Swamy Ayyappa |
స్వామి అయ్యప్ప చరితం | పదహారవ భాగం
కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి ! జయవర్థనుడు , శశికళల పుత్రుడు జన్మించి దిన దిన ప్రవర్థమానుడౌతున్నాడు ! తనకు అయ్యప్పస్వామి చెప్పినట్లుగా ఆ బాలుడిని స్వామి అంశగా భావించి ‘అయ్యప్ప’ అనే నామకరణం చేసాడు కుమారుడికి జయవర్థనుడు ! అయ్యప్ప రూపురేఖలు , అతని మృదుస్వభావం , అందరిపట్ల కనబరిచే కరుణ - ఆ ప్రాంతం వారిని అతనినొక అసాధారణ బాలుడిగా గుర్తించేట్లు చేసాయి ! వన్యమృగాలు అతనికి నేస్తాలు ! భయపడకుండా వాటితో ఆటలాడేవాడు !
ఎవరికే కష్టం వచ్చినా అయ్యప్ప అనుగ్రహంతో తీరిపోయేవి ! దుర్భిక్షం , అనారోగ్యం ఆ ప్రాంతంలో కాలుపెట్టకుండా శాసించిన పన్నెండేళ్ల బాలుడు అయ్యప్పను ఆ ప్రాంతం వాళ్ళు ధర్మశాస్తా అపరావతారంగా కొలవడం మొదలుపెట్టారు ! ‘‘అయ్యప్ప వేద శాస్త్రాలలో , యుద్ధ విద్యలలో నిపుణయ్యాడు ! ఇక ఆ ఉదయనుడిని నిర్జించడానికి తరలివెళ్లవలసిన సమయం ఆసన్నమైంది !’’ అనే నిర్ణయానికి వచ్చిన జయవర్థనుడు మామగారికి లేఖ రాసి పుత్రుడికి ఇచ్చాడు ! ‘‘నాయనా ! ఈ లేఖ తీసుకుని వెళ్లి పంబల రాజ్య రాజుగారిని కలుసుకో ! నీ తాతగారైన ఆయనను ఉదయనుడనే బందిపోటు దొంగ చెరసాలలో బంధించి హింసిస్తున్నాడనీ , పంబల రాజ్యంలో తన ప్రతినిధులను వుంచి అరాచకం ప్రబలేలా చేస్తున్నాడని విన్నాను ! నీవు వెళ్లి ఆయనను రక్షించి , ఆ రాజ్యాన్ని ఆ దుర్మార్గుడి హస్తాలనుండి బయటపడేలా చూడు ! మా అందరి ఆశలు నీమీదే పెట్టుకున్నాము! వెళ్లు ! విజయాన్ని సాధించు !’’ అని కర్తవ్యోపదేశం చేశాడు అయ్యప్ప తల్లిదండ్రులకు నమస్కరించి , వాళ్ల దీవెనలు తీసుకుని లేఖతో పంబల రాజ్యానికి పయనమైనాడు.
రెండు రోజులు ప్రయాణం చేసి అయ్యప్ప పందల రాజ్యం చేరి రాజభవనాన్ని సమీపించేసరికి అర్థరాత్రి అయింది ! భటులందరూ గాడనిద్రలో ఉన్నారు ! వాళ్లను దాటి చెరసాల చేరుకున్నాడు అయ్యప్ప ! అతనికి స్వాగతం పలుకుతున్నట్లు చెరసాల ద్వారాలు వాటంతటవే తెరచుకోవడంతో లోపలకు ప్రవేశించాడు ! ‘‘తాతా !’’ అని పిలిచాడు మెల్లగా. ఒక మూలగా కూర్చుని భగవంతుని ధ్యానిస్తున్న రాజు రాజశేఖరుడు ఆ పిలుపుకి ఉలిక్కిపడి కనులు తెరిచాడు ! ఎదురుగా నిలిచి చిరునవ్వుతో చూస్తున్న ఆజానుబాహువు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘నీవు.. నీవు..’’ అంటూ ఏం మాట్లాడాలో తెలియనట్లు చూస్తుంటే ‘‘మీ మనవడిని ! నా పేరు అయ్యప్ప ! జయవర్థనుడు , శశికళల కుమారుడిని !’’ అంటూ పరిచయం చేసుకుని తండ్రి ఇచ్చిన లేఖను అందించాడు చదవంటూ ! మసక వెలుతురులోనే లేఖను చదివి పట్టలేని ఆనందంతో మనవడిని కౌగిలించుకున్నాడు రాజశేఖరుడు ! ‘‘అలనాడు శ్రీకృష్ణుడు తాతను చెర విడిపించినట్లు ఈనాడు నన్ను చెరవిడిపించడానికి వచ్చిన దేవుడివి , మా అయ్యప్పస్వామివి ! నీ కోసమే ఎదురుచూస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న నన్ను , ఈ రాజ్య ప్రజలను కాపాడాల్సిన భారం నీదే నాయనా !’’ అన్నాడు వణుకుతున్న కంఠంతో ! ‘‘నేను వచ్చింది అందుకోసమే గదా తాతగారూ ! ఇక నిశ్చితంగా ఉండండి’’ అంటూ తన వెంట తాతను బయటకు తీసుకువచ్చాడు అయ్యప్ప.
తెల్లవారింది ! ఉదయనుడి ప్రతినిధులందరూ సభా మండపానికి వచ్చి సింహాసనం మీద ఆసీనుడై వున్న అపరిచితుడిని చూసి ఆశ్చర్యపోయారు ! ‘ఎవరితను ? ఎక్కడినుండి వచ్చాడు ? మన అనుజ్ఞ లేకుండా సింహాసనాన్ని అధిష్ఠించాడే ! ఎంత ధైర్యం ? ఎవరో తెలుసుకోవాలి ముందర !’ ఆవేశంగా తమలో తామే అనుకుంటూ ముందుకు దూసుకువచ్చిన వాళ్లలో అనుకోని మార్పు వచ్చింది. అయ్యప్ప వాళ్లవైపు నిశితంగా చూసిన చూపుకు అందరూ ఆయుధాలు క్రింద పడేసి ‘స్వాగతం నాయకా ! మీకు సుస్వాగతం’ అంటూ నమస్కరించారు.
‘‘మీరందరూ ఇకపై పందల రాజు రాజసింహుడి సేవకులు ! వారి మనవడిని వారికి ప్రతినిధిని అయిన నా ఆజ్ఞలను పాలించవలసి వుంటుంది మీరందరూ !’’ గంభీరంగా అన్నాడు అయ్యప్ప వాళ్లవైపు తీక్షణంగా చూస్తూ ! మౌనంగా తలలూపి నిలిచారందరూ ! ‘‘ఎవరు మీలో సేనాధిపతి ?’’ అధికార పూర్వకంగా అడగటంతో ‘‘నేను నాయకా ! నా పేరు రణతుంగుడు !’’* వినయపూర్వకంగా జవాబు చెప్పి ముందుకు వచ్చి నిలిచాడు ఒకడు !
‘‘రణతుంగా ! వెంటనే సైన్యాలను ఒక చోట సమావేశపరుచు ! నేను ఇక్కడి సేనల పరిస్థితి తెలుసుకోవాలనుకుంటున్నాను ముందుగా !’’ అనేసరికి ‘‘క్షమించండి నాయకా ! ప్రస్తుతం వున్న సేన నామమాత్రమే ! అందరూ తమ బాధ్యతలు మరిచి భోగ విలాసాలలో కాలం గడుపుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు ! ప్రజలు కూడా అంతే ! యువకులెవరూ సైన్యంలో చేరలేదు ! ప్రజలందరిలో క్రమశిక్షణ లేకుండా పోయింది !’’ అంటూ బెరకుగా అక్కడి పరిస్థితులు వివరించాడు ఉదయనుడు నియమించిన సేనాధిపతి రణతుంగుడు ! ‘‘ఊ.. ‘యథారాజా తథాప్రజ’ అన్నట్లు మీరు మీ బాధ్యతలు విస్మరించి ప్రజలలో అరాచకం ప్రబలేలా చేశారన్నమాట ! ముందుగా ఇక్కడి పరిస్థితులు చక్కదిద్దాలి !’’ అంటూ పంబలరాజ్య సేనను , ప్రజలను , ఉదయనుడి ప్రతినిధులను సరిదిద్దడానికి పూనుకున్నాడు అయ్యప్ప!
అయ్యప్ప పర్యవేక్షణలో క్రమంగా అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి ! సైనికులలో తిరిగి క్రమశిక్షణ నెలకొన్నది ! అంతవరకు ఉదయనుడి ప్రతినిధులకు భయపడుతూ వాళ్లకు సేవలు చేస్తూ బ్రతుకుతున్న ప్రజలలో అయ్యప్ప రాకతో ధైర్యం , ఉత్సాహం చోటుచేసుకున్నాయి ! ‘‘మనం ఎదురుచూస్తున్న మన దైవం అయ్యప్ప తిరిగి అవతరించి మన మధ్యకు వచ్చాడు ! ఇక ఉదయ నుడి అంతం దగ్గర పడినట్లే’’ అని సంతోషపడుతూ అయ్యప్పకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఆయన నేతృత్వంలో అందరూ మంచి పౌరులుగా మసలుకోసాగారు ! దృఢకాయులైన యువకులను సైన్యంలో చేర్చుకుని తగిన శిక్షణ ఇప్పించి సైన్యాన్ని బలవత్తరం కావించాడు ! అయ్యప్ప రాకతో రాజ్యంలో దుర్భిక్షం అరాచకం స్థానే సుఖ శాంతులు నెలకొన్నాయి. ప్రజలందరిలో అయ్యప్ప పాలనలో ఉదయనుడి ప్రతినిధులు కూడా మనస్సులు మారి అయ్యప్ప సేవలో క్రమశిక్షణ పాటిస్తూ మసలుకోసాగారు!
పందల రాజ్యంలో పరిస్థితులు సరిదిద్దుతున్న అయ్యప్ప మరొక ప్రమాదకరమైన సముద్రపు దొంగను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ దొంగ పేరు వావరు ! మంత్ర తంత్రాల్లో ఆరితేరినవాడు ! నాయకా ! సముద్ర దొంగ వావర్ ఉదయనుడికన్నా బలవంతుడు ! మంత్ర తంత్రాలు తెలిసినవాడు ! కాలభైరవోపాసకుడు ! సముద్రం మీద ప్రయాణించే వర్తకుల ఓడలను అడ్డగించి వాటిని కొల్లగొడుతూండే వావరు దృష్టి ఇప్పుడు తీర ప్రాంత రాజ్యాలమీద పడిందట ! తన సేనతో తీర ప్రాంతాలపై దాడులు చేస్తున్నాడు ! ఇటువైపునకు ఏ సమయంలోనైనా దండెత్తి రావచ్చును ! అతడిని ఎదిరించడం మన సేనలవల్ల కాకపోవచ్చు ! అంటూ రణతుంగుడు తెచ్చిన ఆ వార్త విని చిన్నగా నవ్వాడు అయ్యప్ప !
‘‘మనసేనంతా ఎందుకు ? నీవు , నేను చాలమా ?’’* అడిగాడు హాస్య ధోరణిలో ! రణతుంగుడు ఆందోళనగా చూశాడు ! ‘నాయకా ! వావరు శక్తి సామర్థ్యాల గూర్చి తెలిసి వున్నవాడిని గనుక మీకు చెప్పే సాహసం చేస్తున్నందుకు మన్నించండి. తన మంత్ర బలంతో ఎదుటి పక్షంవారిని పక్షులుగా , జంతువులుగా మార్చేసి వాటితో వినోదిస్తుంటాడు ! కొందరి తలలు నరికి తాను ఉపాసించే కాలభైరవుడికి బలిగా సమర్పిస్తాడు ! రక్తం నివేదన చేసి ఆ రక్తాన్ని పాత్రలనిండా తాను త్రాగేసేంతటి కఠినాత్ముడు ! ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాయకా !’’* అంటూ రణతుంగుడు చేసిన హెచ్చరిక ఏమార్పూ తేలేదు అయ్యప్పలో ! ‘‘కాలభైరవుడంటే కాశీ పట్టణాన్ని కాపాడుతుండేవాడు , ఏకాదశ రుద్రులలో ఒకడు ! ఆ స్వామి భక్తుడిని చూడాలన్న కోరిక నాలో మరింత దృఢమైంది గానీ , భయంతో వెనుకంజ వేయాలనిపించడంలేదు ! రేపే మనం బయలుదేరుతున్నాం’’ అంటూ సభను చాలించి లేచాడు అయ్యప్ప !
కాలభైరవ స్తోత్రం
‘దేవరాజ సేవ్యమాన పాదనాంఘ్రి పంకజం
వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం!
నారదాది యోగి బృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజేహం!
భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం
నీలకంఠ మీప్యితార్థ దాయకంత్రి లోచనం
కాలకాల మంబుజాక్ష మస్త శూన్యమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజేహం!
ప్రతిరోజూలాగే నిలువెత్తు కాలభైరవుని విగ్రహానికి పూజాదికాలు నిర్వర్తిస్తున్నాడు సముద్ర దొంగ వావరు ! ఇతరులను చంపి వారి ధనపురాశులను దోచుకోవడం వృత్తి అయిన వావరు కాలభైరవుని ఉపాసన మాత్రం భక్తితో నిష్ఠగా జరుపుతాడు ! పూజ చేస్తున్నంతసేపు ఇతరపు ఆలోచనలు మనస్సులో ప్రవేశించవు ! తాంత్రిక పూజ కావిస్తాడు ! పూజానంతరం తన మామూలు కార్యక్రమాలలో ప్రవేశిస్తాడు ! ఆ రోజు పంబల రాజ్య తీరం వైపు వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకుని అందుకు సిద్ధవౌతున్నాడు వావర్!
అంతలో.. ‘‘వత్సా ! ఈవేళ నీవు వెళ్లవలసిన అవసరం లేకుండా నీ దగ్గరకే ఒక వ్యక్తి రాబోతున్నాడు ! అతని రాకతో నీ జీవన విధానమే మారిపోతుంది ! వేచి వుండు !’’ అన్న అశరీరవాణి పలుకులు వినరావడంతో ఆశ్చర్యంగా ఆలోచనామగ్నుడైనాడు వావరు ! ‘‘ఆ పలుకులు తను ఉపాసించే కాలభైరవునివే ! ఎవరి విషయంగా తనను సావధాన పరుస్తున్నాడు ? ఎవరా వస్తున్న వ్యక్తి ? అనుకుంటుండగానే భటుడొకడు పరుగు పరుగునవచ్చాడు ! ‘‘నాయకా ! మన స్థావరం వైపు ఎవరో గజారూఢుడైన వ్యక్తి వస్తున్నాడు ! అతనిని ఆపడం మనవాళ్ళ సాధ్యం కాలేదుట !’’ అంటూ భటుడు తెచ్చిన వర్తమానం విని కనుబొమ్మలు ముడివడగా ‘‘ఎవరింతటి సాహసం చేసి మన స్థావరంలోకి ప్రవేశించారు ? వెంటనే నా రథాన్ని సిద్ధం చేయండి’’* అంటూ లేచి బయటకు వచ్చాడు వావరు ! రథం కొద్ది దూరం వెళ్లగానే మందగమనంతో సాగివస్తున్న తెల్లని ఏనుగు మీద ఆసీనుడై వస్తున్న అయ్యప్ప దర్శనమిచ్చాడు ! ఆవైపే చూస్తూ వుండిపోయాడు వావరు తనను తానే మరిచి ! ‘ఆహా ! ఎంతటి దివ్య మంగళరూపం ! కరుణ ఆ కళ్ళలోనుండి జాలువారుతున్నది ! చిరునవ్వుతో తనవైపే చూస్తున్న ఆ కళ్లు నన్ను గుర్తించలేదా ? అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి ! సందేహం లేదు !
కాలభైరవస్వామి తనను సావధానపరిచింది ఈ దివ్య మంగళ మూర్తి గురించే ! చూస్తుంటే అతనికి నా సర్వస్వాన్ని అర్పించివేయాలనిపిస్తున్నది ! దొంగతనాలు , దోపిడీలు ఏవీ వద్దు ! వెళ్లి ఆ దివ్య పురుషుని పాదాలనాశ్రయిస్తాను ! అనుకుంటూ రథం దిగి ఎదురువెళ్లాడు ముకుళిత హస్తాలతో ! ‘‘ నామీద దయతో నా గృహానికి వచ్చిన దివ్య పురుషా ! నీకు నా సాదర ప్రణామాలు ! నీ దర్శనంతో నేను ధన్యుడినైనాను ! నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నాను ! స్వీకరించి నన్ను నీ వాడిని చేసుకో ’’ అంటూ తదేకంగా* స్వామి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు ! ‘‘యుద్ధంలో నిపుణుడివని విన్నాను ! నాతో తలపడకుండా శరణు కోరుతున్నావే ! నేనెవరినో గుర్తెరిగావా ?’’ చిరునవ్వుతో అడిగాడు అయ్యప్ప ఏనుగుమీద నుండి దిగుతూ ! ‘‘పంబల రాజకుమారుడిగా మనవడిగా నిన్ను గుర్తించాను ! ఆ రాజ్యాన్ని ఉదయనుడి పాలననుండి విడుదల చేసి సైన్యాలను సమీకరించి అతనిపై యుద్ధం ప్రకటించబోతున్నావని విన్నాను ! అందుకే ముందుగా నీ రాజ్యంవైపే రావాలని నిశ్చయించుకున్నాను గానీ నీవే నన్ను కలుసుకోవడానికి రావడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది ! నీవు సామాన్యుడవు కావని , కారణజన్ముడివని గ్రహించాను ! ఓ దివ్య ప్రభావ సంపన్నుడా ! నీతో యుద్ధాన్ని కాదు మిత్రత్వాన్ని వాంఛిస్తున్నాను’’ అన్నాడు వావరు భక్తిపూరితమైన హృదయంతో ! సాదరంగా అతని చేయందుకుని భుజంమీద తట్టాడు అయ్యప్ప ! ‘‘అలాగా ! ఇకపై నీవు నా మంచి మిత్రునిగా నాతోనే ఉండవచ్చును ! నీవు పంబల సైన్యానికి సర్వసేనాధిపతిగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అంటూ ఆ బాధ్యత అప్పగించాడు అయ్యప్ప ! ‘‘అలనాడు మహిషిని సంహరించడానికి అవతరించిన అయ్యప్ప నేడు కలి ప్రభావంతో విజృంభించిన దుష్టులను అంతం కావించడానికి తిరిగి మన మధ్యకు రావడం మన భాగ్య విశేషం ! అయ్యప్పకు , వారి మిత్రులకు పాండ్యరాజ్యం సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది !’’
మిత్రులతో సభాప్రవేశం చేసిన అయ్యప్పకు పుష్పమాల వేసి సాదరంగా ఉచితాసనంమీద ఆసీనుడిని కావించి అతిథి సత్కారాలు జరిపాడు పాండ్యరాజు వీరపాండ్యుడు ! వావరును మిత్రునిగా చేసుకున్న అయ్యప్ప కొచ్చుకడత్త , కరప్ప , విల్లన్ , మల్లన్ అనే బలశాలులైన మరి నలుగురు దుండగులను తన ప్రభావంతో మంచివారిగా మార్చి తనమిత్రులుగా చేసుకున్నాడు ! వారు కూడా అయ్యప్ప సైన్యంలో చేరి సైనికులకు తగిన శిక్షణ ఇచ్చే బాధ్యత స్వీకరించారు. ఉదయనుడు తప్ప సముద్రపు దొంగ వావరు , ఇతరులు అయ్యప్పకు మిత్రులవడం పంబల రాజ్యానికి పొరుగునవున్న పాండ్యరాజు వీరపాండ్యుడు విని తాను కూడా అయ్యప్పతో స్నేహ బాంధవ్యాలు పెట్టుకోవాలని ఆశించాడు ! అతని ఆశయం నెరవేర్చడానికన్నట్లుగా మిత్రులు వెంటరాగా పాండ్యరాజ్యానికి వచ్చాడు అయ్యప్ప ! తన కోరిక నెరవేడంతో ఆనందోత్సాహాలు చోటుచేసుకున్నాయి పాండ్య రాజులో ! అందుకే అయ్యప్పకు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటుకావించాడు !
‘‘పాండ్యరాజా ! మీ ఆదరానికి , అభిమానానికి కృతజ్ఞులం ! ప్రస్తుతం నేను ఉదయనుడిని ఎదుర్కొనడానికి వెళ్లనున్నాను ! మీరు మీ సేనాసమేతంగా మా వెంట రావచ్చును !’’ అని చెప్పాడు అయ్యప్ప ! ‘తప్పకుండా ! మా కోరికా అదే ! ఇంతకుక్రితం అతని చేతిలో అపజయం చవి చూసినా ఇప్పుడు మీవెంట వచ్చి మా శాయశక్తులా పోరాడి అతడిని ఓడించాలని కోరుకుంటున్నాము ! మాకూ అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞులం !’’ ఉత్సాహంగా సేనతో అయ్యప్ప వెంట బయలుదేరాడు వీరపాండ్యుడు ! దండయాత్ర ప్రారంభమైంది ! జయభేరి మ్రోగించి ఉదయనుని స్థావరాన్ని చుట్టుముట్టాయి అయ్యప్ప సేనలు , పాండ్య సేనలు ! ‘‘నాకు స్నేహితులు కావలసిన సముద్ర దొంగ వావరు , మరికొందరు ఆ అయ్యప్పకు మిత్రులైపోయి నామీదే దండెత్తి వస్తున్నారా ? వాళ్లందరినీ నా కత్తికి బలి యిస్తాను ! ఈ ఉదయనుడి శక్తి ఏమిటో తెలిసేలా చేస్తాను !’’ అని కోపంతో పళ్లు పటపటలాడిస్తూ తన సేనలతో వాళ్ళను ఎదుర్కొన్నాడు ఉదయనుడు!
‘‘పిరికిపందలారా ! నన్ను శరణనకుండా ఆ రాకుమారుడి వెనుక నిలబడ్డారా ? ఇప్పుడే నా కత్తికి బలి ఇస్తాను , చూడండి’’*తన కళ్లకు సామాన్య రాకుమారుడిలాగా కనిపిస్తున్న అయ్యప్ప వైపు తేలికగా చూస్తూ అతని వైపు దూసుకువెళ్లాడు ! ‘‘నీ ముచ్చట తీరుస్తాను ! రా కత్తితో కాదుగా నీ ద్వంద్వ యుద్ధానికి వస్తావా ?’’ అని కవ్విస్తూ ఏ ఆయుధం లేకుండా ఉదయనుడిని ఎదుర్కొన్నాడు అయ్యప్ప ! ఇద్దరిమధ్యా కొంతసేపు తీవ్రంగా జరిగింది ద్వంద్వ యుద్ధం ! అందరూ ఆందోళనగా చూడసాగారు ! ‘‘నాయకా ! వాడిని కరుణించవద్దు !’’ అంటూ హెచ్చరించారు మిత్రులందరూ ! వాళ్ళ వైపు చిరునవ్వుతో చూసి ‘‘మీరందరూ చెబుతున్నారు గనక ఈ లీలా వినోదాన్ని ఇక చాలిస్తాను !’’ అంటూ ఉదయనుడిని అమాంతంగా ఎత్తి పట్టుకుని గిరగిర త్రిప్పి పైకి విసిరేశాడు ! రక్తం కక్కుతూ పెద్ద శబ్దంతో క్రిందపడ్డ అతని శరీరంమీద నిలిచి తాండవం చేసాడు ! ఆ దృశ్యాన్ని చూస్తుంటే అక్కడ నిలిచి చూస్తున్న వాళ్లందరికీ అయ్యప్పలో మహిషి మర్దవం కావిస్తున్న మణికంఠుడు దర్శనమిచ్చాడు !
అందరూ భక్తి పారవశ్యంతో పరవశించిపోతూ ‘‘అయ్యప్ప స్వామికి జయము ! హరిహరపుత్రుడు , ధర్మశాస్తా , మణికంఠునికి జయము ! జయము !’’ అంటూ జయజయధ్వానాలు కావించారు !ఉదయనుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజాకంటకుడైన ఆ దుండగుడు మరణించడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది ! చల్లని గాలులు వీస్తూ హాయిని కలిగించాయి హృదయాలకు ! ఉదయనుడి మరణంతో బాధా భయాలు తొలగిపోయి తేలిక పడిన హృదయాలతో అందరూ అయ్యప్ప చుట్టూ చేరి స్తుతించారు.
‘‘పాహి పాహి అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
భక్తజనప్రియ అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
కలియుగ వరదా అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
పరమ కృపాళో అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
అందరి వైపు ప్రసన్నంగా చూస్తూ అక్కడనుండి పంబానదివైపు దారితీశాడు అయ్యప్ప !
పంబానదీ - విడిది, అయ్యప్ప పంబానది తీరాన్ని చేరి పరివారంతో అక్కడ విడిది చేశాడు ! ఆ ఒడ్డునే డేరాలు వేసి అయ్యప్ప కూర్చోవడానికి ఆసనం వేశారు ! పంబానది వాళ్ళను చూసి సంతోషంతో పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! ‘‘గంగతో సమానమైన ఈ నది ఒడ్డున పితరులకు పిండ ప్రదానాలు చేయడం , తర్పణాలు విడవడంవల్ల ఏడు తరాలవారికి సద్గతులు లభిస్తాయి ! మీరందరూ కూడా మరణించిన మీ పెద్దలనుద్దేశించి ఈ నదీ జలాలలో తర్పణాలు అర్పించండి !’’ అని అయ్యప్ప చెప్పడంతో పరివారంలోని వారందరూ భక్తిపూర్వకంగా తర్పణాలు అర్పించారు ! అయ్యప్ప చెప్పడంతో యుద్ధంలో మరణించిన యోధులకు తర్పణాలు విడిచారు !
అయ్యప్ప అక్కడినుండి పంబల రాజుకు , తన తల్లిదండ్రులకు వెంటనే తన విడిదికి రావలసిందిగా దూతలతో వర్తమానం పంపించాడు ! వార్త అందిన వెంటనే వారు ఆనందోత్సాహాలతో బయలుదేరి పంబానదీ తీరాన్ని చేరుకున్నారు !
‘‘కుమారా ! అయ్యప్ప ! నిన్ను కన్న మేము ధన్యులమైనాము !పంబలరాజ్యం , పాండ్య వంశం ధన్యమైనాయి. కన్నుల కరువు తీరా నిన్ను చూసే భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించావా తండ్రీ ! అంతకంటే మాకింకేం కావాలి ? నీకు సదా కృతజ్ఞులమై ఉంటాము’’ చేతులు జోడించి అంటున్న వాళ్లను వారించాడు అయ్యప్ప ! ‘‘మీరు పెద్దలు , నాకు వందనీయులు ! నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు ! నేను వచ్చిన కార్యం పూర్తయింది ! ఇక నేను నా నివాసానికి బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది ! శబరిగిరి మీద నా నివాసానికి ప్రయాణం సాగించనున్న నా వెంట మీరు కూడా అంతవరకు రావచ్చును’’ అంటూ చెప్పాడు అయ్యప్ప అందరినీ ఉద్దేశించి ! ఆ మాటలు అందరిలో ఆనందోత్సాహాలు కలిగించాయి !
‘‘అయ్యప్పస్వామీ ! మీ వెంట మేమూ గిరిమీదకు వచ్చేందుకు అవకాశం ప్రసాదించావు ! ఎంతటి కరుణామయుడివి తండ్రీ !’’ అంటూ పరివారంలోని వారందరూ , పంబలరాజు , పాండ్యరాజు , జయవర్థనుడు , ఆయన భార్య అయ్యప్ప వెంట నడుస్తుండగా తాము వెనకగా అనుసరించారు !పంబా నదిని దాటి శబరిగిరి వైపు దారితీశాడు అయ్యప్ప !
మందిర పునర్నిర్మాణం | అయ్యప్ప ఆలయ ప్రవేశం
‘‘సైనికులారా ! మీ ఆయుధాలను ఈ అశ్వత్థవృక్షం దగ్గర వుంచి , అందరూ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి ముందుకు పదండి ! అదుగో ! ఆ కనిపిస్తున్న ఆలయమే మణికంఠుని కోసం విశ్వకర్మ , పరశురాములవారు నిర్మించినది’’ కొంతదూరంలో కనిపిస్తున్న ఆలయంవైపు చూపిస్తూ చెప్పాడు అయ్యప్ప ! ‘‘అలాగే స్వామి’’ అంటూ అందరూ ఆయుధాలు , అశ్వత్థ (రావిచెట్టు) వృక్షం దగ్గర భద్రపరిచి *‘స్వామియే శరణం అయ్యప్ప’* అని శరణుఘోష గొంతెత్తి పాడుతూ ముందుకు సాగారు ! అయ్యప్ప ముందు నడవగా అందరూ ఆలయాన్ని సమీపించారు ! ఉదయనుడి దాడులవల్ల ఆలయం కొంత దెబ్బతిన్నది ! పూజారులు అయ్యప్ప విగ్రహానికి పూజార్చనలు జరుపుతున్నా భక్తుల రాకపోకలు ఆగిపోయాయి ! ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద నీరవం తాండవమాడుతూ ఉన్నది అక్కడ కొంతకాలంగా ! అయ్యప్ప పరివార సమేతంగా అక్కడకు చేరడంతో పరిసరాలలో చైతన్యం వచ్చింది ! ఎండిపోయిన చెట్లు చిగురించి ప్రకృతి కళకళలాడింది ! అయ్యప్పకు స్వాగతం చెబుతున్నట్లు జల జలమంటూ పుష్పవృష్టి కురిసింది స్వామిమీద ! అయ్యప్ప చుట్టూరా ఒకసారి నిశితంగా పరిశీలించాడు ! ఆయన దృష్టి ఆలయం మీద కేంద్రీకృతమైంది ! అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా ఆలయం పునర్నిర్మింపబడి పూర్వపు శోభతో కలకలలాడింది ! పరశురాములవారు ప్రతిష్ఠించిన విగ్రహం యధాతథంగా దర్శనమిచ్చింది ! ఆయన నియమించిన పూజారుల వంశస్థులు పరుగు పరుగున వచ్చి అయ్యప్పకు స్వాగతం పలికారు ! పద్ధెనిమిది మెట్లను , చిన్ముద్రా , అభయముద్రలు చూపుతూ పట్టుబంధంలో పీఠంమీద ఆసీనమై వున్న స్వామి విగ్రహాన్ని చూస్తూ అందరూ భక్తి పారవశ్యంతో మైమరచిపోయారు !
‘‘స్వామియే శరణం అయ్యప్పా !’’ అంటూ ముక్తకంఠంతో స్తుతించారు ! ‘‘అయ్యప్పా ! నీ దయవల్ల ఈ రోజు మేమందరం ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని , ఇందులో వెలసి వున్న మణికంఠుని దర్శించగలిగాము ! నీకు మా కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకోగలం ? తండ్రీ ! మా నమస్కారాలను స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి !’’ అంటూ తమ వైపు చిరునవ్వుతో చూస్తూ నిలిచిన అయ్యప్పకు నమస్కరిస్తూ అన్నారందరూ ! ‘‘నిర్మల హృదయంతో చేసిన నమస్కారం చాలు నాకు ! మీ యోగక్షేమాలు సర్వదా గమనిస్తూనే వుంటాను ! మీరందరూ దీక్షాధారులై నా సన్నిధికి రావచ్చును పద్ధెనిమిది మెట్లను ఎక్కి ! మీకు సన్మార్గాన్ని చూపడానికి , కలి పురుషునీ , శనీశ్వరునీ ప్రభావానికి లోనుకాకుండా పుణ్యకార్యాలు ఆచరించి ఆత్మ సంయమనం పొందడానికి మండలదీక్ష ఎంతోగానో సహాయపడుతుంది , గుర్తుంచుకోండి ’’ అని చెప్పాడు మేఘ గంభీర స్వరంతో !
అందరూ భక్తిపూర్వకంగా తలలూపారు !
అయ్యప్ప లేచి ‘‘సెలవు భక్తులారా !’ అని గబగబా మెట్లెక్కి వెళ్లి స్వామి విగ్రహం ముందు నిలిచాడు ! ఒక దివ్య జ్యోతి అయ్యప్ప నుండి విగ్రహంలోకి ప్రవేశించి అదృశ్యమైంది ! ‘‘అయ్యప్ప అదృశ్యమైనాడు ! చూస్తున్న వాళ్లందరూ ఒక్కసారిగా ‘స్వామియే శరణం అయ్యప్ప ! శరణం అయ్యప్పా ! మా నమ్మకం నిజమని నిరూపించావు ! మానవునిగా జన్మించి దుండగులందరినీ హతం కావించి మాకు శాంతిని ప్రసాదించిన అయ్యప్పవు ! నీకు కోటి కోటి ప్రణామాలు !’’* అంటూ నమస్కరించారు ! అయ్యప్ప విలీనం కావడంతో మరింత జాజ్వలమానంగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది పరశురామునిచే ప్రతిష్ఠింపబడిన మణికంఠుని విగ్రహం ! స్వామి పూజా కార్యక్రమాలు నిర్వర్తించే పూజారులు విగ్రహాన్ని వివిధ ద్రవ్యాలతో పూజిస్తుంటే భక్తులందరూ మైమరచి చూడసాగారు ! అభిషేకాలు చేస్తూ అందువల్ల కలిగే ఫలితాలను కూడా తెలియచెప్పారు పూజారులు (తంత్రులు)
అభిషేకాలు - వాటి ఫలితాలు
- పాలాభిషేకం - యశోవృద్ధి
- పెరుగు అభిషేకం - వంశవృద్ధి కలుగుతుంది
- కొబ్బరినీరు అభిషేకం - సత్సంతానం , మంచిబుద్ధి ప్రసాదిస్తుంది
- తేనె అభిషేకం - సిరిసంపదలు , తరగని ఐశ్వర్యం కలుగుతాయి
- చెరుకురసం - శాస్త్ర జ్ఞాన వృద్ధి కావిస్తుంది
- పానకం - సంకల్ప సిద్ధి కలుగుతుంది
- పంచామృత అభిషేకం (పాలు , పెరుగు , నెయ్యి , తేనె , పంచదార) - దీర్ఘాయుస్సు లభిస్తుంది.
- శుద్దోదక స్నానం (మంచినీటితో అభిషేకం) - రెండూ అశ్వమేధ యాగఫలం ప్రసాదిస్తాయి
- కుంభజల (కలశ జలం) - మానసిక శాంతిని అచంచలమైన భక్తిభావం మనస్సులో స్థిరమౌతాయి !
- ఆవు నెయ్యితో అభిషేకం - ఇహ పర సౌఖ్యాలు లభిస్తాయి. ఐశ్వర్యభివృద్ధి కలుగుంది. అంతలో మోక్షప్రాప్తి !
- గంథంతో అభిషేకం - పుత్రలాభం , స్వర్గభోగాలు లభిస్తాయి
- భస్మంతో అభిషేకం - మహాపాపాలు నాశనం
- పన్నీరుతో అభిషేకం - మనోబలాన్నిస్తుంది
- పచ్చకర్పూరంతో అభిషేకం - ఋణబాధ విముక్తి కలుగుతుంది
- శంఖం నీటితో అభిషేకం - రోగవిముక్తి , ఆరోగ్యాభివృద్ధి
- సహస్రధార నీటితో అభిషేకం - ధనలాభం
- ఫలాలతో అభిషేకం (ముక్కలుగా కోసి లేక రసం తీసి) - వ్యవసాయాభివృద్ధి , శతృవులపై విజయం
- శుద్ధాన్నం (కొద్దిగా నెయ్యి వేసి వండిన అన్నం)తో - దేహకాంతి , సర్వ తీర్థాలలో పగటి పూట మాత్రమే అభిషేకం చేయవచ్చును. స్నానమాచరించిన పుణ్యఫలం లభిస్తాయి.
- అన్ని రకాల పుష్పాలతో అభిషేకం - కుటుంబ సౌఖ్యం , పాపనివృత్తి లభిస్తాయి.
- నవరత్నాలతో అభిషేకం - గ్రహదోహ నివారణ , శాంతి సౌఖ్యాలు కలుగుతాయి.
పూజారులు వచ్చినవాళ్ళకోసం స్వామి అభిషేకాలవల్ల కలిగే ఫలితాలు తెలియజేశారు ! విన్నవాళ్లందరూ భక్తి పారవశ్యంతో స్వామికి జరుగుతున్న పూజా కార్యక్రమాన్ని చూస్తూ మైమరచి భజన చేయసాగారు.
అయ్యప్పస్వామి భజన
"పాలాభిషేకం స్వామికే
స్వామికే పాలాభిషేకం
నెయ్యాభిషేకం స్వామికే
స్వామికే నెయ్యాభిషేకం
పెరుగాభిషేకం స్వామికే స్వామికే పెరుగాభిషేకం
తేనే అభిషేకం స్వామికే -
స్వామికే తేనాభిషేకం
చందనాభిషేకం స్వామికే
స్వామికే చందనాభిషేకం
పూలాభిషేకం స్వామికే
స్వామికే పూలాభిషేకం
కట్టారదీపం స్వామికే
స్వామికే కర్పూర దీపం
స్వామియే శరణం అయ్యప్పా - అయ్యప్పా స్వామియే !! "
భజనానంతరం కర్పూర హారతి చూపారు స్వామికి శ్రావ్యంగా జేగంటలు మ్రోగిస్తూ - మంగళ హారతి గానం చేశారు.
అయ్యప్ప స్వామి హారతి
"ఓం ఓం ఓంకార రూపునకు
మంగళం జయమంగళం
నాద బిందు కళాతీత
గురుమూరితకి మంగళం జయ మంగళం
మందహాస భక్తవరదునకు
మంగళం జయమంగళం
పూర్ణాపుష్కళ నాధునకు ,
భూతనాథునకు మంగళం జయమంగళం ! "
హారతి అందరూ భక్తిగా కళ్లకద్దుకున్నారు ! తీర్థ , ప్రసాదాలు స్వీకరించారు ! అంతవరకు నిశ్శబ్దంగా కూర్చుని , కళ్ళు మూసుకుని అయ్యప్ప ధ్యానంలో నిమగ్నమై వుండిన వావరు , కొచ్చుకడత్త , కరప్ప , మల్లన్ , విల్లన్లు ఒక్కసారిగా లేచి ‘‘స్వామియే శరణం ! మిత్రా ! నిన్ను విడిచి ఇక మేము వుండలేము ! మమ్మల్ని నీలో చేర్చుకో స్వామీ !’’* అని పెద్దగా అంటూ నేలపై ఒరిగిపోయారు ! వారి జవాత్మలు విడుదలై పరమాత్మలో విలీనమైనాయి ! అందరూ ఆ హఠాత్పరిణామానికి ముందు నిర్ఘాంతపోయినా కొద్దిసేపటికి తేరుకున్నారు ! పూజారులు ఈ విధంగా చెప్పారు !
నవవిధ భక్తులు
‘ఈ నలుగురు అయ్యప్పకు ఆప్తమిత్రులు ! ఆ స్వామిని మిత్రునిగా భావించి ఎప్పుడూ ఆయన దగ్గరే వుండాలని ఆశించడం కూడా భక్తి మార్గాలలో ఒకటి ! ప్రజలారా ! మీ అందరికీ తెలుసో లేదో మరి ! మేము చెప్పేది జాగ్రత్తగా వినండి ! భగవంతుని ఆరాధించి ఆ స్వామిని చేరుకోవడానికి నవ విధ (తొమ్మిది) భక్తి మార్గాలలు పురాణాలలో చెప్పబడ్డాయి. వాటిలో సఖ్యత్వం (స్నేహం , మైత్రి) ఆ స్వామిని సేవించడం ఒక మార్గం ! పూర్వం విభీషణుడు , సుగ్రీవుడు స్వామితో మైత్రి చేసి ఆ మార్గాన తరించారు !
మిగిలిన ఎనిమిది మార్గాల గూర్చి చెబుతాము , వినండి !
- శ్రవణం (వినడం) ద్వారా భగవంతుని ఆరాధించవచ్చును ! భగవంతుని గూర్చి , ఆ స్వామి లీలల గూర్చి పెద్దలు చెబుతుంటే వినడం ద్వారా భక్తిభావం హృదయాలలో బలపడి ఆ మార్గాన స్వామిని సేవించడం జరుగుతుంది ! పరీక్ష్మిన్మహారాజు వారం రోజులపాటు భాగవత పురాణాన్ని విని తరించిన విషయం మీకందరికీ తెలుసు కదా !
- దాస్యం (సేవ చేయడం కింకరునిలాగా) భగవంతుని సేవించడం ఎంతటి పుణ్య ప్రదమో దాసాంజనేయస్వామి లోకాలకు తాను స్వయంగా ఆచరించి తెలియచెప్పాడు ! ‘నన్ను నీ కింకరునిగా (సేవకునిగా) స్వీకరించు , వేరే ఏమీ అవసరం లేదు ’ అని వేడుకుంటూ స్వామిని చేరుకోవడం ఒక భక్తిమార్గం !
- వందనం - నమస్కరించడం కూడా ఒక భక్తిమార్గమే ! పదే పదే నమస్కరిస్తూ ధ్యానించడంవల్ల భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది !
- అర్చనం - షోడోపచారాలతో అర్చించడం మీదే భక్తిమార్గాన్ని సామాన్యంగా భక్తులందరూ అనుసరిస్తుంటారు !
- సంకీర్తనం - స్వామి లీలలను పాడుతూ తరించడం ! దీన్ని భజన అని కూడా అంటారు ! స్వామి మీద పాటలు రాసి , వాటిని పాడుతూ , వాటిలో తాదాత్మ్యం చెందిన ఆనందానుభూతిని పొందడం ఒక భక్తి మార్గంగా చెప్పబడింది !
- పాదసేవనం - స్వామి పాదాలను వత్తుతూ ఆనందానుభూతి చెందడం ! ఆ భాగ్యం అందరికి సులభంగా లభించేది కాదు ! అయినా భక్తి మార్గంలో ఆ విధంగా పాదసేవనం చేస్తున్నట్లు అనుభూతి చెందవచ్చును ! ఇది ఒక మార్గం ! పరమ భాగోవోత్తములు అనుసరించేది !
- స్మరణం - ఎల్లప్పుడూ స్వామి నామాన్ని స్మరిస్తూ (ద్యానిస్తూ) వుండటం వల్ల భగవదనుగ్రహం లభిస్తుంది ! ‘నామస్మరణ ధన్యోపాయం’ (నామస్మరణ జన్మ ధన్యత్వం పొందే ఉపాయం) అని చెప్పబడింది ! అందుకే నిరంతరం అయ్యప్ప నామస్మరణ చేస్తూ వుండటంవల్ల క్రమంగా ఆ భక్తి మార్గం మిమ్మల్ని స్వామి సన్నిధికి చేరుస్తుంది !
- ఆత్మ నివేదనం - జీవాత్మను పరమాత్మకు నివేదన చేయడం భక్తి పరాకాష్టను తెలుపుతుంది నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను ! నాకు ఏ కోర్కెలు లేవు ! నన్ను నీలో ఐక్యం చేసుకో ! అని ఎప్పుడైతే నిర్మలమైన మనస్సును స్వామికి అర్పణ కావిస్తారో వాల్లను తనలో ఐక్యం చేసుకుని ముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు ! ఈ విధంగా స్త్రీలు ఆత్మ నివేదన చేయడాన్ని ‘మధురభక్తి’* మార్గమని గూడా అంటారు !
స్త్రీ రూపంలోని జీవాత్మను పురుష రూపంలో ఊహించుకుంటూ ఆత్మనివేదన చేసి ముక్తి పొందడానికి గోపికలను ఉదాహరణగా చెప్పుకోవచ్చును ! వాళ్లు నిర్మల హృదయాలతో శ్రీకృష్ణునిలో తాదాత్మ్యం చెందాలని కోరుకున్నందువల్ల వాళ్లందరికి ముక్తిని అనుఘ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ ! భక్తులారా ! మీకు సందర్భం వచ్చింది గనుక నవ విధ భక్తుల గూర్చి తెలియజెప్పాము ! ఈ నలుగురు సఖ్య భక్తిమార్గంలో అయ్యప్పస్వామిలో ఐక్యమైనారు ! వాళ్లు ధన్యజీవులు ! వీళ్లకు దహన సంస్కారాలు కావించి పంపా నదిలో తర్పణాలు విడవండి ! మీరందరూ మీకు అనుకూలమైన మార్గాలలో అయ్యప్పస్వామిని ఆరాధించి ధన్యులు కండి ! పూజారులు చెప్పిన విషయాలను ఏకాగ్రతతో , భక్తిశ్రద్ధలతో విన్నారు రాజులు , ప్రజలు గూడా !
‘‘మా నాయకులే మాకు ఆదర్శం ! మేమూ అయ్యప్ప స్వామిని ఆరాధించి ఆ స్వామిని దర్శించడానికి దీక్షాధారులమై వస్తాము ! మా నాయకులకు కూడా ఎప్పటికి గుర్తు వుండేలా గుడులు నిర్మించి పూజించుకుంటాము !’’ అన్నారు వావర్ అనుచరులు ఆవేశంగా ! ‘‘అవును ! మంచి ఆలోచన ! ఆలాగే చేద్దాము !’’ అన్నారు పంబల , పాండ్య రాజులు. అందరూ అయ్యప్ప స్వామి విగ్రహానికి మరొకసారి నమస్కరించి , స్వామి రూపాన్ని మనస్సులో నిలుపుకుని తిరుగు ప్రయాణమైనారు ! ఆలయానికి కొద్ది దూరంలో అయ్యప్ప చెప్పగా ఆయుధాలు వుంచిన అశ్వత్థ వృక్షాన్ని సమీపించారందరూ ! ‘‘తంత్రి స్వాములారా ! మీరు ప్రతిరోజూ అయ్యప్ప విగ్రహన్ని పూజార్చనలతో సేవించే భాగ్యాన్ని పొంది ధన్యులైనారు ! స్వామి సైనికులను ఈ అశ్వత్థ వృక్షం దగ్గర ఆయుధాలు వుంచమనడంతో కారణమేమైనా వుంటే తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్మా’’ అడిగాడు పంబలరాజు అంతవరకు తమను వీడ్కొలుపడానికి వచ్చిన పూజారులనుద్దేశించి ! ‘‘మహారాజా ! ఆయుధాలను రజోగుణం గలవారు ఇతరులకు హాని కలిగించటానికి వాడుతారు ! అటువంటివాటికి తన దగ్గర స్థానం లేదనీ , వాటిని విడిచి తననే నమ్మి తన సన్నిధికి రావలసి వుంటుందని తెలియచెప్పారు. అయ్యప్పస్వామి ! అంతేగాక అశ్వత్థ వృక్షం మహావిష్ణు ప్రతిరూపంగా చెప్పబడింది ! అందుచేత ఆ వృక్ష సమీపంలో విడివడటంవల్ల ఆయుధాలు పవిత్రతను పొంది ఇతరుల రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతాయి ! అశ్వత్థ వృక్షం యొక్క మహిమ గూర్చి బ్రహ్మాండ పురాణంలో వివరంగా తెలుపబడింది ! ఆ విషయాలు చెబుతాము ! వినండి !’’* అంటూ చెప్పసాగారు పూజారులు !
అశ్వత్థ వృక్ష మహిమ
అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) పరమ పవిత్రమైనది ! మహావిష్ణువు దాల్చిన వృక్ష రూపం. త్రిమూర్తులకు సంకేతం అశ్వత్థ వృక్షం ! ఈ వృక్షం మూలంలో బ్రహ్మ , మధ్యలో మహావిష్ణువు , పైభాగంలో పరమేశ్వరుడు వుంటారు ! త్రిమూర్తులు వృక్షం యొక్క ఉత్తర , దక్షిణ , పడమర దిక్కులలోని కొమ్మలలోనూ , ఇంద్రాది దేవతలు తూర్పు దిక్కున వుండే కొమ్మలలోనూ వుంటారు ! సప్త సముద్రాలు , పుణ్యనదులు కూడా తూర్పు వైపు కొమ్మలలోనే వుంటాయి ! చెట్టుమూలంలో వేర్లలో మహర్షులు , గోబ్రాహ్మణులు , నాలుగు వేదాలు వుంటాయి ! ఇంతేగాక వృక్షమూలంలో ‘అ’కారము , కాండలో ‘ఉ’కారము , ఆకులు పండ్లలో ‘మ’కారము లీనమై వుండి ప్రణవ స్వరూపం (ఓం)గా కూడా చెప్పబడింది ! అశ్వత్థ వృక్షం అందుకే అత్యంత మహిమాన్వితమైన వృక్షరాజంగా పూజింపబడుతున్నది ! అశ్వత్థ వృక్షమూలంలో శుభ్రమైన నీటి ని పోసి , ప్రదక్షిణ నమస్కారాలు మూడుసార్లు చేయాలి ! ‘అశ్వత్థ నారాయణ నమః’ అని ధ్యానిస్తూ పాలను మూలంలో పోసి , పసుపు , కుంకుమలు అర్చించాలి ! ప్రతి శనివారం ఈ విధంగా పూజించి , చెట్టును తాకి కళ్లకద్దుకోవాలి ! మృత్యుంజయ మంత్రం పఠించడంవల్ల అపమృత్యుభయం తొలగిపోతుంది ! ఆపదలు , ప్రమాదాలు పరిహరింపబడుతాయి !
