Parvathi devi |
పార్వతి జననం
మహాగ్రంథాలు - శ్రీ శివ మహాపురాణము
మేనకా దేవికి, ఆది పరాశక్తి వర ప్రభావాన పుత్రిక జన్మించే సమయం ఆసన్నమైంది. ఆమె గర్భం ధరించింది. హిమవంతుడికీ - పరివారానికీ ఎంతో వేడుక కలిగిస్తూ ఒకానొక శుభదినాన ఆమె ప్రసవం కూడా జరిగి చక్కటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. రత్నంలాంటి ఆ బాలిక జనన సమయంలో శుభశకునాలు అనేకం తోచాయి.
మేఘాలు ఆనందంగా జలధారలు కురిపించగా, దేవతలు విరి వానలు కురిపించారు. గంధర్వులు తమ గాన ప్రావీణ్యమంతా పలురకాల వాయిద్యాలపై ప్రయోగించగా విద్యాధర - అప్సర స్త్రీలు నాట్యరీతుల్లో తమ - తమ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించారు.
ఆ బాలిక అపూర్వ వర్చస్విని, రూప లావణ్య విలాసిని, శ్యామ వర్ణ శోభిని. జాత కర్మ - నామ కరణవేళ 'కాళీ' అని నామకరణం జరిపించినప్పటికీ, పర్వతరాజ పుత్రిక 'పార్వతి' గా అచిరకాలంలోనే అందరి చేతా పిలువబడసాగిందామె. ఆ పేరే ఆమెకు సార్ధకమైందది. ఆమె కారణజన్మురాలు కదా! ఆమె పుట్టిన నాటినుండీ మేనకా హిమవంతులకు ప్రతిరోజూ ఏదో ఒక దివ్యానుభూతి కలగసాగింది. బాల్యం నుంచే పార్వతికి శివనామోచ్చారణపై ప్రీతి.
మాటలు నేర్చినది మొదలు నిరంతర శివప్రసంగాను రక్తయైన పార్వతీ హిమవంతుల మధ్య ఎన్నిసార్లో శివలీలా ప్రసక్తి గానవచ్చేది.
- "తండ్రీ! ఈ లోకాలన్నిటికీ, అత్యంత సంస్తూయమానదేవుడు, ఆ ఆదిదేవుడే కదా!"
- "అవును తల్లీ! ఆ మహాదేవుని లీలాసృష్టి ఈ సమస్తం మొత్తం. అతడ్ని సేవించేవారికి ఇహపరాలు రెండిటా అమితానందం తధ్యం!"
- "ఆయన నివాసం?" "ఒక ప్రదేశం అని ఏం చెప్పను? సర్వాంతర్యామి." "ఆయన రూపురేఖా విలాసాలు?" "తెల్లని దేహం, దాన్ని దాచే గజ చర్మం. జటాజూట - సర్పహార శోభితుడై - శూలం, డమరుకం కలిగి ఉండి, రుద్రాక్షమాలికాధారియై, ఒడలంతా విభూతి అలముకొని తన దేహకాంతితో దిక్కులు వెలిగింప చేస్తూవుంటాడు. శాంత స్వభావుడు. చంద్రరేఖాధరుడు. ఆ మహాదేవుడు త్రినేత్రుడు కూడా!"
- "మూడుకళ్లు దేనికీ?" "రెండు కళ్లు సాధారణంగా దయతోచూసే చూపుకోసం! మూడోది ఆయన తపోశక్తి చిహ్నం. అది అగ్ని సంయుతమైనది. అది తెరిచి చూస్తే ముల్లోకాలూ మసి అయిపోతాయి. అంతేకాదు ఆయన గురించి ఎంత విన్నా వినాలనిపిస్తుంది!
