Yadadri Lakshmi Narasimha Swamy |
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అహోబిలం, ధర్మపురి మొదలయిన క్షేత్రాల వలెనే యాదగిరిగుట్ట కూడ పేరుపొందిన నారసింహ క్షేత్రం. యదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం ఇది తెలంగాణలోని ముఖ్య ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం పూర్తి పునర్నిర్మాణం చేసి అత్యంత ఆధునికంగా విశాలంగా కెసిఆర్ గారు చూపిన శ్రద్ద అద్బుతం
స్థల పురాణం
ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదవ మహర్షి. చిన్నతనం నుంచే హరి భక్తుడు మరియు ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలనే కోరిక ఉండేదట! కేవలం ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఆ రుషి చేసిన మహాతపస్సు ఫలితమే.. ఈ యాదగిరిగుట్ట రూపంలో నరసింహ క్షేత్రంగా వెలసిందన్నది ఐతిహ్యం.
ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం శ్రీహరికి తెలిసింది. ఆయన తరుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.
ఆంజనేయస్వామి సలహా మేరకు మహర్షి ఇక్కడ తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి “ఏంకావాలో కోరుకో” మంటే యాదర్షి స్వామి వారికి “శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు.
ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాదవ మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు.
స్వామి వెలసిన స్థలం కొండపైన గల గుహలో వుంది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తీర్చిదిద్దారు. లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయస్వామి కోవెల వుంది. ఈ స్వామికి అయిదు ముఖాలుండటం ప్రత్యేకత.
ఆంజనేయస్వామి గుడి వున్న బండపై గండభేరుండ నరసింహమూర్తి వుంది. గర్భగుడిలో జ్వాలానరసింహ, యోగానంద నరసింహ మూర్తులు వున్నాయి. విశాలంగా చేసినప్పటికీ లోపలకు వెళ్లే సమయంలో, కొంచెంగా తల వంచుకొని వెళ్లాల్సి వుంటుంది. యదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి భక్తుల రోగాలు నయం చేస్తాడన్న ప్రఖ్యాతి వుంది. ఎక్కడా కుదరని రోగాలు యిక్కడకు వచ్చి స్వామిని సేవిస్తే తగ్గుతాయని భక్తుల నమ్మకం.
రాక్షస సంహారంచేసి లోకకళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశగంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.
భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.
మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నందు వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నవి.
దర్శనవేళలు
- ఉదయం 4 గంటలకు ఆలయం తెరుస్తారు.
- మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు విరామం
ఉపాలయాల విశేషాలు: యాదగిరిగుట్ట ప్రధానాలయంతో పాటు ఆంజనేయస్వామి ఆలయంతో పాటు పుష్కరిణి చెంత మరో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. కొండపైనే శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని మాత సమేత రామలింగేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇలా ఈ క్షేత్రంలో శివకేశవులు కొలువై ఉండటం.. ఈ రెండు ఆలయాల్లోనూ నిత్యపూజలు కొనసాగుతుండటం విశేషం!
ప్రధాన పూజల వివరాలివి.. ఆలయంలో నిత్యం అభిషేకం, అర్చన, కల్యాణోత్సవం, అలంకారోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు అర్చనలు కొనసాగుతాయి.
వసతి సౌకర్యాలు:
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కొండపై వసతిగదులు, కాటేజీలు ఉన్నాయి. దేవస్థానం కాటేజీలు విచారణ కోసం ఫోన్: 08685- 236623, 236645 నంబర్లలో సంప్రదించవచ్చు.
యాదగిరిగుట్టలోని ప్రైవేటు లాడ్జిల సమాచారం
- వెంకటేశ్వర లాడ్జి ఫోన్: 81252 69331
- వెంకటాద్రి లాడ్జి ఫోన్: 08685- 236455
- భూలక్ష్మి లాడ్జి ఫోన్: 08685-236999
- శివలాడ్జి ఫోన్: 92900 63755
- మహేశ్వరీ లాడ్జి ఫోన్: 92900 63755
- భవ్య ఫంక్షన్ హాలు లాడ్జి ఫోన్: 92472 87901
ఎలా చేరుకోవాలి: హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు నల్గొండ నుంచి.. హైదరాబాద్- ఎంజీబీఎస్ నుంచి.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. జేబీఎస్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు చొప్పున టీఎస్ ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు.. బస్సుల సౌకర్యమూ ఉంది. దగ్గరలోని విమానాశ్రయం.. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయమే!