Swamy Ayyappa |
స్వామి అయ్యప్ప చరితం | పదిహేడవ భాగం
అయ్యప్ప చరితం - 71 వ అధ్యాయం
ఈ రోజున పూజా మందిరంలో ఇండ్లలో అయ్యప్పస్వామి , ఇతర దేవీ దేవతల మూర్తులతో బాటు ‘విషుకణి’ అని ఒక అద్దాన్ని ఉంచి , అద్దానికి బొట్టు , పూలమాలలు వేసి అద్దం ముందర నవధాన్యాలు , వివిధ రకాలైన కాయగూరలు , పండ్లు , బంగారు , వెండి , రాగి నాణాలు మొదలైనవి అమర్చుతారు ! ఒక పళ్ళెంలో పైకం నోట్లు వుంచుతారు ! ప్రొద్దున లేచిన వెంటనే ముందుగా ఈ అద్దంలో ముఖం చూసుకుని , కళ్లు నీటితో తుడుచుకుని , నుదుట బొట్టు పెట్టుకుని అద్దం ముందర వున్న వాటినన్నిటిని చూడటం వల్ల ఆ సంవత్సరమంతా శుభప్రదంగా జరుగు తుందని కేరళీయుల నమ్మకం! ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇండ్లలో ‘విషుకణి’ దర్శనానంతరం స్నానాదికాలు ముగించుకుని కొత్త బట్టలు ధరించి పూజాదికాలు జరుపుతారు. తరువాత అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. చాలామంది ఈ రోజుకు శబరిమల చేరుకుని స్వామిని దర్శించుకుంటారు ! ప్రధాన పూజారులు ఆ రోజు ప్రత్యేకంగా స్వామి దగ్గర భక్తులకోసం ఉంచిన రూపాయ బిళ్లలను ప్రసాదంతోపాటు ఇస్తారు ! ఆ బిళ్ల లభించినవారు ఇంటికి తెచ్చుకుని పూజామందిరంలో భద్రపరుచుకుంటారు ! వ్యాపారులు పెట్టుబడులతో ఆ బిళ్లను కలపటంవల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు.
ఓణం పండగ:
ఇది కేరళీయుల ముఖ్యమైన పండుగ ! ఆగస్టు - సెప్టెంబర్ నెలల మధ్యలో వచ్చే పెద్ద పండగ ! ఈ రోజు స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వర్తిస్తారు ! అన్నదానాలు జరుపుతారు !ఈ విధంగా ఆ ప్రాంతానికి చెందిన ముఖ్యమైన పండగ రోజులలో ప్రతి నెలా మొదటి ఐదు రోజులలో మాత్రం తెరిచి ఉంచడం ఈ ఆలయం ప్రత్యేకత !
సన్నిధానం మూయటం:
జనవరి 19న గానీ , లేకపోతే 20వ తారీఖున గానీ భక్తులందరి సమక్షంలో ప్రధాన పూజారి స్వామివారి చేతిలో విల్లు , బాణము వుంచి శిరస్సుకు నీలివస్త్రం చుట్టి , విభూతితో అభిషేకం జరిపి దేవాలయం మూసేస్తారు ! తాళం పెడతారు ! శబరిగిరికి వెళ్లటం కష్టం కనుక ఈ విధంగా ముఖ్యమైన రోజులలో మాత్రమే తెరిచి వుంచే ఏర్పాటు చేయబడింది ! ఇతర ప్రాంతాలలో మామూలుగా అన్ని అలయాలలోలాగే రోజూ పూజార్చనలు రెండు పూటలా జరుగు తుంటాయి !
అయ్యప్ప స్వామి పూజకు సంబంధించిన కొన్ని వివరాలు:
స్వామి పూజకు బుధవారం, శనివారం ముఖ్యమైనవి. బుధవారం పుణ్యఫలాన్ని విశేషంగానూ, శనివారం శనిగ్రహ దోష నివారణను అనుగ్రహిస్తాయి !
- స్వామికి ఆవునెయ్యితో దీపారాధన చేయాలి ! కుటుంబానికి సంపత్తి , ఆరోగ్యం , సుఖ సంతోషాలు లభిస్తాయి !
- రెండు వత్తులు కలిపి దీపం వెలిగించాలి ! సుఖ సంతోషాలు ప్రసాదిస్తుంది !
- మూడు వత్తుల దీపం సత్సంతానాన్ని ,
- నాలుగు వత్తుల దీపం పశు సంపదను ,
- పంచవత్తుల దీపం సర్వమంగళాలు ప్రసాదిస్తాయి !
- అయ్యప్ప స్వామి పటాన్ని తూర్పు దిశగా గానీ , ఈశాన్య దిశగాగానీ వుంచి పూజించాలి !
- తూర్పు దిశగా పూజ ఆరోగ్యాన్నీ , ఐశ్వర్యాన్నీ ,
- ఈశాన్య దిశగా పూజ కీర్తిప్రతిష్ఠలను వృద్ధి చేస్తాయి !
- బెల్లంతో చేసిన అప్పాలు , చక్కెర పొంగలి , పానకం స్వామికి ప్రీతికరమైనవి ! వీటిని నివేదన చేయటంవల్ల సర్వ శుభాలు అనుగ్రహిస్తాడు అయ్యప్ప స్వామి !
- అన్ని ద్రవ్యాలలో నెయ్యాభిషేకం అయ్యప్ప స్వామికి ప్రీతికరం ! దీక్షాధారులు కొబ్బరి ముద్రలో నెయ్యిని తీసుకువెళ్లి అభిషేకం చేయించి ప్రసాదంగా కొంత తీసుకుని వెళతారు ఇండ్లకు ! ఈ నెయ్యిని సేవించడంవల్ల దీర్ఘరోగాలు , ఉబ్బసం వంటి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు నయమౌతాయి .
అయ్యప్పస్వామి పూజా విధానం
తూర్పు దిశగా పీఠం పెట్టే స్థలంలో , నీళ్లు జల్లి , శుభ్రం చేసి ముగ్గులు తీర్చిదిద్దారు ! ఆ స్థలంలో పీఠాన్ని అమర్చి దానిమీద కొత్త బట్ట వేసి అయ్యప్పస్వామి పటాన్ని ఆ వస్త్రంమీద మధ్యగా వుంచి నమస్కరించారు ! ఆ పటంలో స్వామి చిన్ముద్ర , అభయముద్రలతో , పట్టుబంధంతో ఆసీనుడై దేదీప్యమానంగా కనిపిస్తున్నాడు ! కుంకుమ , చందనం బొట్టు పెట్టి పూలమాలలు వేయడంతో మరింత శోభాయమానంగా దర్శనమిచ్చాడు అయ్యప్పస్వామి పటంలోనుండి ! పీఠం రెండు ప్రక్కలా దీపాలు అమర్చి , పూజకు కావలసిన వస్తువులన్నీ సర్దుకున్నారు పూజారులు ! అరిటాకు మీద పసుపు వినాయకుడిని వుంచి పటం ముందర ఉంచారు !
‘‘భక్తులారా ! గుడిలో చేసినట్లే మేము మా విశిష్ట పద్ధతిలో అయ్యప్పస్వామి పూజ జరిపించ బోతున్నాము ! ఇది వౌనంగా మానసికంగా చేసే పూజ ! చేతితో ముద్రలు వేసి స్వామికి చూపుతూ మనస్సులోనే ఉపచార మంత్రాలు చదువుతాము ! మీరందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుని మేము చేయబోయే పూజను చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’* అంటూ పూజారులు చెప్పడంతో అందరూ తలలూపారు !
