Tirumala Balaji |
తిరుమల బ్రహ్మోత్సవాలు మానవాళికి మహోత్సవాలు. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో వీటిని నిర్వహించడం ఆనవాయితి. అధికమాసం వచ్చినప్పుడు మాత్రం ఒకే ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ సంప్రదాయాలు, విశేషాలు, వాహన సేవల వెనుక పరమార్థాన్ని గురించి తెలుసుకుందాం.
వేదములే శిలలైన కొండపై శ్రీ వేంకటనాథునికి ఎన్నో ఉత్సవాలు రంగరంగ వైభవంగా, నిత్యకళ్యాణం పచ్చతోరణంగా జరుతుతూ ఉంటాయి. కలియుగ వైకుంఠంలో భక్తజన హృదయకుసుమాలతో స్వామి అహర్నిశలూ పూజలందుకుంటూనే ఉంటాడు. ఏటా ఆశ్వయుజంలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ దినోత్సవాలు శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంతో ముగుస్తాయి. ఇదొక మహాపర్వం, మిరుమిట్లు గొలిపే దీపతోరణాలతో, అఖండజ్యోతులతో, ధగద్ధగాయమానంగా ప్రకాశించే నవరత్నహార సంచయంతో, వేదఘోషలతో, పాటలతో, గోవిందనామాలతో సప్తగిరులు శోభిల్లుతాయి. స్వామి బ్రహ్మోత్సవ వేళ వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తకోటిని తరింపచేస్తాడు. దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు స్వామిని తనివితీరా దర్శించుకుని, కోరికలను నివేదించుకోవడానికి తిరుమలకు తరలి వస్తారు.
తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామికి ఏటా 450కి పైగా ఉత్సవాలను నిర్వహిస్తారు. వైఖానస ఆగమవిధిగా నిర్వహించే అన్ని ఉత్సవాలలోనూ అత్యంత విశిష్టమైనవి, శోభాయమానమైనవి తొమ్మిది రోజులపాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు.
ఆ పేరెలా వచ్చింది?
శ్రీనివాస పరబ్రహ్మ కోరిక మేరకు బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి. సాక్షాత్తూ స్వామివారు చతుర్ముఖ బ్రహ్మను పిలిచి “ఉత్సవం కురు మే పుణ్యం బ్రహ్మాన్! లోక పితామహా!” అని అడిగి చేయించుకున్నాడు. నాటి నుంచి బ్రహ్మోత్సవాలు నేటికీ సంప్రదాయంగా కొనసాగుతున్నాయి.
‘బృహి – వృద్ధౌ’ అనే ప్రయోగాన్ని అనుసరించి తొమ్మిది రోజులపాటు నిర్విరామంగా స్వామి ప్రతి ఉదయం, సాయంత్రం వాహనసేవలు అందుకుంటాడు. సూర్యుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు చిట్టా నక్షత్రం నాడు ధ్వజారోహణం, ఉత్తరా నక్షత్రం నాడు రథోత్సవం, శ్రవణానక్షత్రం నాడు తీర్థవారి (చక్రస్నానం)తో బ్రహ్మదేవుడు వీటిని ప్రారంభించాడు కనుక ఇవి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మ పర్యవేక్షణకు సంకేతంగా నేటికీ బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మకు శూన్యరథం సిద్ధం చేస్తారు. ఉత్సవ వాహనసేవల్లో బ్రహ్మరథం ముందుగా వెళుతూ ఉంటుంది.
