ఉగాది |
శ్లోకం.
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం ||
ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగది పచ్చడిని తీసుకోవాలి.
ఉగాది:
యుగాది - తెలుగువారి "ఉగాది” ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది కి ఇల్లు శుభ్రం చేసి,ఇంటికి వెల్ల వేయిస్తారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రి కొనడంలో ఉత్సాహంగా పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. ఉగాది రోజున తెల్లవారుఝామునే లేచి, ఇంట్లోని వారంతా అబ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని, ప్రతీ ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి , రంగు రంగుల రంగ వల్లులు తీర్చి దిద్దుతారు. ఇంటికి మామిడి తోరణాలు కడతారు. (పచ్చటి మామిడి తోరణాలు, ఈ రోజుకు సంబంధించి ఒక కధ ప్రచారములో ఉంది. శివ పుత్రులు గణపతి, సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని సుబ్రహ్మణ్యస్వామి దీవించాడని కధ.)శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటారు. ఆరోగ్య, ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు. పరగడుపున, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకొని తర్వాత అల్పాహారం తీసుకుంటారు.ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం.యుగాది ఎలా జరుపుకోవాలి " బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం వినండి !
పంచాంగ శ్రవణం:
ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగ శ్రవణం చేస్తారు.కవి సమ్మేళనం
ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం" నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవ భావన, పాత ఒరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి