Mohini |
Mohini Ekadashi | మోహినీ ఏకాదశి
హైందవ కాలమానంలో ప్రతి ఏకాదశి తిథీ విశిష్టమే. పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా, అమావాస్యకి ముందుగా వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా… ప్రతి ఏకాదశి రోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. అలా వైశాఖ శుక్ల ఏకాదశి తిథికి ‘మోహినీ ఏకాదశి’ అని పేరు.
ఇంతకీ ఈ పేరు వెనుక విశిష్టత ఏమిటి?
అది దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయం. రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల వల్ల సమస్త లోకాలూ బాధలకు గురవుతున్నాయి. వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది. దాంతో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించాడు. క్షీరసాగరమథనం కనుక చేస్తే, దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందనీ… అది సేవించిన దేవతలు మరణమనేది లేకుండా, దానవుల మీద పైచేయి సాధించగలరనీ చెప్పాడు.
క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలచి, వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మథనం ప్రారంభించారు. వాటిలో కౌస్తుభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం… లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది.
ఈ మథనంలో దేవతలూ, రాక్షసులూ సమానంగా పాలుపంచుకున్నారు కాబట్టి ఇద్దరూ అమృతం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కనుక జరిగితే సముద్రమథనం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదు కదా! అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తే రంగంలోకి దిగాడు. ఎంతటివాడికైనా కళ్లు చెదిరిపోయే అందంతో మోహిని అవతారం ధరించాడు.
మోహిని రూపంలోని విష్ణుమూర్తి తన హొయలతో రాక్షసులను ఏమార్చి, దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోయాడు. ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుని మనసే చలించిపోయిందనీ… అలా ఆ హరిహరులకు జన్మించినవాడే అయ్యప్పస్వామి. విష్ణుమూర్తి రూపాలలో ఒకటి అయిన ఈ మోహినీదేవికి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలి అనే ఊరిలో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉండటం విశేషం. ఇంతకీ ఈ మోహిని అవతరించింది ఏకాదశి రోజు కనుక ఈ ఏకాదశికి ‘మోహినీ ఏకాదశి’ అని పేరు వచ్చింది.
వైశాఖమాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహినీదేవి అవతరించిన సందర్భం. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలకూ ఈరోజు చేసే ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది.
మోహినీ ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంతే దశమి రాత్రి నుంచే ఉపవాసం మొదలుపెట్టి, మర్నాడు… అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ఇవాల్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి, అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు, పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ నిద్రించరాదని శాస్త్రవచనం.
ఈ రోజు అభ్యంగన స్నానం చేయాలనీ, విష్ణుమూర్తిని ధూపదీపనైవేద్యాలతో పూజించాలనీ, ఉపవాసంతో రోజును గడపాలనీ, దానధర్మాలు చేయాలని పెద్దల మాట. ఇవన్నీ కుదరకపోయినా… కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి. తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో… అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలి.
మోహినీ ఏకాదశి వ్రత గాధ :
పాండురాజు పెద్దకుమారుడైన ధర్మరాజు జనార్ధనునితో "కృష్ణా! వైశాఖమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశి ఫలితము ఏమిటి? ఆ వ్రతమును ఆచరించేవిధానం ఏమిటి? ఆ ఏకాదశియొక్క గొప్పదనం ఏమిటి? ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏమిటి? ” సవివరంగా చెప్పమని వేడుకుంటున్నాను అన్నాడు.
"ధర్మరాజా!పూర్వము శ్రీరామచంద్రుడు నీవు నన్నుఅడిగినట్లుగానే వశిష్ఠమహర్షిని ప్రశ్నించాడు. వశిష్ఠుడు శ్రీరామ చంద్రునకు మంచి కథను ఒకదానిని చెప్పాడు. ఆ కథను నేను నీకు వివరంగా చెప్తాను ” అన్నాడు శ్రీకృష్ణుడు.
శ్రీరామచంద్రుడు వశిష్ఠునితో "మునిశ్రేష్ఠా! సమస్త పాపములను నశింపజేసేది, సమస్త దుఃఖములను పోగొట్టునట్టిది, వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతమును గూర్చి మీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను అని అడిగాడు.
అప్పుడు వశిష్ఠమహర్షి "రామచంద్రా! నీవు చాలా మంచి ప్రశ్న వేశావు. ధర్మ స్వరూపుడవైన నీవు ఇటువంటి ప్రశ్నవేయడం తగినదే. అందువలననే నీ నామమును తలచినంత మాత్రముననే మానవుడు పవిత్రుడౌతాడు. ప్రశ్నవేసిన వారిని బట్టి వారియొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది.
శ్రీరామా! వైశాఖమాసములోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ద్వాదశవిద్ధఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి మోహినీ అనిపేరు. ఈ ఏకాదశి సమస్త పాపములను పరిహరిస్తుంది. అన్నింటికంటే శ్రేష్టమైనది. ఈ ఏకాదశీ వ్రతమును ఆచరించినందు వలన మానవుడు మహాపాతకముల సమూహమునుండి సమస్త వ్యామోహములనుండి విడిపింపబడతాడు. విముక్తిని పొందుతాడు. అందువలన నీవంటి వారిచే ఈ వ్రతము తప్పక ఆచరింపబడాలి. సమస్త పాతకములను, సమస్త దుఃఖములను ఈ ఏకాదశీ వ్రతము నివారించును. పుణ్యములను ప్రసాదిస్తుంది. శుభప్రదమైనది అగు ఒక కథను నీకు చెప్తాను. ఏకాగ్రమైన మనసుతో నేను చెప్పే కథ విను. అట్లా వింటే విన్నంత మాత్రం చేతనే మహాపాపములన్నీ నశిస్తాయి.
రామచంద్రా! సరస్వతీ నదీతీరము మిక్కిలి మనోహరముగా ఉంటుంది. దాని ఒడ్డున అందమైన పట్టణము ఒకటి ఉన్నది. ఆ పట్టణమునకు “భద్రావతీ” అనిపేరు. ఆ పట్టణమును “ద్యుతిమాన్” అనేరాజు పరిపాలిస్తున్నాడు. శ్రేష్ఠమైన రాజవంశంలో జన్మించినవాడు. సత్యవాక్యపాలనయందు నిష్ఠకలవాడు. చంద్రవంశంలో జన్మించిన వాడు. మంచిధైర్యవంతుడు. సత్యప్రతిజ్ఞ కలవాడు. ఆ భద్రావతీ పట్టణంలోనే “ధనపాలుడు” అనే పేరుకలిగిన ధనధాన్యాది సకలసంపదలు కలిగిన వైశ్యుడు ఒకడున్నాడు. అతడు చాలా పుణ్యకార్యములుచేస్తాడు అని ప్రసిద్ధిపొందాడు. ప్రజలు దాహమును తీర్చుకొనుటకోసం ఆ వైశ్యుడు చాలా ప్రదేశములలో నీటికుటీరము లను (చలివేంద్రము) నిర్మించాడు. యజ్ఞయాగములు చేసుకొనేవారికి యజ్ఞ, యాగ శాలలను నిర్మిస్తుంటాడు. చెరువులు త్రవ్విస్తుంటాడు. నీడకోసం అక్కడక్కడ చెట్లను, కూడా నాటిస్తుంటాడు. ఈ విధంగా ఆ వైశ్యుడు అనేక ధర్మకార్యములను చేస్తుండేవాడు.
ఇంకనూ ఆ వైశ్యునకు విష్ణుమూర్తిపట్ల అపారమైన భక్తి కూడా ఉన్నది. పరమ శాంతస్వభావము కలవాడు. అతనికి ఐదుగురు కుమారులు ఉన్నారు. మొదటి వానిపేరు సుమనుడు. రెండవవానిపేరు ద్యుతిమంతుడు. మూడవ వాడు మేధావి. నాలుగవవాడు సుకృతి. ఇక ఐదవవానిపేరు దుష్టబుద్ధి. పేరుకు తగినట్లుగానే అతడు నిరంతరము మహాపాపములను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ వేశ్యలతోనే తిరుగుతుండేవాడు. నిరంతరము విటులతో మాట్లాడుతుండే వాడు. తనను గొప్ప మొనగాడు అని భావించేవాడు.
జూదము మొదలైన చెడువ్యసనములందు ఆసక్తి కలిగి ఉండేవాడు. ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన ధర్మవిరుద్ధమైన పనులనే నిరంతరం చేస్తుండేవాడు. దుర్మార్గమైన ప్రవృత్తి వలన తాత, తండ్రులు సంపాదించిన ధనమును విచ్చలవిడిగా ఖర్చుచేసేవాడు. తినకూడని వస్తువులనే తినేవాడు. మహాపాపాత్ముడైనాడు.
తానుచేసే ఘనకార్యములను అందరూ చూచుచున్నారా లేదా, తననుగూర్చి ఎవరెవరు ఏవిధంగా అనుకుంటున్నారు? అని అన్ని దిక్కులకు తనచూపును ప్రసరింపజేసేవాడు. ఇట్లా అతడు తిరుగుతుండగా ఒకసారి తండ్రిచూసాడు. అతనిని అసహ్యించుకున్నాడు. అందుకని తండ్రిపై కోపం తెచ్చుకుని ఇంటికివచ్చిన తరువాత చాలా బలముకలిగిన సేవకులచే తండ్రిని బయటకు గెంటివేయించాడు. అతని ప్రవర్తన అందరికీ తెలిసింది. అతనిని బంధువులు ఎవ్వరూ చేరనివ్వడంలేదు.
