హోళీ విశేషం
హొలీ అనే పండుగ వెనుక ఉన్న ఆంతర్యం మరియు కథా విశేషములు మరియు పాటించవలసిన నియమాలు.
- 🌟 పూర్వం కృతయుగంలో "హోలిక”అనబడే ఒక భయంకర రాక్షసి ఉండేది. శ్రీహరి అంటే ఆ రాక్షసికి ద్వేషం. అది బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ వరాలు కోరుకోమన్నాడు. హరిభక్తులకు విపరీత దాహం కలిగించే శక్తినిమ్మని అది కోరుకున్నది. బ్రహ్మ అలాగేనన్నాడు. ఆ రాక్షసి ఆనాటి హరిభక్తులలో అగ్రగణ్యుడెవరా అని పరిశోధించింది. చివరకు నారదుని ద్వారా ప్రహ్లాదుడు హరిభక్తులలో శ్రేష్ఠుడనీ, హిరణ్యకశిపుని వినాశనానికి అతడే మూలకారకుడనీ తెలుసుకొని ఈ హోలిక ప్రహ్లాదుని ఆవహించింది. దీనివల్ల ప్రహ్లాదునికి మహాదాహం పుట్టుకువచ్చింది. ఎంత నీరు త్రాగినా దాహం తీరేది కాదు. శరీరం అంతా మంటలు పుట్టాయి.
- 🌟 అతడితో పాటు అతని అనుయాయులను కూడా హోలిక వదలలేదు. వారందరికీ ఎక్కువ దాహం పుట్టింది. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని భక్తితో స్తుతించాడు. ఆయన ప్రహ్లాదునికి ప్రత్యక్షమై హోలికను ఆయుధాలతో,శాపాలతో ఎవరూ చంపలేరనీ, అది చస్తే కానీ ప్రహ్లాదుని దాహం తీరదని అన్నాడు. మంగళకరమైన పాటలు వింటే మాత్రం హోలిక మరణిస్తుందని అన్నాడు. “ ప్రహ్లాదా! హోలికకు గంధపుచెక్కల వాసన పడదు. గంధం చెక్కలు ఇంటి ఎదురుగా పేర్పించు. ఆ వాసనకు దానికి శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఆపై మీరంతా హరిగీతాలు పాడండి.
- 🌟 ఆ రాక్షసి మీ శరీరం విడిచి బయటకు వచ్చి కుప్పకూలిపోతుంది. దానిని వెంటనే గంధం చెక్క వేసి దహించండి. అది మరణిస్తుంది.“ అని శ్రీమహావిష్ణువు చెప్పగా ప్రహ్లాదుడు అలాగే చేసాడు. అందుకే ఆ రోజును హోలికాధివసం అంటారు. ప్రతి సంవత్సరం హోలీ నాడు ఆ రాక్షసిని కష్టాలతో, మంగళగీతాలతో దహిస్తుంటే హోలికా రాక్షసి
- శ్లో.చేయం ప్రహ్లాద భయ దాయినీ తతస్తాం ప్రదహస్త్యేవం కాషాద్యైః గీతమంగళై :
- || నారద పురాణం - పూర్వభాగం. అ-124, శ్లో-80
- 🌟 “హోలిక” అనగా అవసరం. కామముల ద్వారా మనిషిలో విపరీత ధోరణులు పెంచేది, మనస్సును పాడు చేయునది. వేద విరుద్ధ కర్మలద్వారా, జీవులచేత పాపకర్మములు చేయిస్తుంటుంది. అందుకే దాన్ని కామరాక్షసి అని కూడా అంటారు. అది తొలగితే జీవులు దుఃఖ విముక్తులవుతారు. ఫాల్గుణమాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు శివాభిషేకం చేసి, పూర్ణిమనాడు శ్రీహరి భజన చేసే వారంతా అసుర శక్తుల నుండి బయటపడి, దుఃఖవిముక్తులై, సర్వసౌఖ్యాలు పొందుతారు.
- 🌟 ఫాల్గుణ మాసంలో అమావాస్య నాడు విప్రులకు భోజనము పెట్టినా పితృదేవతలను తలచుకొని వారి ప్రీతికై స్వయంపాకాదులు దానం చేసినా వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ పని పసివారి నుండి ముసలివారి వరకూ అందరూ చేయవచ్చును. యమ భయం లేని జీవులు చాలా అరుదుగా ఉంటారు. ఎటువంటి వారైనా ఏదో ఒక సమయంలో దోషం చేయకుండా ఉండలేరు కదా! ఆ దోషవిముక్తిని ఇచ్చే మాసం, యమభీతి తొలగించే మాసం ఫాల్గుణ మాసం.
__శ్రీనివాస్ చిలకమారి