Sri Rama
శ్రీ రామ కధ - పూజా విదానం
ఈ క్రింద ఈయబడిన శ్రీరాముని పూజను భక్తితో ఆచరించి, కధను చదువు కొన్నచో తలచిన కార్యములు నెర వేరునను నమ్మకం కలదు .ఇది ఐదు గురువారములు ,ఐదు ఆది వారములు వరుసగా చేయవలయును .మధ్యలో ఏదైనా విఘ్నము ఏర్పడినచో ఆ వారమును వదలి తరువాతి వారము లెక్క పెట్టు కోన వచ్చును .
ఈ పూజకు కావలసిన సామాగ్రి :
రాగి లేదా వెండి కలశము ,శ్రీ రామ పట్టాభి షేకం ఫోటో , తమల పాకులు (తాంబూల మిచ్చుటకు) ,వక్క, పసుపు , కుంకుమ , గంధం ,అక్షతలు ,పువ్వులు ,కర్పూరం ,అగరువత్తులు ,గోధుమ పిండి (అయిదు చిన్న ఉండలకు సరి పోయేంత ), చక్కెర ,నెయ్యి (దీపారాదనకు ,ప్రసాదమునకు సరిపోవు నంత )
పూజా విధానము :
తల స్నాన మాచరించి ,పరి శుబ్రమైన వస్త్రములు ధరించి ,దేవుని వద్ద శుభ్రము చేసుకొని బియ్యం పిండితో పద్మము ఏర్పరిచి ,అందు శ్రీరాముని పట్టాభిషేక పటమును పెట్టి , పటము పువ్వులతో అలంకరించి ,గోధుమ పిండి ,నెయ్యి ,చక్కెర కలిపిన ప్రసాదమును అయిదు ఉండలుగా చేసి ,చిన్న పళ్ళెంలో ఆకులు ,వక్క , ఈ ఉండలను పెట్టి ,దేవుని ముందు పెట్ట వలెను .నెయ్యితో దీపమును వెలిగించి ,సంకల్పము చదువు కొనవలెను. పూజను ఆచరించి ,పిండితో చేసిన అయిదు ఉండలను నైవేద్యము పెట్టవలెను. తరువాత చేతిలో అక్షతలు తీసుకొని ,ఈ క్రింది కధను చదువుకొని ,హారతి ఇచ్చి ,ప్రదక్షణం చేసి అక్షతలను తలపై వేసుకొనవలెను . పిదప పిండితో తయారు చేసిన ఐదు ఉండలను తాంబూలములో పెట్టి ఒక ముత్తై దువకు బొట్టు పెట్టి ఈయవలెను. సాయంత్రము మరల హారతి ఇవ్వవలెను. ఒక పూట మాత్రము భోజనము చేయవలెను.
పూర్వం ఒక పట్టణ ముండెను. అది కష్ట సుఖములకు నెలవై యుండెను. ఆ పట్టణ మందు అరశు శెట్టి ,మంత్రి నివసించు చుండిరి.కేశవ భట్టు అను విప్రుడు కూడా ఉండెను. కేశవ భట్టు మహా దరిద్రుడు .బార్యా బిడ్డలను పోషించ లేక అతడు దేశాంతర మున కేగెను. ఆ విధంగా పోవుచుండగా ఒక అడవి వచ్చెను. అచ్చట కొందరు ఋషులు తపము ఆచరించు చుండిరి. వారిని చూచి కేశవ భట్టు సమీపమున నున్న చెరువులో స్నానము ఆచరించి ,ఆ ఋషులకు చేతులు జోడించి నమస్కరించెను. వారు తపస్సు పూర్తి అయిన తరువాత కేశవ బట్టును చూచి ,నీవెవరువు? పులులు ,సింహములు సంచరించు ఈ అడవికి ఎందుకు వచ్చితివి? అని అడిగిరి. అపుడు కేశవ బట్టు నా పేరు కేశవ బట్టు .నేనొక దరిద్ర బ్రాహ్మణుడను,బార్యా పుత్రులను పోషించ లేక దేశాంతరము వెళ్ళు చుంటిని .తమ దర్శనము దొరికెను. ధన్యుడను .పోయి వచ్చెద అనెను .అపుడు వారు 'నీ బార్యా పిల్లలు నిన్ను నమ్మి జీవించు చున్నారు .వారిని వదలి రావచ్చునా ? అని ,నీకు మేమొక రాముని కధను చెప్పెదము .వినుము.రామునికి పూజను చేసుకొని ఈ కధను చదువు కొన్నచో నీకు సకల సౌభాగ్యములు ,సుఖములు కలుగును.
కష్టములతో ఉన్నవారికి ఈ కధను చదువు కొన్నచో కష్టములు పోయి సుఖముగా నుందురు. పెండ్లి కాని వారికి పెండ్లి యగును . దరిద్రులు ధనవంతు లగుదురు .చెవిటి వారికి చెవుడు పోవును . గ్రుడ్డివారికి కండ్లు వచ్చును .శరీరములో ఏ జాడ్య మున్నను పోవును. శత్రువులు మిత్రులగుదురు. పోయిన పదార్దములు చేతికి వచ్చును. తీర్ధ యాత్ర ప్రాప్తి కలుగును. దైవ దర్శనము అగును. ఇహ లోక సౌఖ్యము లన్నీ పొందిన తరువాత వైకుంఠ ప్రాప్తి కలుగును. నీవు అయిదు గురువారములు ,అయిదు ఆదివారములు క్రమం తప్పక సవా శేరు గోధుమ పిండిలో తగినంత నెయ్యి ,చక్కెర కలిపి అయిదు ఉండలను చేసుకొని శ్రీ రాముల వారికి సకలోప చారములతో పూజా చేసి ,నైవేద్యము చేయవలెను .నీవు ఇంటికి వెళ్లుమని చెప్పిరి.
కేశవ భట్టు ఇంటికి వెళ్ళు సరికి అతని ఇంట ధన ధాన్యములు తుల తూగు చుండెను. అప్పటి నుండి రాముల వారిని మరువ కుండ పూజ చేయుచుండెను .కొంత కాలము అగుసరికి కేశవ భట్టు కాశీకి పోదలచెను. కుమారుడైన నారాయణ భట్టును పిలిచి ,నేను కాశీకి వెళ్ళు చుంటిని.నీవు రాముల వారిని మరువ వద్దు ' అని చెప్పెను .నారాయణ భట్టు స్నానము చేసి ,మడి కట్టుకొని రాములవారికి పూజ చేసి ,అతని తల్లిని కధ వినుటకు రమ్మనగా ఆమె 'కధ వద్దు ,కారణము వద్దు ముందు నీవు భోజనము చేసి వెళ్ళు ' మనెను. సాయంత్రమైన తరువాత మంగళ హారతు లిచ్చి తిరిగి అమ్మను పిలువగా ఆమె 'పాలు కాచి ,తోడు వేయవలెను ,బంగారు ,వెండి దాచవలెను ' అని చెప్పెను. నారాయణ భట్టు ఈమెకు దరిద్ర కాలము సంభవించు చున్నదని తలచి పరుండెను .తెల్లవారు సరికి ధన దాన్యములన్నీ దొంగలు అపహరించిరి. తినుటకు కూడా ఏమియు లేకుండెను .ఇదంతయు రాముల వారి మహిమ అని తలచి నారాయణ భట్టు ఎలుక కన్నములో ఒక రాగి చెంబు దొరకగా దానిని తీసి ,యాయ వారము చేసి వచ్చి ,గంజి కాచి ,దొన్నెలు కుట్టి వాటిలో పోసి తానును ,పిల్లలు త్రాగుచు కాలము గడుపు చుండిరి. కొంత కాలమైన తరువాత కేశవా భట్టు కాశీ నుండి తిరిగి వచ్చి ఇదంతయు ఏమి అనెను.నారాయణ భట్టు తండ్రితో నేను రాముల వారిని మరువ లేదు .అమ్మ కధ వినలేదు, హారతి తీసికొనలేదు అందులకే మనకీ గతి ప్రాప్తించి నాదని ,నేను ఇక రాముల వారి దర్శన మైతే గాని నీరైనను త్రాగనని తండ్రితో చెప్పి చెల్లిలిని తీసుకొని ఎవరి కైనను కన్యాదానము చేయవలెనని పోవుచుండ పోవుచుండెను. అట్లు పోవుచుండగా త్రోవలో ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యెను. అతనిని చూచి ,'విప్రుడా నా చెల్లిలిని కన్యాదానము చేస్తాను ,చేసుకుంటావా ?' అని అడుగగా అతడు 'నాకు అక్కరలేదు 'అనెను. మరి కొంత దూరము పోగా కొందరు ఋషులు కనబడిరి. వారిని చూచి 'ఋషులారా నా చెల్లిలిని కన్యాదానము చేస్తాను చేసుకొంటారా ?' అని అడిగెను. అందులో ఒకరు యితని చెల్లిలిని గాంధర్వ వివాహము చేసుకొనెను .నారాయణ భట్టు మరల పోవుచుండగా ఒక తులసికోట వద్ద ఒక తల్లి విచారముగా కూర్చొని యుండెను. 'అమ్మా !ఎందులకు విచారముగా ఉన్నావు?' అని అడుగగా ,నా భర్త కాశీకి వెళ్ళెను .నా కుమారుడు మధుకరము తెచ్చుటకై వెళ్లి ,తిరిగి రాలేదు అనెను.
