Shri Rama |
శ్రీరామ నామ మహిమ
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
అజానుబాహుం మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
లక్ష్మీ సహితుడైన రాఘవుని, దశరథుని కుమారుని, అప్రమేయుని (కొలతలకు అందనివానిని) సీతాపతిని, రఘువంశంలో రత్నదీపంలా ప్రకాశించే వానిని, ఆజానుబాహుని, పద్మదళాలవలె విశలమైన కన్నులు గలవానిని, రాక్షసులను నశింపజేసినవానిని, శ్రీరామచంద్రునికి నమస్కరించుకుంటున్నాను.
శ్రీరామచంద్రముర్తి చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నాలుగవ పాదాన కర్కాటకలగ్నంలో మధ్యాహ్నం పూట శ్రీమహావిష్ణువు అవతారంగా జన్మించాడు. అసలు శ్రీమహావిష్ణువు దశావతారాలను పరిశీలించినపుడు, ఆయన ధరించిన పది అవతారాల్లో, మూడు అవతారాలు చైత్రమాసంలోనే ప్రాదుర్భవించినట్లు తెలుస్తోంది. మత్స్య, వరాహ, శ్రీరామ అవతార జయంతులు చైత్రమాసంలోనే వస్తుంటాయి. అలాగే దశావతారాలలో శ్రీరామావతారం ఏడవది అయినప్పటికీ, ప్రతి సంవత్సరం పది జయంతులు ముగిసిన పిదప, మరలా సంవత్సర ప్రారంభంలో మొదటగా వచ్చే జయంతి పండుగ శ్రీరామనవమే!
దశావతార జయంతులు:
- మత్స్య - చైత్రబహుళ పంచమి,
- కూర్మ - వైశాఖ శుద్ధ పూర్ణిమ,
- వరాహ - చైత్ర బహుళ త్రయోదశి,
- నారసింహ - వైశాఖ శుద్ధ ద్వాదశి,
- వామన - భాద్రపద శుద్ధ చతుర్దశి,
- పరశురామ - వైశాఖ శుద్ధ ద్వాదశి,
- శ్రీరామ - చైత్రశుద్ధ నవమి,
- శ్రీకృష్ణ - శ్రావణ బహుళ అష్టమి,
- బుద్ధ - వైశాఖ శుద్ధ పౌర్ణమి,
- కల్కి - భాద్రపద శుద్ధ విదియ
శ్రీరాముడు పుట్టినరోజునే శ్రీరామ కల్యాణోత్సవాన్ని జరుపుకుంటుంటాం. ఈ విషయమై కొంతమంది, పుట్టినరోజునే కల్యాణోత్సవం ఏమిటన్న వితండవాదం చేస్తుంటారు. అవతార పురుషుడు శ్రీరాముడు ఈ లోకాన అవతరించడమే మంగళప్రదం. అందుకే ఆనందదాయకమైన ఆరోజున లోక కల్యాణాన్ని ఉద్దేశించి సీతారాముల కల్యాణోత్సవం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ కల్యాణరాముని చరితను ఊరూరా, వాడవాడలా పారాయణం చేస్తూ ధన్యులవుతుంటారు. ఆనందోత్సాహంలో తేలిపోతుంటాము.
అసలు శ్రీరామనామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. శ్రీరామనామం త్రిమూర్తులకు ప్రతీక. అందుకే పార్వతీ వల్లభుడు కూడ,
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే |
అంటూ శ్రీరామనామం విష్ణుసహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు. విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైంది. అటువంటివి వేయినామాలు ఒక్క రామనామానికి సమం. రామనామం బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది.
'రామ నామాత్పరో మంత్రః నభూతో న భవిష్యతి' అని అన్నారు. అంటే, రామనామాని కంటే గొప్పమంత్రం ఇదివరలో లేదు. భవిష్యత్తులో కూడా ఉండబోదని చెప్పబడింది. మంత్రాలలోకెల్లా గొప్పదైన గాయత్రీ మంత్రానికి, రామమంత్రానికి మధ్య భేదమేమీ లేదు. 'రామ' నామాన్ని చెబితే గాయత్రీమంత్రాన్ని చెప్పినట్లే.