‘‘స్వామియే శరణం అయ్యప్ప’’ అంటూ పెద్దగా ఒక్కసారి శరణుఘోష చెప్పి స్వామి పీఠం ముందు వేసిన పీటల మీద ఇంటి పెద్దవారిని వచ్చి కూర్చోమన్నారు. మనస్సులో గణపతిని , గురువును ధ్యానించి దీపాలు వెలిగించమని చెప్పడంతో , ఆవు నేతిని దీపపు సెమ్మెలలో పోసి పంచ ముఖాలున్న వత్తులు వేసి వెలిగించారు దంపతులిద్దరూ ! పసుపు వినాయకుడిమీద పుష్పాలు , పసుపు , కుంకుమలు జల్లుతూ చేతులతో ముద్రలు చూపుతూ మనస్సులో ఉపచార మంత్రాలు చెబుతూ , గణపతి పూజ పూర్తిచేశారు పూజారులు ! అగరు ధూపం, దీపాలు చూపి నైవేద్యంగా బెల్లం ముక్కలు , అరటిపళ్లు అర్పించారు ! కర్పూర హారతి ఇచ్చి అందరికీ చూపమని చెప్పడంతో అలాగే చేశారాయన ! అందరూ నిలబడి మంత్ర పుష్పానంతరం పూజారి పుష్పాలు గణపతిమీద వేయమని సైగ చేయడంతో అందరూ పుష్పాలు జల్లి , ఆత్మప్రదక్షిణ నమస్కారాలు చేశారు ! అందరికీ తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ! పూజారి గారు పసుపు వినాయకుడిని వుంచిన ఆకును జరిపి ఉద్వాసన మంత్రాన్ని ధ్యానించి గణపతి పూజ పూర్తిచేశారు !
శ్రీ అయ్యప్పస్వామి పూజ
" ఓం శ్రీ భూతనాథాయ నమః
అఖిల భువన దీపం భక్తజన చిత్తాబ్జసూనం
సురగణముని సేవ్యం తత్వ మస్యాది లక్ష్యం
హరిహర సుత మీశం తారక బ్రహ్మరూపం
శబరిగిరి నివాసం భావయే శ్రీభూత నాథం "
పూజారిగారితో పాటు అయ్యప్పస్వామిని ధ్యానించి నమస్కరించారందరూ ! పూజారిగారు మానసికంగా షోడశోపచారాలను చదువుతూ వాటికి సంబంధించిన ముద్రలు చేతులతో , వ్రేళ్ళతో చూపుతుంటే అందరూ ఆసక్తిగా ఏకాగ్రతతో చూస్తున్నారు ! వాటికి తగ్గ పూజా ద్రవ్యాలు సమర్పించుతూ ఆయన పుష్పాలు తీసుకుని అష్టోత్తర శతనామావళి మానసికంగా చదువుతుంటే ఆయన సహాయకుడు అందరికీ అష్టోత్తర శతనామావళి ముద్రించిన కాగితాలు పంచాడు చదువుకోమంటూ ! అందరూ మనస్సులోనే భక్తిశ్రద్ధలతో స్వామి నామాలు చదువుకున్నారు !
శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళిని పఠిస్తారు.
- ఓం ధర్మ శాస్త్రే నమః
- ఓం వేద శాస్త్రే నమః
- ఓం విశ్వశాస్తే నమః
- ఓం లోక శాస్త్రేనమః
- ఓం కాలశాస్త్రే నమః
- ఓం మహా శాస్త్రే నమః
- ఓం మహా బలాయనమః
- ఓం గదాంతకాయనమః
- ఓం గణాగ్రణినే నమః
- ఓం ఋగ్వేద రూపాయ నమః
- ఓం గజాధిపాయ నమః
- ఓం గణారూఢాయనమః
- ఓం గణాధ్యక్షాయ నమః
- ఓం వ్యాఘ్రరూఢాయనమః
- ఓం మహాద్యుతాయనమః
- ఓం గోప్త్రే నమః
- ఓం గీర్వాణ సంసేవ్యాయ నమః
- ఓం హాలాహల ధరాత్మజాయనమః
- ఓం అర్జునేనమః
- ఓం అగ్నినయనాయ నమః
- ఓం నక్షత్రాయ నమః
- ఓం చంద్రరూపాయ నమః
- ఓం వలాహకాయ నమః
- ఓం దూర్వాళ్యామాయ నమః
- ఓం క్రూర దృష్టియే నమః
- ఓం అనామయాయ నమః
- ఓం త్రినేత్రాయ నమః
- ఓం ఉత్పలతారాయ నమః
- ఓం కాలహంత్రే నమః
- ఓం నరాధిపాయ నమః
- ఓం ఖండేందు వౌళితనయా నమః
- ఓం కల్హారు కుసుమ ప్రియాయ నమః
- ఓం మదనాయనమః
- ఓం మాధవ సుతాయ నమః
- ఓం మందార కుసుమార్చితాయ నమః
- ఓం మహాబలాయ నమః
- ఓం మహోత్సాహాయ నమః
- ఓం మహా పాప వినాశయా నమః
- ఓం మహారూపాయ నమః
- ఓం మహాధీశాయ నమః
- ఓం మహా సర్ప విభూషణాయనమః
- ఓం అనంగ మదనాతురాయ నమః
- ఓం దుష్ట గ్రహాధిపాయ నమః
- ఓం శ్రీదాయ నమః
- ఓం శిష్టరక్షణ దక్షితాయ నమః
- ఓం కస్తూరి తిలకాయ నమః
- ఓం రాజశేఖరాయ నమః
- ఓం రాజసోత్తమాయ నమః
- ఓం రాజరాజార్చితాయ నమః
- ఓం విష్ణు పుత్రాయ నమః
- ఓం వనజనాధిపాయ నమః
- ఓం వర్చస్కరాయ నమః
- ఓం వరరుచయే నమః
- ఓం వరదాయ నమః
- ఓం వాయువాహనాయ నమః
- ఓం వజ్రకాయాయ నమః
- ఓం ఖడ్గపాణి నమః
- ఓం వజ్రహస్తాయ నమః
- ఓం బలోద్ధతాయ నమః
- ఓం త్రిలోక జ్ఞానాయ నమః
- ఓం అతిబలాయ నమః
- ఓం పుష్కలాయ నమః
- ఓం వృత్తపావనాయ నమః
- ఓం అసిహస్తాయ నమః
- ఓం శరధరాయ నమః
- ఓం పాశీ హస్తాయ నమః
- ఓం భయాపహాయ నమః
- ఓం షట్కార రూపాయ నమః
- ఓం పాపఘ్నాయ నమః
- ఓం శివసుతాయ నమః
- ఓం పాషాండ రుధిరాసనాయ నమః
- ఓం పంచ పాండవ సంత్రాతే నమః
- ఓం శర పంచాక్షరాశ్రీతాయ నమః
- ఓం పంచవక్త్ర సుతాయ నమః
- ఓం పూజ్యాయ నమః
- ఓం పండితాయ నమః
- ఓం పరమేశ్వరాయ నమః
- ఓం భవతాపప్రశీమీనాయ నమః
- ఓం భక్త్భాష్ట ప్రదాయకాయ నమః
- ఓం కవయే నమః
- ఓం కవినామాధిపాయ నమః
- ఓం కృపాళవే నమః
- ఓం క్లేశనాశాయ నమః
- ఓం సమయా అపురూపాయ నమః
- ఓం సేనానినే నమః
- ఓం భక్తి సంపత్ప్రదాయకాయ నమః
- ఓం వ్యాఘ్ర చర్మధరాయ నమః
- ఓం పూర్ణ ధవళాయ నమః
- ఓం పుష్కలేశాయ నమః
- ఓం శూలినే నమః
- ఓం కపాలినే నమః
- ఓం వేణునాదనాయ నమః
- ఓం కళార్లవాయనమః
- ఓం కంబుకంఠాయ నమః
- ఓం కిరీటాది విభూషితాయ నమః
- ఓం ధూర్జటినే నమః
- ఓం వీర నిలయాయ నమః
- ఓం వీరాయ నమః
- ఓం వీరేంద్ర వందితాయ నమః
- ఓం విశ్వరూపాయ నమః
- ఓం వృషపతయే నమః
- ఓం వివిధార్థ ఫలప్రదాయ నమః
- ఓం దీర్ఘనాశాయ నమః
- ఓం మహాబాహవే నమః
- ఓం చతుర్బాహవే నమః
- ఓం జటాధరాయ నమః
- ఓం హరిహరాత్మజాయ నమః
- ఓం దేవ గణ పూజితాయ నమః
- ఓం పంబా బాలాయ నమః
- ఓం శ్రీధర్మా శాస్తాయ నమః
- ఓం శ్రీ భూతనాధాయ నమః
- ఓం శ్రీ గురునాధాయ నమః
అష్టోత్తర శతనామావళి చదవటం పూర్తయింది.
అందరూ పుష్పాలు జల్లి కూర్చన్నారు! ధూప , దీపాలు చూపిన తర్వాత సిద్ధమైన నైవేద్యాలు తెచ్చి పటం దగ్గర పెట్టారు. అప్పాలు , చక్కెర , పొంగలి , పానకం , పండ్లు నివేదన చేసి , తాంబూలం సమర్పించారు ! కర్పూర హారతి చూపించారు ! అందరూ భక్తిగా హారతి కళ్లకద్దుకుని ఆత్మప్రదక్షిణ నమస్కారాలు చేశారు ! నమస్కార శ్లోకాలు పైకి చదువుతూ దండప్రణామాలు ఆచరించారు పూజారి గారు !
అయ్యప్పస్వామి నమస్కార శ్లోకాలు (ఆదిశంకరాచార్య విరచిత)
‘‘భూతనాథ సదానంద సర్వభూత దయాపర
రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః
లోక వీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమాహ్యహం
విశ్వపూజ్యం విశ్వ వంద్యం విఘ శంభోప్రియసుతం
క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం
మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం ! "
తీర్థప్రసాదాల వితరణ
నమస్కార శ్లోకాలు పఠించి అందరికి శంఖంతో తీర్థాన్ని ఇచ్చారు పూజారిగారు శంఖంతో తీర్థం ఇవ్వటం గూర్చి , చెప్పారాయన !
‘‘తీర్థమంటే స్వామి పూజకోసం శంఖంలో, రాగిపాత్రలో పోసి స్వామి ముందర వుంచే మంచినీరు ! ఇందులో తులసీదళాలు వేయటంవల్ల పవిత్రవౌతుంది ! తులసీదళాలు మహాలక్ష్మి రూపాలు ! తీర్థంతో ఈ దళాలను స్వీకరించటంవల్ల ఆరోగ్యం , ఐశ్వర్యం సిద్ధిస్తాయి ! పూజ పూర్తయ్యాక తప్పకుండా తీర్థాన్ని తీసుకోవాలి ! అప్పుడే పూజాఫలం లభిస్తుంది !
తీర్థం తీసుకునే పద్ధతి:
ఎడమచేతిమీద శుభ్రమైన రుమాలునుగానీ , పైబట్టను గానీ వేసుకుని దానిమీద కుడి చేతిని బొటనవ్రేలు లోపలకు మడిచి శంఖం ఆకారంలా వుంచాలి ! దాంట్లో ఉద్ధరిణితో మూడుసార్లు తీర్థాన్ని స్వీకరించి త్రాగాలి !
- మొదటి ఉద్ధరిణి తీర్థం శరీరాన్ని శుద్ధి చేస్తుంది !
- రెండవ వుద్ధరిణి తీర్థం ధర్మసాధనకు దోహదం చేస్తుంది !
- మూడవ వుద్ధరిణి తీర్థం (వుద్ధరిణి అంటే చెంచా) మోక్షమార్గాన నడిపించడానికి సహాయపడుతుంది ! కనుక పూజ చేసిన తీర్థంని మూడుసార్లు తప్పకుండా తీసుకోవాలి !
ఒకేసారి మూడు చెంచాల తీర్థం చేతిలో వేయించుకుని ఒక్కసారే త్రాగటం సరైన పద్దతి కాదు ! తీర్థాన్ని ముందుగా భక్తితో కళ్లకద్దుకుని , తరువాత క్రింద పడకుండా , శబ్దం చేయకుండా నోటితో తీసుకోవాలి’’ అని చెప్పి "అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ సమస్త పాపక్షయ కరం శ్రీ అయ్యప్పస్వామి వారి పాదోదకం పావనం శుభం’’ అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని అందరికీ ఇచ్చారు ! తీర్థాన్ని దేవాలయాలలో నిలబడి , ఇండ్లలో కూర్చుని తీర్థాన్ని తీసుకోవాలని చెప్పడంతో అందరూ వరుసలో పూజారిగారి ముందు కూర్చుని తీర్థాన్ని తీసుకుని కళ్లకద్దుకుని స్వీకరించారు.
అయ్యప్పస్వామి ప్రసాదం:
స్వామికి నివేదన చేసిన ప్రసాదాలను ముందుగా కొంత ఆకులో పెట్టి స్వామి దగ్గరగా మూత పెట్టి వుంచిన తరువాత అందరికీ పంచాలి ! చిన్న దొనెలలో ప్రసాదాన్ని ఉంచి అందరికీ ఇచ్చారు ! అందరూ భక్తితో ఆరగించారు ! తీర్థ ప్రసాదాల వితరణ జరిగాక భజన బృందంవాళ్లు వాళ్ల వాయిద్యాలతో ముందుకు వచ్చి కూర్చున్నారు ! అయ్యప్పస్వామి భజన ప్రియుడు ! అందుచేత ఇండ్లలో స్వామి పూజా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు తప్పకుండా భజన కార్యక్రమం చేయాలి ! అప్పుడే కార్యక్రమానికి నిండుదనం చేకూరుతుంది. రెండు గంటలసేపు గణపతి , సుబ్రహ్మణ్యేశ్వరస్వామి , అమ్మవారులమీద పాటలు పాడి అయ్యప్పస్వామి మీద పాడసాగారు !
అయ్యప్పస్వామి భజన
‘‘అదిగదిగో శబరిమల
- అయ్యప్ప దేవుడుండుమల
అదియే మనకు పుణ్యమల -
స్వామియే శరణం అయ్యప్ప!
అదిగదిగో కైలాసం -
ఇదిగిదిగో వైకుంఠం
ఈ రెండూ కలిసిన శబరిమల
- అదియే మనకు మోక్షమల
అదిగదిగో పంబానది -
దక్షిణ భారత గంగానది
అదిగదిగో అళుదానది
- కన్నెస్వాములకు ముఖ్యనది
అదిగదిగో కాంతిమల -
కలియుగ జ్యోతి వెలయు మల
మకరజ్యోతి వెలయు మల -
అయ్యప్పదేవుని కిష్టమైన మల!
శరణం శరణం అయ్యప్పా
అయ్యప్ప శరణం స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్పా’’
భజన చేస్తున్నవాళ్ల పాటల్లో తాదాత్మ్యం చెంది అందరూ చేతులు చప్పట్లు. కోడుతూ ‘శరణం అయ్యప్పా’ అంటూ గొంతులు కలిపారు !
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప చరితం సంపూర్ణం
మూలము : చెలికాని కేశవ - బొబ్బిలి - 9866790451