మృత్యుంజయ మంత్రం
‘‘త్య్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనమ్ఉ
ర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్’’
సంతాన భాగ్యం కోరేవారు ఆ సంకల్పం చేసుకుని అశ్వత్థ వృక్షాన్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు (పదకొండుసార్లు) చేయడంవల్ల కోరిక సిద్ధిస్తుంది ! అశ్వత్థ వృక్షం మూలంలో దారిద్య్రానికి అధిదేవతయైన జ్యేష్ఠా దేవి కూడా వసిస్తూ వుంటుందని పురాణాలలో తెలుపబడింది ! ఇందుకు సంబంధించిన కథనం
వివరణ:
జ్యేష్ఠాదేవి పాల సముద్రునికి మహాలక్ష్మికి పూర్వమే జన్మించింది ! ఈమెను శనీశ్వరుడు వివాహం చేసకున్నాడు ! జ్యేష్ఠాదేవి చూపు సోకితే కష్టాలు , దారిద్య్రం సంభవిస్తాయి. శని వక్రదృష్టి సోకినా కష్టాల పరంపర , అనారోగ్యం , ఆపదలు సంభవిస్తాయి ! మానవులు శని భగవానుని తైలాభిషేకాలతో , పూజార్చనలతో సేవించసాగారు వక్రదృష్టిని ప్రసరించవద్దని ప్రార్థిస్తూ !
జ్యేష్ఠాదేవికి ప్రత్యేక పూజార్చనలు చెప్పబడలేదు ! ఆమె విచారంతో తన సోదరి మహాలక్ష్మిని , ఆమె భర్త మహావిష్ణువును దర్శించి తనకు కూడా పూజార్చనలు లభించేలా వరం ప్రసాదించమని కోరింది ! మహాలక్ష్మి కూడా ఆమె కోర్కెను తీర్చమని భర్తను ప్రార్థించటంతో మహావిష్ణువు జ్యేష్ఠాదేవికి తన రూపమైన అశ్వత్థవృక్ష మూలంలో కూర్చుని వుండమనీ , శనివారాలు ఆ మూలంలో అర్పించే పూజాదికాలు ఆమెకూ చెందుతాయనీ , అందువల్ల శనీశ్వరుని అనుగ్రహం భక్తులకు లభిస్తుందనీ వరం ప్రసాదిస్తాడు ! ఆ కారణగా అశ్వత్థ వృక్ష మూలంలో జ్యేష్ఠాదేవి కూడా వున్నా ఏ విధమైన అశుభాలు జరగవని మహావిష్ణువు సెలవివ్వడంతో ఆందోళన దూరమైంది భక్తులకు !
శనిశ్వరదేవుని మంత్రం
‘‘కోణస్థః పింగళో బ్రభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిశ్చనైశ్వరో మందః పిపలాదేవ సంస్తుతః "అని పఠించడంవల్ల శనిగ్రహ దోష పరిహారం జరుగుతుంది ! అభీష్ట సిద్ధి లభిస్తుంది ! రావిచెట్టు నీడలో కార్తీకమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెడితే అనంతమైన పుణ్యం లభిస్తుంది ! రావిచెట్టును నాటడం వల్ల నలబై రెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది !
పురాణాలలో చెప్పబడ్డ విషయాలను మాకుతెలిసినంతవరకు తెలియజెప్పాము ! మీరందరూ అశ్వత్థ వృక్ష మహిమను గ్రహించి , పూజించి శుభాలు పొందాలన్నదే ఆ స్వామి సంకల్పం ! వృక్షాన్ని పూజించి మీరందరూ ధన్యులవండి ! అంటూ పూజారులు చెప్పిన విషయాలు విని భక్తిభూరి హృదయాలతో నమస్కరించారందరూ !
ఆయుధాలు తీసుకుని సైనికులు , పందల , పాండ్య రాజుల వెంట తిరిగి తమ స్వస్థానాలకు చేరుకున్నారు ! అయ్యప్ప దయతో సుఖ , శాంతులతో జీవించసాగారు ! పంబలరాజు తమ రాజ్యంలోని అయ్యప్పస్వామి ఆలయంలో తిరిగి పూజార్చనలు యధావిధిగా జరిగేట్లు చేశాడు ! ఇతర ప్రాంతాలలో కూడా అయ్యప్ప ఆలయాలు వెలిశాయి ! ప్రజలు భక్తి విశ్వాసాలతో స్వామిని కొలుచుకోసాగారు ! వావర్ మొదలైనవారికి కూడా గుడులు ఏర్పాటు చేసి వాళ్లను చిరస్మరణీయులు కావించారు !
‘‘ అయ్యప్పస్వామి తిరిగి అవతరించి దుర్మార్గులను వధించి జనాలను రక్షించి ధర్మాన్ని స్థాపన చేసిన జానపదగాథ ! ఒక విషయం గమనించాలి ? పురాణాలలో మహావిష్ణువు వేరు వేరు రూపాలతో , పేర్లతో అవతరిస్తుంటాడు ! అయ్యప్ప చరితంలో మహిషి సంహారానికి హరిహరుల అంశతో జన్మించిన పుత్రునికి మహావిష్ణువు మణికంఠుడు అనీ , ధర్మశాస్తా అనీ పేర్లు ప్రసాదిస్తే , పరమేశ్వరుడు భూతనాథుడనే పేరుతో భూతగణాలకన్నిటికి నాయకుడిని చేశాడు ! ఆ పుత్రుడు భూలోకంలో మణికంఠుడనే పేరుతో పెరిగి మహిషిని సంహరించాడు ! మణికంఠుడు అవతార లక్ష్యం పూర్తయ్యాక శబరిగిరిమీద శిలారూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు ! అయ్యప్ప అనే పేరుతో ఆ ప్రాంత ప్రజలు మణికంఠుని వెళ్లవద్దంటూ ఆర్తిగా వేడుకున్నప్పుడు మణికంఠుడు తాను ఆ పేరుతోనే ప్రసిద్ధుడినౌతానంటూ వరం ప్రసాదించి సంతోషం కలిగించాడు ! అందుకే అయ్యప్ప స్వామిగానే ప్రఖ్యాతి చెందాడు ! ఈ పేరు ప్రజలు పెట్టినది ! మహిషి సంహారం కృతయుగాంతంలో జరిగినట్లు గ్రహించాలి ! తరువాతి యుగాలు గడిచి , కలియుగారంభంలో తిరిగి అరాచకం పంబల దేశ ప్రాంతంలో తలఎత్తినపుడు మణికంఠుడు అయ్యప్ప అనే పేరుతోనే అవతరించి వాళ్లను సంహరించాడు ! తిరిగి తన విగ్రహంలోనే విలీనం చెందాడు ! ఇదే ఈ స్వామిలోని ప్రత్యేకత ! అవతార రూపం , మూల రూపం ఒకే విధంగా , ఒకే పేరుతో వుండటంవల్ల ఎక్కడ వెలసినా ఆ రూపంలోనే ఆ పేరుతోనే ఆరాధింపబడుతున్నాడు ! దేవుడైన విష్ణుమూర్తి భూలోకంలో మానవుడిగా అవతరించినపుడు రాముడుగా కృష్ణుడుగా వేరే రూపాలతో , పేర్లతో జన్మించడం జరిగింది ! కాని అయ్యప్పస్వామి మణికంఠుడు , ధర్మశాస్తా అనే దైవపరమైన పేర్లకన్నా ప్రజలు పెట్టిన పేరుతోనే పూజింపబడుతున్నాడు ,
‘‘పంబలరాజ్యం , శబరిగిరి - వీటిలోనేగాక అయ్యప్పస్వామికి సంబంధించిన పుణ్యక్షేత్రాలింకా ఉన్నాయి ! పంబల రాజ్యం ఇప్పటి కేరళ రాష్ట్రంలోనిది ! కేరళలోనే పురాణ ప్రసిద్ధమైన అయ్యప్పస్వామి ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో శబరిమలతోపాటు మరో నాలుగు చోట్ల వెలసిఉన్న అయ్యప్పస్వామి క్షేత్రాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడ్డాయి. ఈ నాలుగు స్థలాలలో మాత్రం వేరు వేరు రూపాలలో అయ్యప్పస్వామి వెలసి వుండటం ప్రత్యేకతగా చెప్పబడుతున్నది !
ఆ ప్రాంతాలు , అక్కడ వెలసి వున్న మూర్తులను శబరిమలమీద వెలసి వున్న మూలమూర్తిని కలిపి ‘పంచ అయ్యప్పలు’ గా వ్యవహరిస్తారు ఆ ప్రాంతాలవాళ్లు ! వాటి వివరాలు..
పంచ అయ్యప్పలు:
పంచతత్వ క్షేత్రాలు
- కుళత్తుపుల - అనే క్షేత్రంలో అయ్యప్పస్వామి విగ్రహం బాలుని రూపంలో వుంటుంది ! అందాలు చిందే పసిబాలుడుగా సాలగ్రామ శిలారూపంలో *‘కుళత్తూర్ అయ్యన్’* అనే పేరుతో పూజింపబడుతున్నాడు. ఆలయ సమీపంలో వున్న పుష్కరిణిలో స్నానం ఆచరించడంవల్ల చర్మరోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం ! ఈ క్షేత్రం జీవి హృదయస్థానంలో వుండే వాయుతత్త్వంతో కూడిన అనాహత చక్రానికి ప్రతీకగా స్థల పురాణంలో చెప్పబడింది !
- ఆర్యన్గావ్ - కుళత్తపుల క్షేత్రానికి సుమారు పద్ధెనిమిది మైళ్ల దూరంలో వున్న ఈ క్షేత్రంలో కళ్యాణమూర్తిగా పూర్ణా , పుష్కళా దేవేరుల సహితంగా దర్శనమిస్తాడు అయ్యప్పస్వామి ! ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి , దేవేరుల కళ్యాణం వైభవంగా జరుపుతారు ! జీవి నాభి స్థానంలో వుండే అగ్నితత్వం గల మణిపూరక చక్రానికి ఈ క్షేత్రం ప్రతీకగా చెప్పబడింది !
- అచ్చన్ కోవిల్ : జలతత్త్వమైన , నాభికి క్రిందగా వుండే స్వాధిష్టాన చక్రానికి ప్రతీకగా వెలసి వున్న ఈ క్షేత్రంలో రుద్రాక్ష శిలారూపంలో వెలసి వున్న అయ్యప్పస్వామి గృహస్థుగా పూజింపబడుతున్నాడు !
- ఎరుమేలి : ఇక్కడ ఆలయంలో ధర్మశాస్తా కిరాత పురుషునిగా (వేటగాడు)గా దర్శనమిస్తాడు. ఈ ఎరుమేలిలోనే అయ్యప్పస్వామి మిత్రుడైన వావరు గుడి వున్నది ! శబరిమల యాత్రలో భక్తులందరూ ఎరుమేలి చేరి అయ్యప్ప ఆటవిక పురుషుని రూపంలో వున్నందువల్ల తాము కూడా ఆటవిక వేషాలు ధరించి , తాము తీసుకువెళుతున్న ఆయుధాలను చేతబట్టి (కత్తి , గద , బాణం మొదలైనవి) అయ్యప్ప భజన చేస్తూ నాట్యం చేస్తుంటారు. దీన్ని *‘వేటతుళ్లి’* అంటారు ! ఈ విధంగా చేయడంవల్ల స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం ! జీవి శరీరంలోని పృథ్వీతత్వమైన మూలాధార చక్రానికి ప్రతీకగా ఈ స్థానం చెప్పబడింది !
- శబరిమల : జీవి కనుబొమ్మల మధ్య వుండే ఆజ్ఞా చక్రానికి ప్రతీకగా శబరిమల ! ఇక్కడ స్వామి జ్యోతి రూపంలో మకర సంక్రాంతినాడు దర్శనం ప్రసాదిస్తాడు ! ఈ ఐదు క్షేత్రాలేగాక పంబల రాజ్యంలోని ధర్మశాస్తా ఆలయం వెలసి వున్న ప్రాంతం జీవి కంఠ ప్రదేశంలో వుండే ఆకాశ తత్వాన్ని గల విశుద్ధి చక్రానికి ప్రతీకలా చెప్పబడింది. ఇక్కడ స్వామిని బాలశాస్తాగా పూజించడం ఆనవాయితీ ! కేరళ రాష్ట్రంలో ప్రధానమైన అయ్యప్ప క్షేత్రాలు అవి ! ఇక ఇప్పుడు దక్షిణాపథంలోని ఇతర రాష్ట్రాలో గూడా అయ్యప్పస్వామికి ఎన్నో గుడులు నిర్మించబడ్డాయి. భక్తులు కూడా ఎక్కువైనారు ! దీక్షాధారులే కాక అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో కార్తీకమాసం నుండి శబరిమలకు వెళ్ళేదారులంతా జన సందోహంతో నిండి వుంటుంది !
