Snana Vidhulu |
స్నాన విధులు
మన పూర్వులు స్నానానికి, స్నానవిధులకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారు.
ఉత్తమం తు నదీస్నానం, మధ్యమం తు ప్రవాహకమ్
అధమం తు తటాకేన, కూపస్నానమధమమ్
నదీస్నానంఉత్తమం, ప్రవాహంలో స్నానం మాధ్యమం, ఓ తటాకం లో స్నానం అధమమైతే, కూపంలో స్నానం అధమాధమము అని అన్నారు. అలా నదులలో స్నానం చేయడానికి కుదరనివారు ఇంట్లోనే తలస్నానం చేయడం మంచిది. ఇక, మన పూర్వులు స్నానవిధులను ఆరు రకాలుగా విభజించారు.
- నిత్యస్నానం: జప, తప, ధ్యాన, పూజ, పారాయణల నిమిత్తం చేసె స్నానాన్ని ‘నిత్యస్నానం’ అని అంటారు.
- నిమిత్తికస్నానం: దోషనివారణ కోసం చేసె స్నానాలను నైమిత్తిక స్నానం అని అంటారు.
- కామ్యస్నానం: కొన్ని ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ చేసే స్నానాలు కామ్యస్నానాలు, వైశాఖ, ఆషాఢ, కార్తీక, మాఘమాసాలలో చేసే స్నానాలు, యజ్ఞయాగాదులలో చేసే స్నానాలు కామ్యస్నానలే.
- క్రియాంగస్నానం: ఆయా సమయాలలో పితృ దేవతల తృప్తి కొరకు చేసే స్నానాలు.
- మలాపకర్షణ స్నానం: దీనినే అభ్యంగన స్నానం అని అంటారు. శరీరాన్ని అంటివున్న మురికిని వదిలించుకోవడానికి చేసే స్నానం.
- క్రియాస్నానం: పవిత్ర పుణ్యక్షేత్రాలలో చేసే స్నానాన్ని క్రియాస్నానాం అని అంటారు.
ఇది ఇలావుంటే కొంతమంది ఆరోగ్యరీత్యా నీటిలో స్నానం చేయలేనివారై ఉంటారు. మరికొంతమందికి నీటి వనరులు దగ్గర్లోలేనివారై ఉండవచ్చు. అలాంటప్పుడు శరీరశుద్ధికోసం కొన్ని స్నానపద్ధతులను ప్రతిపాదించారు. వీటినే గౌణస్నానాలు అని అంటారు. ఈ గౌణస్నానాలు ఎనిమిది రకాలు:
- మంత్రస్నానం: అపోహిష్టాది మంత్రాలతో మార్జనం చేసుకోవడం.
- ధ్యానస్నానం: పండితుల పాదాలు కడిగిన జలముతో, తులసిపాదులో జలంతో ప్రోక్షణం చేసుకోవడం.
- భౌమస్నానం: శరీరానికీ విభూతి పూసుకోవడం.
- కాపిలస్నానం: తడిగుడ్డతో తుడుచుకోవడం.
- ఆగ్నేయస్నానం: త్ర్యాయుషం జమదగ్నేః అనే మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ భస్మంతో మార్జనం చేసుకోవడం.
- వాయువ్యస్నానం: ఆవుల డెక్కల వలన ఏర్పడిన గుంటలోని మట్టితో మార్జనం చేసుకోవడం.
- దివ్యస్నానం: ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండతో కూడిన వానలో నిలబడివుండటం.
- మానసస్నానం: ‘పుండరీకాక్ష’ అనే నామ ధ్యానాన్ని చేస్తూ శుభ్రతను పాటించడం.
ఇదిలావుంటే, తెల్లవారుఝామున 4-5 గంటల మధ్య చేసే స్నానాన్ని ఋషిస్నానమని, 5-6 గంటల మధ్య చేసే స్నానం దైవస్నానమని 6-7 గంటల మధ్య చేయు స్నానం మానవస్నానమని, 7 గంటల తరువాత చేసే స్నానం రాక్షసస్నానం అని అంటారు. అందుకనే సూర్యోదయానికి ముందే స్నానం చేయడం ఉత్తమమని అంటారు. నదులలో, ప్రవాహాల్లో, చెరువులలో స్నానం చేస్తున్నప్పుడు, బొడ్డులోతు నీటిలో నిలబడి, శిఖను పాయ తీసి, అంగుష్టాలతో చెవులను, కనిష్టాలతో ముక్కు రంధ్రాలను మూసుకుని, మూడుసార్లు పూర్తిగా మునిగి స్నానం చేయాలి. కట్టుబత్తలతోనే స్నానం చేయాలి. దిగంబరస్నానం చేయరాదు.
సుమంగుళులు నీటిలో మునుగుతూ స్నానం చేయకూడదు. తలజుట్టు విప్పి, దోసిట్లో నీతిని తలపై పోసుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత శ్రీరామనామ స్మరణ చేస్తూ వస్త్రాలను పిండి, శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఇళ్లలో స్నానం చేసేవారికి ఈ నియమాన్నింటినీ పాటించడానికి కుదరదు కాబట్టి శిరః స్నానం చేయడంతో సరిపెట్టుకోవచ్చు.