చారిత్రకంగా బ్రహ్మోత్సవాలు
పల్లవరాణి పెరిందేవి (సామవై) క్రీ.శ. 614లో మనవాళ పెరుమాళ్ళు అనే వెండి (భోగ) శ్రీనివాసుని విగ్రహాన్ని తిరుమల ఆనందనిలయానికి సమర్పించింది. క్రీ.శ.1254 చైత్రమాసంలో తెలుగు పల్లవ ప్రభువైన విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ.1328 ఆషాఢమాసంలో త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవ రాయలు. క్రీ.శ.1429 ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయలు, క్రీ.శ.1446లో మాసి తిరునాళ్ళు పేరుతో హరిహర రాయలు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. క్రీ.శ.1530లో అచ్యుతరాయులు నిర్వహించిన ఉత్సవం అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా చరిత్ర ప్రసిద్ధికెక్కింది. క్రీ.శ.1583 నాటికే బ్రహ్మోత్సవాలు ఇంచుమించుగా నెలకొకసారి జరిగేవి. రాజులు రాజ్యాలు అంతరించినా బ్రహ్మోత్సవ సంప్రదాయం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయశుద్ధి)
బ్రహ్మోత్సవాలకు ముందువచ్చే మంగళవారం నాడు తిరుమల ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. ఇలా ఉగాది, ఆణివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందుకూడా చేస్తారు. పరిమళ ద్రవ్యాలతో శ్రీవారి ఆనంద నిలయాన్ని శుద్ధిచేసి, అలంకరించే ఈ ప్రక్రియను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని వ్యవహరిస్తారు.
అంకురారోపణ
బ్రహ్మోత్సవ సంరంభం ధ్వజారోహణం తో ప్రారంభమవుతుంది. ధ్వజారోహణ చేయడానికి ముందురోజు సాయంత్రం భార్యలైన సూత్రవతి, జయాదేవిలతో కూడి విష్వక్సేనుడు భూమిపూజను నిర్వహిస్తాడు. ఛత్రచామర మంగళవాద్య పురస్సరంగా ఆలయంలోకి ప్రదక్షిణ మార్గంలో ప్రవేశిస్తాడు. నైరుతి దిశలో భూమిపూజ చేసిన తరువాత మృత్ సంగ్రహణం (మట్టిని తీసుకురావడం) చేస్తాడు. ఆనాటి రాత్రివేళ నవధాన్యాలతో బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ (బీజావాపం) జరుగుతుంది.
ధ్వజారోహణ
బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభసూచికగా గరుడధ్వజాన్ని ప్రతిష్ఠ చేస్తారు. కంకణధారణ చేసి ఆలయం లోపల, బయట అష్టదిక్కుల్లో బలిని వేస్తారు. మలయప్పస్వామి ధ్వజస్తంభం వద్దకు విచ్చేసిన తరువాత పరివార దేవతలైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదులు విమాన ప్రదిక్షిణంలో ఉన్న అంకురార్పణ మంటపానికి విజయం చేస్తారు. అత్యంత శోభాయమానంగా ఉభయ దేవేరీ సమేతుడైన ఉత్సవరాయుని సమక్షంలో ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజాన్ని అధిరోహించే ముందుగా గరుడాళ్వార్ ముద్గలాన్నం అని పిలిచే పెసరపప్పు పులగం నివేదనగా అందుకుంటాడు. ధ్వజంపై నిలిచి సకల లోకాలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం పలుకుతాడు. ఈ ధ్వజారోహణ వేళకే శ్రీవారి భక్తుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామికి పట్టుపీతాంబరాలను అందచేయడం ఆచారంగా ఉంది. ఆ తరువాత వాహనసేవలు ప్రారంభమవుతాయి.
పెద్దశేషవాహనం
శ్రీవారికి తోలి బ్రహ్మోత్సవ వాహనసేవను వరంగా పొందాడు ఆదిశేషుడు. శ్రీవైకుంఠంలో నిత్యశయ్యగా, శ్రీవారికి నివాసభూమిగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, అనుకునే మెత్తగా, ఛత్రంగా వివిధ రూపాలలో సేవలందించిన దాసుడు ఆదిశేషుడు. పెద్దశేష వాహనసేవ వల్ల మనిషిలో పశుత్వం తొలగిపోయి, మానవత్వం, దానిలోనుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. మానవుల మనసుల్లోని విషతుల్యమైన పాపాలను ప్రక్షాళన చేసె విశిష్ట సేవ ఇది.
చిన్నశేషవాహనం
ఆదిషేశుడే శ్రీవారికి రెండోరోజు చిన్నషేశుడుగా మళ్ళీ సేవలను అందిస్తాడు. ఈ వాహనసేవ శేషశేషి భావాన్ని పెంపొందిస్తుంది. కుండలినీ శక్తి మానవునిలో వెన్నెముక ఉండేచోట సర్పాకారంలో ఉద్భవిస్తుంది. ఆ వాహనసేవ భక్తులకు ఆ యోగమార్గాన్ని చేరుకునేందుకు ప్రేరణ ఇస్తుంది.
