో తిరిగేవు ||
ఏదో చేయాలనుచు ఏదో పొందాలనుచు
ఎందుకే తాపంబు మనసా
నిఖిలమ్ము వర్జించి నిశ్చలత చెందుటే
నిజమైన సుఖమౌను మనసా !!
|| ఎందెందో తిరిగేవు ||
5. జాగు చేయగనేల ఓ జీవ ...
జాగు చెయగనేల ఓ జీవ, వేగ సాధన చేయు ఓ జీవ !
ఇంటి యందున పెద్దనిధి ఉన్నదని తెలియ
వెంట వెంటనె త్రొవ్వి వెలితీయ బోవ
నీయందునే బ్రహ్మసుఖమున్నదని తెలుప
నిష్టతో దానికై శోధింప లేవా
|| జాగు ||
క్రూర రోగము చేత కుములు చుండెడి వాడు
కోరి ఘన వైద్యుని చేరువకు పోడా
సంసార దుఃఖమున సతమతంబగు నీవు
సత్వరమే సద్గురుని చేరంగ లేవా
|| జాగు ||
శత్రుబాధల చేత తల్లడిల్లెడివాడు
సరగున మిత్రులను దరిచేర బోడ
భవ దుఃఖమభివృద్ధి పరచు లోకులను వీడి
భద్రముగ సత్సంగమందుండలేవా
|| జాగు ||
వెదకి మన పెరటిలో విషపు మొక్కల పీకి
మంచి మొక్కల నెంచి మరిపెంచుకోమా
మనయందె యున్నట్టి మలినముల పొగొట్టి
సద్వాసనల పెంచుశ్రమచేయకోవా || జాగు ||
మరణ మొచ్చిన వేళ, మమతలను సంపదలను వీడి
ఎచటికో ఒంటరిగ పోవా
అన్నిటిని ఇప్పుడే త్యాగంబు చేసినచో
పరమపదమును చేరు భాగ్యంబు రాదా || జాగు ||
జాగు చెయగనేల ఓ జీవ,
వేగ సాధన చేయు ఓ జీవ !
6, జయము జయము బ్రహ్మవిద్య
జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి
జయ జయహే ఆశ్రితజన జననమరణ సంహర్త్రి
జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి
గృహము నీకు వేదాంతము, గీతలు క్రీడాస్థలము
పరిపరి శాస్త్రములు నీ పరిచారికులైన జనము
అఖిల విద్యలకును నీవు అంతిమ గమ్యము
భవరోగికి నీ సేవ ప్రాణమిచ్చు వైద్యము
జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి
నారాయణుడాదిగా నాగురువుల వరకును
పెక్కు బ్రహ్మవిదులు నిన్ను చక్కగ పోషింపగా...
పలుజన్మల పుణ్యంబులు ఫలియించిన వత్తువూ
గురుకరుణను చేరువై పరమపదము నిత్తువూ
జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి
సురలు, నరులు, ఋషులు నిన్ను విరివిగా సేవింతురు
నీ పాలను త్రావి తల్లి నిత్య తృప్తులౌదురు
నిఖిల సిద్ధ సాధకులును నీరాజనమేడెదరు
మంగళమని మంగళమని మంగళమని పాడెదరు
జయము జయము బ్రహ్మవిద్య జనయిత్రి జ్ఞానదాత్రి
జయజయహే ఆశ్రిత జన జననమరణ సంహర్త్రి
జయము జయము
7. కలవంటిది కల్ల జగమిది
కల వంటిది కల్ల జగమిది, కల వంటిది కల్ల జగమిది
తెలివి కనులు తెరిచి చూడ, క్షణమందే కరుగునది
|| కల వంటిది కల్ల జగమిది ||
ఉన్నదనే భావనచే ఉండునట్టిది
ఉనికేదని తరచిచూడ ఉత్తదైపోవునది
నిమిషమైన ఒకరీతి నిలకడే లేనిది
అసలు రూపమునకు వెనుక అంతు చిక్కనట్టిది
|| కల వంటిది కల్ల జగమిది ||
సంకల్పముకన్న వేరు సత్వమే లేనిది
తలపులాపినంతనే విలయమై పోవునది
|| కల వంటిది కల్ల జగమిది ||
జాగ్రతందు ఒకపగిది, స్వప్నమందు ఒక పగిది
మారుచుండు నట్టిది, మాయకాక ఏమిది ?
|| కల వంటిది కల్ల జగమిది ||
చిత్ర చిత్ర గతుల తోడ చింతపెట్టు నట్టిది
ఇంత కునుకు పట్టినంత ఇగిరి పోవునట్టిది
|| కల వంటిది కల్ల జగమిది ||
ఉన్నదంత ఒక్కటనుచు ఉపనిషత్తు అన్నది
నామ రూప దృష్టి పోవ నానాత్వము వట్టిది
|| కల వంటిది కల్ల జగమిది ||
కల వంటిది కల్ల జగమిది తెలివి కనులు తెరిచి చూడ,
క్షణమందే కరుగునది కల వంటిది కల్ల జగమిది
|| కల వంటిది కల్ల జగమిది... !!
8. కర్మములవియే జరుగుతు వుంటే...
కర్మములవియే జరుగుతు వుంటే
కర్తను నేనను భ్రమయేల
మర్మము తెలియక కర్మబంధమున
మరలా మరలా పడిపోనేలా
కాళ్ళు చేతులు కదులుతూ వుంటే
కదిలితినే ననుకోనేలా?
కళ్ళు చెవులు కాంచుతు వుంటే
కాంచితినే ననుకోనేలా?
ప్రాణము బొందిని నిలబెడుతుంటే
బ్రతుకుదు నేననుకోనేలా?
తలపులు మనసున పుడుతూ వుంటే
తలచితినే ననుకోనేలా?
సంకల్పంబులు, వికల్పంబులు
సంశయ నిర్ణయ వికారముల్
అంతరంగమున ఉబుకుతుంటే
అవి నావే యనుకోనేలా?
అన్ని తలపులు వాటికి అవియే
అశేషంబుగ పుడుతూ వుంటే
చేయవలెయునను ఇచ్ఛ మాత్రము
నా ఆధీనమనుకోనేలా?
సకల చరాచర విశ్వంబంతా
స్వప్నము వంటిది అయివుంటే
నేనునేనను అహంకారము
నిక్కంబని అనుకోనేలా?
ప్రకృతి ఈశ్వర నియమము చేత
ప్రపంచంబును నడుపుతూ వుంటే
పనులు చేయుటకు స్వాతంత్ర్యమ్ము
తనకు కలదనుకోనేలా
శ్రీగురు కృపచే సాధన జరిగితే
చేసితినే ననుకోనేలా
పాటలు చిత్గగనంబున పుడితే
పాడితినే ననుకోనేలా?
