భస్మధారణ |
బిల్వ మహిమ - భస్మధారణ ఫలం
మహాగ్రంథాలు - శ్రీ శివ మహాపురాణము
శివ స్వరూపంగా బిల్వవృక్షం భావించబడుతున్నది. మొత్తం చతుర్దశ (14) భువనాల్లోనూ పుణ్యక్షేత్రాలకు బిల్వ వృక్షం సూచిక అంటారు. దీని మూలం (వేర్లు) గంధపుష్పార్చితం చేసేవారికి వంశాభివృద్ధి, ఈ వృక్షం చుట్టూ దీపారాధన శివజ్ఞానదాయిని, ఇంత విశేష మహిమగల ఈ మారేడు చెట్టు నీడన, ఒక్కరికి అన్నం పెట్టినా కోటిమందికి అన్నదానం చేసిన ఫలితం. దీని క్రింద ఒక శివభక్తునికి క్షీరాన్నం ఘృతసహితంగా సమర్పిస్తే, అట్టివాడికి జన్మాంతరాల యందు కూడా అన్నదారిద్ర్యం ఉండదు.
సాలగ్రామ శిలా మహిమ:
గుప్పిట్లో ఇమిడే ప్రమాణం గల సాలగ్రామ శిలలను, గృహ పూజలలో వాడవచ్చు! ఈ సాలగ్రామ శిలలు గండకీ నదిలో మహావిష్ణు ప్రతిరూపాలుగా లభ్యమవుతాయి. సహజ శంఖ చక్ర చిహ్నాలు కలిగిఉంటాయి. ఈ సాలగ్రామ శిలాదానం ఇహపర సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలకు మోక్షప్రాప్తిని కలిగిస్తుంది.
సోమవారం శివ ప్రీతికరం
లోకరీతి ప్రకారం, సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించబడుతున్నది. శంకరుడు అగ్నిని తన స్వరూపంగా కలిగిన లక్షణయుతుడు. (త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ...అని రుద్ర సూక్తం) ఈ వేడిమిని చల్లబరచ గలిగేది సోముడు. (చంద్రుడు). జ్యోతిషరీత్యా 'కృత్తికాగ్నిర్దేవతా' అని శ్రుతి. అగ్ని నక్షత్రం కృత్తిక. కృత్తికా నక్షత్రం చంద్ర కళలన్నీ ఉండే పూర్ణిమనాడు ఉండటం ఏ మాసంలో సంభవిస్తుందో అదే కార్తీకం. కనుకనే కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనది. అంతరార్ధం ప్రకారం (స + ఉమ = సోమ) ఉమాసహితంగా ఉండే రోజు కనుక సోమవారం శివ ప్రీతికరం!
భస్మధారణ - ఫలం
భస్మము ద్వివిధాలుగా ఉంటుంది.
1. స్వల్పభస్మం 2. మహాభస్మం . వీటివల్లనే శ్రౌత, స్మార్త - లౌకికాలనే మూడు విభూతులు ఉత్పన్నమయ్యాయి.
- విభూతిని శివనామస్మరణంతోనూ; మంత్రపూర్వకంగానూ ధరించవచ్చు!
- త్రిపుండ్రాలుగా ధరించబడే ఈ విభూతిలో ముఖ్య ద్రవ్యం - కాల్చబడిన గోమయం. వితంతుస్త్రీలు పంచాక్షరీ జపంతో భస్మధారణ చేయాలి.
- సత్యశాంభవ దీక్షాయుతులు మాత్రం ఈశాన మంత్రయుక్తంగా ఎల్లవేళలా భస్మధారణతో ఉండాలి.
- భస్మధారణ లేకుండా చేసే ఏ పూజలైనా, నిష్ఫలాలని చెప్తుంటారు. 32 స్థానాలు భస్మధారణానుకూలం. సాధారణంగా 16చోట్ల భస్మం ధరించేవారున్నారు. గృహస్థులు మాత్రం తల, బాహుద్వయం, హృదయం, నాభి అనే ఐదు తావుల భస్మధారణ చేస్తేచాలు!
- నీచులనుండి దానం పరిగ్రహించడం కూడా పాపమే!.. ఇట్టి పాపాన్ని పోగొట్టగలది భస్మధారణ.
- ఇంకా...స్త్రీ హత్య, గోవధ, పరస్త్రీగమనం, అకారణహింస, పంట దొంగలించుట, గృహదహనాది సమస్త ఘోరపాపాలకు భస్మధారణ తక్షణ నివృత్తి సాధకమని శివ తత్త్వజ్ఞులు చెప్తారు.
- నియమంగా భస్మధారణ చేయడం, శివోపాసన చేయడం దేవతలకు సంప్రీతికరం కనుక అట్టివాడు దైవకృపకు తప్పక పాత్రుడు కాగలడు.
ఇక, ఇప్పుడు ఏయే రోజులలో ఏయే దేవతలను పూజ ద్వారా సంతృప్తి చేయవచ్చునో చెప్పి, ఈ అనంత మహాపురాణానికి ఉపసంహారం చెప్పుకుందాం!
వివిధ దేవతారాధన :
- ప్రతినెలా బహుళపక్ష చవితి : విఘ్నేశుడు , పాపనివారణ
- ప్రతిపక్షంలోనూ ద్వాదశి : విష్ణువు , అఖండ సంపద
- జ్యేష్ఠ - మార్గశీర్ష మాసాలు : శివారాధన, భోగ మోక్ష ప్రదం
- కార్తీక మాసం ఆదివారాలు : సూర్యుడు , సర్వరోగ నివారణ
- అశ్వయుజ శుక్ల పక్షం : దేవి , ఐశ్వర్య భోగ సిద్ధి