హంసవాహనం
రెండో రోజు రాత్రి శ్రీవారు హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతీ రూపంలో విజయం చేస్తారు. ‘హంసస్తు పరమేశ్వరః’ అని ఉపనిషత్తులు కీర్తిస్తున్నాయి. హంసలు నీళ్ళను, పాలను వేరుచేసి, పాలను మాత్రమే స్వీకరిస్తాయి. భగవానుడు ఆత్మానాత్మ వివేకాన్ని అనుగ్రహిస్తూ, ఆశ్రయించిన వారిలోని అహంభావాన్ని హంసవాహనం ద్వారా తొలగిస్తాడు. సోహం భావన కలిగిన భక్తులను ఉద్దరిస్తూ, అహంకారం తొలగించి, దాసోహం అన్న శరణాగతిని ప్రబోధిస్తాడు.
సింహవాహానం
బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై విహరిస్తారు. సింహం పరాక్రమానికి శీఘ్రగమన శక్తికి ఆదర్శం. దుష్టశిక్షకుడైన శ్రీనివాసుని వైభవానికి సింహవాహనం చక్కని అమరిక. తన భక్తులకు ధర్మదీక్ష పట్ల అనురక్తిని, ప్రతాపస్ఫూర్తిని శ్రీహరి ఈ వాహన సేవాఫలంగా కటాక్షిస్తాడు.
ముత్యపు పందిరి వాహనం
బ్రహ్మోత్సవాల్లో మరులు గొలిపే ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు కనువిందు చేస్తారు. ముత్యాలు చంద్రునికి ప్రతీకలు. ముత్యాల హారాల మధ్య నిలిచినా శ్రీవారు తనను దర్శించే భక్తుల తాపత్రయాలు తొలగిస్తాడు.
కల్పవృక్ష వాహనం
కల్పవృక్షం కోరిన కోరికలు మాత్రమే తీరుస్తుంది. కానీ శ్రీహరి మోక్షాన్ని కూడా అనుగ్రహించగలడు. మానవ జీవన ప్రస్థానానికి పరమావధి అయిన మోక్ష ఫలాన్ని ఇవ్వగల జనార్దనుడు కనుక కల్పవృక్షం ఆయనకు దాస్యం చేస్తోంది.
సర్వభూపాల వాహనం
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ వేదం శ్రీహరిని సకలభువన చక్రవర్తిగా ప్రస్తుతిస్తోంది. న రాజన్యులందరు వాహనస్తానీయులై శ్రీహరిని సేవిస్తారు.
మోహినీ అవతారం
బ్రహ్మోత్సవాల్లో అయిదోనాటి ఉదయం మోహినీరూపంలోని శ్రీవారికి ప్రక్కనే దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుని రూపం కూడా కనిపిస్తుంది. అన్ని సేవలు వాహన మండపం నుంచే మొదలవుతాయి. కానీ ఈ ఒక్క సేవలో మాత్రం సీవారు దేవాలయం నుంచే నేరుగా విచ్చేస్తారు. మొహం, మాయలను దాటాలంటే స్వామికి శరణాగతి చేయాలన్న దివ్యసందేశం ఇది.
గరుడ వాహనం
వాహనసేవల్లో గరుడ సేవ విశిష్టమైనది. దాసుడిగా, సఖుడిగా, విసనకర్రగా, అన్నింటికీ మించి నిత్యవాహనంగా గరుడుడు స్వామికి సేవలను అందిస్తాడు. గోదాదేవి సమర్పించిన మాలను, సహసనామాలను, లక్షీహారం వంటి మూలవరుల ఆభరణాలతో స్వామి ఊరేగే ఈ గరుడవాహన సేవ మానవులకు జ్ఞాన వైరాగ్యాలను, అభీష్ట సిద్ధిని కటాక్షిస్తుంది.
హనుమద్వాహనం
ఆరో రోజు ఉదయం బ్రహ్మోత్సవ రాయడు వేంకటాద్రి రాముడై హనుమద్వాహన సేవలో శోభిల్లుతాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, ఆజాడ్యం, వాక్పటుత్వం కటాక్షించే హనుమంతుని సేవలు అందుకుంటూ శ్రీహరి భక్తులకు సద్భుద్ధిని ప్రసాదిస్తాడు.
