దుర్గా మాత |
సర్వదేవతా స్వరూపం
మహిషాసుర మర్ధిని - ఆది శక్తి అవతారం
ఆది పరాశక్తి, జగన్మాత అయిన ఆ అమ్మ అవతారము మరియు మహిషాసుర సంహార గాధ మహిషాసురుడు రాక్షసుడు. గొప్ప బలవంతుడు. అతనికున్న వరమహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది. ఆ బలగర్వంతో మూడు లోకాలను జయించి విజయ గర్వంతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించ సాగాడు. దేవతలను, ఋషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో - బాధతో, మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను ( బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ) రక్షణ కల్పించమని వేడుకున్నారు.
దేవతల, మునుల, మానవుల వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు ( అంటే ఒక వెలుగు - ఒక శక్తి అని అర్ధం ) పుట్టింది. దానికి ఒక రూపం ఏర్పడింది. ఆ తరువాత మూడుకోట్ల దేవతల కోపము, ఆవేశము ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా - అదే "ఆదిశక్తి " గా, " అమ్మ " గా, స్త్రీ మూర్తిగా అయింది. ఈ రూపాన్నే " సర్వదేవతా స్వరూపం " అంటారు.
దేవతలందరూ తమతమ శక్తిని, ఆయుధాలను - " అమ్మ " కు యిచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, శ్రీమహావిష్ణువు తన చక్రాన్ని, విశ్వకర్మ ( ఈయన ఒక దేవత ) ఒక పదునైన గొడ్డలిని ( పరశువుని), ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తి కి ఆయుధాలుగా యిచ్చారు. హిమవంతుడు సింహాన్ని " తల్లి " కి వాహనంగా సమర్పించాడు.
సింహాన్ని వాహనంగా చేసుకొని పైన చెప్పిన ఆయుధాలను తీసుకొని వరుణుడు యిచ్చిన శంఖాన్ని వూదింది. ఆ శంఖ నాదశక్తికి తట్టుకోలేక రాక్షసులు తలక్రిందులయ్యారు.
మహిషాసురుడును "అణిమాది అష్టసిద్ధుల" సహాయంతో సింహరూపంలో " దేవి " ముందు యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు. మత్తగజంలా ( బలమైన ఏనుగ లా ) మారి " అమ్మ " ను ముట్టడించబోయాడు. చివరకు తన సహజ రూపమైన దున్నపోతు (అంటే మహిషం ) రూపంలో వాడి కొమ్ములతో " అమ్మ " మీద దాడి చేశాడు.
తన త్రిశూలంతో మహిషాసురుడి గుండెలు చీల్చిపారేసింది ఆ జగదాంబ. రాక్షసుడు చచ్చిపోయాడు.
ఇది మహిషాసుర సంహార కథ.
1) చండ 2) ముండ 3) శుంభ 4) నిశుంభ 5) దుర్గమాసుర 6) మహిషాసురులు ఆరుగురు రాక్షసులు - రజో, తమో గుణాలకు ప్రతీకలు. సత్వ గుణానికి అధిదేవత అయిన జగన్మాత యీ ఆరుగురు రాక్షసులను సంహరించింది.
రజో, తమో గుణాల పైన సత్వ గుణము యొక్క విజయానికి ప్రతీక - ఈ జగన్మాత విజయము.