శబరిమల యాత్ర విషయాలు
పూర్వకాలంలో శబరిమల యాత్ర చేయడం చాలా కష్టంగా వుండేది ! క్రూరమృగాలతో నిండిన ఘోరారణ్యాల మధ్య , ముళ్లతో నిండిన సన్నని కాలిబాటల వెంట కాలినడకన సుమారు 50 కి.మీ ప్రయాణం చేయాల్సి వచ్చేది ! అయినా ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ , మార్గాయాసాన్ని లెక్కచేయకుండా మూడు రోజులు నడిచి శబరిమలను చేరుకునేవాళ్లు భక్తులు ! ఈ మార్గాన్ని ‘పెద్దపాదం’ అని వ్యవహరిస్తారు ! యాత్రకు పురుషులకు వయస్సు పరిమితి లేదు ! పిల్లలను కూడా తీసుకువెళ్లవచ్చును. స్త్రీలు మాత్రం 12 నుండి 50 సంవత్సరాల వయస్సు వారు యాత్ర చేయరాదన్న నియమం వున్నది ! (ఆడపిల్లలు వ్యక్తులవ్వడానికి ముందు , స్త్రీలు బహిష్టు ఆగిన తర్వాత మాత్రమే యాత్రకు అర్హులు)
యాత్ర ఆరంభం:
ఇరుముడి తలమీద పెట్టుకుని గురుస్వామి వెంట భక్తులు శరణుఘోష చేస్తూ మొదటి మజిలీ ఎరుమేలి చేరుకుంటారు !
మొదటిరోజు మజిలీ ఎరుమేలి:
ఈ క్షేత్రాన్ని చేరగానే అందరిలో ఉత్సాహం పొంగులువారుతుంది. ఇక్కడ కిరాత వేషంలో వున్న వేట శాస్తా గుడి , స్వామి మిత్రుడైన వావరు సమాధి ఉన్నాయి. ఇక్కడ అందరూ ఇరుముడులు శుభ్రమైన స్థలంలో భద్రపరిచి , వేటగాళ్లలా వేషాలు వేసుకుని , అయ్యప్ప భజన చేస్తూ తమ వెంట తెచ్చిన ఆయుధాలు పట్టుకుని కొంతసేపు నాట్యం చేస్తారు ! ఈ కార్యక్రమాన్ని ‘వేటతుళ్లి’ అంటారు. ఈ విధంగా ఆడి పాడటంవల్ల స్వామి ఆనందిస్తాడన్నది ప్రజల విశ్వాసం !
ఆ కార్యక్రమం ముగిసాక గుడిలో స్వామిని దర్శించి కొబ్బరికాయలు కొట్టి , వావరు గుడికి ప్రదక్షిణలు చేస్తారు ! స్వామి ఆదేశం ప్రకారం వావర్ తమ వెంట అరణ్యమార్గంలో తోడుగా వుండి ప్రమాదాలు సంభవించకుండా చూస్తాడన్న విశ్వాసంతో అక్కడనుండి ముందుకు సాగి *‘పేరూరు తోడు’ అనే నదీ ప్రాంతాన్ని చేరుకుంటారు ! ఆ నది భక్తులు స్నానం ఆచరించడానికి వీలుగా కొండలమీది నుండి క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది ! ఇక్కడ స్నానాలు చేసి శుభ్ర వస్త్రాలు ధరించి భక్తులు ‘కాళైకట్టె’ ప్రాంతాన్ని చేరుకుంటారు !
కాళైకట్టె: ఆ ప్రాంత భాష అయిన మలయాళంలో *‘కాళై’* అంటే వృషభం అనీ , కట్టె అంటే కట్టివేయటం అనీ అర్థం ! మణికంఠుడు మహిషిని మర్దించే సమయంలో చూడటానికి వచ్చిన పరమేశ్వరుడు ఈ స్థలంలోనే తన నంది వాహనాన్ని కట్టివేసినట్లు ఇక్కడి స్థల పురాణం తెలుపుతున్నది ! ఇక్కడ వున్న పార్వతీ పరమేశ్వరులు , గణపతి , సుబ్రహ్మణ్యస్వామి , నాగరాజుల గుడులను దర్శించుకుని భక్తులు అక్కడికి దగ్గరలో వున్న అళుదానది దగ్గరకు చేరుకుని రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు ! వంట చేసుకుని తిని రాత్రంతా భజన చేస్తూ గడుపుతారు !
అళుదానది: ఇది ఒక చిన్న జలప్రవాహం ! మహిషిని సంహరించడానికి మణికంఠుడు ఆమె శరీరాన్ని మర్దిస్తున్నపుడు జ్ఞానోదయమై తనకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటూ విషాదంతో కన్నీరు కారుస్తుంది మహిషి ! ఆ కన్నీరే అళుదా (కన్నీళ్ళు) నదిగా ఏర్పడిందని స్థల పురాణం తెలిజేస్తున్నది. వనమూలికలు , ఔషధాల సారం గల ఈ అళుదానది నీటిలో స్నానం దేహానికి ఆరోగ్యాన్ని , మనస్సుకు శాంతిని ప్రసాదిస్తాయి. ఈ నదీ ప్రాంతంలోనే ఉదయనుడనే గజదొంగను చంపడానికి సైన్యాలతో బయలుదేరిన అయ్యప్ప విడిది చేసినట్లు కూడా *జానపదగాథలలో* తెలుపబడింది. మర్నాడు పొద్దున అళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో నుండి రెండు రాళ్లను తీసుకుని వాటితో రెండవ రోజు ప్రయాణం మొదలుపెడతారు భక్తులు !
రెండవ రోజు ప్రయాణం:
అళుదానదీ స్నానం ముగించుకుని , అందులో నుండి రెండు రాళ్లు ఏరుకుని భద్రపరచుకుని అళుదామేడు అనే కొండ ప్రాంతాన్ని చేరుకుంటారు యాత్రికులు !
అళుదామేడు:
మేడు అంటే కొండ ! సుమారు 5 కి.మీ ఎతైన గుండ్రని రాళ్ళతో కూడిన ఈ కొండను శరణుఘోష చెప్పుకుంటూ ఎక్కుతారు యాత్రికులు. ఈ కొండ శిఖరానికి కొంచెం క్రిందగా ‘కళ్లడుంకుండ్రు’ అనే ప్రదేశం ఉన్నది !
కళ్లడుంకుండ్రు:
మహిషిని వధించి , ఆ శరీరాన్ని ఆకాశంపైకి విసురుతాడు మణికంఠుడు ! ఆ కళేబరం వచ్చి భూమిపై పడ్డ స్థలమే ఈ ‘కళ్లడుంకుండ్రు’గా* స్థల పురాణంలో తెలుపబడింది ! దేవతలు మహిషి కళేబరం మీద అళుదానది నుండి తీసిన రాళ్ళు విసిరి ఆ స్థలంలో సమాధి గావించారట. అందుకు గుర్తుగా భక్తులు అళుదానది నుండి ఏరుకుని తెచ్చిన రెండేసి రాళ్లను ఆ ప్రదేశంలో వుంచడం ఆచారంగా మారింది ! అక్కడ కర్పూర హారతులు ఇచ్చి నమస్కరించి ముందుకు సాగుతారు !
ఇంజిపారకోట:
అళుదామేడు శిఖరాన్ని ఇంజిపారకోట అంటారు! పూర్వం ఉదయనుడి కోట వుండిన స్థలంగా ఈ ప్రదేశం చెప్పబడింది ! ఇక్కడే అయ్యప్పస్వామి ఉదయనుడిని హతమార్చటం జరిగింది ! ఇక్కడ నీరు చిన్న కాలువగా ప్రవహిస్తూ ఉండటంవల్ల భక్తులు కొంతసేపు విశ్రమించి కొండదిగటం ప్రారంభిస్తారు ! శరణుఘోష చెప్పుకుంటూ ‘కరిమలతోడు’ అనే ప్రదేశాన్ని చేరుకుంటారు !
కరిమలత్తోడు:
కరి అంటే ఏనుగు , మల అంటే కొండ , తోడు అంటే నీరు ! ఈ ప్రాంతమంతా ఏనుగులతో నిండి వుండటంవల్ల ఈ కొండ ప్రాంతానికి ‘కరిమల’ అనే పేరు వచ్చింది ! ఇక్కడి పిల్లకాలువలలో నీరు ప్రవహిస్తూ వుండటంవల్ల ఏనుగులు ఈ కాలవల దగ్గరకు వస్తుంటాయి. ఇక్కడ నీరు పాత్రలతో నింపుకుని నిటారుగా వున్న కొండను ఎక్కటం ప్రారంభిస్తారు భక్తులు ! సుమారు పది కి.మీ పైకి ఎక్కి వెళ్లి కొండ శిఖరం చేరుకుంటారు ! ఈ కొండ శిఖరాన్ని ‘కరిమల ఉచ్చ’* అని పిలుస్తారు. ఇక్కడ ఒక దివ్యమైన బావి , జలపాతం దర్శనమిస్తాయి ! బావిలో నీరు ఎప్పుడూ వూరుతూనే వుండటం ఆశ్చర్యకరంగా భావించబడుతున్నది ! వాటికి పసుపు , కుంకుమలు సమర్పించి , కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి నమస్కరించి అక్కడ ఏర్పరచిన హుండీలో డబ్బులు సమర్పించి నమస్కరిస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు ! బస చేసే స్థలాలను ‘తావళం’ అంటారు !
మూడవ రోజు ప్రయాణం:
మూడవ రోజు ఉదయాన్నే భక్తులు కరిమలఉచ్ఛ నుండి దిగటం ప్రారంభిస్తారు. ఈ కొండ దిగటం కూడా ఎంతో కష్టం ! అయినా అయ్యప్ప శరణు ఘోష చెప్పుకుంటూ దిగి పెరియాన పట్టం అనే ప్రదేశాన్ని చేరుతారు.
పెరియాన పట్టం:
పెరి అంటే పెద్ద , యాన అంటే ఏనుగు , పట్టం అంటే స్థలం అని అర్థం మలయాళ భాషలో ! ఇక్కడ ఒక కాలువలో నీరు ప్రవహిస్తుంటుంది. ఆ నీరు త్రాగి దాహం తీర్చుకోవటానికి పెద్ద పెద్ద ఏనుగులు , ఇతర వన్యమృగాలు వస్తుంటాయి కనుక భక్తులు ఇక్కడ ఎక్కువసేపు ఆగరు ! రాత్రుళ్లు బస చేయరు ! ఇక్కడ నుండి కొద్ది దూరంలో ప్రవహిస్తున్న పంబానది కనిపిస్తుంటుంది ! భక్తులు ఉత్సాహంగా ఆ వైపు నడక సాగిస్తారు ! అడవి మార్గాన కాలినడకన వచ్చే యాత్రికులు పంబానది చేరడంతో మార్గంలో పడిన కష్టాలను మరిచి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు ! కష్టంతో కూడినదే అయినా ఇప్పటికీ ఈ మార్గాన చాలామంది భక్తులు పంబా నదీ తీరాన్ని చేరుకుంటున్నారు. అడవి మార్గాన సుమారుగా 50-60 కి.మీ నడవవలసి వుంటుంది ! అడవి మార్గాన కాకుండా వాహనాలమీద ప్రక్కగా వుండే రహదారి మార్గాన (చిన్నపాదం) కూడా భక్తులు పంబానదీ తీరాన్ని చేరి ఆ రోజుకు అక్కడ విశ్రమిస్తారు ! (అక్కడ నుండి 6 కి.మీ మార్గం నడిచి కొండ ఎక్కి సన్నిధానం చేరుకుంటారు)
పంబానది:
పంబ అంటే పాపవినాశిని అని అర్థం ! దక్షిణదేశపు గంగానదిగా ప్రఖ్యాతిగాంచింది ఈ పంబానది ! ‘దక్షిణ గంగ’ అని కూడా పిలువబడుతున్నది. ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదీ జలాలలో స్నానం శరీరానికి , మనసుకు శాంతిని , ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ! పాపవినాశిని గనక భక్తులు ఈ నదీ స్నానం చేయడంవల్ల వారిలోని రజోతమోగుణాలు నశిస్తాయనీ , సాత్విక గుణం మాత్రం కలిగి వుంటారనీ చెప్పబడింది ! శ్రీరామచంద్రుడు కూడా వనవాస కాలంలో ఈ నదిలో స్నానం ఆచరించినట్లు స్థల పురాణంలో చెప్పబడింది ! అందుకు గుర్తుగా పంబా తీరాన రాతి శ్రీరామ పాదాలు దర్శనమిస్తాయి ! అయ్యప్పస్వామి శిశువుగా పంబళరాజుకు పంబాతీరానే దొరకటంవల్ల పంబా తీర దర్శనం , పంబా స్నానం పవిత్రంగా భావించబడుతున్నాయి !