స్వర్ణరథోత్సవం
సాయంత్రవేళ బంగారుతెరుతో బ్రహ్మాండనాయకుడు ఉభయదేవేరులతో ప్రసన్నంగా గోచరిస్తాడు. నాడు శ్రీకృష్ణుని రథగమనం శ్లెబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, మాహాకాలనే గుర్రాలతో దారకుని సారథ్యంలో ముందుకు సాగింది. ఆనంద నిలయవాసుడైన శ్రీనివాసుని స్వర్ణరథోత్సవంలో నాలుగు గురాలను పూన్చిన రథంపై స్వామి దర్శనం కన్నుల పండుగ.
గజవాహనం
శ్రీనివాసుడు పార్వేటలో గజరాజును తరిమినప్పుడు పద్మావతీదేవిని చూసినట్లు శ్రీనివాసకళ్యాణం చెబుతోంది. గజవాహనం అంటేనే సకల శ్రేయోదాయకం. బ్రహ్మ ఈ వాహనాన్ని శ్రీవారికి చక్కగా సిద్ధపరుస్తాడు.
సూర్యప్రభ వాహనం
సూర్యతేజం జీవులకు అభ్యుదయ కారకం. సూర్యుడు తన సప్తకిరాణాలతో కూడిన ప్రభను ఏడుకొండలవానికి వాహనంగా అందిస్తాడు. సూర్యప్రభలు విద్య, ఐశ్వర్యం, సంతానం, కవిత్వం, కాంతిని ప్రసాదిస్తాయి. సూర్యప్రభా వాహనంపై శ్రీవారి సేవలో పాల్గొంటే జీవుల శోకాలు తొలగి, జ్ఞానబీజాలు వెలుగురేఖల్లా అంకురిస్తాయి.
చంద్రప్రభ వాహనం
ఏడవరోజు రాత్రి తెల్లని చంద్రప్రభా వాహనంపై విహరిస్తూ శ్రీవారు చల్లని చూపుల వెన్నెలతో లోకాన్ని అనుగ్రహిస్తారు. ఈ శ్రీహరిని సేవించిన భక్తకోటికి ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే త్రివిధ తాపాలు తొలగుతాయి.
రథోత్సవం
జన్మరాహిత్యాన్ని కటాక్షించి, ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించేది రథోత్సవం. రథికుడు ఆత్మ, శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీథులు. ఉపనిషత్తులు చేసె ఈ భోధ స్థూలశరీరం వేరని, సూక్ష్మశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే జ్ఞానం కలిగిస్తుంది. ఎనిమిదో రోజు ఉదయం ఎందరో భక్తులు తమ చేతులతో శ్రీహరి రథవాహాన్నాని ముందుకు నడిపించే భాగ్యం పొందుతున్నారు.
అశ్వవాహనం
ఈ వాహనసేవ కలిదోషాలను పరిహరిస్తుంది. పటుత్వాన్ని కలిగించి, నామ సంకీర్తనాదుల ద్వారా మానవులు తరిస్తారని ప్రభోదిస్తుంది.
చక్రస్నానం
యజ్ఞాంతంలో జరిగే అవబృధం చక్రస్నానం. బ్రహ్మోత్సవాలు మహోన్నత యజ్ఞఫలాన్నిస్తున్నాయి. శ్రీవారు ఉభయదేవేరులతో, చక్రత్తాళ్వారుతో కలిసి వరాహస్వామి ఆలయంలో నిలిచి స్నపన తిరుమంజనాన్ని అందుకుంటారు. తొమ్మిది రోజులపాటు శ్రీవారు అలసట పొందుతారు. ఆ అలసట తీరేలా ఈవారికి ఆత్మస్థానీయుడైన చక్రత్తాళ్వార్ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. పదోరోజు రాత్రి గరుడధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి. బ్రహ్మోత్సవాలను సేవించిన వారికి సమస్త పాప విముక్తి లభిస్తుంది. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అపమృత్యువు నివారణమవుతుంది. సకల లౌకిక శ్రేయస్సులు కలిగి తదనంతరం శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
" శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రప్రద్యే "