Rush |
ఋషి పంచమి వ్రతకల్పము
ఋషి పంచమి వ్రతకధ
భూశుద్ద:
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ద చేసి, అలికి, బియ్యపు పిండితో గాని, రంగుల చూర్ణ ములతో గాని, ముగ్గులు పెట్టి, దైవ స్థాపన నిమిత్త మై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని, మరీ పల్లముగా గానీ ఉండ కూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి, వరి పిండి (బియ్యపు పిండి) తో ముగ్గులు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజింజబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్ర పటమును గాని ఆ పీట పై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి ( పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి) దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్ళెంలో గాని, క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దాని పై ఒక తమలపాకు నుంచి, అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి. ఇపుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైఋతి దిశలో చేయవలెను.
దీపారాధనకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము:
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని, ఇత్తడిది గాని, మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో ( కర్పూర హారతికి వాడే వస్తువు) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోన1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించవలెను. తర్వాత చేయు కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వులనూనెగాని, కొబ్బరినూనెగాని, ఆవు నెయ్యిగాని వాడ వచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.
ఘంటానాదము:
శ్లో || ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్
కుర్యాద్ఘంటార వంతత్ర దేవతాహ్వాహన లాంఛ నమ్
మనము,
ఆచ మనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు.
పూజకు విడిగా ఒక గ్లాసుగాని, చెంబుగాని తీసుకొని దానిలో శుద్ద జలమును పోసి ఆ
చెంబునకు కలశారాధన చేసి ఆనీళ్లు మాత్రమె దేవుని పూజకు ఉపయోగించవలెను.
పూజకు కావలసిన వస్తువులు :
ఏ వ్రతమును (పూజకు) ఆచరించుచున్నామో ఆ దేవుని యొక్క బొమ్మ(ప్రతిమ)(తమ శక్తి
కొలది బంగారముతో నైనను, వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకోనవలెను), లేదా చిత్ర పటము, మండపమునకు మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరి కాయలు, పళ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గి పెట్టె, అగరవత్తులు, వస్త్ర, యజ్ఞో పవీతములు, తోరములు( తెల్లని దారమునకు పసుపు రాసి 9 వరసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను దేవునికి పూజ చేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు.) ప్రత్యేక నివేదన ( పిండి వంటలు) పిమ్మట యజమానులు (పూజ చేసే వారు) ఈ దిగువ
కేశవనామాలను స్మరిస్తూ ఆచ మనం చేయాలి. ఈ నామములు మొత్తం 24 కలవు.
1. " ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
2. " ఓం నారాయణాయ స్వాహా " అనుకుని ఒక సారి
3. " ఓం మాధ వాయ స్వాహా " అనుకుని ఒక సారి జలమును పుచ్చు కోవలెను. తరువాత
4. " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగుకోవాలి.
5. " ఓం విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు, బొటన వ్రేళ్ల తో కళ్లు తుడుచుకోవాలి.
6. " ఓం మధు సూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురు కోవాలి.
7. " ఓం త్రివిక్ర మాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.
8,9 " ఓం వామనాయ నమః" " ఓం శ్రీధ రాయ నమః" ఈ రెండు నామాలు స్మరిస్తూ తల పై కొంచెం నీళ్లు చల్లుకోవాలి.
10. " ఓం హృషీకేశాయ నమః" ఎడమ చేతితో నీళ్లు చల్లాలి.
11. " ఓం పద్మనాభాయ నమః" పాదాల పై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
12. " ఓం దామోద రాయ నమః" శిరస్సు పై జలమును ప్రోక్షించుకోవలెను.
13. " ఓం సంకర్షణాయ నమః" చేతి వ్రేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
14. " ఓం వాసుదేవాయ నమః" వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15,16 " ఓం ప్రద్యుమ్నాయ నమః" " ఓం అనిరుద్దాయ నమః" నేత్రాలు తాకవలెను.
17,18 " ఓం పురుషోత్తమాయ నమః" ఓం అధోక్షజాయ నమః" రెండు చెవులూ తాకవలెను.
19,20 " ఓం నారసింహాయ నమః " ఓం అచ్యుతాయ నమః" బొడ్డును స్పృశించవలెను.
21. " ఓం జనార్ద నాయ నమః" చేతివ్రేళ్ల తో వక్ష స్థలం, హృదయం తాకవలెను.
22. " ఓం ఉపేంద్రాయ నమః" చేతి కొన తో శిరస్సు తాక వలెను.
23,24 " ఓం హరయే నమః " ఓం కృష్ణాయ నమః" కుడి మూపురమును ఎడమ చేతితోను, ఎడమ మూపుర మును కుడి చెతితోను తాకవలెను.
ఆచ మనము వెంటనే సంకల్పము చెప్పుకోవలెను.
ఆచ మనము అయిన తరువాత, కొంచెం నీరు చేతిలో పోసుకుని నేల పై చిలకరించుతూ ఈ శ్లోకము పటించవలెను.
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః
యేతే షామవిరో ధేన బ్రహ్మకర్మ సమారభే ||
ప్రాణాయామమ్య : ఓం భూ: - ఓం భువః ఓం సువః - ఓం మహః - ఓం జనః ఓం తపః - ఓగ్o సత్యం - ఓం తత్ సవితుర్వ రేణ్యం భర్గో దెవస్య ధీమ హీధ యోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భు వస్సువరోం అని సంకల్పము చెప్పుకొనవలెను.
సంకల్పము :
మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణః (ఇక్కడ శ్రీ మహావిష్ణో రాజ్ఞయా అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూ ద్వీపేభరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీ శైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీ శైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను), కృష్ణా గోదార్యో: మధ్య ప్రదేశే (మనం ఏఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొన వలెను), శోభన గృహే ( అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ ఆస్మిన్ వర్త మానే వ్యావ హారిక చాంద్ర మానేన సంవత్సరే, (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలెను), అయనే, ( సంవత్సరమునకు రెండు అయనములు - ఉత్త రాయణము, దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం. పూజచేయునపుడు ఏ అయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను) ఋతు:, ( వసంత, గ్రీష్మ, వర్ష మొ|| ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు) పక్షే, (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము, అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు) తిధౌ, ( ఆరోజు తిధి) వాసరే (ఆరోజు ఏ వార మనదీ చెప్పుకొని) శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే ఏవం గుణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీరామా ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్.... గోత్రస్య..... నామధేయః, శ్రీ మత్యః, గోత్రస్య, నామధేయస్య అనియు, స్త్రీ లైనచో శ్రీమతి, గోత్రవతి, నామధేయవతి, శ్రీ మత్యాః, గోత్ర వత్యాః, నామధేయవత్యాః అనియు ( పూజ చేయువారి గోత్రము, నామము చెప్పి) నామధేయస్యః దర్మ పత్నీ సమేతస్య ( పురుషులైనచో) మమ సహ కుటుంబస్య, క్షేమ స్థ్యైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్ధం సకలవిధ మనోవాంఛాఫల సిద్ద్యర్ధం, శ్రీరామ ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం( ఏ దేవుని పూజించుచున్నాయో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని) సంభవద్భి రుపచారై: సంభవతానియమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి ( నాకు తోచిన రీతిలో, నాకు తోచిన విధముగా, భక్తి శ్రద్దలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తధంగ కలశ పూజాం కరిష్యే || పిద పకలశారాధ నను చెయవలెను.
కలశ పూజను గూర్చిన వివరణ :
వెండి, రాగి, లేక కంచు గ్లా సులు( లేదా పంచ పాత్రలు) రెండింటిలో శుద్ద జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షింతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండువ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమ అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమునుగాని, కుంకుమనుగాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను. కుంకుమ అక్షతలువ గైరాబొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్లను కలిపి సమర్పించవలెను. యజమానులు( ఒక్కరైతే ఒకరు, దంపతులు లైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడి చేతితో మూసివుంచి, ఇలా అనుకోవాలి. ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదవవలెను.
మం || కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాస్శ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మామధ్యే మాతృ గణాస్మృతాః||
ఋగ్వేదో ధయజుర్వేద స్సామావేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే, గోదావరి, సరస్వతీ,
నర్మదా సింధు కావేరౌయో జలే స్మిన్ సన్నిధంకురు ||
ఇక్కడ, ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీరామ. ( ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను) పూజార్ధం మమ దురితక్షయకార కాః కలశో దకేన ఓం దేవం సం ప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవుని పై చల్లాలి) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని, ఆకుతో గానీ చల్లాలి.
మార్జనము:
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావ స్థాంగతో పివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతర శ్ముచి:||
అని,
పిద పకాసిని అక్షతలు, పసుపు, గణపతి పై వేసి, ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ఠ అనగా శ్రీ మహా గణాధి పతయేనమః ప్రాణ ప్రతిష్టా పన ముహూర్తస్సు ముహూర్తోస్తు తధాస్తు. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.
శ్లో || శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నో పశాంతయే ||
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః
షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||
పిదప,
షోడశో పచార పూజను చేయవలెను. షోడశో పచార ములనగా ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం,
నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు మొదలగునవి. పిదప షోడశో పచార పూజను చేయవలెను. షోడశో పచారములనగా ధ్యాన, ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు మొదలగునవి.
షోడశో పచార పూజాప్రారంభః
ధ్యానం:
శ్లో || ఓం శ్రీ రామచంద్రాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి
అని శ్రీ రాముని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.
ఆవాహనం:
శ్లో || ఓం శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి. ఆవా హనార్ధం అక్షతాం సమర్పయామి. అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సున అక్షతలు దేవుని పై వేయవలెను.
ఆసనం:
శ్లో || ఓం శ్రీ రామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్ధం
అక్షతాం సమర్పయామి. దేవుడు కూర్చుండుట కై మంచి బంగరుపీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.
అర్ఘ్యం:
శ్లో || ఓం శ్రీ రామ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి.
దేవుడు చేతులు కడుగుకొనుట కై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ, ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.
పాద్యం :
శ్లో || ఓం శ్రీరామ నమః పాదౌ:పాద్యం సమర్పయామి.
దేవుడు కాళ్లు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.
ఆచమనీయం:
శ్లో || ఓం శ్రీరామ నమః ఆచమనీయం సమర్పయామి.
అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్ళిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతొ ఒక మారు నీరు వదలవలెను.
సూచన:
అర్ఘ్యం,
పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్ర లో వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పల్లెము) లో వదలరాదు.