అప్పుడు నారాయణ భట్టు 'నేను నీకు రాముల వారి కధను చెప్పెదను ,రాముల వారికి పూజను చేసి ,ఈ కధను చదువు కొనమ'నెను. ఇది చేసినచో నీ భర్త తిరిగి వచ్చును .నీ కుమారుడు రాజగును అని పలికెను. ఆమె ఒప్పుకొనిన తరువాత ఆ వూరి రాజు హఠాత్తుగా చని పోయెను. రాజ్యము కొరకు ప్రజలు పోట్లాడు కొనుచున్న సమయములో ఆమె కుమారుడు జోలి వేసుకొని వచ్చు చుండెను. ఆ ఊరి ప్రజలు రాజును ఎన్ను కొనుటకై పట్టపు టేనుగును అలంకరించి ,ఇష్టము వచ్చిన వారి మెడలో పూలహారము వేయమని పంపిరి . ఆ సమయములో అటు వచ్చు చున్న ఆమె కుమారుని మెడలో ఆ ఏనుగు పూలహారము వేసి ,అతనిని తీసుకు వచ్చి సింహాసనము పై కూర్చుండ బెట్టెను . ఇంతలో కాశీ నుండి ఆమె భర్త కూడా తిరిగి వచ్చెను. పిల్లవాడి తల్లి దండ్రుల కొరకు పల్లకీ పంపిరి .తల్లి దండ్రులు వచ్చి నమస్కరించిరి .అప్పుడు తల్లి ,అయ్యా ! ఎవరో బ్రాహ్మణుడు మనకు రాముల వారి కధను ఉపదేశించెను అందువల్లనే మనకింత భాగ్యము కలిగెను అని చెప్పి ,అప్పటి నుండి మరువక వారు రాముల వారిని పూజ చేయు చుండిరి.
నారాయణ భట్టు వెడుతూ వెడుతూ అలసి పోయి ఒక మర్రి చెట్టు క్రింద పరుండెను .ముసలి బ్రాహ్మణ రూపంలో రాములవారు కనబడి ,'నీవెవడవు ? పులులు, సింహములు సంచరించు అడవిలో ఒంటరిగా ఎందుకున్నావు ?' అని అడుగగా ,'నా పేరు నారాయణ భట్టు .నేను రాములవారిని చూడ బోవుచున్నాను .అయినా నా సంగతి మీకెందుకు ?' అని అనెను. 'నేనే రాముడను ' అని ముదుసలి అనెను. రాముదవని నీకేమి గుర్తు? అని అడుగగా ,శంఖ చక్ర పీతాంబర ధారియై ,కోదండ పాణి ధారుడై సీతా సమేతముగా రాములవారు ప్రత్యక్ష మైరి.నారాయణ భట్టు చేరువలో నున్న చెరువులో స్నానము చేసి రాముల వారికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ,'రామా ! నాకు దర్శన మిచ్చితివి .అట్లే నా తల్లి దండ్రులకు కూడా నీ దర్శనము ఇయ్య గోరెదను.' అని పలికెను. 'నేను భక్త పరాదీనుడను ,భక్తుల యిండ్లనే నివసింతును ' అని రాముల వారు పలికిరి. ఇంటికి వెళ్ళు సరికి ధన ధాన్యములు ఎప్పటి వలె తుల తూగు చుండెను. తల్లి దండ్రులు అతనికై ఎదురు చూచు చుండిరి .వారితో రాముల వారు వస్తున్నారు అని చెప్పెను. వారు పట్టణ మంతయు అలంకరించి ,ముత్యాల ముగ్గులు పెట్టి ,రత్నాల తోరణములు కట్టి, వెండి పీటలు ,బంగారు పీటలు వేసి ,ఏనుగు మీద శృంగారించి ,అరటి స్థంబములు కట్టి ,మామిడి తోరణములు కట్టి ,పంచ భక్ష్య పరమాన్నములతో నైవేద్యము చేసి రాముల వారిని సీతా సమేతంగా ఊరేగించి ,మంగళ హారతు లిచ్చి సకలోపచారములతో పూజ చేసిరి. ఋషులు కేశవ భట్టుకు చీప్పిన కధను కేశవ భట్టు నారాయణ భట్టు కు చెప్పెను. నారాయణ భట్టు దేశమంతా చెప్పిన కధ మనము చెప్పు కుంటున్నాము .కావున ఓ రామ చంద్రా ! కేశవ భట్టు ,నారాయణ భట్టు ఇంట ఉన్నట్లే మా యింత ఉండి మమ్ము రక్షింపుము.
శ్రీ రామ శ్లోకము
వైదేహి సహితం సురద్రు మతలే హైమే మహా మంటపే
మధ్యే పుష్పక మానసే మని మయే విరాసనే సుస్తితం |
అగ్రే వాచ యతి ప్రభంజన సుతం తత్వం మునిభ్యః
పరం వ్యాఖ్యాంతం భరతా భి భి: పరి వృతం రామం భజే శ్యామలం ||
|| శ్రీ రామ జయం ఓం ఓం ఓం ||