కర్మములవియే జరుగుతు వుంటే
కర్తను నేనను భ్రమయేల?
9. మేలుకొనుడీ మనుజులారా
మేలుకొనుడీ మనుజులారా ! మేలుకొనుడీ మిత్రులారా !
మేలుకొనుడీ అమృతత్వపు మిగులచక్కని పుత్రులారా !!
|| మేలుకొనుడీ ||
అఖిల జీవుల యందు నరులకె ఆత్మవిద్యకు అర్హతందురు
అట్టి జన్మము ఎత్తి ఆయువు వ్యర్థపరచుచు తిరుగనేల ?
|| మేలుకొనుడీ ||
జగతి యందలి భ్రమలు బాధలు జనన మరణములన్ని కలలు
తనను తాను తెలియకుండుటె తలచి చూచిన పెద్ద నిదుర
|| మేలుకొనుడీ ||
నిదుర మీరు లేవరేమి ? నిజసుఖంబును పొందరేమి ?
మీదు మిక్కిలి దేవతలకును మేలుకొలుపులు అందురేమీ ?
|| మేలుకొనుడీ ||
ఏమి సారము ? ఎందుకలదు ? ఏల విసుగును చెందలేదు ?
పీడకలల పాడు నిదురను వీడి బ్రహ్మగ మేలుకొనుడి !!
|| మేలుకొనుడీ ||
అమృతత్వపు పుత్రులారా ! అనుచు వేదము పిలుచుచుండు
మేలుకొనుడీ, మేలుకొనుడీ మీది హక్కును కోరుకొనుడీ ||
|| మేలుకొనుడీ ||
10. నీలోన వెలుగు నాలోన వెలుగు
నీలోన వెలుగు నాలోన వెలుగు
నిఖిలభూతములందు నిలుచు ఒక వెలుగు
నీలోన వెలుగు నాలోన వెలుగు
నిఖిలభూతములందు నిలుచు ఒక వెలుగు
అవని యందున వెలుగు ఆకసంబున వెలుగు
అఖిల జ్యోతులలో వెలుగు అంధకారమున వెలుగు
నీలోన వెలుగు నాలోన వెలుగు
జడము నందున వెలుగు చైతన్యమున వెలుగు
చలనమందున వెలుగు స్థావరంబుల వెలుగు
నీలోన వెలుగు నాలోన వెలుగు
అల్పమందున వెలుగు అధికమందున వెలుగు
అంతటా ఒక రీతి అంటిఅంటని వెలుగు
నీలోన వెలుగు
ముందు వెనుకల వెలుగు క్రింద మీదను వెలుగు
అంతరాయములేక అంతటా ఒక వెలుగు
నీ లోన వెలుగు నా లోన వెలుగు
సంకల్పమున వెలుగు సంధియందున వెలుగు
సుక్తి యందున వెలుగు శూన్యమందున వెలుగు
నీలోన వెలుగు
బ్రతుకునందున వెలుగు బాధలందున వెలుగు
మంచిచెడులను వెలుగు మరణమందున వెలుగు
నీలోన వెలుగు
భగవంతునిలో వెలుగు భక్తులందున వెలుగు
యెదలో నిండిన వెలుగు ఎన్నడారని వెలుగు
నీలోన వెలుగు నాలోన వెలుగు
నిఖిలభూతములందు నిలుచు ఒక వెలుగు
11. అసంగోహం అసంగోహం
అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః
కోటి జీవులు కోటి వస్తువులు
కోటి ఘటనలు కోటి భ్రమలు
కల యందున వలె కదలుచుండగ
కదల కుండగ కాంచు సాక్షి
||అసంగోహం ||
కోటి ఊహలు కోటి చింతలు
కోటి ఇంద్రియ జ్ఞానములు
చిత్తమందున చెలగి అణగుచు
శూన్యమగుటను చూచు సాక్షి
||అసంగోహం ||
కోటి బాధలు కోటి సుఖములు
కోటి కోటి వికారములు
ఎన్ని వచ్చిన ఎన్ని పోయిన
ఏమి మారక ఎరుగు సాక్షి
||అసంగోహం ||
క్షణము క్షణము గడచి పోవుచు
గతమునందున కలియు చుండగ
కాలమొక సంకల్పమాత్రమై
తరలి పోవగ కాంచు సాక్షి
||అసంగోహం ||
సకల భావనల సాక్షిగ చూచుచు,
సాక్షి భావనకును సాక్షిగ యగుచు
సాక్షిని నేనను సన్నని అహమిక
సమసిన ఉండెడి సాక్ష్యతీతము
అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః
12. కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు
వేదాంత వాక్యముల రమియించుచుండు
భిక్షాన్నమాత్రమున సంతుష్ఠినుండు
శోకంబు లేకుండు కరుణతో నిండు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు
ఏ చెట్టుమూలనో నివసించుచుండు
అరచేతిలో భిక్ష భుజియించుచుండు
ఏ చెట్టుమూలనో నివసించుచుండు
అరచేతిలో భిక్ష భుజియించుచుండు
బొంతనైనను స్త్రీవలె దూరముగ నుంచు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు
దేహాభిమానంబు వర్జించి ఉండు
ఆత్మయందాత్మను వీక్షించుచుండు
రేపవలు బ్రహ్మమున రమియించుచుండు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు
ఆత్మసుఖమును పొంది సంతుష్ఠితోనుండు
ఇంద్రియముల ప్రవృత్తులణగారి ఉండు
అంతర్ బహిర్ విషయ స్మరణ లేకుండు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు
పంచాక్షరంబులను జపియించుచుండు
హృదయమున పశుపతిని భావించుచుండు
భిక్షగొనుచు దిశలు తిరుగాడుచుండు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు
కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు
13. ఊరకుంటే సుఖము వుంటే
కోరి కర్మల ఉచ్చులందు చేరనేల?
మనసా! దుఃఖమందు దూరనేల?
మనసా! దుఃఖమందు దూరనేల?
అచలముగా తాను వుంటే
అవధిలేని సుఖము వుంటే
అచలముగా తాను వుంటే
అవధిలేని సుఖము వుంటే
అవధిలేని సుఖము నందు
హాయిగాను నిలిచి పోక
సతత మేదో చేయగాను
సతమతంబై పోవనేల?
మనసా! దుఃఖమందు దూరనేల
ఊరకుంటే సుఖము వుంటే
కోరి కర్మల ఉచ్చులందు చేరనేల?
కోరికేదో రేగినంత
తీరు వరకు తాపమేనూ !
