yogi |
ఈశ్వర దండకము
శ్రీ కంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ ! మురారి! ప్రియ చంద్రధారీ !
మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా !
దేవ నీదైన తత్వంబు ! భావించి బుద్ధిం బ్రధానంబు కర్మంబు! విజ్ఞాన ఆధ్యాత్మ యెాగంబు !
సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ ! విచారించుచో నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా ! నిర్వికల్ప ప్రభావా ! భవానీ పతీ !
నీవు లోక త్రయీ వర్తనంబుల్మ హీవాయుఖాత్వగ్ని సోమార్క తోయంబు లం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! మహాదేవ నిత్యంబు నత్యంత యెాగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల !
విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ ! జితక్రోధరోగాది దోషుల్ ! యతీంద్రుల్ ! యతాత్ముల్ !
భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా!
భవ్య సేవ్యా! భవా భర్గ భట్టారకా ! భార్గవాగస్థ్య కుత్సాది నానా ముని స్తోత్ర దత్తవధానా ! లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! భస్మానులిప్తాంగ ! గంగాధరా ! నీ ప్రసాదంబునన్ !
సర్వ గీర్వాణ గంధర్వులున్ ! సిద్ధసాధ్యోరగేంద్రామరేంద్రాదులున్ ! శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !!
సురాభ్యర్చితా !! నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !!
త్రిలోకైకనాథా ! మహా దేవ దేవా !! నమస్తే నమస్తే నమస్తే నమః !!
మహా భారత అరణ్య పర్వంలో అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రములు పొంది ఈ దండకంతో శివుని స్తుతించాడు.