పంబాతర్పణం:
అయ్యప్పస్వామి సైన్యాలకు , ఉదయనుడి సైన్యాలకు యుద్ధం జరిగినప్పుడు రెండు ప్రక్కల ఎందరో సైనికులు మరణించడం జరిగింది ! చనిపోయినవారికి పంబా తీరానే పిండప్రదానం కావిస్తారు మిగిలిన సైనికులు అయ్యప్ప చెప్పడంతో ! పంబా నీటితో తర్పణాలు విడవటం , పిండ ప్రదానాలు చేయడంవల్ల పితరులకు సద్గతులు కలుగుతాయి. అనంతమైన పుణ్యం లభిస్తుంది ! భక్తులు తమ పూర్వీకులకు పిండప్రదానాలు కావిస్తారు , తర్పణాలు విడుస్తారు ! పంబానదిలో స్నానం ఆచరించి పవిత్రులౌతారు ! దీక్షాకాలంలో ధరించిన నల్లవస్త్రాలు విడిచి కొంతమంది సత్వగుణానికి చిహ్నమైన తెల్లని వస్త్రాలు ధరిస్తారు !
పంబా సద్ది:
స్నానం, తర్పణాలు ఇవ్వడం పూర్తయిన తర్వాత ఈ తీరాన ‘పంబాసద్ది’ అనే విందు భోజనం తయారుచేస్తారందరూ కలిసి ! ఇక్కడ కాయగూరలు , వంటసామగ్రి కట్టెలు , విస్తరాకులు మొదలైన సరుకులు అమ్మకానికి తీసుకువస్తారు ఆ ప్రాంతంవాళ్లు ! వాటిని కొనుక్కుని విందుభోజనం తయారుచేస్తారు ! ముందుగా ఇరుముడులు వుంచిన స్థలంలో ఒక విస్తరి వేసి అందులో వడ్డిన పదార్థాలన్నిటిని వుంచి అయ్యప్పస్వామికి నివేదన చేస్తారు ! అందులో స్వామి భోజనం ఆరగించుతారని భక్తుల విశ్వాసం ! భక్తులందరూ స్వామి నామస్మరణ చేస్తూ తృప్తిగా భుజించిన తరువాత స్వామి కోసం వేసిన విస్తరాకును వేలం వేస్తారు ! ఆరోగ్యం , సంతానం , ఐశ్వర్యం మొదలైన కోరికలు తీరడం కోసం భక్తులందరూ ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొంటారు ! అందరికంటే ఎక్కువ పాడిన భక్తుడు ఆకును స్వంతం చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరగించటం జరుగుతుంది ! తరువాత ఆ ఆకును భక్తిశ్రద్ధలతో తలమీద వుంచుకుని పంబాతీరానికివచ్చి ఆకును నదిలో విడిచిపెట్టడంతో పంబాసద్ది కార్యక్రమం పూర్తవుతుంది !
పంబావిళక్కు:
విళక్కు అంటే దీపం అని అర్థం ! రాత్రి కాగానే చిన్న ఆకు దొన్నేలలో దీపాలు వెలిగించి నదిలో వదలిపెడతారు ! దీప జ్యోతులు మెల్లగా సాగిపోతూ నయనానందకరంగా కనిపిస్తాయి ! ఈ దీపాలు వదిలే కార్యక్రమాన్ని కన్నిస్వాములు చేస్తారు ! పంబా నదీ తీరంలో వున్న గణపతి , ఆంజనేయస్వాముల గుడులను దర్శించి కొబ్బరికాయలు కొట్టి యాత్ర నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించి రాత్రి పంబా తీరంలో విశ్రమిస్తారు !
నాలుగవ రోజు ప్రయాణం:
ఉదయాన్నె బయలుదేరి భక్తులు నీలిమల మార్గాన అప్పాచిమేడు చేరుకుంటారు ! ఇక్కడినుండి శబరిగిరి మీదకు ఎక్కటం ప్రారంభిస్తారు ! ముందుగా గిరికి రెండువైపులా వున్న లోయలలోకి భూతగణాల తృప్తికోసం బియ్యపు వుండలు విసురుతారు ! ఆ విధంగా చేయడంవల్ల అవి యాత్రకు ఆటంకం కలిగించవని భక్తుల విశ్వాసం !
శబరిపీఠం:
మార్గంలో ముందుగా వచ్చేది శబరిపీఠం ! ఈ ప్రాంతంలోనే అయ్యప్ప భక్తురాలు స్వామిని తపస్సుతో సాక్షాత్కరింపజేసుకుని , దర్శించి మోక్షప్రాప్తిని పొందింది ! తర్వాతికాలంలో పంబలరాజ వంశీయులు ఇక్కడ శబరి పేరుమీద విద్యాపీఠాన్ని ఏర్పర్చటం జరిగింది ! ఈ పీఠాన్ని దర్శించి ముందుకు సాగి ‘శీరం గుత్తి’ అనే ప్రాంతాన్ని చేరుకుంటారు.
శీరంగుత్తి:
ఇక్కడే అయ్యప్ప స్వామి సైనికుల ఆయుధాలు రావిచెట్టు క్రింద పెట్టించినందువల్ల యాత్రకు దీక్ష స్వీకరించి వచ్చిన స్వాములు తాము తెచ్చిన శరము , కత్తి , గద మొదలైన ఆయుధాలను ఈ ప్రదేశంలో వుంచుతారు ! గంట తెచ్చిన వాళ్లు గంటను గుడిలో కడతారు ! శీరం గుత్తినుండి కొద్ది దూరంలో శబరిగిరీశుని ఆలయం దర్శనమిస్తుంది ! అదే స్వామి సన్నిధానం ! అక్కడికి చేరడంతో శ్రమ అంతా మాయమై అలౌకికానందంతో మనస్సు , శరీరం పరవశించిపోతాయి !
స్వామి సన్నిధానం
గర్భగుడిలోని స్వామిని ఎప్పుడెప్పుడు కన్నుల కరువుదీరా దర్శిద్దామా అన్న ఆత్రుత అందరూ దీక్షాధారులలో , భక్తులలో అధికమౌతుంటుంది ! ఒక వరుసలో శరణుఘోష చెప్పుకుంటూ తూర్పు నుండి స్వామి సన్నిధికి తీసుకువెళ్ళే పద్ధెనిమిది పవిత్రమైన మెట్లును దీక్షాధారులు ఎక్కటం ప్రారంభిస్తారు.
పదునెట్టాంబడి - పద్ధెనిమిది మెట్లు:
ఇవి పరశురాముని చేత ప్రథమంగా నిర్మింపబడినవి ! పద్ధెనిమిది మంది దేవతలు తమ శక్తులను వీటిలో విలీనం కావించటం, ఈ మెట్ల మీదగా నడిచి అయ్యప్పస్వామి తన పీఠాన్ని చేరి ఆసీనుడు కావటం జరిగాయి ! స్వామి పాద స్పర్శ నోచుకున్న ఈ మహిమాన్వితమైన మెట్లపై కాలు పెట్టడానికి దీక్షాధారులు మాత్రమే అర్హులు ! ఇతరులు ఈ మెట్లపై నుండి కాకుండా మరో ప్రక్కగా వున్న మార్గాన వెళ్లి స్వామిని దర్శించుకుంటారు.
పడిపూజ:
ఈ మెట్లకు రోజు వాటి పవిత్రత చెదరకుండా వుండటానికి ప్రధాన తంత్రి పూజారులు షోడశోపచారాలతో పూజలు నిర్వర్తిస్తూ వుంటారు ! ఇందువల్ల పొరబాటున దీక్ష స్వీకరించని వాళ్లు ఎవరైనా పాదాలు మోపడం జరిగితే అందువల్ల జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం జరిగి వాటి పవిత్రత తరిగిపోకుండా ఉంటుంది !
మెట్లు ఎక్కటం:
మెట్ల మొదట్లో ఒక ప్రక్క స్వామి మిత్రుడైన కరప్ప స్వామి , మరోప్రక్క కడుత్తన్ స్వామి విగ్రహాలు ఉంటాయి ! వాటికి కొబ్బరికాయలు కొట్టి నమస్కరించి దీక్షాధారులు ఇరుముడి తలమీద జాగ్రత్తగా పెట్టుకుని ఒక్కొక్క మెట్టుగా ఎక్కడం ప్రారంభిస్తారు ! మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి చొప్పున కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్య , ఈర్ష్య , దంబం లనే అష్టరాగాలను మొదటి ఎనిమిది మెట్లు ఎక్కుతూ వాటిని విడిచిపెడుతున్నట్లు స్వామికి మానసికంగా చెప్పుకోవాలి ! మెట్లు యొక్క దేవతకు నమస్కరించుకోవాలి ! తరువాతి ఐదు మెట్లు ఎక్కేటప్పుడు వరసగా నాలుకతో పలికిన తప్పులను కళ్లతో చూసిన చెడును , చెవులతో విన్న పాపపు మాటలను , చేతులతో కాళ్ళతో చేసిన పాపాలను (పంచేంద్రియాలవల్ల జరిగిన అపరాధాలను) మన్నించమని ప్రార్థిస్తూ దేవతలకు నమస్కరిస్తూ ఎక్కాలి ! తరువాత మూడు మెట్లమీద వరసగా సత్వగుణాన్ని వృద్ధి చేయమనీ , రజో , తమో గుణాలను అణివేయమనీ ప్రార్థిస్తూ పైకెక్కాలి ! చివరగా వున్న రెండు మెట్లలో పదిహేడవ మెట్టుమీద అవిద్యవల్ల వచ్చే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పద్ధెనిమిదవ మెట్టు మీద నిలబడి జ్ఞానాన్ని ప్రసాదించే సద్విద్య ప్రసాదించమని నమస్కరిస్తూ స్వామి సన్నిధానాన్ని చేరుకోవాలి ! ఈ విధంగా అష్టరాగాలను , పంచతత్వాల చేత జరిగే పాపాలను , త్రిగుణాలను విద్య , అవిద్యలనే వాటిని మొత్తం పద్దెనిమిదింటిని పద్ధెనిమిది మెట్లమీద అదుపు చేసి పరిశుద్ధాత్మలతో మెట్ల మార్గాన సన్నిధానాన్ని చేరుకుంటారు దీక్షాధారులైన భక్తులు. (ప్రారంభంలో దీక్షాధారులు మెట్లు కొక్కటి చొప్పున కొబ్బరికాయలు కొడుతుండేవారు ! ఆ విధంగా చేయడంవల్ల రాతి మెట్లు శిథిలమవుతుండటం గమనించి కొబ్బరికాయలు కొట్టకూడదని నియమం ఏర్పర్చటం , మెట్లకు రక్షణగా పంచలోహపు తొడుగులను (తాంత్రిక పూజాదులతో శక్తివంతం చేసినవి) ప్రధాన తంత్రుల సహాయంతో రాతిమెట్లకు అమర్చడం జరిగింది. 1985 ప్రాంతంలో) ఇప్పుడు లోహపు తొడుగుతో బంగారంలా మెరుస్తున్న పద్ధెనిమిది మెట్లను ఎక్కి స్వామి సన్నిధిని చేరుకుంటారు దీక్షాధారులు !
మూల విగ్రహం:
మెట్లు ఎక్కగానే ముందుగా ద్వజస్తంభం కనిపిస్తుంది! ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తుంటే గణపతి , నాగరాజుల చిన్న గుడులు కనిపిస్తాయి ! వాటికి నమస్కరించి అయ్యప్పస్వామి మూల విగ్రహం ను దర్శించుకుంటారు ! మణికంఠుని మూల విగ్రహం సుమారు 18 అంగుళాల ఎత్తులో , పంచలోహ మూర్తిగా , చిన్ముద్రా , అభయముద్రలతో పట్టబంధముతో పీఠంపై ఆసీనమై దర్శనమిస్తుంది ! అత్యంత మనోహరము , శక్తివంతమూ అయిన మూల విగ్రహాన్ని చూస్తూ భక్త్యావేశంతో పరవశించిపోతారు దీక్షాధారులు . మరొకదారినుండి వచ్చి దర్శించుకున్న ఇతర భక్తజనులు ! ఈ విగ్రహానికే అన్ని రకాల అభిషేకాలు , పూజలు జరుగుతుంటాయి.
ఆ దివ్యమంగళ స్వరూపుడు, భక్తుల పాలిట సులభ సాద్యుడు , అభయ ప్రదాయకుడు , ఆ శాస్తా రూపం లో ఇమిడి ఉన్న అయ్యప్పస్వామిని కన్నుల కరువు తీరా దర్శించి పడమర దిక్కునుంచి క్రిందికి దిగి వస్తారు భక్తులు ! అయ్యప్పస్వామిని దర్శించి ప్రశాంతత నిండిన హృదయాలతో భక్తులు మాలికాపురత్తమ్మ గుడిని చేరుకుంటారు (ఇప్పుడు రెండు గుడుల మధ్య వంతెన కట్టబడి వున్నది)
మాలికాపురత్తమ్మ ఆలయం
మణికంఠుని చేత దైవత్వాన్ని పొందిన మహిషి , మంజల్ మాతా పేరిట , దేవీ శక్తిగా లోకపావని అని పిలువబడుతూ ఇక్కడ కొలువై వున్నది ! మాలికాపురత్తమ్మగా భక్తులను కాపాడుతూ , వారి కోర్కెలను తీర్చ వలసిందిగా అయ్యప్ప చెప్పిన ప్రకారం తనను దర్శించేవారికి శుభాలు ప్రసాదిస్తుంది మాలికాపురత్తమ్మ ! ఈమెను దర్శించుకుని రవిక గుడ్డలు , పసుపు , కుంకుమలు సమర్పిస్తారు ! అమ్మవారికి సమర్పించిన రవిక గుడ్డలు ఋతుక్రమం సమయంలో స్త్రీలు వాడరాదు. పెళ్లికాని కన్యలు , మంచి భర్తకై ప్ర్రార్థించి , శబరిమల వెళ్ళు భక్తుల ఇరుముడులో తమ స్వహస్తాలతో వేసి , తమ కోర్కును వారు ఆ దేవాది దేవుడి కి చెప్పుకుంటారు. ఇరుముడిలో సమర్పిస్తారు. అమ్మను దర్శించుకున్న భక్తులు , ఆ రవికలు అమ్మకు ఇచ్చి పూజ చేయించి , తీసుకుని వచ్చి ఆ కన్యలకు ఇస్తారు. వారు రవికెలు కుట్టించుకుంటారు ! ఆ తల్లి తన వివాహ కోర్కెను , వీరికి వివాహ ప్రాప్తిని కలిగించి , వరం ప్రసాదించి తృప్తి పడుతుంది. ఇక్కడ టెంకాయలు కొట్టరు ! ఇరుముడి లోని ఆ కాయను , దొర్లించి గుడిలో వదిలేస్తారు ! పేలాలు , అటుకులు జల్లుతూ ప్రదక్షిణలు చేస్తారు ! ఏడాదికి ఒకమారు , అమ్మ , - అయ్యప్ప చెప్పిన మాటపై కోలాహలంగా, శరంగుత్తి వచ్చి చూస్తుంది. అక్కడి కన్నిస్వాములు విడిచిన శరములను చూచి,ఈ సంవత్సరం కూడా కన్నిస్వాములు వచ్చినట్లు గ్రహించి ప్రతి సంవత్సరంలా నిరుత్సాహం చెందుతూ ఉంటుంది మాలికాపురత్తమ్మ ! (కన్నిస్వాములు రాని సంవత్సరం , ఆమెను వివాహం చేసుకుంటానని మణికంఠస్వామి చెప్పారు) అందువల్ల ఆ విధంగా జరగటానికి అవకాశం లేకుండా ప్రతి సంవత్సరం కన్నిస్వాముల సంఖ్య ఎక్కువవుతూనే వుంటున్నది.
మాలికాపురత్తమ్మ ఆలయం దర్శించిన తర్వాత గణపతి ఆలయం, నాగరాజు - నాగయక్షిణిల ఆలయాలను దర్శించుతారు ! ఇక్కడ పూజలు చేసి , నాగులమీద పాటలు పాడతారు ! ఆ విధముగా చేయడంవల్ల సర్వ సర్పదోషాలు , జాతక రీత్యా సంభవించు కష్ట నష్టాలు , తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పిదప మధ్యలో వచ్చే, అయ్యప్ప మిత్రుల ఆలయాలను కూడా దర్శిస్తారు !
భస్మకొలను
ప్రస్తుతం ఈ కోనేరు స్వామి గుడి వెనుక భస్మకొలను పేరిటనున్నది. ఇందులో భక్తులు స్నానం ఆచరించి , తడిబట్టలతో , స్వామి ఆలయమునకు , పొర్లు దండాలు చేస్తారు. బసకు తిరిగి వెళతారు
ఇరుముడి విప్పటం:
మండల దీక్ష , యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని , ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని ఎంతో తృప్తినిండిన హృదయాలతో ఇరుముడలను , గురుస్వాములకు అప్పగిస్తారు దీక్షాధారులు ! గురుస్వామి ఇరుముడులను విప్పి పూజా సామగ్రిని వేరుచేస్తారు ! ముందుగా ముద్ర కాయను పగులగొట్టి అందులోని నేతిని వేరుగా ఒక పాత్రలోకి వేస్తారు ! ఈ నేతి పాత్రతో , గంధం , పంచామృతాలు, విభూది వేరు వేరు పాత్రలలో తీసుకుని దీక్షాధారులు తిరిగి అయ్యప్ప గుడికి వెళ్లి స్వామికి నెయ్యాభిషేకం చేయించి, ఆ నేతిని ప్రసాదంగా స్వీకరించి తమ వెంట తీసుకువెళతారు ! స్వామికి అభిషేకం చేసిన ఈ నెయ్యి పరమ పవిత్రమైనది ! సర్వరోగ నివారిణి ! దీర్ఘరోగాలతో భాధపడేవారు , ఈ నెయ్యిని కొద్దిగా సేవించటం వల్ల సత్వరంగా ఉపశమనం లభిస్తుంది ! ప్రసాదపు నెయ్యిని జాగ్రత్తగా ఇళ్ళకు తీసుకువెళతారు. అభిషేకానంతరం పూజా ద్రవ్యాలను , గంధం , కొబ్బరికాయలను సమర్పించుతారు ! ముద్ర కాయ కొబ్బరి చిప్పలు గుడి ముందున్న హోమ గుండంలో వేస్తారు. గణపతి హోమంలో వేసిన కొన్నిటిని ప్రసాదంగా తీసుకుంటారు. తరువాత విభూదిని పళ్లెంలో వేసుకుని , కర్పూర హారతి చూపి , భస్మం ఇతరభక్తులమీద జల్లుతూ అమ్మవారి గుడిని చేరి , ఇరుముడిలో నుండి వేరు చేసిన రవిక గుడ్డలు , పూజాద్రవ్యాలు సమర్పించి తిరిగి రవిక గుడ్డలు ప్రసాదంగా తీసుకొని వస్తారు ! ఇరుముడిలో కట్టి తెచ్చిన మిరియాలను వావరు స్వామి గుడిలో సమర్పిస్తారు ! ఇరుముడి తలమీద పెట్టుకుని స్వామిని దర్శించటం , తిరిగి దానిని విప్పి తెచ్చిన నెయ్యి , ఇతర పూజా ద్రవ్యాలు స్వామికి సమర్పించి ప్రసాదాల తో తిరుగుప్రయాణం కోసం భద్రపరచుకోవడం పూర్తయిన తర్వాత సాయంత్రం మకర జ్యోతి దర్శనం కోసం ఆత్రంగా ఎదురుచూడటం మొదలౌతుంది ! స్వామివారి ఆభరణాలు కూడా ఆ రోజు సాయంత్రానికే సన్నిధానం చేరుకుంటాయి !
స్వామివారి ఆభరణాలు:
స్వామి రాకుమారుడుగా ధరించిన ఆభరణాలను పందల రాజు , స్వామి తండ్రి అయిన రాజశేఖరుని విన్నపాన్ని అంగీకరించి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతినాడు వాటిని స్వామి విగ్రహానికి అలంకరించడం జరుగుతున్నది ! ఆ ఆభరణాలు వుంచిన మూడు పెట్టెలు పంబల రాజవంశీయుల అధీనంలో ఉంటాయి ! మకర సంక్రాంతినాడు పెట్టెలను ఉత్సవంగా మేళతాళాలతో తలమీద వుంచుకుని బయలుదేరుతారు. ప్రస్తుత రాజవంశం రాజు , అప్పుడు స్వయంగా , అయ్యప్ప ఇచ్చిన కరవాలంతో నగల తో పాటు వస్తారు. ఆ సమయం లోనే ఆకాశమార్గాన పెద్ద గరుడ పక్షి ఎగురుతూ, పెట్టెలకు రక్షణగా , శబరిమల దాకా వచ్చి ఆలయం పై ప్రదక్షణాలు చేసి వెళ్ళి పోతుంది. శబరిమలమీద వున్న భక్తులకు ఆ పక్షి కనబడుతుంటుంది. దాన్ని చూసి ఆభరణాల పెట్టెలు బయలుదేరాయని గ్రహిస్తారు భక్తజనం !
అయ్యప్ప దీక్ష విరమణ
తిరిగి తమ ఊర్లకు చేరుకున్న తరువాత ఇరుముడిలో కట్టి తెచ్చిన బియ్యంతో పొంగలి తయారుచేసి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ! తరువాత ముందుగా మాల వేయించుకున్న గుడికి వెళ్లి గురు స్వాములను దర్శించుకుంటారు మాలధారులు ! గురుస్వామి మంత్రపూర్వకంగా వారి మెడలనుండి మాల తీసివేయడంతో దీక్ష విరమణ జరుగుతుంది !
అయ్యప్ప మాలావిసర్జన మంత్రం
"అపూర్వమచలా రోగాద్దివ్య దర్శన కారణః
శాస్త్రుముద్రాత్ మహదేవ దేహిమే
వ్రత విమోచన సమస్త సలీద రక్షకన
శరణమయ్యప్ప స్వామియే శరణం " పై మంత్రాన్ని చెప్పిస్తూ మాలను తీయిస్తారు గురుస్వామి ! ఆయనకు కృతజ్ఞతా పూర్వకంగా దక్షిణ తాంబూలాలు సమర్పించి ఇండ్లకు చేరుకుంటారు దీక్ష తీసుకుని యాత్ర చేసుకువచ్చిన భక్తులు !
దీక్షవస్త్రాల పవిత్రత
యాత్రలో ఎన్నో తీర్థాలలో మునిగి, కాలినడకన వెళ్ళేటప్పుడు ఆ ప్రాంత ధూళి సోకి పునీతవౌతాయి దీక్షాధారులు ధరించే వస్త్రాలు ! వాటిని ధరించి స్వామి దర్శనం చేయడంవల్ల వాటికి మరింత పవిత్రత చేకూరుతుంది ! అందుచేత ఇండ్లకు చేరుకోగానే ముందుగా ఆ వస్త్రాలను విప్పి ఒక పాత్రలో తడిపి , ఆ తడిపిన నీటిని ఇల్లంతా ప్రోక్షించాలి ! తరువాత వస్త్రాలను శుభ్రంగా వుతికి , ఆరిన తరువాత శుభ్రమైన స్థానంలో భద్రపరచుకుని తిరిగి యాత్రకు మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పుడు వాడుకోవచ్చును ! ఈ వస్త్రదారణవల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ! మనోధైర్యం పెరుగుతుంది ! దీక్షాకాలంలో వాడుకున్న చాప , దుప్పట్లను దీర్ఘరోగాలతో బాధ పడుతున్న వారికి దానం చేయవచ్చును ! మాలలు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇతరులకు ఇవ్వకుండా ! మరు సంవత్సరం వాటినే ధరించాలి ! దీక్షకాలంలో చేసే నియమాలు వచ్చే పుణ్యఫలమంతా మాలలోనే విలీనమై వుంటుంది ! ‘‘శబరిమల అయ్యప్పను ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకోవడానికి వీలుకాదు ! ఆలయం కొన్ని ప్రత్యేక కాలాలలోనే తెరిచి వుంటుంది !
ఆలయం తెరిచి వుంచే రోజులు
- ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు ఆలయం తెరిచి ఉంచుతారు ! ఈ కాలాన్ని మండల పూజాకాలం అంటారు.
- జనవరి 1 నుండి 20వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో దేశ విదేశాల నుండి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. మకరజ్యోతి , మకర విళక్కు (దీపం) ఉత్సవాలు చూడటానికి !
- మలయాళ పంచాంగం ప్రకారం ప్రతి నెలా మొదటి ఐదు రోజులు ఆలయం తెరిచి వుంటుంది !
- అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పంచమి , ఉత్తరా నక్షత్రంతో కూడిన పర్వదినం ! మార్చి ఆఖరు - ఏప్రిల్ మొదటివారంలో వచ్చే ఈ రోజున ‘ఫాల్గుణి ఉత్తర’ పూజ అని స్వామివారికి జన్మనక్షత్ర విశేష పూజలు జరుగుతాయి !
- విషు మహోత్సవం: మలయాళీయుల కొత్త సంవత్సరాదిని *‘విషు* ’ అని అంటారు ! ఈ రోజు కేరళ రాష్టమ్రంతటా అయ్యప్పస్వామి వారిని గుడులలో పండ్లు , పూలు , ధాన్యాలతో అలంకరిస్తారు.