కోరికేదో రేగినంత
తీరు వరకు తాపమేనూ !
తీరినంత కలుగును హాయి
వేరుకాదు తనదు సుఖమే
ఇచ్ఛలే మరి లేకపోతే...
ఇచ్ఛలే మరి లేకపోతే
ఎల్ల వేళల సుఖమే కాదా?
మనసా! ఎల్ల వేళల సుఖమే కాదా?
ఊరకుంటే సుఖము వుంటే...
తోచునట్టివాని వలన
చూచువానికి హాని లేదు
చూడ చూడగ దృశ్యంబంతా
శూన్యమే అయిపోవదా
చూడ చూడగ దృశ్యంబంతా
శూన్యమే అయిపోవదా
కాంచు వానిగా నిలిచి వుంటే
కాంచు వానిగా నిలిచి వుంటే
కల్ల జగమేమైతే నేమీ?
ఊరకుంటే, సుఖము వుంటే..
ఈశ్వరుని లీల చేత
విశ్వమంతా నడచుచుంటే
ఈశ్వరుని లీల చేత
విశ్వమంతా నడచుచుంటే
కర్తనేనని భ్రమనుచెంది
కష్టములలో చిక్కనేల?
చేయువాడవు కాకపోతే...
చేయువాడవు కాకపోతే
చేయుబాధ్యత మోయనేల?
చేయువాడవు కాకపోతే
చేయుబాధ్యత మోయనేల?
మనసా! దుఃఖమందు దూరనేల?
అడవి వంటి శాస్త్రములలో
అంతులేని సాధనలతో...
అడవి వంటి శాస్త్రములలో
అంతులేని సాధనలతో
ఏదో నేర్చి, ఏదో చేసి
ఎన్నడింక సుఖియించెదవు?
ఏదో నేర్చి, ఏదో చేసి
ఎన్నడింక సుఖియించెదవు?
సుఖతరంబు ఈ విహంగ మార్గము
సుఖతరంబు ఈ విహంగ మార్గము
సులభము కాదా గురుదాసులకు
ఊరకుంటే సుఖము వుంటే
కోరి కర్మల ఉచ్చులందు చేరనేల
మనసా! దుఃఖమందు దూరనేల?
ఊరకుంటే సుఖము వుంటే
కోరి కర్మల ఉచ్చులందు చేరనేల?
14. తెలిసి మౌనము పూనవె చిలిపి మనస
తెలిసి .. ..
మౌనము పూనవె .. ..
చిలిపి మనస !
1. తెలివియను తెరయందున తీరకుండ
జగము మాయ బొమ్మల వోలె జరుగుచుండ
తెలివికిని వేరుగ నీవుకల్గుటెట్లు?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
2. క్షణము తీరిక దొరుక సుఖపడలేక
ఏదియోమరిచేయ ఊహింతువేల?
ఊరకున్న లోన సుఖము ఊరిరాదె !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
3. ఇదియు అదియును చేసి ఎంతెంతొ చేసి
తుదకు సుఖియింతునన్నచో దుఃఖమిపుడు
ఎట్టిఆశలు లేకున్న ఇపుడె సుఖము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
4. పగటి కలలందు విహరింప ఫలితమేమి?
ఊహలోని సుఖము నిలుచుండగలదె
కల్పనలు లేనట్టి ఉనికియె ఘనసుఖంబు
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
5. సాక్షివీవని తెలుపంగ సరి అనెదవు
మరల కర్తను నేనను అభిమాన మేల?
అరయువానికేరీతి చేతలంటగలవు!
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
6. ఇది జరుగునొ కాదొ అనుచును మథనమేల?
జరుగవే అన్ని ప్రారబ్ధశక్తిచేత
జరుగకున్నను సాక్షికి తరుగు కలదె?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
7. ఎటుల చేయుటిది అటులొ ఇటులొ అనుచు
బహువిమర్శించి సంక్షోభ పడగనేల?
ఇచ్ఛ విడిన నిర్ణయమెట్టులైన నేమి?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
8. ఇటులనే కావలయునిది ఎటులైన
అనుట బాధయౌగాని అట్లౌనోకాదో
పట్టుదల వీడి చూచుటె బహుసుఖంబు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
9. తలచి నంతనె పనులు కావలయు ననెడి
ఆతురత పనుల చెరచు ఆయాసమిచ్చు
ఐన ఔనుకాకున్న పొమ్మనుటె సుఖము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
10. ఏదో రాకుండె రాదేమి ఎపుడు వచ్చు
ఏమి అగును ఎటౌనంచు ఎదురు చూడ
తపనయౌగాని లాభమే మింతైన కలదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
11. ఆలు బిడ్డలు బంధు మిత్రాదులందు
బాధ్యతల తల పోయుచు భ్రమయు నేల?
కాదు నీదేదియును నాటకంబు జగము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
12. జ్ఞానియైనను ధర్మంబు సలుపవలయు
అనెడు కర్తవ్య బుద్ధి చే కనల నేల?
కల్లబొల్లి జగమందు కార్యమేమి ?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
13. లోకశాస్త్ర మర్యాదల లోన చిక్కి
తప్పుఒప్పుల చింతించు త్రిప్పటేల
ఏదియెటులున్న మిథ్యయే ఎంచి చూడ
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
14. ఈ పని సరిగ చేయక లోపమయ్యె
నలుగురేమందురో అంచు కలగనేల
పనుల కంటని ఆత్మకు భంగమేమి?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
15. పాపమని లోపమని తలపంగనేల?
తప్పుచేసిన భావన తగులనేల?
కర్మలేని సాక్షికి తప్పు కలుగుటెట్లు?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
16. ఏది ఎవరెట్లు ఎచ్చట ఎప్పుడనుచు
జగతి వార్తల యందేల సంబరంబు
మిథ్యయందున కుతూహల మేల నీకు !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
17. ఏదొ అగుపించ వినిపింప ఏదనుచు
బుద్ధినిలిపి తెలియు శ్రమ అదేల ?