మధుపర్కం :
ఓం శ్రీ రామ నమః మధుపర్కం సమర్పయామి
అని,
స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ , ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు )
పంచామృత స్నానం :
ఓం,
శ్రీ రామ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి ,ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.
శుద్దోదక స్నానం :
ఓం శ్రీ రామనమః శుద్దోదక స్నానం సమర్పయామి . పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను .
వస్త్ర యుగ్మం :
ఓం,
శ్రీ రామనమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
యజ్ఞోపవీతం :
ఓం శ్రీరామనమః ఉపవీతం సమర్పయామి
అనగా,
జందెమును ఇవ్వవలెను ఇదియును ప్రత్తితో చేయవచ్చును .ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి, కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.
గంధం :
ఓం శ్రీనమః గంధాన్ సమర్పయామి
ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
ఆభరణం : శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే |
భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత ||
ఓం
శ్రీ రామనమః ఆభరణాన్ సమర్పయామి అని స్వామికి మనము చేయించిన ఆభరణములను
అలంకరించవలెను లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు స్వామిపై
వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించవలెను.
పిదప ఆధాంగ పూజను చేయవలెను. ఈ క్రింది నామాలను చదువుచు పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.
తరువాత
అష్టోత్తర శతనామావళి పూజ. దీనియందు 108 మంత్రములుండును. ఈ మంత్రములను చదువును పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.
పిదప అగరువత్తిని వెలిగించి
ధూపం :
శ్లో || ఓం శ్రీ రామ నమః ధూప మాఘ్రాపయామి.
ధూపం సమర్పయామి. అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.
దీపం :
శ్లో || ఓం శ్రీరామ నమః సాక్షాత్ దీపం దర్శయామి
అని,
మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపు వత్తులతో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదవవలెను.
నైవేద్యం :
శ్లో || ఓం శ్రీరామ నైవేద్యం సమర్పయామి
అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరి కాయ మొదలగునవి ఒక పల్లెములోనికి తీసుకొని స్వామివద్ద నుంచి దాని పై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంటవాయిస్తూ ' ఓం భూర్భువస్సువః ఓం తత్ స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీయో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరి షించామి,( ఋతంత్వా సత్యేత పరి షించామి అని రాత్రి చెప్పవలెను) అమృత మస్తు అమృతో పస్త రణమసి, ఓం ప్రాణాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణెతో) స్వామికి నివేదనం చుపించాలి. పిదప ఓం శ్రీరామ నమః నైవేద్యానంతరం, హస్తౌ ప్రక్షాళ యామి' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర ( పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర ) లో వదలాలి. తరువాత ' పాదౌప్రక్షాళ యామి' అని మరో సారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. పునః శుద్దాచ మనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం
తాంబూలం :
శ్లో || ఓం శ్రీరామ నమః తాంబూలం సమర్పయామి
అని,
చెబుతూ తాంబూలమును ( మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ, ' తాంబూల చరవణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ' అంటూఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి
నీరాజనం :
శ్లో || ఓం శ్రీరామ నమః కర్పూర నీరాజనం సమర్పయామి
అని,
కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ, చిన్నగా ఘంట వాయించవలెను. అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్దాచ మనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,
మంత్ర పుష్పం :
శ్లో.. || ఓం శ్రీరామ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామివద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణం:
శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ,
నమస్తే విఘ్న రాజాయ నమేస్తే విఘ్న నాశన ||
శ్లో || ప్రమధ గణ దేవేశ ప్రసిద్దే గణనాయక,
ప్రదక్షిణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే ||
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం
శ్రీరామ నమః ఆత్మ ప్రదక్షిణ చేసి ( అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట
సాష్టాంగ నమస్కారం చేసి ( మగ వారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి,
ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి ) తరువాత స్వామి పై
చేతిలో నున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసినులై
నమస్కరించుచూ
పునః పూజ :
ఓం
రామ నమః పునః పుజాంచ కరిష్యే అని చెప్పుకొని, పంచపాత్ర లోని నీటిని చేతితో తాకి, అక్షతలు స్వామి పై చల్లుతూ ఈక్రింది మంత్రములు చదువుకొనవలెను.
విశేషో పచారములు:
ఛత్రం
ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని, నమస్కరిస్తూ ఈక్రింది శ్లోకమును చదువుకొనవలెను.
పూజాఫల సమర్పణమ్:
శ్లో || యస్యస్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయాధ్యానావాహనాది షోడశో పచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీరామ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు.
ఏతత్ఫలం
శ్రీరామర్పణమస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట ' శ్రీరామ ప్రసాదం శిరసాగృహ్నామి' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
ఓం శ్రీ రామ నమః యధాస్థానం ప్రవేశయామి ||
శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు. పూజా విధానం సంపూర్ణం.
తీర్ధ ప్రాశ నమ్ :
శ్లో || అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్ష యకరం శ్రీరామ పాదో దకం పావనం శుభమ్ ||
అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను.
వ్రత కధా ప్రారంభము
సర్వలోకమునకు గురువుఐన, సర్వేశ్వరుడు ఐన శ్రీ కృష్ణుని చూచి ' ధర్మరాజు ' ఓ దేవ దేవా! అనేక వ్రతములను గూర్చి విన్ననూ, వ్రతములలో ఉత్తమమైనది, అన్ని దోషములను పోగొట్టునది ఐన ఒక వ్రతము వినవలెనని ఉన్నది. అని చెప్పగా విన్న శ్రీ కృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ ధర్మ రాజా చెప్పెదను వినము దేనిని చెయుట చేత ప్రజలు నరకమును చూడరో పాపములను పోగొట్టునది ఐన ' ఋషి పంచమి ' అను వ్రతము ఒకటి కలదు. దానిని గూర్చిన పురాణ కధ ఒకటి కలదు.
పూర్వకాలమున ' విదర్భ దేశం'లో ' ఉదంకుడు ' అను ఒక ' బ్రాహ్మణుడు ' కలడు. అతని భార్య పేరు 'సుశీల' ఈమె పతివ్రత వీరికి సుభీషణుడు అను కొడుకు, ఒక కూతురు ఉండిరి. ఇతని కొడుకు వేదే వేదాంగములను చదివెను. కూతురుని ఒక బ్రాహ్మణునకు ఇచ్చి ' వివాహం ' చేసిరి ఆ తరువాత ఆమె 'విధ వశము' చే వైధవ్యమును పొందెను.( అనగా భర్త లేనిదయ్యెను) తాను పవిత్రముగా ఉండి, తన తండ్రి ఇంటిలోనే కాలము, గడుపు చుండెను. తండ్రి ఐన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధ పడుచు కొడుకు ఇంటి నుంచి భార్యను, కూతురును తీసుకొని అడవులకు పోయి తన శిష్యులకు ' జ్ఞాన బోధ' చేయుచుండెను. అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరి చర్యలు (సేవలు) చేయు చుండగా ఒకానొక రోజున అర్ద రాత్రి వేళ, అలసి నిద్రిస్తుండగా ఆమె దెహమంతా పురుగులు పట్టినవి. ఇలా శరీర మంతా పురుగులతో నిండియున్న ఆమెను చూచి 'శిష్యులు' ఆమె తల్లికి చెప్పిరి. అది విని తల్లి బాధ చెంది, ఆమె శరీర మునకు ఉన్న పురుగులను దులిపి, ఆమెను తీసుకొని తన భర్త ఐన ఉదంకుని దగ్గరకు పోయి, జరిగిన దంతా వివరించి చెప్పి, ఇందుకు కారణము తెలుపమని కోరగా ఉదంకుడు కొంత సేపు 'ధ్యాన ముద్ర'లో ఉండి ఆమె పూర్వ జన్మ వృత్తాంత మంతయూ గ్రహించి ఇలా చెప్పెను.
ఓ ప్రాణేశ్వరీ! ఆమె ఇంతకుముందు తన ఏడవ జన్మమున బ్రాహ్మణ స్త్రీగా ఉండి 'రజస్వల' యై దూరముగా నుండక ఇంటి పనులు అన్ని చేయుచూ వంట సామాగ్రిని (అనగా అన్నము,కూర, పప్పు, మొ|| పదార్దములు వండిన గిన్నెలు|| వాటిని) తాకిన దోషము వలన ఆమె శరీర మంతట పురుగులు వ్యాపించనవి, కావున 'స్త్రీ' రజొయుక్తరాలు ఐనచో పాపము కలది అగును. అది యెట్లు అనగా మొదటి రోజున చూడాలి రెండవ రోజున బ్రహ్మఘాతి ( అనగా బ్రహ్మను చంపిన పాపము కలదిగను) మూడవ రోజున రజకి ఐ నాలుగవ దినమున శుద్ద అగును. ఇలా ఉండగా ఈమె పూర్వము చెలికత్తెలతో కలిసి ఒక మంచి వ్రతమును అవమానించెను. కాని, ఆ వ్రతము చేయుటను చూచి ఉండుట వలన నిర్మలమైన బ్రాహ్మణకులంలో పుట్టుట జరిగినది ఆ వ్రతమును దూషించుట వలన శరీరమంతా పురుగుల కలదిగా అయ్యెను. అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంత మను గూర్చి చెప్పగా అతని భార్యైన సుశీల ఏ వ్రతము యొక్క మహిమచే ఉత్తమ కులములొ పుట్టుటయు మరియు శరీర మంతా పురుగులు వ్యాపించుట జరిగినదో ఆ మహిమ కల ఆశ్చర్య కరమైన వ్రతము గూర్చి నాకు తెలపువలెను.అని కోరగా అందుకు ఉదంకుడు ఈ విధముగా చెప్పుచుండెను.
ఏ వ్రతము చేసిన మాత్రమున స్త్రీలకు సకల సౌభాగ్యములు, సకల ఐశ్వర్యములు కలుగునో సర్వపాపములు తొలగునో, అంతే గాక ఆపద లేని సంపదలు వర్దిల్లునో అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతము ఒకటి కలదు. అన్న శ్రీ కృష్ణుని మాటను విని ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు. ఓ శ్రీకృష్ణ ఈ వ్రతము యొక్క మహిమను వివరింపుము అనిన శ్రీకృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ రాజేంద్రా ఏ వ్రతము చేసినచో ఆడువారు సర్వపాపముల నుండి విముక్తి పొందెదరో ఆ వ్రతమును గూర్చి నీకు తెల్పెదను. అని ఇలా వివరించుచుండెను.