- ఆయనను వర్ణించ ఎవ్వరి తరమమ్మా? ఆయన నివాసస్థానం కైలాసం. వజ్ర, పరశు, ఖడ్గాది ఆయుధాలు ధరించి మహాశివుడుస్మశాన సంచారం చేసే వేళల భూతప్రేత గణాలన్నీ ఆయనను సదా వెన్నంటి సేవిస్తుంటాయి."
"అలా ఎందుకుంటాయి?" "అది ప్రస్తుతం నీకు అర్ధం కాదమ్మా! శివుడంటే వైరాగ్య చిహ్నం! కాని సర్వసన్మంగళకరు డాసదాశివమూర్తి. " ఇటువంటివే పలుసార్లు శివసంబంధాత్మక భాషణలు అ తండ్రీ కూతుళ్ల మధ్య జరుగుతూండడం వల్ల, పార్వతి హృదయంలో శివ స్వరూపం ముద్రితమై పోయింది. అందువల్ల ఇతరుల బోధనలతో అవసరం లేని విధంగా ఆమె మసస్సు, శివసానిధ్యంలో వసించడం ప్రారంభమైంది. క్రమంగా ఆమె పెరిగి పెద్దదై త్రిజగన్మోహనాకృతిని దాల్చింది. వయస్సుకు అనుగుణమైన ఆమె తనూవిలాసం శతాధికమైంది.
నారదుని జోస్యం
ఇలా ఉండగా..
నారదుడు హిమవంతుని నగరికి విచ్చేశాడు. నారద మునీంద్రులకు మధోచిత సత్కారాలు చేసినానంతరం, "మహానుభావా! మా పార్వతీదేవి యొక్క భవిష్యత్తును తమవంటి త్రిలోక సంచారులు - త్రికాలవెద్యులు చెప్పగా విన వేడుక అవుతున్నది " అని ముకుళిత హస్తుడై ప్రాధేయపడ్డాడు. అందుకు కారణం లేకపోలేదు.
- లోకరీతి ప్రకారం - బాల్యమున ఎంతోసంతోషదాయకంగానూ పుట్టింట గడిపే ఆడపిల్లకి, ప్రాయమురాగానే పెళ్లిచేసి అత్తవారింటికి పంపేవేళ, ఆదుర్దగా ఉండడం ఇటు పిల్ల తల్లిదండ్రులకూ - అటు ఆ పిల్లకూ సహజం!
- అందున - అపురూప విశ్వమోహన రూపాన అలరారుచున్న పార్వతికి తగిన వరుడెవరో తెలుసుకోవాలన్న కుతూహలం పర్వత రాదంపతులకు మరీమరీ సహజం!
- పార్వతిని ఆపాదమస్తకం తిలకించాక, ఆ దేవ మునీంద్రుడు చిరు మందహాసంతో, అప్రయత్నంగా చేతులు జోడించడంతో, పర్వతేంద్రుడు ఆశ్చర్యపోయాడు.
- "హిమవద్రాజా! నీవు మహా అదృష్టవంతుడివి!" అన్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న పర్వతరాజుని భుజం తట్టి "అవునయ్యా! ఈమె సామాన్యురాలు కాదు! సమస్త దేవతారాధ్యుడైన ఆ సదాశివునికే పత్ని కాగలదు. కృతార్ధుడివి నీవు!" అన్నాడు తానే మళ్లా.
- దేవర్షి చెప్పిన మాటలు పొల్లుపోవుట అనేది జరగదు! అది దేవరహస్యం కావచ్చును! ఒక వరం కావచ్చును! లేదా ఆశీస్సేకావచ్చును! జరిగి తీరితుంది. కాని, అంతలోనే చిరుసందేహం!..."శివుడా? ఆయన నిత్య తపోనిధి. పైగా పరతత్త్వుడు. ఆయన ఈ ప్రపంచ సుఖాల నాశించునా? కొంతకాలం దాక్షాయణితో కాపురం చేసిన వాడాయె! అమె నిర్యాణానంతరం కఠోరతపస్సుకు పూనుకొన్న వాడెట్లు కల్యాణవేదిక చెంతకు రాగలడు?"....ఇవీ హిమవంతునికి అంతుచిక్కని ప్రశ్నలు.