ఉన్నదది ఏదొ ఉండదె ఊరకున్న ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
18. నాకు కర్తవ్యమసలేమి నాస్తికాని
పరులకై చేయవలెనంచు పాటులేల
కలను మేలుకొన్న పరులు కలుగుటెట్లు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
19. దైవకార్యము దైవాజ్ఞ ధర్మమనుచు
సంఘసేవ అనుచును జంజాటమేల
మాయ జగము నందొక పని మంచి ఏమి?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
20. పాపమెచ్చెను ధర్మంబు భ్రష్టుపట్టె
జగము మారుటెట్లనుచు విచారమేల
మాయ ఇది అని చూచుటె మార్చుటగును ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
21. తత్త్వమెరిగితి నేనంచు తలపు చెలగి
పదుగురికి చెప్పవలెనంచు పాటులేల
పరులు వేరుగ కలరన్న భ్రాంతి కాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
22. వ్యాధి బలహీన మాకలి బాధలనుచు
తనువుపై నీకు సతతమ్ము ధ్యానమేల
దేహమేమైన మరి ఆత్మ స్థిరము కాదె !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
23. సొగసు సింగార మతి పరిశుభ్రతనుచు
దేహసేవ చేయు గతి అదేమి నీకు |
నీకొరకు అది దానికై నీవుకాదు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
24. అయ్యొ కష్టంబు నాకర్మ మయ్యె ఇటుల
కటకటా ఓర్చుటెటులంచు కంపమేల?
జగమసత్తైన కష్టంబు సత్యమౌనె !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
25. కష్టమొచ్చెను దీనికి కారణంబు
వీరు వారు అది అని వెదుకనేల
కష్టమనుభావనే మూలకారణంబు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
26. అది ఇటుల నాయె అటుల కాదాయె నంచు
గతము త్రవ్వుచు చింతింప వెతలుకాదె?
తలపు లందెకాక గతము కలదె ఇపుడు
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
27. కష్టమొచ్చిన దుఃఖంబు కలుగుగాక
వచ్చునేమొ అంచు ఇప్పుడేడ్వ పని ఏమి?
అసలు కంటెను ఊహించుటధిక బాధ ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
28. పరుల వెతలకు చలియించి బాధపడిన
అట్టి బాధ లెన్నటికైన అంతమగునె?
అఖిలమును నాటకం బట్లు అరయరాదె?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
29. విషయ సుఖమందు దుఃఖంబు వెంటవుండు
ఎరిగి ఎరిగియు బయలందు తిరుగ నేల
లోన మారని సుఖమును కానలేవె?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
30. ఇపుడె వేదాంత గగనాన ఎగిరి ఎగిరి
మరల విషయ భూముల యందు పొరలనేల?
ఏదిసుఖమంచు ఇంకను ఎరుగలేవె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
31. తాపరహిత సుఖము నీదాపు నుండ
తనువు సంగముచే కామతాపమేల
స్త్రీ పురుష భేద మాత్మ దృష్టికిని కలదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
32. సంపదెచ్చిన దాన అశాంతి హెచ్చు
ధనము నార్జింప రక్షింప తహతహేల
కొంచెమందున సంతృప్తి గొప్ప ధనము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
33. జగము నీవు తలచినట్లు జరుగకున్న
కోపతాపము లొందుచు కుముల నేల
జగతి నడపువాడవుకావు సాక్షి వీవు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
34. సకల విధముల తన ఆజ్ఞ జరుగగాను
పరుల హింసించు విపరీత భావమేమి
సమత కలిగించనట్టి నీ జ్ఞానమేమి ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
35. అల్పవిషయాల చిర్రు బుర్రాడు చుండ
మాటిమాటికి గుండెల మంటకాదె
సహనమందున తరగని శాంతిలేదె !
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
36. పరుడొకండు నిన్నవమాన పరచెననుచు
తలచి తలచి తాపంబు పొందగనేల
అరయ నీ కంటె జగమున అన్యమెవరు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
37. జరిగిన అపకారంబులు మరువ కున్న
పగను తీర్చుతలపు నిన్నె రగుల చేయు
అన్యులెవ్వరంతయు పరమాత్మకాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
38. ద్వేషము భయము దుష్టులందేల నీకు
సృష్టి భాగముకాదె ఆ దౌష్ట్యమంత
సకలము నుపేక్ష చేయుటె సాధుగుణము
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
39. పరుల సంపద చూచి కంపరము చెంది
వలయు నాకవి అన్నచో కలత ఏను
ఎన్ని ఉన్న అవి ఎన్న సున్న కాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
40. ఒకరి గొప్పతనము చూచి ఓర్వలేక
అంతకు మించి యత్నింప చింతకాదె
ఎక్కువయు తక్కువయు ఏమి ఏకమందు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
41. పొద్దుపోవమేమి విసుగు పుట్టుటేమి
ఊరకుండక పని ఏదో పూనుటేమి
కాలమదియె గడచు నీవు గడపుటేమి ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
42. ఏదొ మరచితి గురుతు రాదేల అనుచు
అధికముగ తలపోయ ఆయాసమేను
అఖిల జగమును మరువంగ హాయిలేదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
43. గొప్పతనమేమి గుర్తింపుకోరుటేమి?
ఖ్యాతి గౌరవ సత్కార కాంక్షలేమి?
అహము పెంచు ఆధ్యాత్మ విద్య అది ఏమి?
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
44. గొప్పనేనను భావన కూల్చివేయు
తక్కువనుభావనయు బహుతాపమిచ్చు
తక్కువెక్కువలేని తత్త్వంబు ఘనము ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
45. భయమదేల పలాయనంబదియునేల
త్యాగమంచు అది ఇది వీడ తలచనేల
విడుచువాని విడిన అన్ని విడిచి నట్లె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
46. ఎట్టులైన మనసు బిగబట్టగాను
ప్రబల యత్నముచే మౌన భంగమవదె
సహజమగు దాని సాధింప శ్రమఅదేల ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
47. తలపులాపక తనరూపు తెలియ దనుచు
చెలగి యత్నింప అదియొక తలపు కాదె
అన్నితలపులాపెడి యుక్తి నరయ రాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
48. కలదు సుఖమిందు ఇది ఇట్లె నిలువ వలయు
అనెడి తలపు ఆ సుఖంబున కడ్టుపడదె
ఉన్నదున్నట్లు చూచుటె మిన్నసుఖము
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
49. నామ రూప లింగ వయో గుణ స్వభావ
వర్ణ కర్మాది దృష్టిచే వ్యథయె కలుగు
ఎట్టి భావన లేని చూపెంత సుఖమొ ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
50. చూచి గురుతు తెచ్చి చెడు మంచూహ చేసి
ఎటుల ప్రతిచర్య అను తలపేల నీకు
ఏ వికారము లేని చూపెంత సుఖమొ ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
51. పరుల దోషాలు పరికించు చురుకు చూపు
బ్రహ్మదృష్టిని పోగొట్టు బంధమిచ్చు
తనను తాకాంచు చూపు వాసనల చంపు
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
52. ఇందు సుఖమేమి ఇట లాభమేమి
అనెడి స్వార్థ దృష్టిని పూన విశ్రాంతి ఎట్లు?