ఆ, ఉ, మ ల సంగమమే ఓంకారమని మనకు తెల్సిందే. అ= విష్ణువు, ఉ= మహాలక్ష్మీ, మ= జీవుడు. రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది. శ్రీరామనామ మహిమను తెలియజేసే ఎన్నో ఉదాంతాలు మనకు కనబడుతున్నాయి. అందులో ఓ ఉదాంతం:
రావణ వధానంతరం సీతాసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు, నీండుసభలో కొలువైయుండగా నారదమహర్షి ప్రవేశించాడు. నారదమునితో పాటు విశ్వామిత్రుడు, వశిష్ఠాదిమహర్షులు విచ్చేశారు. అక్కడ ఒక దార్మిక విషయమంపై చర్చ కొనసాగుతున్న విషయాన్ని గమనించిన నారదుడు, సభాసదులందరినీ ఉద్ధేశించి, "సభకు వందనం, ఇక్కడ సమావేశమైన వారందరినీ ఒక విషయమై ప్రార్థిస్తున్నాను. భగవంతుని నామం గొప్పదా? భగవంతుడు గొప్పవాడా? ఈ విషయమై అభిప్రాయాన్ని చెప్పండి" అని పలికాడు. నారదుని అభ్యర్థన విన్నవెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయు. ఎంతగా వాదోపవాదాలు జరిగినప్పటికి రాజసభలోని ఋషిగణం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కలకలం చెలరేగింది. చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ, ఖశ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్ఠమైనదని చెప్పాడు. సభ ముగియడానికి ముందుగానే ఈ విషయం ఋజువవుతుందని పలికాడు.
అనంతరం నారదుడు, ఆంజనేయునితో, "హనుమా! నువ్వు మాములుగానే ఋషులకూ, శ్రీరామునికీ నమస్కరించు. విశ్వామిత్రునికి తప్ప" అని చెప్పాడు. అందుకు హనుమంతుడు అంగీకరించాడు. ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు గాని, విశ్వామిత్రునికి మాత్రం నమస్కరించలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపగించుకున్నాడు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి, "మునీశ్వరా! హనుమంతుని పొగరును గమనించారా? నిండుసభలో మీకు తప్ప అందరికీ నమస్కరించాడు. మీరు అతన్ని తప్పక శిక్షించాలి. అతనికి ఎంత గర్వాతిశయమో చూశారా? " అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి, "రాజా! నీ సేవకుడైన హనుమంతుడు అందరికి నమస్కరించి, నన్ను అవమానించాడు. కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా, నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి" అన్నాడు. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. కనుక, రాముడు అతని అదేశాన్ని పాలించవలసిందే. ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు. కారణం స్వయంగా తన చేతులతో అనన్య స్వామిభక్తుడైన తన మారుతికి మరణదండన విధించాలి. ఈ విషయం క్షణకాలంలో నగరం అంతా వ్యాపించిపోయింది.
హనుమంతునికి కూడా మహాదుఃఖం కలిగింది. అతడు నారదమునిని సమీపించి "దేవర్షీ! నన్ను రక్షించండి. శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు. నేను మీరు చెప్పినట్లే చేసినందులకు ఫలం అనుభవించినాను. ఇప్పుడు నేనేమి చేయాఅలి?" అనగా దేవర్షి, "ఓ హనుమంతా! నిరాశపడకు. నేను చెప్పినట్లు చేయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి సరయూనదిలో స్నానమాచరించి చేతులు జోడించి, "ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ" అన్న మంత్రాన్ని జపించు. అంతే. విశ్వాస పూర్వకంగా చెబుతున్నాను. నీకే భయం రాదు" అన్నాడు.
మరునాడు తెల్లవారింది. సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూనదికి చేరాడు. స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం, చేతులుజోడించి భగవంతుని నామాన్ని జరిపించసాగాడు. ప్రాతఃకాలం కావడంతో హనుమంతుని కఠినపరీక్షను తిలకించాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చేశారు. శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంలో నిలబడి తన పరమ సేవకుణ్ణి కరుణార్ధ్ర దృష్ఠితో చూడసాగాడు. కాలం ఆసన్నం కావడంతో అనిచ్చా పూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపజేయసాగాడు. కాని, ఒక్క బాణం కూడా హనుమంతుని బాధించలేకపోయింది. ఆ రోజల్లా బాణాలు వర్షింపబడుతున్నాయి. కాని, అవి హనుమంతునిపై పడడం లేదు. కుంభకర్ణాది రాక్షసుల్ని వధించటంలో ప్రయోగించిన భయంకర అస్త్రాలను కూడా ప్రయోగించాడు. అంతంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు. హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రముగా జపిస్తున్నాడు. అతడు రామునివైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. స్థిరభావంతో నిలబడిపోయాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతునికి జయజయకారాలు పలుకసాగారు. అట్టిస్థితిలో నారదమహర్షి విశ్వామిత్రుని సమీపించి - "ఓ మహర్షీ! ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకొనెదరు గాక! శ్రీరామచంద్రుడు అలసివున్నాడు. విభిన్న ప్రకారాలైన బాణాలు కూడ హనుమంతుని ఏమీ చేయలేకపోయాయి. హనుమంతుడు మీకు నమస్కరించక పోతే పోయినదేమున్నది? ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షించండి. ఈ ప్రయాస నుండి అతణ్ణి నివృత్తుణ్ణి చేయండి. మీరంతా శ్రీరామ నామ మహత్త్యాన్ని చూచినారు కదా!" ఆ మాటలకు విశ్వామిత్రమహర్షి ప్రభావితుడైపోయాడు. "రామా! బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు" అని ఆదేశించాడు. దానితో హనుమంతుడు వచ్చి, తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వ్రాలిపోయాడు. విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని అనన్య భక్తిని గురించి విశేషంగా ప్రశంసించాడు.
హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారదమహర్షి ప్రప్రథమంగా అతనికి రామమంత్రాన్ని ఉపదేశించాడు.
'శ్రీరామ' - ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు. "జయరామ" ఇది అతని స్తుతి. 'జయజయరామ'- ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ. మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే వుండాలి. ఓ రామా! నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ శరణుజొచ్చినానన్న భక్తులకు శ్రీఘ్రమే శ్రీరామభగవద్దర్శనం జరుగుతుంది.
సమర్థ రామదాసస్వామి ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి, శ్రీరాముని ప్రత్యక్షదర్శనాన్ని పొందాడు. రామనామ శక్తి ప్రభావం అమితమైనది. అందుకే రామనామాన్ని నిత్యం భక్తులు జపించి తరిస్తుంటారు. స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో, ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది. రామనామాన్ని నిత్యం జపించేవాడు, తులసీమాలను ధరించినవాడు, రామా అని స్వామి వారిని నోరార పిలిచినవాడు ధన్యుడు. ఈ రామనామము తారకమంత్రమని చెప్పబడుతోంది. వేరొక మంత్రాన్నితారకమంత్రమని అనరు. అంత్యకాలంలో మరణం సమీపించినపుడు, స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.
ఎలాగైతే అత్యంత సూక్ష్మమైన మర్రివిత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో, అలాగే రాం అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది. కాబట్టి ఈ కనబడే ప్రపంచమంతా రామమయమే. మట్టి నుండి ఏర్పడిన కుండ, పిడత, బుంగ, తొట్టి, ప్రమిద ఎలాగ మృత్తికాస్వరూపమో, అలాగే ఈ జగమంతా రామ స్వరూపమే. శ్రీరామ నామాన్ని నిత్యం జపించే భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేరవు. నిత్యం రామ నామామృతంతో వారి జీవితాలు పునీతమయి, సర్వ సుఖాలు లభిస్తాయి