ఓ పక్క నారదులవారి జోస్యం ఆనందం కలిగించినా, శివుని సన్నిధిన పార్వతిని నిలుపుటే రీతిని జరుగుట?.. అనే చింత పట్టుకుందిప్పుడు. సెలవు తీసుకొని నారదుడు వెళ్లిపోయాడు. ఈలోగానే - శివుడు సపరివార సమేతుడై, తన గిరి శిఖరాలలో ఒక శిఖరాన తపోదీక్ష కొచ్చిన వర్తమానం విని పరమానంధ భరితుడైనాడు పర్వతుడు. కాగల కార్యం గంధర్వులే తీర్చుటన్న ఇదియే కదా! అని సంతసించాడు.
తన కుమార్తె యైనను, చిన్ననాటినుండి శివారాధనే నిత్య కృత్యంగా ఎంచే పార్వతిని, సాక్షాత్తు ఆయన సన్నిధిన ప్రవేశపెట్టడానికి నిశ్చయించాడాయన. ఒక శుభదినాన కూతుర్ని వెంట నిడుకొని శివదర్శనార్ధియై బయల్దేరాడు.
పార్వతి శివ సందర్శనాభిలాష:
పశుపతిని పరామర్శించిన అనంతరం "స్వామీ! తామిపుడు,మా భూములను పావనంచేయరావడం మాకెంతో ముదావహం! తపస్సు కోసమే వచ్చినప్పటికీ మీరు మాకు ఇప్పుడు అతిధులు కనుక, మీరు పూనిన కార్యము ఫలవంతమగు వరకు తోడ్పడుట మా విధి!" అన్నాడు పర్వతరాజు.
- సుహృద్భావ స్ఫోరకములైన ఆ పలుకులకు శివుడెంతో ఆనందించి, తనకక్కడ ఎట్టి లోటుపాట్లు జరగడంలేదనీ, అంతా దివ్యంగానే ఉందనీ సంతృప్తి ప్రకటించాడు.
- గిరిజను చూపి ఈమె నాపుత్రి! తాము అనుమతీయ ప్రార్ధన! తమ సేవార్ధం ఈమెనిక్కడ విడిచి పెట్టదల్చుకున్నాను... అన్నాడు హిమవంతుడు.
- కానీ...నా దొక్క చిన్నమనవి! తమ సపర్యలమూలమున, నా పుత్రిక ధన్యురాలు కాగోరుచున్నది. మందహాసం చేశాడు శివుడు. నిమిషం ఆలోచించాక సమ్మతించాడు.
- పరమ నిర్లిప్తుడూ, పావన వరితుడూ అయిన పరమ శివునిధోరణికి ప్రమధ గణాలు విస్మయ చకితులైనవి.
- హిమవంతుడు పెద్దలతో యోచించి, ఒక దివ్యముహుర్తాన, తన కూతురు కాళిచేత శ్రీకంఠుని సేవలను ఆరంభింపజేశాడు.
- కాళి సేవలను శివుడు ఆమోదించడం - తృప్తిగా తలూపడం తప్ప ఒక్కసారైనా ఆమెను సమ్మోహదృష్టితో చూడలేదు. సర్వప్రపంచాన్నే సమ్మేహపరచగల సౌందర్యం ఉండి కూడా - అది తాను శివునికి సమర్పించుకొనే ఇచ్చ ఉండి కూడా శివుడు స్థాణువువలె ఉండడం ఆమెకు కష్టంగానే తోచేది.
- సర్వాంతర్యామి కదా! శివుడికి ఆమె అంతరంగంలో చెలరేగే సంఘర్షణ తెలీదా? తెలుసు! అయినప్పటికీ, ఆమె అహం, అందం వెనుక దాగి ఉన్నదని - అది కరిగాక ఆదరిద్దామని మిన్నకున్నాడాయన.