'ఋషి పంచమి' వ్రతము అను ఒక వ్రతము ఉన్నది. 'ధర్మ రాజు' అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈవిధముగా పలుకుచున్నాడు. ఒక స్త్రీ 'రజస్వల' ఐనందున తెలిసిఐననూ, తెలియక ఐననూ వంటచేయు (పాత్రలను) భాండ ములను తాకినచో అది పాపమే అగును. బ్రాహ్మణులు మొదలగు నాలుగు జాతులలోను స్త్రీలు రజొవతులుగా ఉండునపుడు దూరముగా ఉండుటకు హేతువు ఉన్నది. అనగా కారణము ఉన్నది. అది ఏమనగా ఇంద్రుడు ముందు వృత్రాసురుని చంపినపుడు కలిగిన పాపము వలన బ్రహ్మహత్య చేత పీడింపబడి, ఆపీడను పోగొట్టుకొనుటకై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి శరణము కోరగా బ్రహ్మ ఆ ఇంద్రుడి బ్రహ్మహత్యను నాలుగు భాగములుగా విభజించి ' స్త్రీ 'లయందును, వృక్షములయందును (అనగా నీటి యందును) ఈ విధముగా నాలుగు తావులయందు (అనగా నాలుగు స్థలముల యందు) ఉంచెను.
కావున బ్రహ్మదేవుని ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి, రెండవ రోజున బ్రహ్మఘాతి, మూడవ రోజున రజకిగా నుండి నాలుగవ రోజున పరిశుద్దము అగును కావున, రజః కాలమున జ్ఞానముచే గాని వంట సామాగ్రిని తాకినచో ( అనగా అన్న భాండములు తాకినచో అట్టి పాపము నశించుటకు అన్ని పాపములు తొలగి పోవుటకు సర్వ ఉపద్రవములు నశించిపోవుటకు ఈ 'ఋషి పంచమి' వ్రతము బ్రాహ్మణాది నాలుగు జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా ఆచరింపదగినది. (అనగా చేయ దగినది) ఈవిషయమున ఇంకొక పురాణ కధ కలదు.
మొదటగా కృత యుగమున విర్భ దేశమునందు ' శ్వేన జిత్తు ' అను పేరుగల ఒక రాజు నాలుగు (అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్ర) జాతుల ప్రజలను పరిపాలించుచుండెను. ఇలా ఉండగా అతని దేశమున పద శాస్త్ర హితామహుడ ( అనగా పదములు చెప్పుటలో పాండిత్యము కలిగిన వాడు) అన్ని ప్రాణులయందు లేద ఆజీవులయందు దయ కలవాడైన సుమిత్రడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. ఇతడు వ్యాపారము చేయుచూ కుటుంబమును పోషించుచుండెను. అతని భార్య పతివ్రత, భర్త యందు భక్తి కలది. అనేక మంది చెలికత్తెలు కలదిగా అనేక మంది స్నేహితులు కలదిగా వర్షాకాలమున కృషి వ్యాపారమునందు ఎక్కువ జాగ్రత్తతో నుండి, జయ శ్రీ అను పేరుతో విలసిల్లుచుండెను. ఇలా ఉండగా ఒక సారి రజస్వల ఐ ఇంటి పనులు చేయుచూ, వంట సామగ్రిని తాకి భర్తతో కూడి ఉండి, పాపకర్మ చేయుటచే కొంత కాలమునకు భార్య భర్తలు ఇద్దరూ చనిపోయిరి. ఇలా చనిపోయిన తరువాత ఆ జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వలా నియమమును తిరస్కరించినది (అనగా నియమం పాటించ లేదు) కావున ఆ పాపము వలన ఆడ కుక్కగాను ఆమె రుతుమతిగా ఉన్నపుడు భార్యతో నుండుట చేత సుమిత్రుడు వృషభము అనగా ఎద్దుగాను తమ కొడుకు ఇంటిలోనే పూర్వజన్మ జ్ఞానము కలవారై పుట్టిరి. ఆ సుమిత్రుని కొడుకు ఐన సుమతి అనువాడు ధర్మములను తెలిపిన వాడు, పెద్దల యందు భక్తి కలవాడు. దేవతలను, అతిధులను పూజించువాడై ఉండెను. ఆ తరువాత అతని తండ్రి చనిపోయిన (తద్దినము) రోజు వచ్చనది అప్పుడు తన భార్యైన ' చంద్రవతి ' అనునామెను పిలిచి శ్రద్ద తోను భక్తి తోను ఇలా పలికెను.
ఓ దేవీ!