ఆశ విడి చూడ అఖిలంబు హాయి కొలుపు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
53. వలసి నంతగ ఏదైన తలచ వచ్చు
మరిమరి వ్యర్థముగ దాని మననమేల
క్షణము పూనివదలు శక్తి ఘనము కాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
54. మౌనముగ ఉంటినని ఎంచి మోసపోకు
నీవు లోలోన భాషించు నైజమేమి
లోన చలనంబు లాగక మౌనమెట్లు ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
55. పాటలల్లి పద్యములల్లి పాట్లుపడిన
తెలుప చాలని తత్త్వంబు తెల్లమగునె
భాషలుడగక మౌనంబు పట్టుపడునె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
56. మాటి మాటికి మౌనము మౌనమంచు
పద్యములు చదివిన అది పట్టు పడునె
పలుకు లాపి తలపులాపి నిలువ రాదె ||
తెలిసి మౌనము పూనవె చిలిపి మనస !
మానసబోధ
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారి రచన
1. సంసార కూపమున
దిక్కుతోచక యుండి
విలపించు టేలకో మనసా
గురు పాదముల బట్టి
తత్త్వంబు తెలిసికొని
తప్పించుకో ఓయి మనసా
2. ఎన్ని జన్మలనుండి
బంధంబు తొలగక
దుఃఖించుచున్నావు మనసా
నరజన్మ మందున
జ్ఞానంబు ఆర్జించి
తాపంబు బాపుకో మనసా
3. సంసార మందలి
అల్ప సుఖమును జూచి
మురిసిపోవగనేల మనసా
ఆనందముగ తోచు
విషయభోగము లన్ని
ముణ్ణాళ్ళ ముచ్చటే మనసా
4. దారుణం బైనట్టి
సంసార వ్యాధిని
పోగొట్టుకో ఓయి మనసా
పుట్టి చచ్చుట యందు
పురుషార్థ మేమియో
బాగుగా యోచించు మనసా
5. రామ రామా యనుచు
నిరతంబు మదిలోన
స్మరణ చేయుము ఓయి మనసా
పరమ పావనమైన
దైవనామము చేత
పాపమంతయు తొలగు మనసా
6. కోటికిని పడగెత్తి
కొండంత ధనమును
కూడబెట్టిన నేమి మనసా
దానధర్మము లేక
దాచిన సొమ్మంత
పరులపాలై పోవు మనసా
7. జగతిలో నున్నట్టి
దేహంబు లన్నియు
నీయొక్క రూపాలె మనసా
సత్యంబు తెలిసికొని
ప్రాణులన్నిటి యెడల
దయగల్గి యుండుమూ మనసా
8. రేపు రేపని చెప్పి
దైవకార్యాలను
విరమించబోకుము మనసా
ధర్మకార్యాలను
దైవకార్యాలను
వెనువెంటనే చేయి మనసా
9. జడమైన దేహము
జడమైన చిత్తము
నీ స్వరూపము కాదు మనసా
సచ్చిదానందమగు
ఆత్మయే నీ వని
బాగుగా తెలిసికో మనసా
10. చావు పుట్టుక లన్ని
పాంచభౌతికమైన
దేహానికే యగును మనసా
నిత్య శుద్ధంబైన
ఆత్మయే యగు నీకు
జన్మాదులే లేవు మనసా
11.కనుపించునది యంత
కాలగర్భమునందు
నాశంబు నొందునూ మనసా
నాశ మేమియు లేని
బ్రహ్మమే నీ వని
త్వరితముగ తెలిసికో మనసా
12. విశ్వమందెల్లెడల
ఆత్మయొక్కటె కాని
రెండవది లేదోయి మనసా
నీకంటె వేరుగ
మఱియొకటి లేదని
తెలిసి ధైర్యము నొందు మనసా
13. ధ్యానయోగము చేత
ఆత్మలో స్థితిగల్గి
ద్భశ్యభావన వీడు మనసా
దృశ్యంబులేనట్టి
స ద్రూపమే నీవు
సత్యమును తెలిసికో మనసా
14. అనుభూతి బడసిన
సద్గురూ త్తమునికై
బాగుగా వెతకుము మనసా
గురుపాదముల జేరి
ఆత్మానుభూతికై
ధ్యానంబు సలుపుమూ మనసా
15. ఋషులు పొందిన శాంతి
కలుగునా నాకని
సంశయింపకు ఓయి మనసా
అభ్యాస వశమున
సర్వులకు మోక్షంబు
సమకూరు ధరణిలో మనసా
16. బలహీనుడను నేను
అని తలంచుచు నీవు
పరితపించెదవేల మనసా
శక్తులన్నియు నీలోనే
కలవంచు భావించి
ధైర్యమును చేబట్టు మనసా
17. జన్మంబు లన్నిటిలో
నరజన్మ శ్రేష్ఠమని
చక్కగా నెరుగుము మనసా
దైవభావము గలిగి
మనుజత్వ మంతను
సార్థకంబుగ జేయి మనసా
18. శాస్త్రాల సారము
వివరించి తెలిపెద
శ్రద్ధగా వినుము ఓ మనసా
పరహితమె పుణ్యము
పరపీడ పాపము
దయచూపు ఎల్లెడల మనసా
19. మార్గంబు లన్నిటిలో
భక్తిమార్గమె చాల
సులభమైనది ఓయి మనసా
శ్రద్ధతో శుద్ధితో
భక్తిమార్గమును బట్టి
గమ్యాన్ని చేరుకో మనసా
20. పెక్కు జన్మల నుండి
విషయ సంస్కారాలు
వెంటాడుచున్నవీ మనసా
అభ్యాస బలముచే
వానినెల్లను నీవు
పోగొట్టుకో ఓయి మనసా
21. వ్యవహారమందున
మునిగియున్నను నీవు
దైవాన్ని మరువకూ మనసా
దైవచింతన యొకటె
నిక్కముగ భువిలోన
కడతేర్చు సాధనము మనసా
22. ధ్యానమందున నీవు
చిత్తమును ఇటు నటూ
పరుగెత్తనీయకూ మనసా
నిశ్చలంబై నట్టి
చిత్తంబు లోపల
ఆనంద ముదయించు మనసా
23. తోటి ప్రాణిని నీవు
