వీరశైవుని లక్షణములు
- ఇతరుల మాదిరి ఎన్నో క్రియలచే కొంత ఫలాన్ని పొందక, ఉత్కృష్టమైన కొన్ని క్రియలచే కొండంత ఫలాన్ని పొందేవాడే వీరశైవుడు.
- లింగ భోగోపభోగియై ఎల్లపుడు లింగాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడు (ధరించే వాడు).
- ఇతరుల వలె దేవుని ఆహ్వాన-విసర్జనల చేయక సదా తన యిష్ట లింగమును అంటిఉండి ఎల్లవేళలా పూజించువాడు. జాతి సూతక, జన సూతక, ప్రేత సూతక, ఉచ్చిష్ట సూతక, రజస్సూతకము అనే 5 సూతకములు లేక లింగ పూజ సల్పువాడు.
- అనృతము, అస్థిర వాక్యము, వంచనము, పంక్తిభేదము, ఉదాసీనత, నిర్దయత అనే 6 అంతరంగములు గల భవి సంస్కారములు లేనివాడు.
- త్రికాల లింగార్చన చేయువాడు.
- శివనింద, గురునింద, జంగమనింద, ప్రసాదనింద, పాదోదకనింద, భస్మధారణనింద, శివక్షేత్రనింద, శివాచారనింద, శివాగమనిందల సహింపని వాడు.
- శివమహేశ్వరుల చూడగనే లేచి వెళ్లి ప్రియవచనములు పలికి వారిని గౌరవించి అన్నపానాదులు సమర్పించువాడు.
- స్నాన, భోజన, నిద్రా, జాగరణ, మలమూత్ర విసర్జన కాలములలో అశుచి భావమున పొందక, లింగము దూరమై బ్రతుక జాలనన్న తలంపుతో సదా లింగమును ధరించువాడు.
- శివుడే సర్వమని మరి ఏ దేవతల గణింపని వాడు శివలింగ లాంచనములు లేని భవులతో సంపర్క, శయన, ఎకాసన సహపంక్తి భోజనములు చేయనివాడు.
- లింగాచార, సదాచార, భ్రుత్యాచార, శివాచార, గణాచారము లనే పంచాచార నిష్టుడు.
- దాసత్వ, వీరదాసత్వ, భ్రుత్యత్వ, వీరభ్రుత్యత్వ, సమయాచారత్వ, సకలావస్థత్వంబు లనే 6 సజ్జనత్వ యుక్తుడైన వాడు.
- దేశకాల కల్పితాది లౌకిక ఆచారములను మీరి స్వతంత్రశీలుడై శివాత్ములకు భేద భ్రాంతి లేనివాడు.
- పంచాచార్యుల, సిద్ధాంత శిఖామణి వచనముల బద్దుడై కడు భక్తితో మసలువాడు.
పరమేశ్వర నిర్మితమైన ఈ ప్రపంచమున చరమశరీరి అనబడి అందరిలోకి విశిష్టుడైన వాడు వీరశైవుడు.