మా తండ్రి గారు చనిపోయిన రోజు వచ్చినది కావున బ్రాహ్మణులకు భోజనము పెట్ట వలెను. అందుకై వంట చేయుమని అడుగగా ఆమె వెంటనే భర్త శాసనమును అనుసరించి అనేక శాకములను (అనగా అనేక పిండి వంటలను చేసెను) చేసి వాటిని సిద్దము చేయుచుండెను. ఇలా ఉండగా ఒక సర్పము వచ్చి పాయసాన్నములను తినుచుండెను. అక్కడ ఉన్న ఆ కుక్క దానిన చూచెను. అది తినినచో బ్రాహ్మణులందరూ మరనింతురు.అని అనుకొని తాను తాకినది వారు చూచినచో ఆ అన్నమును ఎవ్వరూ ముట్టరు అనుకొని అది అన్నమును తినుచుండెను. వెంటనే అది చూచి దానిని ఎంగిలి చేసినదిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టెను. ఆ ఆహార పదార్దములను పార వేసి, మరల శుభ్రముగా వండి, బ్రాహ్మణులంతా భోజనము చేసిన తరువాత వారికి అన్ని విధముల విధులు సమకూర్చి, పిదప మిగిలిన వాటిని ఇంట్లో నివారంతా భుజించి మిగిలిన పదార్దములను కూడా ఆ కుక్కకు వేయక పోవుట వలన అది తన భర్త రూపములో నున్న వృషభము (అనగా ఎద్దును) చూచి ఇలా పలుకుచున్నది. ఓ స్వామి! నేడు ఉచ్చిష్టము (అనగా అందరూ తినగా మిగిలినది) వెయక పోవుట వలన ఆకలి మిక్కిలి బాధించుచున్నది. ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేయుచుండెను. ఇది గాక బ్రాహ్మణుల కొరకు శ్రార్దమునకై చేసిన పాకము నందు ఒక సర్పము (అనగా పాము) వచ్చి అక్కడి పాయసము తిని, విషము దానిలో కలిపి పోయెను అది నేను చూచి, ఆ సర్పము విషము కలిపిన ఆహార పదార్దములను ఆ బ్రాహ్మణులు తినినచో చనిపోవుదురని భావించి వాటిని నేను తినినచో నేనొక్కదానినే చనిపోయెదను అని అనుకొని అవి నేను తాకి తిని అది సుమతి యొక్క భార్య చూచి అపార్దము చేసుకొని నన్ను బాధించినది. అని ఏడ్చుచుండెను. అలా ఏడ్చుచున్న ఆ (శునకము) అనగా కుక్కను ఆ (వృషభము) ఎద్దు తన కష్టముల గూర్చి చెప్పుచుండెను.
ఓ దేవీ!
మనకు వచ్చినట్టి ఇలాంటి కష్టములు అన్ని పూర్వ జన్మ కర్మ చేత కలిగినవి. కావున నేను ఏమి చెయుదును. ఈ రోజు శ్రార్దము చేసెడి రోజు కదా! ఐనను నా కుమారుడు నన్ను కొట్టి తిట్టి అనేక బాధలు పెట్టి తన పొలమునందు సాయంత్ర సమయము వరకు దున్నించి కష్ట పెట్టెను. కనుక ఆకలితో ఉంటిని. వాడు చేసిన శ్రార్దము ఇష్టము లేనిది ఐనది నాకు కష్టము కలిగినది అని చెప్పినాడు. శ్రీకృష్ణుడు మరలా ఇలా పలుకుచున్నాడు. ఓ ధర్మరాజా! ఇలా మాట్లాడు కొనుచున్న తల్లి తండ్రుల మాటలు విని, వెంటనే ఆహారము ఇచ్చి సందేహము లేక, వారిని తల్లి తండ్రులుగా ఎరిగి (అనగా తెలుసుకొని) శోకము చేత కలిగిన వారి వ్యధను తీర్చుటకై ఇంటి నివదలి, అడవి చేరి అందున్న మునులను వినయముతో, సాష్టాంగ దండ ప్రణామము చేసి, అనగా సాష్టాంగ నమస్కారము చేసి, వారిని సంతోషపరచెను.
తరువాత 'సుమతి' వారితో ఈ విధముగా పలుకుచుండెను. ఓ మునివర్యులారా! నేను ఒక ప్రశ్న వేసెదను. దానికి సమాధానము ఇవ్వవలెను. అని వినయముగా అడుగగా, వారు సంతోషముగా అడుగ మనిరి అనగా: ఏ పాపకర్మచె నా తల్లి తండ్రులకు ఈ శునక వృషభ రూపములు సంభ వించినవి (అనగా కలిగినవి) మరి నా అవస్థలు ఎలా తొలగును అను సుమతి మాటలు విని వారిలో ఒక డైన సర్వతపుడు అను మహర్షి దయతో కూడిన వాడై సుమతికి అతని తల్లి తండ్రులు కష్ట విమోచనము (అనగా కష్టములు తొలగు విధము) గూర్చి చెప్పెను.
ఓ సుమతి ముందు నీ తల్లి ' రజో వతి 'గా ఉండునప్పుడు చిన్న పిల్ల మనస్తత్వముతో తండ్రి ఇంటికి వెల్లి ఆహార పదార్ధములు వండిన భాండములు అనగా గిన్నెలు ముట్టుకొనుటచే ఈ జన్మము (శునక జన్మము) సంభవించెను నీ తండ్రియు అలాంటి రజస్వలతో సంభోగము జరిపినందున అతనికి 'వృషభ' జన్మము అనగా (ఎద్దుగా జన్మించుట) అనునది సంభవించెను. ఇలా నీ తల్లి తండ్రులు ఇద్దరకు సంభవించినది. అని చెప్పి దీనికి తరుణొ పాయము గూర్చి ఇలా చెప్పసాగెను. మీ తల్లి తండ్రులు ఇద్దరకూ పాపవిమోచన ఫలమును గూర్చి వివరించెదను. అని ఇలా చెప్పుచుండెను.