నీవలె చూచుచు
మెలగుచుండుము ఓయి మనసా
నీ సౌఖ్యమును వోలె
పరసుఖంబును గూడ
కాంక్షించు చుండుమూ మనసా
24. కష్టాలు కలిగినా
నష్టాలు కలిగినా
శాంతంబు వీడకూ మనసా
నిర్వికారత్వము
సహన శీలత్వము
అభ్యసింపుము ఓయి మనసా
25. బంధరూపములైన
కోపతాపాలను
దరికి చేర్చకు ఓయి మనసా
కోపాన్ని అరికట్టి
కామాన్ని తెగద్రుంచి
మోక్షధామము చేరు మనసా
26. కామాది రూపులగు
శత్రువుల జాడను
కనిపెట్టుచుండుమూ మనసా
ధైర్యమును చేబట్టి
వానితో పోరాడి
విజయాన్ని పొందుమూ మనసా
27. పంచభూతాలతో
నిర్మితంబై నట్టి
తోలుబొమ్మవు కావు మనసా
దేశకాలాలచే
గ్రసితంబు కానట్టి
చిద్రూపమే మనసా
28. సచ్చిదానందమగు
బ్రహ్మమే నే ననుచు
భావించుచుండుమూ మనసా
నిరతంబు గావించు
మననంబుచే నీవు
తద్రూప మగుదువూ మనసా
29. దీప మున్నప్పుడె
ఇళ్ళు వాకిళ్ళను
చక్కబెట్టుకో ఓయి మనసా
ఆరోగ్య మున్నప్పుడె
భుక్తికై యున్నపుడె
దైవాన్ని తెలిసికో మనసా
30. కాలచక్రము నందు
గిరగిరా తిరుగుచు
క్లేశ మొందగనేల మనసా
జన్మమే లేనట్టి
ఆత్మపదమును పొంది
ఆనంద మొందుమూ మనసా
31. విశ్వమం దెల్లెడల
గొప్ప శాసన మొకటి
పనిచేయుచున్నదీ మనసా
పుణ్యంబుచే సుఖము
పాపంబుచే బాధ
కలిగితీరును దాన మనసా
32. దేహావసానమున
దంధ్వాదులందరు
వీడిపోదురు ఓయి మనసా
తాను చేసిన కర్మ
ఒక్కటే తన వెంట
ఎల్లచోట్లకు వచ్చు మనసా
33. పుణ్యకర్మను పెంచి
పాపకర్మను త్రుంచి
నిర్మలత్వము పొందు మనసా
సాధనంబున కలుగు
హృదయ శుద్దిచె నీకు
జ్ఞానంబు చేకూరు మనసా
34. సంసారబాధతో
తల్లడిల్లుచు నుండి
తాప మొందగనేల మనసా
బాధ లెవ్వియు లేని
ఆత్మయే నీవని
అనుభూతి బడయుమూ మనసా
35. ఇలలోన విద్యలు
ఎన్నియో యున్నను
దుఃఖాన్ని బాపవూ మనసా
దుఃఖమును పోగొట్టు
ఏకైక సాధనము
పరమార్థ విద్యయే మనసా
36.స్వప్నమున ఎన్నియో
దుఃఖంబు లున్నను
మేల్కాంచి నపుడేమి మనసా
సంసార దుఃఖాలు
ఆత్మానుభూతిచే
తొలగిపోవును ఓయి మనసా
37. పరిపూర్ణమైనట్టి
ఆనందమంతయు
లోననే కలదు ఓ మనసా
బాహ్య దృష్టిని వదలి
లోని దృష్టిని బడసి
ఆనంద మొందుమూ మనసా
38. విషయభోగాలను
అనుభవించిన కొలది
పెరుగుచున్నది ఆశ మనసా
వైరాగ్యమును బూని
విషయాల నరికట్టి
ఆత్మానుభవమొందు మనసా
39. దేహాది వస్తువుల
అందచందములు చూచి
ఉబ్బి పోవగనేల మనసా
త్వరితముగ అవియన్ని
మట్టియై పోవునని
వేగముగ తెలిసికో మనసా
40. పాశంబు గైకొని
యమదూత లేతెంచ
రక్షించు వారెవరు మనసా
జీవించియున్నపుడె
గురుపాదముల బట్టి
కైవల్యమును పొందు మనసా
41. దైవచింతన లేక
నిమిషంబు గడిచిన
వ్యర్థమే యగును ఓ మనసా
సావధానుండవై
ఇకనైన నీ విపుడు
దైవాన్ని చింతించు మనసా
42. కన్ను బాగున్నపుడె
కాలు బాగున్నపుడె
"నే నెవరొ" తెలిసికో మనసా
అంగంబు లన్నియు
శిథిలములు కానపుడె
దైవకార్యము చేయి మనసా
43. కష్టాలలోనైన
నష్టాలలోనైన
సత్యంబు తప్పకూ మనసా
సత్యధర్మాలను
శ్రద్ధతో పాటించి
శ్రేయస్సు బడయుమూ మనసా
44. ఒక్క ప్రాణికి అయిన
మేలు చేకూర్చుటె
దేవదేవుని పూజ మనసా
భూత సేవయె దైవ
సేవగా భావించి
హితము చేయుము ఓయి మనసా
45. ద్రవ్యంబులో కొంత
దానధర్మములు చేసి
పుణ్యాన్ని ఆర్జించు మనసా
పుణ్య సంపాదనే
జ్ఞానసంపాదనకు
దారితీయును ఓయి మనసా
46. ఓంకార మంత్రమును
శ్రద్ధతో భక్తితో
జపము చేయుము ఓయి మనసా
ప్రణవజపము చేత
పాపరాశంతయు
భస్మమై పోవునూ మనసా
47. ప్రాణులన్నిటిలోన
పరమాత్మ సమముగా
వ్యాపించియున్నాడు మనసా
దైవదృష్టిచె నీవు
ఎల్లప్రాణులయందు
దయగల్గి యుండుమూ మనసా
48. ప్రతిజీవి దేహంబు
పరమాత్మ నివసించు
స్థానమే యగును ఓ మనసా
సద్గుణాలను నట్టి
పుష్పాలచే నీవు
పూజించు ఆత్మనూ మనసా
49. భువిలోన జీవుని
ధనకీర్తు లెవ్వియు
రక్షించజాలవూ మనసా
సత్యధర్మములు రెండు
ఎల్లకాలములందు
కడతేర్చు జీవుని మనసా
50. చిత్తమందేవైన
దోషాలు దొరలినా
తొలగించి వేయుమూ మనసా
దోషరహితంబైన
చిత్తంబె ముక్తికి
అనువైన క్షేత్రమూ మనసా
51. మితమైన హితమైన
ఆహార సేవనచె
ఆరోగ్యమే బడయు మనసా
అధ్యాత్మ రంగమున
ఆరోగ్యమే మొదటి
