గాయత్రీ దేవి ! |
గాయత్రీ మంత్రము
(ఋగ్వేదము, 3.62.10)
ఓం
భూర్భువస్సువః |
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ || ఓం ||
అన్ని పరిస్థితులలోను జీవిత పురోగతిని కలిగించే శక్తిని సంతరించు కొన్నది గాయత్రీ మంత్రము. కోట్లాది మందిచే కాలాల పర్యంతం జపింపబడి వస్తూన్నది ఈ మంత్రము. స్త్రీ పురుషులు, చిన్నలు పెద్దలు, ఫలానా దేశస్థులు, ఫలానా మతస్థులు అనే విచక్షత లేకుండా సర్వులూ దీనిని జపించి ఉన్నతి పొందవచ్చు. ఒక ఫలానా దైవం అంటూ కాక జ్యోతిర్మయ దైవాన్ని ధ్యానించేటట్లుగా రూపొందడం చేత యావత్ప్రపంచానికీ ఈ మంత్రం వర్తించే రీతిలో ఒప్పారుతున్నది.
గాయత్రీ మంత్రము విశిష్టత
ఈ మంత్రం బుద్ధి స్పష్టటకై ప్రార్థిస్తుంది. ‘అష్టకష్టాలకు హేతువు అజ్ఞానమే అని మన ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి. సమాజంలోనైనా ఆధ్యాత్మికంగానైనా, లేక మరే రంగంలోనైనా ఇది నగ్నసత్యం’ అని చెబుతారు స్వామి వివేకానంద. ఈ అజ్ఞానం సశించి బుద్ధి స్పష్టత పొంద ఈ మంత్రం ప్రార్థిస్తుంది.
ఈ బుద్ధి స్పష్టత ఎలాటి బాహ్యవస్తువుల ప్రేరణచేత కాకుండా చేతనా అంతరాళం నుండి ఉద్భవిస్తుంది. దీనిని అంతర్భుద్ధి (Intution) అని పేర్కొంటారు. ఇది ఎప్పటికీ అసత్యంకాబోదు. ఏ రంగాన్ని తీసుకొన్నా, మానవుడి ఆవిష్కృతులన్నీ ఈ అంతర్భుద్ధి నుండి ఆవిర్భవించినవే. ఇది ప్రతి ఒక్కరిలోను పనిచేయ నారంభించలేదు. విజ్ఞానం, కళలు, ఆధ్యాత్మికత అంటూ ఏ రంగాన్ని తీసుకొన్నా వాటి ఉన్నత శిఖరాలకు వాకిలిగా భాసిల్లూతూవుండేది అంతర్భుద్ధి.
ఈ అంతర్భుద్ధినే శాస్త్రాలు బుద్ధి, ధీః ఇత్యాదులుగా పేర్కొంటాయి. ఈ బుద్ధిని జాగృతం గావించమని అరుణకిరణమూర్తియైన సూర్యభగవానుని ఈ మంత్రం ప్రార్థిస్తుంది. ఏ రకమైన జీవితమైనా, దాని ఉన్నతికి కీలకంగా, ఉన్నత స్థితులకు ఆలవాలంగా ఉండడంచేత ఈ మంత్రం వరాలను అనుగ్రహించే దివ్యమంత్రం (వరదాదేవి) గాను, మంత్రాల తల్లి (ఛాందసాం మాత) గాను ఆరాధింపబడుతున్నది.
ఓం
భూర్భువస్సువః |
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ || ఓం ||
ఓం = ప్రణవ మంత్రంగాను; భూర్భువస్సువః = భూః, భువః, సువః అనే వ్యాహృతులుగాను ఉంటున్న; యః = ఎవరు; నః మన; ధియః = బుద్ధిని; ప్రచోదయాత్ = ప్రేరేపిస్తారో; సవితుః = సకలాన్ని సృష్టించే వాడిన; తత్ = ఆ; దైవస్య = దైవంయొక్క; వరేణ్యం = ప్రశస్తమైన; భర్గః = జ్యోతిర్మయ రూపాన్ని; ధీమహి = ధ్యానిద్దాం.
ప్రణవ మంత్రంగాను, భూః భువః సువః అనే వ్యాహృతులుగాను ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ దైవ జ్యోతిర్మయరూపాన్ని ధ్యానిద్దాం!
ఈ మంత్రం మూడు భాగాలను సంతరించుకొన్నది.
మొదటిది ప్రణవ మంత్రమైన "ఓం"
పిదప వచ్చే భాగం ప్రణవమంత్రపు విపులమైన వ్యాహృతులు. ఇవి దివ్యశక్తి కలిగిన పదాలు. స్థూలస్థితిలో ఇవి భూమి (భూః) పితృలోకం (భువః), దేవలోకం (సువః) అనే మూడు లోకాలను సూచిస్తాయి. సూక్ష్మస్థితిలో మన చేతనా యొక్క మూడు స్థితులను, అంటే శరీరం, మనస్సు, ప్రాణం అనే మూడు స్థితులలోనూ పనిచేసి జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.
తత్….ప్రచోదయాత్ అనే భాగం సావిత్రీమంత్రంగా పెర్కొబడుతున్నది. ప్రణవం, వ్యాహృతి, సావిత్రీ – ఈ మూడు కలిసిందే గాయత్రీ. ‘గాయాతం త్రాయతే యితి గాయత్రీ’ – జపించే వారిని తరింప చేస్తుంది కనుక ఈ మంత్రం గాయత్రీ అని పేరుగావించింది.
గాయత్రీ మంత్రము జపించే పద్ధతి - Method of Chanting Gayatri Mantra
గాయత్రీ మంత్రాన్ని ఐదు భాగాలుగా, అంటే నడుమ నాలుగుసార్లు నిలిపి జపించాలి. (ఓం భూర్భువస్సువః, తత్ సవితుర్యరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్) సూర్యుడు కానరాని ప్రాతః కాలంలోను, సూర్యుడు నడినెత్తిన ఉండే మిట్టమధ్యాహ్న సమయంలోను, సూర్యుడు అస్తమించే సాయం సమయంలోను గాయత్రీ జపించడం మంచిది. నిత్యం 108 సార్లయినా జపించాలి.