Linga Bhairavi |
లింగ భైరవి దేవి
శివుడు లింగరూపంలో కనిపించటం అత్యంత సహజమైన విషయం. కానీ అమ్మవారిని ఎప్పుడైనా లింగరూపంలో చూశారా? అలాగే ఏ ఆలయంలో అయినా స్త్రీలు పూజారులుగా ఉండటం విన్నారా? ఇటువంటి ఆశ్చర్యకర విశేషాలు చూడాలి అంటే మీరు కోయంబత్తూర్ సమీపంలో వెళ్ళంగిరి కొండలలో కొలువై ఉన్న లింగ భైరవి దేవి ఆలయానికి వెళ్లాల్సిందే.
ఈశా యోగా కేంద్రంలో ఉన్న ఈ ఆలయంలో లింగ భైరవి దేవిని, సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ గారు, 2010 జనవరిలో ప్రతిష్టించారు. దేవీ ప్రతిష్టాపన "ప్రాణ ప్రతిష్ట" ప్రక్రియ ద్వారా జరిగింది. సహజంగా ఏ దేవతామూర్తి ప్రతిష్ట అయినా మంత్రం లేదా హోమం ద్వారా జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ట ఒక యోగి లో ఉండే ప్రాణ శక్తిని ఉపయోగించి దేవతామూర్తిలో శక్తి నింపే విధానం. ఇటువంటి ప్రక్రియ ఈ కాలంలో చాలా అరుదు.
కాలరాత్రి లాంటి నల్లటి ఛాయతో, తీక్షణమైన కళ్ళతో, వెలుగులు చిమ్మే త్రినేత్రంతో, తన వైభవాన్ని చాటే బంగారు రంగు చీరతో, పది చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది లింగ భైరవి దేవి. మనకి అమ్మవారు లింగ రూపంలో కొలువై ఉన్న ఆలయాలు చాలా అరుదు. కొన్ని ఉన్నా కూడా అవి మారుమూల ప్రదేశాలలో పెద్దగా గుర్తింపు లేకుండా ఉన్నాయి. జనవాహినికి అందుబాటులో ఉన్నటువంటి దేవతామూర్తి ఇది ఒక్కటే.
Linga Bhairavi Pooja |
స్త్రీ తన సహజ శక్తిని పూర్తి స్థాయిలో వ్యక్తపరిస్తే ఆమె ఒక జ్వలించే శక్తి స్వరూపంగా పరిణమిస్తుంది. లింగ భైరవి ఒక అత్యున్నత ఆవేశంతో జ్వలిస్తున్న అగ్ని గోళం. సద్గురుచే ప్రతిష్టించబడిన ఈ శక్తి స్వరూపం, అణువణువునా స్త్రీ అంశ నిండిన మూర్తి. ఈ స్త్రీ మీలో అత్యల్ప స్థాయి అయిన కామ కీలలు రగిల్చే స్త్రీ కాదు. మీ అంతరాలలో అగ్ని జ్వాలలు పుట్టించే స్త్రీ. ఆ జ్వాలలే మిమల్ని ధ్యానం వైపుకి నడిపిస్తాయి. ఆ శక్తియే మన కోరికలను సిద్ధింప చేస్తుంది. ఇదే విషయాన్ని సద్గురు చాలా చక్కగా వివరించారు.
లింగ భైరవి దేవి మీ మనుగడకి అవసరమైన సమస్త కోరికలను సిద్ధింప చేస్తుంది. అంతేకాదు,భౌతిక విషయాలకు అతీతమైన దాన్ని సాధించే జిజ్ఞాసను మీలో ప్రేరేపిస్తుంది కూడా. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. త్రికోణ ఆకారంలో ఉండటం ఈ ఆలయం యొక్క మరొక్క విశిష్టత.