Theertham |
సర్వపాపక్షయకరం - తీర్థం
మన ఆచారాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయనేది. ప్రస్తుతం కొంతమంది ఒప్పుకోలేక పోతున్న వాస్తవం. ఉదాహరణకు ఆలయాలలో భక్తులకు పంచుతున్న తీర్థాన్నే తీసుకుంటే ఎన్నో అపూర్వమైన విషయాలు మనకు బోధపడతాయి. విమర్శలను గుప్పిస్తుంటారు. పాంచారాత్రశాస్త్రం ప్రకారం, పూజలు జరిగే మన ఆలయాలలో జరిగే షోడశోపచారపూజలో పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం అనే ఉపచారాలతో పూజ జరుగుతుంటుంది. ఆర్ఘ్యంలో కొన్నిరకాలైన పువ్వులను, పండ్లను, తెల్ల ఆవాలను, బియ్యం, నువ్వులు, యవలు, చందనం, దర్భకోణాలను చేర్చుతుంటారు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే. ఉదాహరణకు చందనాన్నే తీసుకుంటే, మంచి గంధం పైత్యాన్ని పోగొట్టి రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. అంతర్దాహాన్ని తగ్గించి, మన శరీరానికి కాంతిని కలుగ జేయడంలో గందానికి ప్రముఖపాత్ర ఉంది. అక్షతలంటే, పసుపు కలిపినా బియ్యం. ఇవి క్రిములను నశింపజేస్తుంది. అర్ఘ్యంలో వాడే మరొక పదార్థము తెల్లఆవాలు. ఇవి ఆమ్ల దోషాలను, క్రిమిరోగాలను, చర్మవ్యాధులను దూరంగా ఉంచుతాయి. కొంచెం కారం, కొంచెం చేదుగా ఉండే తెల్ల ఆవాలు వాత, శ్లేష్మజ్వరాలను కూడ అడ్డుకుంటాయి. పండ్లు చేసె మంచిని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రక్తవృద్ధికి పండ్లు ఎంతగానో తోడ్పడుతుంటాయి. కొన్ని రకాల పువ్వులు జీర్ణకోశ వ్యాధులను అరికట్టగలవు.
ఆర్ఘ్యంలో వాడే మరొక పదార్ధం యవలు. ఆంగ్లంలో వీటిని బార్లీ అంటారు. యవలు శ్వాస, శ్లేష్మ, చర్మరోగ, పైత్య వ్యాధులను నశింపజేస్తాయి. రక్తవికార రోగాలకు కూడ యవలు మంచివి. నువ్వులు మన జుట్టుకు మేలు చేస్తాయి. చివరగా ఆర్ఘ్యంలో వాడే దర్భకొనవలన కఫం, పైత్యం, రక్తదోశాలు మాయమవుతాయి. ఇలా ఆర్ఘ్యంలో వాడే ప్రతి ఒక పదార్ధం ఆరోగ్యాన్ని కాపాడే లక్షణం గలదే. ఈ పదార్థాలన్నింటిని చూర్ణం చేసి ఆర్ఘ్యపాత్రలో వేసి దైవానికి సంబంధించిన మంత్రంతో ఆవాహనం చేస్తారు.
పాద్యంలో శ్రీకపింజలసంహితననుసరించి దూర్వా, నేలుసిరిక, చామలు, మెట్టతామరలను ఉపయోగిస్తుంటారు. కోరం, చేదు, వగరు రుచులతో ఉంటే మెట్టతామర కఫవాతాలను, మూత్రవ్యాధులను తగ్గిస్తుంది. చామలు కఫపైత్యాన్ని దూరం చేస్తాయి. ఇక నేలఉసిరిక చేసె మంచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేలఉసిరిక చేసె మంచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేలఉసిరిక పొత్తికడుపు లోని మంటను తగ్గించడమే కాక కఫాన్ని, రక్తదోషాన్ని పోగొడుతుంది. దూర్వాకూడా కఫవ్యాధులను అడ్డుకుంటుంది. పాద్యంలో ఆరోగ్యాన్నిచ్చే ఇన్ని సంగతులున్నాయి.