నీవు నీ 'ధర్మపత్ని' అనగానీ భార్యతో కూడా 'ఋషి పంచమి' అను వ్రతమును చేయుము ఋషి పంచమి వ్రతమును ఏడు సంవత్సరములు ఆచరించి, ఫలమును పొందుము ఈ వ్రతముకు ఉద్యాపనము వ్రతము యొక్క ముందుగాని, మధ్యగాని, తరువాత కాని చేయవలెను శాకములు గాని పరిచామలు, కందమూల ఫలములు వీటిలో ఏది ఐన భుజించుచూ, ఆ వ్రతం ఆచరించవలెను. భాద్ర పద మాసమున శుక్ల పక్ష పంచమినాడు మధ్యాహ్నవేళ నిర్మలమైన నీరుగల 'నది' మొ||గు వానియందు...
శ్లో || ఆయుర్బలం యశోవర్చః ప్రజాపశువశూనిచ
బ్రహ్మప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహివన స్పతే ||
అను శ్లోకముచే ఉత్తరేణు పుల్లను ప్రార్ధించి, దంత ధావనం చేసి, (అనగా పండ్లను శుభ్రముగా కడుగుకొని) తిలామలక పిష్ఠములచే కేశసంశోధం చేసుకుని (అనగా నువ్వుల నూనెను వ్రాసుకుని) మృత్తి కాస్నాన పూర్వకముగా శుద్దోదక స్నానము (అనగా ఎవరైనా మరణించిన తరువాత చేయు స్నానము అని అర్దము) పరిశుద్ద మైన వస్త్రములను కట్టుకొని యధా విధి కర్మలు ఆచరించి (అనగా నిత్య కర్మలు కాలకృత్య కర్మలు తీర్చుకొని అగ్నిని వ్రేల్చి అనగా యజ్ఞ మునకు కావలసిన అన్ని సామగ్రులను సిద్దము చెసికొని భక్తి యుక్తుడై సప్తర్షులను ఆవహింప చేసి శుభములైన పంచామృత రసములచే వారిని సంత్రుప్తులను గావించి, అభిషిక్తులను గావించి, చందన, అగరు, కర్పూరాది సుగంధములను అలంకరింపచేసి, అనేక విధములైన పువ్వులతో వారిన పూజించి, వస్త్రయజ్ఞో పవితముల చేత కప్పి ధూప దీప నైవేద్యములు పెట్టి అనేక శాకములు (అనగా కరలు) పాయసములు అనగా పరమాన్నములు మొ||న ఆరురుచులుగల షడ్రశోపేత భోజనం పెట్టి ఫలములచే అర్ఘ్యము ఇచ్చి...
శ్లో || కశ్యపోత్రిర్భర ద్వాజో విశ్వామిత్రోధ గౌతమః
జమదగ్నిర్వశిష్టవ్చ సాధ్వి చైనాప్యరంధతీ ||
అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే అతని దోషము నశించునని చెప్పిన సర్వతపుడు అను మహర్షి వాక్యములు విని అతని కొడుకు అట్లే చేసి ' ఋషి పంచమి ' వ్రతమును యధాశక్తి ఆచరించి తన తల్లితండ్రులను బ్రతికించుకొనెను. ఈ విధముగా ' ఋషి పంచమి ' వ్రతమును సప్త ఋషుల సహితముగ ఆచరించి ఈ వ్రత ఫలమును పొంది, ఆ ఫలమును తల్లి తండ్రులకు ఇచ్చి, వారిని బ్రతికింపచేసెను. వారు బ్రతికి ఆమర లోకమునకు అధిపతులు ఐనారు. కావున ఈ వ్రతమహిమ చేత కాటుక వాచిక మానసిక ( అనగా శారీరకమైన దోషములు) తొలగిపోయి కలిగెడు పుణ్యమును గూర్చి వివరించెదను అని ఓ రాజా అన్ని వ్రతములు ఆచరించి ఫలము, అన్ని నదులలో స్నానము చేసిన ఫలము, అన్ని రకముల దానములు చేయుటవలన కలుగు పుణ్యఫలము ఈ వ్రతము చేసినచో కలుగును.
ఏ 'స్త్రీ ' ఈ వ్రతం ఆచరించునో ఆ ' స్త్రీ ' భోగభాగ్యము కలిగినది, రూపము, సౌందర్యము, పుత్రులతోను పౌత్రులతోను కూడిన దైఇహపర సౌఖ్యములను పొందినది అగును. దీని చేత విశేషముగా స్త్రీల పాపములు నశించిపోవును. మరియు చదువు వారి వినువారి పాపములు నశింపచేయుటయే గాక ధనము, పుత్రులు, కీర్తి, స్వర్గము ఇచ్చును. కావున ధర్మరాజా! ఈ వ్రతములలోకి శ్రేష్ఠము అనిన శ్రీకృష్ణుని మాటలు విని, అజాత శత్రువుఐన ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు.
ఉద్యాపన ఘట్టము:
ఓ దేవకీ నందనా ఈ వ్రతమునకు ఉద్యాపన విధానము ఎలా? సుమతి ఎలా చేసినాడు దాని వివరము చెప్పవలెను అనిన వసుదేవ సుతుడు ఇలా చెప్పుచుండెను.
