విగ్నేశ్వరుడు |
పాపాలు పోగొట్టే పాతాళ వినాయకుడు
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణాలకూ అధిపతి. అన్ని అడ్డంకులూ తొలగించేవాడు. అన్ని కార్యాలకూ పూజలకూ ప్రథమంగా ఆరాధించాల్సినవాడు. విజయానికీ చదువుకూ జ్ఞానానికీ ప్రతీకగా నిలిచే దేవుడు. అంతటి శక్తిసంపన్నుడు స్వయంభూగా వెలసిన క్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. వాటిల్లో విశేషమైనదీ కాణిపాకానికి సరిసమానమైనదీ చిత్తూరులోని పాదగిరి పాతాళ వినాయకుడి క్షేత్రం.
వినాయకుడంటే కాణిపాక వరసిద్ధుడే మనకు గుర్తుకు వస్తాడు. కానీ కాణిపాకానికి అల్లంత దూరానే మరో స్వయంభూ వినాయకుడున్నాడు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరుడు ఎలా వెలిశాడో... కాణిపాక వరసిద్ధుడు సైతం తన ప్రతిరూపంగా పాదగిరిలో ఇలా పాతాళ వినాయకుడిగా వెలిశాడని స్థానికుల నమ్మిక. పాదగిరి వక్రతుండుడు సైతం వరసిద్ధుడే. కోరినంతనే కొంగు బంగారం చేసే మహిమాన్వితుడే. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి విగ్రహం మాదిరిగానే పాదగిరిలోని పాతాళ వినాయకుడి విగ్రహం కూడా ఏటా పెరుగుతూ ఉండటం విశేషం.
ఆలయం |
స్థలపురాణం :
స్వయంభూగా వెలసిన వక్రతుండ గణపతి ఆలయానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. కుప్పం మండలం కంగుందికి చెందిన రామచంద్రయ్య అనే హరికథా కళాకారుడికి ఒకనాటి రాత్రి కలలో వినాయకుడు కనిపించి గోపాలకృష్ణపురానికి పడమర వైపు పందిగుట్టూరు గుట్ట ప్రాంతంలో పాతాళంలో విగ్రహరూపంలో తాను స్వయంభూగా వెలశాననీ, తనకు ఆ ప్రాంతంలోనే ఆలయాన్ని నిర్మించమనీ ఆజ్ఞాపించాడట.
ఈ విషయాన్ని రామచంద్రయ్య గ్రామంలోని ప్రజలకు వివరించారు. వారి సహాయంతో గుట్ట ప్రాంతంలోని ఒక దొన(పాతాళం)లో ఉన్న నీటిని తొలగించారు. అక్కడ చిన్నగా లింగాకారంలో వక్రతుండ వినాయకుడి రూపం కన్పించింది. వెంటనే ఈ విషయం పరిసర గ్రామాల ప్రజలకు తెలిసింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పాతాళంలో స్వయంభూగా వెలసిన స్వామివారు వక్రతుండుడుగా ఉండటం గుర్తించి... స్వామివారి విగ్రహానికి పూజలు చేశారు. అప్పటి నుంచీ స్వామి అక్కడ నిత్యం పూజలందుకొంటున్నాడు.
ఇంతింతై
వినాయకుడి ఆలయం నిర్మించేనాటికి స్వామివారి విగ్రహ పరిమాణం చిన్నదిగా ఉండేదనీ కాణిపాకం వినాయకుడి విగ్రహం మాదిరిగానే పాతాళవినాయకుడూ ఏటా పెరుగుతున్నాడనీ ఆలయ అర్చకులు చెబుతున్నారు. కలియుగాంతం వరకూ ఇలాగే స్వామివారి మూలవిరాట్టు పెరుగుతుందంటున్నారు. ఏటా ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఇక స్వామికి ఇష్టమైన సంకష్టహర చతుర్దశి రోజున ప్రత్యేక అభిషేకాలూ హోమాలూ జరిపిస్తారు. ఈ క్షేత్రంలో స్వామివారు దక్షిణాభిముఖంగా కొలువుతీరడం మరో విశేషం.
ఇలా దక్షిణాభిముఖంగా ఉండే వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకుంటే సర్వపాపాలూ నశిస్తాయని పురాణకథనం. ఈ కారణంగానే కాణిపాకంలోని వరసిద్ధుడిని దర్శించుకున్నవారు ఈ పాతాళ వినాయకుడిని తప్పక దర్శించుకుంటారు. ఆలయానికి కొన్ని అడుగుల దూరంలోనే నాగదేవత ఆలయం ఉంది. ఈ అమ్మవారిని వేడినంతనే సంతానం లేనివారికి సంతానం అనుగ్రహిస్తుందనీ, సర్పదోషం ఉన్నవారికి ఉపశమనం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం.
ఇలా చేరుకోవచ్చు...
పాదగిరి పాతాళ వినాయకస్వామిని దర్శించుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతికి సుమారు 64 కిలోమీటర్లు.., కాణిపాకానికి 7 కిలోమీటర్లు, చిత్తూరుకు 20 కిలోమీటర్ల దూరంలో స్వామివారి ఆలయం ఉంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే బస్సులో గోపాలకృష్ణపురం, పందిగొట్టూరు మధ్యలో దిగి కొంతదూరం కాలికనడకన వెళ్లి స్వామి దర్శనం చేసుకోవచ్చు. రైలు మార్గంలో వచ్చే భక్తులు... తిరుపతి, చిత్తూరు రైల్వే స్టేషన్లలో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.