షోడశోపచారపూజలో మరో ప్రధాన విషయం ఆచమ నీయం, ఆచమనీయ ద్రవ్యాలలో లవంగాలు, యాలకులు, తక్కోలాలు, జాజిపూలు ఉంటాయి. లవంగాలు వాత, కఫ, చర్మవ్యాధులను నివారించడమేకాక వీర్యాభివృద్ధిని కలిగిస్తాయి. కొంచెం చేదుగా అనిపించే యాలకులు వేడి కలిగించే లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ దగ్గు, అతిసారాన్ని (రక్తం) తగ్గించే శక్తిని కలిగి ఉంది. తక్కోలాలు, శ్లేష్మాన్ని, వాత రోగాలను అడ్డుకుంటుంది. ఇక, జాజికాయ, జాజిపూలు రక్త దోషాన్ని నివారిస్తుంది.
చివరగా స్నాన ఉపచారంలో వట్టివేళ్ళు, సంపెంగ, తుంగముస్తలు, వస, కచ్చూరాలు, కస్తూరిపసుపు, జటామాంసి, చెంగల్వకోష్టులను ఉపయోగిస్తారు. చెంగల్వకోష్టు వాత పైత్యశ్లేష్మ రోగాలను తగ్గిస్తుంది. వట్టి వేళ్ళు శీతలాన్ని తగ్గిస్తాయి. కొంచెం కారం, కొంచెం చేదుగా ఉండే కచ్చూరాలు మేష, ప్లీహ, గుల్మరోగాలను నశింపజేస్తాయి. సంపెంగ నేత్రరోగాలను మంచింది. తుంగముస్తలు రక్తదోషాన్ని నివారిస్తుంది. కస్తూరి పసుపు చర్మవ్యాధులను అడ్డుకుంటుంది. జటామాంసి శ్లేష్మవ్యాధులను నశింపజేస్తుంది. ఇక, వస వాత శ్లేష్మరోగాలను హరిస్తుంది.
ఇలా, మన ఉపచారాలలో శుద్ధోదకం ఆరోగ్యకర పదార్థాలను కలిగి ఉండటం విశేషం. ప్రస్తుతం చాలా దేవాలయాలలో తులసితో కూడిన సాలగ్రామతీర్థాన్ని ఇస్తున్నారు. ఇది సమస్తరోగనివారిణి, మరికొన్ని దేవాలయాలలో తులసి, పచ్చకర్పూరం కలిపి చేసిన తీర్థాన్ని ఇస్తున్నారు.
తీర్థాన్ని భక్తిభావంతో స్వీకరించిన భక్తులు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది, మోక్షప్రాప్తి పొందగలరని పురాణవాక్కు. తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలని, తీర్థాన్ని తీసుకోన బోవునపుడు, తీసుకున్న తరువాత శిరస్సుపై చల్లుకోవాలని శ్రీప్రశ్నసంహిత చెబుతోంది.
అయితే, ఏ పదార్థమైనప్పటికీ, అందులో కలిపే వస్తువులు సమపాళ్ళలో ఉన్నప్పుడే తగిన శక్తిని పొందుతుంది. ఆయాపాళ్ళలో పదార్థాలను కలపనప్పుడు, అది నిరుపయోగాపే అవుతుంది. ఉదాహరణకు, కొన్ని ఆలయాలలో తీర్థప్రసాదాల కోసం ఉపయోగిస్తున్న నీరు కలుషిత పూరితంగా ఉంటోందని, ఫలితంగా లేని పోనీ రుగ్మతలు కలుగుతున్నాయన్న విమర్శలు తలెత్తుతున్నాయి. శుద్ధ జలాన్ని ‘క్లిస్లర్డ్ వాటర్’ అని అంటుంటారు. ఈ నీతిని ఎన్నో రసాయినిక ప్రక్రియల ద్వారా తయారుచేస్తారు. అలాగే మన తులసిఆకులను కలిపినా జలం కూడ శుద్ధ జలంగానే మారిపోతోందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఆ తీర్థజలంలో అందుకు తగినంతగా ద్రవ్యాలను కలిపారా? లేదా అన్నదే ప్రశ్న. ఈ విషయంలో అర్చకస్వాములు జాగ్రత్తలు పాటిస్తుంటారు.