- పరమశివుడు అందరిలాంటి కాముకుడు కాడు. వైరాగ్యమే ఆయన స్వరూపము. అది కూడా సతీదేవి నిర్యాణానంతరం మరింతగా హెచ్చింది.
- అప్పటికీ - ఎందరెందరో మహామహులు తమ తమ కూతుళ్లను ఇవ్వడానికి వచ్చారు. అందరినీ నిరాకరించిన వాడాయె! అటువంటి ఈశ్వరుని మనస్సు ఒక కన్య మీద లగ్నం అవుతుందా?...
శివ పార్వతులను కలిపే యోచన
తారకాసుర సంహారానికి శివపార్వతుల పెళ్లి ఎంతో ముఖ్యం. వారి ప్రణయ సమాగమమే ఇంకా జరుగలేదు - ఇక పెళ్లి వరకు ఎలా తీసుకురావడం?
ప్రకృతి పురుషుల కలయిక జరగాలి. తత్ఫలం కుమార రూపంలో ఎదగాలి. ఆయనవల్ల తారకాసుర సంహారం జరగాలి. మళ్లీ దేవతలంతా సమావేశమయ్యారు - ఇంద్రుని ఆధ్వర్యంలో.
- ప్రత్యక్షసాక్షి అయిన సూర్యుడు అన్నాడు "నీజమే! శంకరుని తపోదీక్ష నిత్యం నేను చూస్తూనే ఉన్నాను కదా! పార్వతీదేవి అంత చేరువలో ఉండి కూడా ఎటువంటి కామ వికారానికీ లోను గావడం లేదు."
- "కావచ్చు! కాని ఆవిడ పూర్వాశ్రమంలో అతనిపత్ని సతీదేవియే గద!" అగ్నిదేవుడన్నాడు.
- "నిజమే! కాని ఆ సంగతినైనా వారిరువురికీ తెలియజెప్పి, పరస్పరం వారిమధ్య ప్రేమ అంకురించేలా చేయగలవారేరి? హవిస్సులను మోసే సామర్ధ్యం ఉన్నవాడివి! ఈ చిన్నకబురు మోసే పని చేపట్టడానికి వేరే ఎందుకూ! నీవే చాలు అగ్నిదేవా!" అని ఇంద్రుడు అగ్నిని పొగిడి, ఆ పని సాధీంచ తలపోశాడు.
- "అది మాత్రం నావల్ల కాదు దేవేంద్రా! ఏమీ అనుకోవద్దు!"
- "వరుణా! చల్లనివాడివి!నువ్వయినా..." ఇంకా ఇంద్రునిమాట అతని నోట్లొనే ఉంటూండగానే" దేవాధిదేవా! అన్యధా భావించవద్దు! అది నాచేతగాదు" అంటూ తప్పుకున్నాడు.
- "కుబేరా! శివుడు నీకు పరమ పవిత్రుడు గదా! ఈ సాహస కార్యానికి..." ఇంద్రుని మాట అంది పుచ్చుకుంటూ, "సాహసకార్యం మాట అలా ఉంచు! ఇంతకు ముందే, సతీదేవి దేహ త్యాగం జరిగిన అనంతరం, పునర్వివాహం చేసుకోమని శివునికి సలహా ఇచ్చి చీవాట్లు తిన్నాను. మళ్లీ ఇప్పుడా పని చేయడం వల్ల నాకు ఇంకోసారి అదే మర్యాద తప్ప, ఇతరత్రా ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా?" అంటు సందేహం వెలిబుచ్చాడు కుబేరుడు.
మన మహామునుల వైపు చూశాడు. వారిలో ఒక్కరూ ఈ బాధ్యత నెత్తిన వేసుకోడానికి రాలేదు. నిరుత్సాహంగా తమ గురువులైన బృహస్పతి వంక చూశాడు దేవరాజు.