ఉపనిషత్తులు
ఉపనిషత్తులంటే తెలియకపోయినా వేదాంతం అనే మాట ఉపయోగించని తెలుగువారంటూ ఎవరూ ఉండరు. వేదాలను మధించాగ్గా వాటి సారాంశంగా చివరగా పుట్టినవి కాబట్టి ఉపనిషత్తులు వేదాంతాలుగా పేరుపడ్డాయి. ఇవి వైదిక సాహిత్యంలోని చివరి భాగాలు. అన్ని ధర్మాలకూ వేదమే మూలం. వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు.
సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్ నే పదానికి సమీపంలో ఉండడం అని అర్థం. సత్యాలను తెలుసుకునేందుకు గురువు దగ్గర ఉండడం లేదా ఆత్మ (పరమాత్మ) కు సమీపంలో ఉండడం అనేవి ఈ శబ్దార్ధం వెనుక ఉన్న ఆంతరిక అర్థాలు.
ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను సునిశితంగా చర్చిచడం జరిగింది. ఈ చర్చ ఫలితంగా జీవాత్మ-పరమాత్మలు అభిన్నులు అనే అద్వైతం, జీవుడు-బ్రహ్మము వేరువేరు అనే ద్వైత భావాలకు ఆస్కారం కలిగింది. ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగానే ప్రస్తుతం హైందవం అని పిలువబడే ధార్మికభావనలోని అనేక దార్శనిక సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. అనేకమంది ఆచార్యులు ఉపనిషత్తుల ఆధారంగానే తమ సిద్ధాంతాలను రూపొందించి, ప్రచారంలోకి తీసుకువచ్చారు. శంకరాచార్యుల అద్వైతవాదం, రామానుజుల విశిష్టాద్వైతం, నింబార్కాచార్యుల ద్వైతాద్వైతవాదం, వల్లభును శుద్ధాద్వైతవాదం ఇలా అన్నీ ఉపనిషత్ మూలాలున్నవే.
ఉపనిషత్తుల సంఖ్య
వేదాలలాగే ఉపనిషత్తుల సంఖ్య కూడా అసంఖ్యాకం అని కొందరి వాదన. మొదట 1008 ఉపనిషత్తులు ఉన్నట్లూ భావించగా వాటిలో 108 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలోనూ కలిపి పది ఉపనిషత్తులు ముఖమైనవిగా అధ్యయనం చేస్తారు. ఆదిశంకరాచార్యులు ప్రస్థానత్రయ భాష్యంలో పది ఉపనిషత్తులనే చెప్పారు.
ఈశ కేన కఠ ప్రశ్న ముండా మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగయం బృహదారణ్యకం తథా
అనే నామసూచికా శ్లోకాధారంగా దశోపనిషత్తుల పేర్లు ఇవి.
- ఈశోపనిషత్తు
- కేనోపనిషత్తు
- కఠొపనిషత్తు
- ప్రశ్నోపనిషత్తు
- ముండకోపనిషత్తు
- మాండూక్యోపనిషత్తు
- తైత్తిరీయోపనిషత్తు
- ఐతరీయోపనిషత్తు
- ఛాందోగ్యోపనిషత్తు
- బృహదారణ్యకోపనిషత్తు
ఉపనిషత్తుల కర్తలు
ఉపనిషత్తులు ఏ ఒక్కరి రచనలో కాదు. ఎందరో ఋషులు వీటి రచనాకార్యాన్ని నిర్వహించారు. యాజ్ఞవల్క్యుడు, ఉద్దాలకుడు, అరుణి, శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాడ, సనత్కుమార, గార్గి, మైత్రేయ లాంటి ఎందరెందరో ఉపనిషత్తుల ఆవిర్భావానికి కారణమయ్యారు.
శైవవైష్ణవ ఉపనిషత్తులు
ఈ ఉపనిషత్తులలో కొన్నింటిని శైవులు సొంతం చేసుకోగా, మరికొన్ని ఉపనిషత్తులు వైష్ణవ ఉపనిశాట్టులుగా ప్రసిద్ధికెక్కాయి. అక్షమాలికోపనిషత్తు, అథర్వశిరోపనిషత్తు, అథర్వశిఖోపనిషత్తు, కాలాగ్ని రుద్రోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, జాబాలోపనిషత్తు, దక్షిణామూర్తి ఉపనిషత్తు, పంచబ్రహ్మోపనిషత్తు, బృహజ్జాబాలోపనిషత్తు, భస్మజాబాలోపనిషత్తు, రుద్రహృదాయోపనిషత్తు, రుద్రాక్షజాబాలోపనిషత్తు, శరభోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు అనే పదిహేను ఉపనిషత్తులు శైవ ఉపనిషత్తులు.
వైష్ణవులకు సంబంధించిన ఉపనిషత్తులుగా చెప్పుకునే పద్నాలుగు ఉపనిషత్తులు ఉన్నాయి. అవ్యక్తోపనిషత్తు, కలిసంతరణోపనిషత్తు, కృష్ణోపనిషత్తు, గరుడోపనిషత్తు, గోపాలతాపసోపనిషత్తు, తారసోపనిషత్తు, త్రిపాద్విభూతి ఉపనిషత్తు, దత్తత్రేయాపనిషత్తు, రామతాపన ఉపనిషత్తు, రామరహస్యొపనిషత్తు, వాసుదెవ ఉపనిషత్తు, హయగ్రీవ ఉపనిషత్తు. శైవ వైష్ణవ విభాగాలే కాకుండా ఉపనిషత్తులలో మరెన్నో విభాగాలు కనిపిస్తాయి.
ఏ వేదానికి ఎన్ని
ఉపనిషత్తుల వేదాల సారమైన వేదాంతాలు అనుకున్నప్పుడు ఏ వేదానికి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి అనే సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి 108 ఉపనిషత్తుల వర్గీకరణ కొంతవరకూ సమాధానంగా కనిపిస్తుంది. ఈ నూటఎనిమిది ఉపనిషత్తులలో వేదాల వారీ విభజన ఇలా ఉంది. ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదానికి 32, శుక్ల యజుర్వేదానికి 19 ఉపనిషత్తులు లభిస్తున్నాయి. సామవేదానికి 16, అథర్వణ వేదానికి 31 గా ఉపనిషత్తులు ఉన్నట్లూ కనిపిస్తుంది. ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల నుంచి ముఖ్యమైన పది ఉపనిషత్తులను ప్రధానంగా ఎంచుకున్నారు. వాటికే దశోపనిషత్తులు అని పేరు.