కొంతకాలానికి తన చేతియందున్న ఉంగరములను, కంఠాభరణములను తక్కువ ధరకు అమ్మేసి ఆ ధనముతో కొంతకాలము కాలక్షేపం చేసాడు. అతనివద్ద ధనము పూర్తిగా అయిపోయిన విషయము తెలుసుకొన్నారు అతనితో ప్రవర్తించిన వేశ్యలు వారందరూ. అతనిని వారివద్దకు రానివ్వడంలేదు. ఒకవేళ వచ్చినా గుమ్మంవద్దనేతిట్టి పోస్తున్నారు. అవమానిస్తున్నారు. ధనహీనులైనవారితో వేశ్యలకు పని ఉండదు కదా! దుష్టబుద్ధికి ధరించడానికి పరిశుభ్రమైన వస్త్రములు కూడా లేకుండ పోయినవి. అందువలన పూర్తిగా మాసిపోయిన చిరిగిపోయిన వస్త్రములనే కట్టుకొని తిరుగుతుండే వాడు. తినడానికి సరియగు తిండి కూడా ఉండేదికాదు. దానితో ఆకలితో బాధపడుతుండేవాడు. మిక్కిలి దుఃఖపడుతూ అయ్యో ఇప్పుడు నేను ఏమి చేయవలెను. ఎక్కడికి పోవలెను ఇకమీదట నా జీవితం ఏ విధంగా గడుస్తుంది? అని ఆలోచించసాగాడు.
మరేవిధంగానూ జీవితమును గడుపుకొనుటకు అతనికి అవకాశం లభించలేదు. చివరకు దొంగతనము చేయుట ప్రారంభించాడు. దొంగతనము చేయుట మొదటిసారి అయినందువలన మొదటి రోజునే రాజభటులకు దొరికిపోయాడు. భటులు అతనిని పట్టుకున్నారు. అతని తండ్రి ధార్మికుడు గౌరవనీయుడు కనుక అతని ముఖము చూచి కొద్ది శిక్షణ మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టారు.
చేసేది లేక అతడు మళ్లీ రెండోసారి కూడా దొంగతనం చేశాడు. దొరికిపోయాడు. భటులు ఈసారి పూర్వం కంటే కొంచెము కఠినముగా శిక్షించారు. తరువాత విడిచి పెడుతూ గట్టిగా మందలించి హెచ్చరించారు. ఇకపై దొంగతనము చేయనని మాట ఇచ్చాడు. అయినప్పటికీ కొన్ని దినములు గడిచిన తర్వాత జీవితము సాగే మార్గము లభించునందువలన మరల దొంగతనం చేస్తూ భటులకు దొరికిపోయాడు. ఎన్నిసార్లు మందలించినను హెచ్చరించినను అతడు తన యొక్క చెడ్డ బుద్ధిని మార్చుకోలేకపోయాడు. దుర్వ్యసనము అంతా బలవత్తరమైనది. తాను చేసే దురాచారములను విడిచిపెట్టలేకపోయాడు. భటులు కూడా విసిగిపోయారు. అతనికి బేడీలు వేసి బంధించారు.
కారాగారంలో బంధించి ఉంచారు. కొరడాలతో కొట్టారు అనేక విధములైన జైలు శిక్షలను అనుభవింపజేశారు. చిట్టచివరకు రాజు వద్దకు తీసుకొని వెళ్లారు. రాజు అతడు చేసిన నేరములను అన్నిటిని విచారణ చేశాడు. బుద్ధిహీనుడా నీబోటి వారిని రాజ్యమునందు ఉండనివ్వకూడదు కనుక నీవు రాజ్యమును వదిలిపెట్టి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. జైలు నుండి తరిమి కొట్టించాడు. మిక్కిలి భయపడుతూ దుష్టబుద్ధి రాజ్యమును వదిలిపెట్టాడు. భయంకరమైన అరణ్యములకు చేరుకున్నాడు. ఆకలి దప్పికలకు మిక్కిలి బాధపడుతూ నీటి కోసం ఆహారం కోసం అరణ్యములో ఇటు అటు పరిగెత్తేవాడు.
చివరికి ధనుర్భాణాలను తయారు చేసుకున్నాడు. అమ్ములపొదుని వీపుకి కట్టుకున్నాడు అరణ్యమంతా తిరుగుతున్నాడు. చిన్నచిన్న పక్షులను, జంతువులను, చకోర పక్షులను, నెమళ్లను, గ్రద్దలను, తిత్తిరి పక్షులను, ఎలుకలను కూడా ఏమాత్రం దయ లేకుండా చంపుతు తన ఆకలి తీర్చుకుంటూ కాలం గడపసాగాడు.
ఒకానొకనాడు అతడు చాలా దూరముగా ఉన్నఅరణ్యంలో తిరుగుతున్నాడు. ఏజన్మలోనో చేసిన పుణ్యవిశేషం కొద్దిగా మిగిలిఉన్నది. అతనికి ఆ కారణంగా కౌండిన్యమహర్షి ఆశ్రమము కనపడింది. అది వైశాఖమాసం కౌండిన్యమహర్షి గంగానదిలో స్నానంచేసి తిరిగివస్తున్నాడు. దుఃఖముతో క్రుంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపించాడు.
మంచి వేసవికాలం. అందువలన వేడి ఎక్కువగా ఉన్నది. కౌండిన్య మహర్షి స్నానముచేసి నీరుకారుతున్న వస్త్రములతోనే ఆశ్రమమునకు వెళ్ళుచున్నాడు. ఆయనను వెంబడించి వెళ్తున్నాడు దుష్టబుద్ధి. మహర్షి ధరించిన వస్త్రమునుండి జారుతున్న నీటిబిందువులు గాలికి ఎగిరి వెనుక నడుస్తున్న దుష్టబుద్ధి మీద పడుతున్నాయి. ఒక్కోక్కబొట్టు పడుతున్నప్పుడల్లా అతని పాపరాశి కొద్దికొద్దిగా తరిగిపోతున్నది. దురదృష్టముకూడా కొంత తగ్గినది. దానితో అతనికి అవకాశం లభించింది. మహర్షికి ఎదురుగా నిలబడి నమస్కరించాడు.
“ఓ బ్రాహ్మణోతమా! నేను పుట్టిన దగ్గరనుండి పాపములనే చేస్తున్నాను. పరమ పాపాత్ముడను. ప్రస్తుతము నావద్ద ధనము ఏమియూలేదు. ధనముతో పనిలేని నా పాపములను పోగొట్టునట్టి ప్రాయశ్చిత్తము ఏదైనా ఉంటే నాయందు అనుగ్రహము ఉంచి నాకు వివరించండి” అని అన్నాడు మహర్షితో. మహర్షిదివ్యదృష్టితో గడచిపోయిన అతని జీవితమునంతటినీ తెలుసుకున్నాడు. వెంటనే దుష్టబుద్ధితో " ఓయీ! నీవు నీ పాపములను పోగొట్టుకొనదలచినట్లైతే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను. వైశాఖమాసములో శుక్లపక్షమునందు మోహినీ ఏకాదశి వస్తుంది. ఆ రోజున నీవు నా మాట మీద నమ్మకము ఉంచి ఉపవాసవ్రతమును చెయ్యి. ఆ వ్రతప్రభావమువలన మేరుపర్వత మంత పెద్ద పాపసమూహమైనప్పటికిని నశిస్తుంది. మానవులు గతజన్మలలో ఎన్ని పాపములను చేసినప్పటికీ అవి అన్నియు మోహినీ ఏకాదశినాటి ఉపవాస వ్రతము వలన నశించుట తప్పనిసరిగా జరుగును. ఈ మోహినీ వ్రతముయొక్క మహత్యము చాలా గొప్పది " అని చెప్పాడు మహర్షి.
రాజోత్తమా! దుష్టబుద్ధి మహర్షి చెప్పిన మాటలను విన్నాడు. అపరిమితమైన ఆనందాన్ని పొందాడు. కౌండిన్య మహర్షి ఉపదేశించిన ప్రకారంగా శాస్త్రపద్ధతిని అనుసరించి మోహినీ ఏకాదశి వ్రతమును ఆచరించాడు. దానితో ఆ వ్రత ప్రభావం వలన దుష్టబుద్ధి యొక్క పాపములన్నీ తొలగిపోయినాయి. దుష్టబుద్ధి దివ్యమైన దేహమును ధరించాడు. గరుడవిమానమును ఎక్కాడు. ఏ బాధలూ లేనటువంటి వైకుంఠలోకమునకు చేరుకున్నాడు.
రామచంద్రా! మోహినీ ఏకాదశి మహిమ తెలిసినదిగదా! అజ్ఞానము అనే మోహమును నశింపజేస్తుంది. చరాచర ప్రాణికోటితో నిండిన మూడులోకము లందునూ ఈ వ్రతమును మించినది వేరొక వ్రతము లేదు.
మహారాజా! యజ్ఞములు యాగములు పుణ్యతీర్ధములు దానములు మొదలగునవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ ఈ ఏకాదశీ వ్రతఫలములో పదహారవవంతుకి కూడాసాటిరావు. ఈ మాటలో ఆశ్చర్యం ఏమీలేదు. ఈ మోహినీ ఏకాదశీ మహాత్మ్య మును చదివిననూ, విన్ననూ వెయ్యిగోదానములు చేసినంత మహాపుణ్యము లభించును. ఈ కథ కూర్మ పురాణములోనిది. పద్మపురాణమునందుకూడా ఉన్నది.