శ్రీ శ్యామలా దేవి |
రేపటి నుంచి శ్రీ శ్యామల (గుప్త) నవరాత్రులు ప్రారంభం - (22/01/2023)
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని నిఘంటువులలో ఉన్నది. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఎంతో పుణ్యప్రదమైన ఈ మాసంలో ఉన్నన్ని పర్వదినాలు ఇక మరే మాసంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. పరమపవిత్రమైన ఈ మాఘమాసంలో శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు దేవీ భక్తులు నవరాత్రి వ్రత అనుష్ఠానవంతులు అవుతారు.
అసలు ఇప్పుడేమి నవరాత్రులు అంటారా..?
- శ్రీ దేవీనవరాత్రుల పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు.
- నవరాత్రి దీక్ష అనేది మొదటి 2 సార్లు చైత్ర మరియు ఆశ్వీయజ మాసంలో జరుపుకుంటారు. దీనిని ప్రత్యక్ష నవరాత్రులు గా పరిగణిస్తారు.
- మరో రెండు సార్లు నవరాత్ర దీక్షను ఆషాడ మరియు మాఘ మాసములలో జరుపుకుంటారు. వీటిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి అని అంటారు.
- ఆషాఢంలో వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో శ్యామల నవరాత్రులని పిలుస్తారు.
- వీటిలో మాఘమాస శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలా అమ్మ వారిని ఆరాధించటం విశేషం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులలో ప్రధానమైన జ్ఞాన స్వరూపం శ్యామలా దేవి.
ఈ మాఘ మాసంలో అమ్మను శ్యామలా దేవి స్వరూపంలో ఆరాధించాలి. కాళిదాసు వారు అమ్మను ధ్యానించిన రూపంలో మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలినీ అన్నట్లుగా అమ్మవారి మరకత రంగు కలిగిన శ్యామలా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని లేదా గృహంలో అమ్మవారి విగ్రహం ఉంటే చక్కని మరకతం రంగు చీరను అమ్మకు అలంకరించి తొమ్మిది రోజులు అమ్మను కుంకుమ పూజచేత ఆరాధించి పాయసాన్నాన్ని నివేదించి, శ్యామలా స్తోత్ర దండకాదులను పారాయణ చేయాలి. అలా ఆచరించటం ద్వారా జ్ఞానం ఐశ్వర్యం, కలుగుతాయి వివాహాలు కావలసిన వారికి వివాహం అవుతుంది. వివాహం అయినవారికి దీర్ఘ సుమంగళిత్వం కలుగుతుంది, గృహంలో శుభములు మంగళములు కలుగుతాయి.
శ్యామల దేవి అంటే ఎవరు..?
మాతంగియే రాజ శ్యామల. శ్రీ లలితా పరాభట్టారికా స్వరూపంగా కొలువు తీరినప్పుడు మహా మంత్రిగా కుడిపక్కన ఉండే తల్లియే ఆమె. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధించగలవు. సాక్షాత్తు శ్రీ శ్యామల దేవినే శ్రీ శుక శ్యామలగా, శ్రీ వేణు శ్యామలగా, శ్రీ వీణా శ్యామలగా, శ్రీ లఘు శ్యామలగా ఇలా వివిధ మంత్రాలతో విశేష ఉపాసన చేసే కాలాన్నే శ్యామల (గుప్త) నవరాత్రులంటారు. ఈ వేడుక చాలా కొద్దీ మందికి మాత్రమే తెలుసు. అందువల్ల గుప్త నవరాత్రి అని పిలుస్తారు. ఈ పండుగను ప్రధానంగా ఉపాసకులు జరుపుకుంటారు.
ప్రత్యక్ష మరియు గుప్త నవరాత్రి వేడుకల మధ్య తేడా ఏమిటంటే..?
ప్రత్యక్ష నవరాత్రులనేవి కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఉత్సవంగా ప్రదర్శనంగా జరుపుకుంటారు. గుప్త నవరాత్రనేవి మాత్రం దేవి సాన్నిధ్యంలో, ఏకాంతంగా జరుపుతారు. కేవలం దేవతా ప్రీతికై మంత్ర, తంత్రాలతో వివిధ రకాలైన పారాయణ హోమాదికాలను వైదికంగా నిర్వహిస్తుంటారు.
గుప్త నవరాత్రి ప్రయోజనాలు
శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి యొక్క మంత్రిణీ శక్తియైన శ్రీ శ్యామల దేవిని శాంతపరచటానికి మాఘమాసంలో నవరాత్రి లేదా గుప్త నవరాత్రిని జరుపుకుంటారు. శ్రీ శ్యామల దేవి తన భక్తులను శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, ఆనందం, జ్ఞానం మరియు సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. ఈ నవరాత్రులలో ప్రతి రోజు ప్రత్యేకమైన ఆచారాలతో విశేష మంత్రాలను ఉపాసించటం వలన దేవతానుగ్రహం అతిశీఘ్రంగా ఆ ఉపాసకునికి లభించి ఆ ఉపాసకుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గ్రామంలో ఉండే ఆస్తికులైన ప్రజలందరూ వారి వారి దుఃఖముల నుంచి విముక్తులవుతారు. గుప్త నవరాత్రి అన్ని రకాల భయాలను మరియు ఆందోళనలను తగ్గిస్తుంది. తద్వారా భక్తులు గొప్ప విశ్వాసాన్ని పొందుతారు.
రహస్య నవరాత్రి సమయంలో శక్తివంతమైన శ్రీ శ్యామలాదేవి స్తోత్రజాలమును పఠించట వలన అన్ని రకాల చెడు మరియు ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అలాగే భక్తుల వివిధ భయములు మరియు ఒత్తిడి లేకుండా చేస్తుంది. శ్రీ శ్యామల దేవి మంత్రాన్ని కానీ, స్తోత్రమును కానీ ఎక్కువ సార్లు పఠిస్తే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. అమితమైన బుద్ధి శక్తిని, అపార మేధా సంపత్తును కల్గజేస్తుందని శాస్త్ర వచనం. గుప్త నవరాత్రులలో నిర్దిష్టమైన జప, పారాయణాది అనుష్ఠానముచే సాధకునికి మంత్రసిద్ధి కల్గి, అభీష్టం నెరవేరుతుంది.