అవసరంబగు నోయి మనసా
52. దేహమే యొక నావ
జీవు డద్దానిని
నడుపుచుండును ఓయి మనసా
నావ బాగున్నపుడె
సంసార సాగరము
దాటి వేయుము ఓయి మనసా
53. భువిలోన జీవుడు
మోక్షంబు నొందుటకు
గీత బోధయే చాలు మనసా
గీతతత్వము నెల్ల
క్షుణ్ణముగ తెలిసికొని
భవసాగరము దాటు మనసా
54. దానధర్మములు చేసి
పేదలను రక్షించి
పుణ్యమును బడయుమూ మనసా
పుణ్యమే ధనమని
భావించి శీఘ్రముగ
అద్దాని నార్జించు మనసా
55. ఇటునటు పరుగెత్తు
ఇంద్రియంబుల నెల్ల
అదుపులో నుంచుమూ మనసా
అదుపు తప్పిన గుఱ్ఱాలు
బండిని పడవైచు
జాగరూకత నొందు మనసా
56. దేహమే రథమని
బుద్ధియే సారథని
బాగుగా తెలిసికో మనసా
బుద్ధికుశలత చేత
ఇంద్రియంబుల నణచి
గమ్యంబు చేరుకో మనసా
57. బాల్యంబు యౌవనము
బాగున్న కాలముననె
తత్త్వంబు తెలిసికో మనసా
వార్ధక్య మేతెంచ
ఇంద్రియాదులు సడల
ధ్యానంబు జరుగదూ మనసా
58. స్వస్వరూపాత్మను
లెస్సగా ఎరుగుటే
నరజన్మ లక్ష్యమూ మనసా
తన్ను తా నెరుగక
ఏమి పొందిన కూడ
శాంతి కలుగదు ఓయి మనసా
59. తత్త్వమసి మొదలైన
వాక్యాల అర్థము
మననంబు చేయుమూ మనసా
నిరతంబు చేసిన
మననాది క్రియలచే
అనుభూతి కలుగునూ మనసా
60. ఇలలోన మఱియొక
వస్తువుండిన యెడల
భయ ముద్భవించునూ మనసా
జగతియం దెల్లెడల
ఆత్మయొక్క టె యుండ
భయమేల కలుగును మనసా
61. నూరేండ్ల జీవితము
కలదంచు భావించి
మత్తుగా నుండకూ మనసా
ఏనాటి కానాడు
దైవకార్యము యెడల
జాగరూకత నొందు మనసా
62. శివశివా యనుచును
శివమంత్రమును నీవు
స్మరణచేయుము ఓయి మనసా
శివమంత్ర జపముచే
పాపజాలము లన్ని
మాయమై పోవునూ మనసా
63. మరణకాలమునందు
బంధుమిత్రాదులు
వదలి పోవుదు రోయి మనసా
పుణ్యంబు ఒక్కటియే
ఎల్లలోకములందు
వెంటొచ్చునే ఓయి మనసా
64. పుణ్యమే ధనమని
జ్ఞానమే ధనమని
భావించి యెల్లప్పుడు మనసా
వానినే అర్థించి
వానినే ఆర్జించి
కడతేర్చు జన్మనూ మనసా
65. సర్వత్ర దైవంబు
కలదంచు భావించి
ఆర్జించు ప్రేమను మనసా
దైవభావన గల్గి
ప్రాణికోట్లకు నీవు
కీడు చేయకు ఓయి మనసా
66. ఎల్ల వస్తువులందు
కాలంబు ఒకటియె
విలువైనదే యగును మనసా
విలువైన కాలాన్ని
విషయభోగములందు
వ్యర్థంబు చేయకూ మనసా
67. కర్మచే జన్మము
కర్మచే బంధము
కలిగితీరును ఓయి మనసా
జ్ఞానాగ్నిచే కర్మ
భస్మంబు అయినచో
భవబంధములు తొలగు మనసా
68. అవతారమూర్తి యగు
కృష్ణుండు చెప్పిన
గీత ఒక్కటి చాలు మనసా
గీత భావన చేత
గీత గానము చేత
శాంతి సుఖములు కలుగు మనసా
69. ఆత్మావలోకనము
అతి ముఖ్యమైనదని
భావించి నీ వెపుడు మనసా
ధాన్యాదులందును
జ్ఞానార్జనందును
కాలంబు గడుపుమూ మనసా
70. ఆత్మలో విశ్వము
కల్పింపబడియుండి
తోచుచున్నది ఇట్లు మనసా
లేనిదే అయినట్టి
జగతియందున నీకు
ఆసక్తి యేలకో మనసా
71. వేదశాస్త్రాలను
శ్రద్ధతో నీ వెపుడు
మనసంబు చేయుము మనసా
మననాది క్రియలచే
బుద్ధి తానంతట
శుద్ధమై పోవునూ మనసా
72. జీవుని కడతేర్చు
దేవదేవుని నీవు
ఆశ్రయించుము ఓయి మనసా
దైవభక్తిచె ఎల్లపుడు
శాశ్వతంబగు ముక్తి
కలిగితీరును ఓయి మనసా
73. దేహదృష్టిని వదలి
ఆత్మదృష్టిని పెంచి
ఆనందమొందుమూ మనసా
అభిమానమును త్రెంచి
మమకారమును త్రుంచి
మోక్షధామము చేరు మనసా
74. సత్పాత్రులకు చేయు
దానధర్మాలచే
పుణ్యంబు చేకూరు మనసా
పుణ్యముచె జ్ఞానంబు
జ్ఞానముచె మోక్షంబు
కలిగితీరును ఓయి మనసా
75. కామక్రోధాలను
దంభదర్పాలను
దరికి చేర్చకు ఓయి మనసా
కలుషరూపాలగు
కామక్రోధాలచె
హృదయంబు చెడిపోవు మనసా
76. నారాయణా యనుచు
హరినామమును నీవు
భక్తితో పలుకుమూ మనసా
హరినామ స్మరణచే
దురితంబు తొలగును
చిత్తశుద్ధియు కలుగు మనసా
77. జడమైన దేహము
ఏ కాలమందును
నీ స్వరూపము కాదు మనసా
దేహాన్ని చూచేటి
సాక్షివే నీ వని
ఎల్లపుడు చింతించు మనసా
78. ఇలలోన సకలము
ఏనాటికైనను
నాశమై పోవునూ మనసా
నాశంబు లేనట్టి
పరమాత్మనే నీవు
ఆశ్రయించుము ఓయి మనసా
79. క్షేత్రంబునే గాదు
క్షేత్రజ్ఞుడను నేను
అని తలంచుము నీవు మనసా
దృశ్యమును నే గాడు
దృగ్రూపమే అనుచు
ఎలుగెత్తి చాటుమూ మనసా
80. సంసార దుఃఖమును
అంతమొందించెడు
ఆత్మవిద్యను బడయు మనసా
తత్త్వంబు తెలిసికొని
చింత లెవ్వియు లేక
హాయిగా నుండుమూ మనసా
81. ఇల్లు బాగున్నను
వళ్లు బాగున్నను
ధనము బాగున్నను మనసా
హరిపాదముల యెడల
భక్తియే లేనిచో
సర్వమూ వ్యర్థమే మనసా
82. వెన్నవలె హృదయాన్ని
కోమలంబుగ నీవు
చేసివైచుము ఓయి మనసా
నవనీత ప్రియుండ
అత్తఱ్ఱి హృదయాన
తిష్ఠవేయును ఓయి మనసా
83. వైరమును వదిలేసి
ప్రేమభావము పెంచి
దయగల్గి యుండుమూ మనసా
దయయున్న హృదయమే
దైవవాసంబని
త్వరితముగ తెలిసికో మనసా
84. తోలుతిత్తివి నీవు
కాదంచు వేదాలు
ఘోషించు చున్నవీ మనసా
దేహాభిమానంబు
వదిలేసి శీఘ్రముగ
ఆత్మవై చెన్నొందు మనసా
85. చెడ్డ భావాలకు
మంచి భావాలకు
జరుగుచున్నది పోరు మనసా
యత్నాతిశయముచే
చెడ్డ భావాలపై
విజయంబు చేబట్టు మనసా
86. అభ్యాసవశమున
అసురగుణముల నీవు
అణగద్రొక్కుము ఓయి మనసా
శ్రద్ధతో భక్తితో
దైవగుణముల నీవు
లెస్సగా బడయుమూ మనసా
87. కాలంబు వ్యర్థముగ
వ్యవహారమందున
గడచుచున్నది ఓయి మనసా
కాలాన్ని జాగ్రతగ
దైవానుభూతికై
వినియోగపరచుమూ మనసా
88. హృదయంబు లోపల
కామాది శత్రువులు
బాధించుచున్నారు మనసా
శత్రుజాలమునంత
హృదయపీఠము నుండి
తరిమివేయుము ఓయి మనసా
89. ఆహారమందున
నిద్రాదులందున
మితము తప్పకు ఓయి మనసా
ఆరోగ్యమే భాగ్య
మనెడు సూత్రము నీవు
లెస్సగా పాలించు మనసా
90. శబ్దాది విషయాలు
ఆరంభ సమయాన
సుఖముగా తోచునూ మనసా
అనుభవించిన పిదప
దుఃఖ రూపాలుగా
పరిణమించును ఓయి మనసా
91. మతిని శుద్దము చేయు
మార్గాన్నె విజ్ఞులు
మతమనీ చెప్పుదురు మనసా
మతము లన్నిటియొక్క
ఏకైక లక్ష్యంబు
దైవాన్ని పొందుటే మనసా
92. బాగుగా యోచించి
భోగజాలము నంత
వదలివేయుము ఓయి మనసా
భోగాలు ఒక దశలో
రోగాలుగా మారు
తెలివితెచ్చుకొ ఓయి మనసా
93. అజ్ఞానమున మునిగి
నీచకార్యముల నీవు
చేయబోకుము ఓయి మనసా
జ్ఞాననేత్రము బడసి
సచ్చరిత్రను బొంది
దివ్యజీవితము గడుపు మనసా
94. ఏనాటి పుణ్యమో
నరజన్మ మిప్పుడు
ఏ తెంచినది నీకు మనసా
ఈ భవ్యజీవితము
సంపూర్తికానపుడె
దైవాన్ని చేరుకో మనసా
95. చిత్తంబు ఉన్నచో
జీవత్వ ముదయించు
బాధలన్నియు గలుగు మనసా
చిత్తమే లయమొంద
జీవుడే శివుడగును
మోక్షంబు చేకూరు మనసా
96. మురికి కొంపగ పేరు
పొందిన దేహంబు
నీ వెట్లు అగుదువూ మనసా
అతి నిర్మలంబైన
ఆత్మయే నీవని
దృఢముగా నమ్ముమూ మనసా
97. సంసార విషయాలు
సేవించి సేవించి
విసుకెత్తదే నీకు మనసా
ఆత్మానుభూతి యను
అపురూప కార్యంబు
సాధించుమూ ఓయి మనసా
98. మరణించు సమయాన
బంధ్వాదు లెవ్వరూ
వెంబడించరు నిన్ను మనసా
నీవు చేసిన కర్మయె
నీ వెంట వచ్చునని
బాగుగా తెలిసికో మనసా
99. పుట్టింది యేలకో
బాగుగా యోచించి
కార్యంబు సలుపుమూ మనసా
పుట్టుకే లేనట్టి
ఆత్మ పదమును పొందు
మార్గాన్ని తెలిసికో మనసా
100. ఎందరో రాజులు
పుట్టిరీ గిట్టిరీ
పేరైన యున్నదా మనసా
భువిలోన మానవులు
సంపత్తు లన్నియు
బుడగవంటివి ఓయి మనసా
101. ప్రతిబింబ సుఖములు
ఎంత గొప్పవి అయిన
సంతుష్టి నొసగవూ మనసా
బింబ సౌఖ్యానికై
హృదయంబు లోపల
బాగుగా వెతుకుమూ మనసా
102. కొండంత ఆశతో
విషయాల నన్నిటిని
అనుభవింపగనేల మనసా
విషయ సౌఖ్యాలన్ని
దుఃఖాలుగా మారి
బాధించు శీఘ్రమే మనసా
103. భువిలోన సర్వత్ర
ఒక్క ప్రాణినినైన
బాధించకూ ఓయి మనసా
నిన్ను నీ వెప్పుడు
ప్రేమించులాగున
దయజూపు అంతటా మనసా
104. చిత్తమెల్లపుడును
విషయాల మీదికి
పరుగెత్తుచుండునూ మనసా
దేనిపై వ్రాలునో
జాగరూకుండవై
సాక్షిగా గమనించు మనసా
105. మితమైన హితమైన
ఆహారమును నీవు
సేవించుమూ ఓయి మనసా
మోక్షసాధనలందు
ఆహార నియమము
అతి ముఖ్యమైనదీ మనసా
106.'ఆత్మయే నేన' నుచు
మదిలోన ఎల్లపుడు
భావించుచుండుమూ మనసా
ఆత్మ చింతనచేత
శక్తి సామర్థ్యములు
బాగుగా కలుగునూ మనసా
107. వేదాలసారము
ఒక్కమాటలో నీవు
ఆలకింపుము ఓయి మనసా
బ్రహ్మమే సత్యము
జగము సత్యము కాదు
జీవుండు బ్రహ్మమే మనసా
108. శాస్త్రసారము నిట్లు
బాగుగా తెలిసికొని
ఆచరింపుము ఓయి మనసా
ధరణి విద్యాప్రకాశుని
మాట గైకొని
శ్రద్ధగా నడుపుమూ మనసా