ఓ కుంతీ కుమారా! మొదటి రోజున అనేక ఆహార పదార్ధములను చేసి, ప్రోద్దునేలేచి, స్నానముచేసి, గురువుదగ్గరకు చేరి ఆ గురువును చూచి, ఓ స్వామినే చేయు ఉద్యాపనము ఆచార్యుండ వైఉండుము అని ప్రార్దించి ముందు చెప్పిన విధి ప్రకారము భక్తితో ప్రార్దించి పరిశుద్ధ ప్రదేశమును అలికి, అందు సర్వతొ భద్రమండలమను ఏర్పరచి (అనగా రాగి పాత్రైనకావచ్చును, రాగి చెంబుతో కలశమును తయారు చేసుకొనవలెను. ఆ చెంబునకు వస్త్రసూత్రమును కట్టి, పంచరత్నములను ఇచ్చి, పూలు, పండ్లు, గంధము, అక్షతలు మొ||గు వాటిచేత అర్పించి, ఇలా చేసిన తరువాత ఆ కలశమును పూజించవలెను.
ఎం ఆ కలశము మీద సువర్ణ రజత తామ్రములతో (అనగా బంగారం, వెండి, రాగి మొ||వి ఏదైననూ శక్తిని మించక అనగా తమకున్న శక్తితో సప్తఋషుల బొమ్మలు చేయించి ఆ కలశములమీద ఉంచి ఫలపుష్పములతో కూడిన పంచవర్ణ నితానంబులను కట్టించి సమస్త పూజాద్రవ్యములతో మధ్యాహ్న సమయమున శ్రద్ధతో భక్తితో కశ్యషమహర్షి మొ||న సప్తఋషులను పూజించి, అరుంధతితో కూడిన కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్టులారా, నాచేత ఇవ్వబడిన అర్ఘ్యము తీసుకొని సంతోషములతో ఉండమని ప్రార్ధించి, ఈవిధముగా పూజచేసి, స్థిరమైన మనసు కలవాడై, ఇలాంటి విధానముచే ఈవ్రతము ఏడు సంవత్సరముల చేయవలెను. దీనికి ఉద్యాపనము ఇంకను వేదవేదాం పారంగతులైన గురువులను ఋషులను పూజించి జటాజుటాసూత్రక మండల సమన్వితులును (అనగా బొమ్మలను) ఆకలశముల మీద ఉంచి పంచామృత స్నానమును భక్తితో చేయించి, విధ విధానము చేత సప్తర్షులను పూజించి, ఆ రాత్రి పురాణము చదువుటచేతను, వినుట చేతను జాగరణము చేసి, మరునాడు ఉదయమున స్నాన సంధ్యావంద నాదికములు ఆచరించి నిత్య కృత్యములు తీర్చుకొని (అనగా కాలకృత్యములు తీర్చుకొని) వేద మంత్రముల చేత నైననూ, పురాణములో చెప్పిన మంత్రములచేత నైననూ, వారి వారి అధికారమును అనుసరించి నువ్వులనూనె మొ||గు వాటిచే ఆ మంత్రములు చెప్పి, అష్టోత్తర, సహస్రములచేత నైనను లేక అష్టోత్తర శతనామములతో నైన వేరువేరుగా అర్చించవలెను.
ఇట్లు చేసి, మరల పూజచేసి బంగారు ఆభరములు, వస్త్రకుండలములు అమృత భోజనములు ( అనగా పిండి వంటలు, పాయస పదార్ధములు మొ||న నెయ్యి, పెరుగు మొ||న వాటితో కూడిన పదార్ధములు) ఇలా అనేక దానములచే గురువును సంతోషపెట్టి, వస్త్రములతో (బట్టలతో అలంకరింపబడిన ఏడుగురు ఋగ్వేదము పాడు 'ఋత్వికులకు' వస్త్రములను యజ్ఞో పవీతములను, దక్షిణలను భక్తితో ఇచ్చి పూజించి, భార్యతొ కూడిన గురువునకు ప్రదక్షిణములతో సాష్టాంగ నమస్కారములు చేసి, అతని 'ఆజ్ఞ' (అనగా మాటను తీసుకొని వ్రతము పూర్తి చేసి, ఆ తరువాత భక్తితో మృష్టాన్నము (అనగా పంచ భక్ష, పాయసములతో కూడినది) పెట్టి బ్రాహ్మణులను తృప్తి పరచి దీన జనులకు భోజనము పెట్టి, ఋత్తికులకు తాంబూల దక్షిణలు ఇచ్చి సప్తర్షుల బొమ్మలను దానముచేసి, వారిచే ఆశీర్వాదము పొంది, వారి ఆజ్ఞను తీసుకొని ఇష్టమైన చుట్టములతో కూడి భుజింపవలెను. ఓ ధర్మరాజా ఎప్పుడూ ఫలం కోరువారు ఇలా చెప్పబడిన విధమున ఉద్యాపనము చేసి, ఈ వ్రతం చేయవలయును. ఇలా ఆచరించిన ఈ వ్రతము సర్వ తీర్ధముల యందు స్నానము చేసిన ఫలమును,అన్ని వ్రతములను ఆచరించిన పుణ్యమును ఇచ్చును. కావున ఓ ధర్మరాజా! ఏ వనిత (అనగా స్త్రీ) ఈ వ్రతమును ఆచరించునో ఆమె సమస్త పాపముల నుండి విముక్తురాలయు ఈ లోకమున చాలాకాలము పుత్రులతో పౌత్రులతో భర్తతో అనేక భోగముల అనుభవించి, నిత్య సౌభాగ్యముతో స్వర్గలోకములో కూడ పూజింపబడి చివరకు మోక్షము పొందును. అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించెను.