Swamy Ayyappa |
స్వామి అయ్యప్ప చరితం | పదిహేనవ భాగం
వాళ్లను చిరునవ్వుతో పలకరించి తీర్థ , ప్రసాదాలు ఇచ్చారు అర్చక తాంత్రులు ! ‘‘భక్తులారా ! స్వామిని మీరీవిధంగా రోజూ దర్శించుకోవచ్చును ! మీరు తనివితీరా దర్శించుకుని మీ నివాసాలకు తిరిగి వెళ్లి మీ గృహాలలో స్వామి రూపాలను చిత్రపటాలుగా గానీ , విగ్రహాలుగా గానీ పవిత్రమైన స్థలంలో వుంచుకుని పూజించుకోండి !’’ అంటూ వాళ్లకు చిత్ర పటాలు , విగ్రహాలు ఇచ్చారు!
‘‘రాజా ! పరశురాములవారు , అగస్త్య మహర్షి మీ అందరికోసం ఈ పటాలను , విగ్రహాలను ఇచ్చి వెళ్లారు ! స్వామికి రోజూ పూజార్చనలు చేసుకోండి ! మీకు మనస్సు కలిగినప్పుడు వచ్చి ఈ శబరిగిరి క్షేత్రంలో స్వామిని దర్శించుకోండి ! మీకు పూజా విధానం తెలియజేస్తాము ! మీరు మీ రాజ్యానికి తిరిగి వెళ్లి అక్కడ కూడా స్వామికి ఆలయం నిర్మింపజేయండి నిపుణులైన శిల్పులతో ! స్వామి విగ్రహ ప్రతిష్ఠ మేము కావించుతాము !’’ అంటూ ప్రధాన తాంత్రి చెప్పినది విని ‘‘తప్పకుండా అట్లాగే చేస్తాను ! అర్చకస్వాములారా ! నాదొక విన్నపం ! మణికంఠుడు మా కన్నుల వెలుగు రాజకుమారునిగా అమూల్యమైన ఆభరణాలు ధరించి ఆనందాన్ని పంచిన రోజులు ఇంకా మా కళ్లముందు కదలాడుతూనే వున్నాయి ! పులిపాల కోసం అరణ్యానికి బయలుదేరినప్పుడు ఆ ఆభరణాలు తీసివేసి నార బట్టలు ధరించి వెళ్లాడు ! ఆ నగలు రాజభవనంలో జాగ్రత్త చేయబడి వున్నాయి ! వాటిని స్వామి విగ్రహానికి అలంకరింప జేయాలని ఆశిస్తున్నాను !’’ అన్నాడు ప్రార్థన పూర్వకంగా నమస్కరించి !
‘‘తప్పకుండా ! ప్రతి సంవత్సరం మకరజ్యోతిగా స్వామి దర్శనమిచ్చే సమయంలో మీరు ఆ ఆభరణాలను స్వయంగా తీసుకుని వచ్చి మాకందిస్తే వాటిని విగ్రహనికి అలంకరిస్తాము ! మీరు తృప్తితీరా చూడవచ్చును ! తిరిగి వాటిని మర్నాడు తీసుకువెళ్లి మీ రక్షణలో వుంచి మరు సంవత్సరం తిరిగి తీసుకుని రావాలి ! ప్రతి రోజూ విగ్రహానికి స్వామి స్వయంగా వ్యక్తమైనపుడు వుండిన ఆభరణాలు మాత్రమే అలంకరింపజేయడం జరుగుతుంది’’ అని వాళ్ళు చెప్పింది విని తృప్తిగా నిశ్వసించాడు రాజు !
‘‘శౌనకాది మునులారా ! ఆ విధంగా అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ! ప్రధాన తంత్రుల ద్వారా స్వామి పూజా విధానం సామాన్యజనులు నేర్చుకుని వ్యాప్తి కావించారు. పందళ రాజ్యంలోనూ, చుట్టుప్రక్కల క్రమంగా ఆలయాలు వెలసి స్వామి విగ్రహ ప్రతిష్ఠలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ! ఇండ్లలో తమ ప్రాంతాలలోని గుడులలో స్వామి అర్చించుకుంటున్నా శబరిగిరి మీది స్వామిని దర్శించుకోవడంలో లభించే ఆనందం, తృప్తి వర్ణనాతీతమైవని గ్రహించారు పందళ ప్రజలు ! అందుకే శబరిగిరి కి ప్రయాణమవాలని ఉబలాటపడేవారు ! మెట్లెక్కి వెళ్లి స్వామి సన్నిధానం చేరాలన్న ఆశే అందరిలో ! అది గమనించి ప్రధాన తాంత్రులు (మేల్శాంతి) వారి ఆశ నెరవేరడానికి అయ్యప్ప స్వామి నిర్దేశించిన దీక్షావిధి, నియమాలు పాటించవలసి వుంటుందనీ, అప్పుడే ఆ స్వామిని మెట్లెక్కి వెళ్లి దర్శించే అర్హత కలుగుతుందని చెప్పడంతో అందరూ భక్తివిశ్వాసాలకు, ఉత్సాహం తోడుకాగా ప్రధాన తంత్రులనుండి ఆ విధుల గూర్చి ఉపదేశం పొంది ఆ ప్రకారం ఆచరించి స్వామిని పద్దెనిమిది మెట్లెక్కి వెళ్లి దర్శించుకుని జీవితాలు ధన్యం కావించుకునేవారు ! ఇహపర సౌఖ్యాలు ప్రసాదించి మెల్లగా చూసేవాడు అయ్యప్ప.
పంబళ రాజు రాజశేఖరుడు మరు సంవత్సరం మణికంఠుని ఆభరణాలను ఉత్సవంగా మకర జ్యోతిగా దర్శనమిచ్చే రోజున శబరిగిరికి తీసుకువెళ్లి ప్రధాన తంత్రులు వాటిని స్వామి మూల విగ్రహానికి ధరింపజేయడం కన్నుల కరువు తీరా చూసి పులకించిపోతాడు ! ఆయనకు జీవితంలో ఇక కావలసినదేమీ లేదనిపించింది ! తనకు తిరిగి జన్మ లేకుండా స్వామిలో లీనమై మోక్షాన్ని పొందాలని తహతహలాడాడు ! స్వామికి మొరపెట్టుకున్నాడు !
‘‘ఆర్తితో నీవు నన్ను మోక్షప్రాప్తిని అనుగ్రహించమని కోరుతున్నావు ! రాజా ! నీవు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ! ఇకపై ప్రతి సంవత్సరం నీ వంశీయులు నా ఆభరణాలను మకర సంక్రమణం రోజున తీసుకురావడం , వాటిని నా విగ్రహానికి ధరింపజేయడం జరుగుతుంది ! నీ పేరు భూమిపై చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అని స్వామి విగ్రహం నుండి పలుకులు వినరావడంతో ‘‘ధన్యుడిని స్వామి ధన్యుడిని ! అయ్యప్ప స్వామి ! నీ పాదాలే భక్తులందరికీ ఆశ్రయమిచ్చి కాపాడాలి ! స్వామి శరణం ! అయ్యప్ప శరణం !’’ అని భక్తి పారవశ్యంతో భజిస్తూ వుండగా , ఆయనలోనుండి జీవాత్మ జ్యోతిరూపంలో వెలువడి పరమాత్మలో లీనమైంది ! రాజశేఖరుడికి మోక్షప్రాప్తి లభించింది ! అంటూ చెప్పటం ఆపారు సూతమహర్షి ! ‘‘మహర్షి ! మీ నోట అయ్యప్పస్వామి దివ్యచరితాన్ని విని ధన్యులమైనాము ! దుష్టశిక్షణ , శిష్టరక్షణ అవతార లక్ష్యాలుగా హరిహర పుత్రునిగా జన్మించిన మణికంఠుడు అయ్యప్పస్వామిగా శబరిగిరిమీద వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యచరితాన్ని ఎన్నిసార్లు విన్నా తనివితీరదినిపిస్తున్నది ! శబరిగిరి దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి ఆచరించవలసిన దీక్షా విధులగూర్చి గూడా వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అంటూ అందరూ ముక్తకంఠాలతో ప్రార్థించారు.
అలా వారు అడుగుతున్న తీరు చూసి ‘‘తప్పకుండా చెబుతాను ! అయ్యప్పస్వామి దివ్య చరితంతోపాటు ఆ స్వామి భక్తులకోసం ఏర్పరిచిన దీక్షా నియమాలను గూర్చి తెలుసుకోవడంవల్ల అయ్యప్పస్వామి అనుగ్రహంతో సర్వాభీష్టాలు నెరవేరి శాంతితో సన్మార్గంలో జీవించి స్వామి సన్నిధిని చేరుకుంటారు ! ఏదీ అందరూ ముక్తకంఠాలతో ముందుగా గురుమూర్తి అయిన అయ్యప్పస్వామిని స్తుతించండి !’’ అన్నారు. ‘‘పరమ పావనం స్వామి విశ్వ విశృతం వరగుణప్రదం స్వామి భక్తపాలకం గిరిగుహాప్రియం స్వామి నిత్య నిర్మలం హరహరాత్మజం స్వామి దేవ మాశ్రయేత్ !’’* అని అందరూ భక్తి పూర్వకంగా భజన చేస్తుంటే ఆ ప్రాంతమంతా భక్తిపూరిత ప్రశాంత వాతావరణంతో విలసిల్లింది !
ఆరవ అధ్యాయం
దీక్ష - వ్రత నియమాలు గురు ప్రార్థన:
‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్ద్రేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మా
తస్మై శ్రీగురవే నమః’’
అంటూ గురు పరంపరకు మూలపురుషుడు , త్రిమూర్త్యాత్మకుడు అయిన దత్తాత్రేయస్వామికి ముందుగా నమస్కరించారు సూత మహర్షి ! ముని ముఖ్యులను కూడా స్మరించారు.
‘‘జ్ఞాన విజ్ఞాన సిద్ధర్థ్యం భజేహం నారదమునిం
వ్యాసం వాల్మీకి వౌనీంద్రం వశిష్టం బ్రహ్మవాదినమ్!
సర్వశాస్త్రార్థ యోగ్యార్థం సర్వగ్రంథి విభేదనమ్
బ్రహ్మ విష్ణు శివం మూర్తింగురు రూపముపాస్మహే’’ అంటూ స్తుతించి చెప్పసాగారు.
సద్గురువు ఆవశ్యకత
పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లడానికి గురువు అనుజ్ఞ , దీక్ష , నియమాలు ఆవశ్యకం కావు ! కాని అయ్యప్పస్వామి దర్శనానికి ఆయన ఎక్కి వెళ్లిన పద్ధెనిమిది మెట్లమీద నుండి ఎక్కి వెళ్లడానికి మాత్రం గురువు , వ్రతదీక్ష , మాలధారణ మొదలైనవి తప్పక అవసరమౌతాయి.
గురువులలో చదువు నేర్పే గురువులు కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సద్గురువుల వల్ల పొందే మంత్రోపదేశం అయ్యప్పస్వామి వ్రతదీక్షకులకు సత్ఫలితాలనిస్తుంది ! ప్రధాన అర్చకుల నుండి మంత్రోపదేశం పొంది దీక్ష స్వీకరించి మెట్లెక్కి వెళ్లి స్వామి దర్శనం చేయటంవల్ల ఆ మనిషిలో దైవభక్తి , ఆధ్యాత్మికచింతన పెంపొందుతాయి ! సద్గుణాలు అలవడతాయి ! రాగద్వేషాలు విడిచిపెట్టి , అహంకారం, ఆడంబరం లేకుండా అందరిపట్ల దయాభావంతో సమానతలు దృక్పథంతో చూడగలుగుతారు. భగవంతుడే పరబ్రహ్మ ! ఆ పరబ్రహ్మను చేరడానికి సద్గురువు ఉపదేశం పొందడమే మార్గం అన్న వివేచన కలుగుతుంది ! అప్పయ్యస్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించే అర్చకస్వాములు, పది సంవత్సరాలు వరుసగా దీక్ష స్వీకరించి పద్ధెనిమిది మెట్లక్కి స్వామి దర్శనం చేసుకువచ్చిన గురుస్వాములు ఇతరులకు దీక్ష ఇవ్వడానికి అర్హతను కలిగి వుంటారు ! వీరు మానసిక పరిపక్వత కలిగిన పరబ్రహ్మతత్వాన్ని ఆకళింపు చేసుకుని వుండగలరు !
మాలధారణ
దీక్ష స్వీకరించాలని సంకల్పం చేసుకున్నవాళ్ళు ముందురోజు తాము ఎంచుకున్న గురుస్వామివారిని దర్శించి తమకు దీక్ష ఇవ్వవలసిందిగా ప్రార్థించాలి ! ఆ సద్గురువు ఆశీర్వాదం చేసి మాలను ధరింపజేయడానికి అంగీకరించి స్థల నిర్ణయం చేస్తారు .
స్థల నిర్ణయం:
గురువు ఆశ్రమము , ఇంట్లో పవిత్రంగా , ప్రత్యేకంగా వుంచుకునే పూజాగృహం , అయ్యప్పస్వామి దేవాలయం , ఇతర దేవీ దేవతల దేవాలయాలు దీక్షాస్వీకారానికి అనుకూలమైనవి !
కాలవ్యవధి:
వృశ్చిక మాసం (వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించే నెల రోజులు) మొదటి రోజునుండి 41 రోజుల కాలాన్ని మండల కాలంగా వ్యవహరిస్తారు ! ఈ 41 రోజులు దీక్షాకాలం వ్రతకాలాన్ని పరమ పవిత్రంగా గడపాలి !
దీక్ష స్వీకారం:
ముందు రోజు గురుస్వామిని కలుసుకుని ఆయన చెప్పిన స్థలానికి (సాధారణంగా అయ్యప్పస్వామి గుడిలో దీక్ష ఇచ్చి మాలధారణ జరుపుతారు) పగటిపూట గుడి మూయడానికి పూర్వం గురుస్వామి నిర్ణయించిన సమయానికి చేరుకోవాలి ! ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని చల్లని నీటితో తలస్నానం ఆచరించి శుభ్ర వస్త్రాలు ధరించాలి ! దీక్ష స్వీకరించేవారు నల్లనిరంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి !
అయ్యప్ప నల్లరంగు వస్తధ్రారణ ఆంతర్యం:
తెలుపు , ఎరుపు , పసుపు రంగుల కలయికవల్ల నల్లరంగు ఏర్పడుతుంది ! వీటిలో సత్వగుణానికి తెలుపు రంగు , రజోగుణానికి ఎరుపు రంగు , తమోగుణానికి పసుపు రంగు ప్రతీకలు ! ఈ మూడు రంగుల కలయికతో ఏర్పడే నల్లని వస్త్రాలను ధరించటం వల్ల మనిషిలోని ఈ మూడు గుణాలను తగిన రీతిలో అదుపులో ఉంచుకోవాలని నలుపు రంగు గుర్తుచేస్తుంటుంది. నల్ల రంగు వస్త్రాలను ధరించి నుదుట విభూది , చందనము , కుంకుమ బొట్టు పెట్టుకోవాలి.
మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు:
నలుపు , కావి , నీలిరంగు దుస్తులు రెండేసి జతలు , తులసి , రుద్రాక్షమాలలు 108 సంఖ్యగలవి రెండు మాలలు తీసుకోవాలి !
పూజాద్రవ్యాలు
కంకుమ , విభూది , చందనం , అరటిపండ్లు , కొబ్బరికాయ , ఆవు నెయ్యి , దీపారాధాన వస్తువులు , పుష్పాలు మొదలైనవి తీసుకుని గుడిలో గురుస్వామి వారిని కలుసుకోవాలి ! గురుస్వామి వారు దేవాలయాలలో పూజ జరిపి మెడలో మాలలు వేసి చెవిలో అయ్యప్పస్వామి మంత్రం ఉపదేశించి దీక్ష ఇవ్వటం జరుగుతుంది !
మాలాధారణ మంత్రం:
మాలను ధరింపజేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠింపచేస్తారు గురుస్వామి !
‘‘జ్ఞానముద్రాం , శాస్తమ్రుద్రాం ,గురుముద్రాం నమామ్యహంవనముద్రాం , శ్రద్ధాముద్రాం ,రుద్రముద్రాం , నమామ్యహం ,శాంతముద్రాం , సత్యముద్రాం ,వ్రతముద్రాం నమామ్యహంశబర్యాశ్రమ సత్యేన ముద్రాంపాతు సదాపిమే గురు దక్షిణాయా ,పూర్వ తస్మానుగ్రహకారిణే శరణాగతముద్రాఖ్యం ,తన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం ఖేచరీముద్రాం ,భద్రముద్రాం నమామ్యహం శబర్యాచలముద్రాయై ,నమస్త్భ్యుం నమో నమః‘ఓం స్వామియే శరణం అయ్యప్ప’
అంటూ దీక్ష ముద్ర వున్న మాలను ధరింపజేస్తారు గురుస్వామి ! మండల దీక్షా స్వీకారానికి ఆశీర్వాదం , ఆమోదం తెలియజేస్తారు ! దీక్ష ముద్ర మాలను ధరించినవారు అప్పటినుండి మండలకాలంలో ఎంతో పవిత్రంగా , నియమ నిష్ఠలతో గడపవలసి వుంటుంది!
అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వాముల దినచర్య
- ఉదయం: బ్రాహ్మముహూర్తంలో (తెల్లవారు జామున గం.3.30) లేచి సూర్యోదయానికి ముందుగానే కాలకృత్యాలు పూర్తిచేసి , చల్లనీళ్ళతో తలస్నానం ఆచరించాలి ! శుభ్రమైన నల్లని వస్త్రాలు ధరించి నుదుట విభూతి , చందనము , కుంకుమ బొట్లు ధరించాలి ! మెడలో వున్న మాలలోని ముద్రకు కూడా విభూది , కుంకుమ , చందనము అద్ది కళ్లకద్దుకోవాలి ! సూర్యునికి నమస్కరించి పూజ గదిలోకి ప్రవేశించాలి ! పూజాగృహంలో అయ్యప్పస్వామి చిత్రపటాన్ని మధ్యలో అమర్చిన పీఠంమీద అరిటాకు వేసి , దానిమీద వుంచి చందనపు బొట్టు పెట్టి , కుంకుమ అద్ది పూలమాలలతో అలంకరించి రెండు వైపులా దీపపు కుందులు వుంచి దీపారాధన చేయాలి ! స్వామిని షోడశోపచారాలతో పూజించాలి ! నైవేద్యంగా అరటిపండ్లు , బెల్లం , అటుకులు మొదలైనవి సమర్పించి హారతి చూపుతూ 108 నామాల శరణు ఘోష చదివి , సాష్టాంగ నమస్కారాలు చేయాలి ! మెడలోని ముద్రమాలకు హారతి చూపించాలి ! పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత దేవాలయానికి వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేసుకుని ఇంటికివచ్చి పాలు , పండ్లు స్వీకరించాలి . ( వయసు , ఆరోగ్యరీత్యా ) అల్పాహారం (భిక్ష) స్వీకరించవచ్చు !
- మధ్యాహ్నం: రోజువారీ పనులు చేసుకుని మధ్యాహ్నం తిరిగి స్నానం చేసి సద్ది (భోజనం) స్వీకరించాలి !
- సాయంత్రం: సూర్యాస్తమయం తర్వాత తిరిగి స్నానం చేసి పూజ చేయాలి. ఉదయం చేసిన విధంగానే ! స్వామికి భజన ప్రీతికరం ! అందుచేత రాత్రి కొంతసేపు భజన నిర్వర్తించాలి ! ఆపైన దేవాలయాన్ని , గురుస్వామిని దర్శించి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి అల్పాహారం స్వీకరించాలి !
- రాత్రి: నిద్రించడానికి కొత్తచాప , దుప్పటి నేలపై పరుచుకుని నిద్రించాలి ! ఈ విధమైన దినచర్యను మండల కాలంలో పాటించాలి !
ఆహార నియమాలు:
దీక్ష స్వీకరించిన స్వాములు ఆహార నియమాలను సక్రమంగాపాటించవలసి వుంటుంది ! వారికి ఆహారం తయారుచేసేవారు స్నానం చేసి శుచిగా వంట చేయాలి ! సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి ! ఎక్కువగా తీపి , ఉప్పు , పులుపు , కారం , ఉల్లి , వెల్లుల్లి , మసాలా దినుసులు కలిపిన ఆహారాన్ని భుజించకూడదు ! అపరిశుభ్రమైన పదార్థాలు అకాలంలో , అమితంగా తినకూడదు !
*పానీయాలు: ఆహార పానీయాల విషయంలో శ్రద్ధ తీసుకుని , నిషిద్ధమైనవి స్వీకరించకుండా వుండటంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ! అప్పుడే మనస్సు ఆరోగ్యంగా ఉండి మండల దీక్ష పూర్తిచేయడానికి వీలు కలుగుతుంది !
అనారోగ్యకారణమైన మత్తు పదార్థాలతో కూడిన పానీయాలు త్రాగకూడదు ! సురాపానం చేయరాదు! ఆరోగ్యాన్ని కలిగించే పాలు , మజ్జిగ తేట , పండ్ల రసాలు త్రాగవచ్చును ! సరైన ఆహారంవలన దేహానికి శక్తి లభిస్తుంది ! మనస్సు ప్రశాంతంగా వుంటుంది ! నిద్ర సరిగా పడుతుంది ! దీక్షాకాలంలో సాత్వికాహారం స్వీకరించాలి ! అటుకులు , కాయగూరలు , అన్నం మధ్యాహ్నం వేళ స్వీకరించి , ఉదయం , రాత్రి కాలంలో పాలు , పండ్లు స్వీకరించాలి !
ఇతర దీక్షా నియమాలు
- దీక్ష స్వీకరించిన మొదట రోజూ మూడుసార్లు చన్నీటితో తలస్నానం ఆచరించాలి ! నుదుట విభూది , చందనం , కుంకుమధారణచేసి నల్లని వస్త్రాలు ధరించాలి !
- ఉదయ , సాయంకాల సమయాలలో దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేయాలి !
కర్మేంద్రియాలు:
- మాట్లాడే నాలుక, పనులు చేసే చేతులు, నడిపించే కాళ్లు, గుహ్యం (పురుషాంగం), గుదం (విసర్జన అంగం) అనబడే ఐదు కర్మేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని వాటి చేత మంచి పనులు చేయించడం దీక్షా నియమాల ముఖ్యోద్దేశం !
- నాలుక మాట్లాడటానికి సహకరించే కర్మేంద్రియం ! అట్లాగే రుచిని తెలిపే జ్ఞానేంద్రియం కూడా !
- దీక్షాకాలంలో నాలుకను అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం ! అందువల్ల మాటల చేత , తినడం చేత జరిగే తప్పులను , పొరబాట్లను అరికట్టడం జరుగుతుంది !
- కోపాన్ని విడిచి , శాంతంగా వుండాలి !
- వాక్కుకు సంబంధించి దీక్షాకాలంలో మితంగా \, మృదువుగా మాట్లాడటం అలవర్చుకోవాలి ! సత్యం మాట్లాడాలి ! సౌమ్యంగా , ఇతరులను సంతోషపెట్టేలా మాట్లాడాలి !
- అనవసరపు మాటలు , అబద్ధాలు చెప్పడం , ఇతరులను నొప్పించేలా మాట్లాడటం , వివాదాలు , తగవులుపడటం , ఇతరులను దూషించడం దీక్షాకాలంలో చేయకూడదు !
- భగవద్భక్తిని కలిగించే పుస్తకాలు , నీతి బోధకాలైన పుస్తకాలు చదవాలి !
- చేతులు మంచి కార్యాలు - దానధర్మాలు చేయడానికి , స్వామి పూజకు ఉపయోగపడాలి ! జీవహింస, దొంగతనాలు , ఇతరులను కొట్టడం వంటి పనులు దీక్షాకాలంలో చేయరాదు !
- పాదములు - దేవాలయాలను , పుణ్యక్షేత్రాలను దర్శించడానికి కాలినడకన (శక్తినిబట్టి) వెళ్లడం మంచిది !
- జూదగృహాలు , వేశ్యాగృహాలకు వెళ్లకూడదు !
- దీక్షాకాలంలో బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి !
- వేశ్యలతో సంపర్కం , బలాత్కరించడం మొదలైన విషయాల గూర్చి ఆలోచించకూడదు ! కోరికలను అదుపులో ఉంచుకుని ఆస్ఖలిత బ్రహ్మచర్యాన్ని ( స్త్రీ సంబంధిత ఆలోచనలతో వీర్యస్ఞలనమవడం) పాటించడానికి ప్రయత్నిచాలి !
- మనస్సు విషయవాంఛలవైపు పరిగెత్తకుండా ఉండటానికోసమే సాత్వికాహారం తీసుకోవాలన్న నియమం ఏర్పడింది !
దమము:
- ఆహార నియమాలు సక్రమంగా పాటించడంవల్ల విరేచనాలు మలబద్ధకం వంటిరోగాలకు గురికాకుండా శరీరారోగ్యాన్ని కాపాడుకోవచ్చును !
- కర్మేంద్రియాలను నిగ్రహించడాన్ని దమము అంటారు.
- జ్ఞానేంద్రియాలైన ముక్కు , చెవులు , కళ్లు , నాలుక , చర్మము వీటిని నియత్రించడాన్ని ‘శమము’ అంటారు .
జ్ఞానేంద్రియాల విషయంగా దీక్షాకాలంలో పాటించవలసిన నియమాలు.
- చెవులు: శబ్దాన్ని గ్రహించే జ్ఞానేంద్రియాలు చెవులు ! దీక్షాకాలంలో చెవులను బ్రద్దలు చేసే పెద్ద పెద్ద శబ్దాలను , ఇంద్రియాలను ఉద్రేకపరిచే సంభాషణలను వినగూడదు ! మనస్సుకు శాంతిని ప్రసాదించే దైవ సంబంధిత పాటలను , పురాణాలను వినాలి ! శాస్ర్తీయ సంగీతాన్ని వినడంవల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది ;
- కళ్లు: ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరిశీలనాగుణాన్ని అలవరచుకోవాలి ! విషాదకరమైన , భయానకమైన , శృంగారపరమైన దృశ్యాలనుర చూడకూడదు ! ఎటుచూసినా కళ్లకు స్వామి అయ్యప్ప గోచరించే స్థితికి మనస్సు , కళ్లు చేరుకోవడానికి దీక్షాకాలంలో సాధన చేయాలి !
- నాలుక: రుచిని తెలియజేసే జ్ఞానేంద్రియం నాలుక ! దీక్షాకాలంలో అన్ని రకాల రుచులు కోరుకునే నాలుకను నియంత్రించి సాత్వికాహారాన్ని మాత్రమే భుజించాలి ! తీపి , ఉప్పు , పులుపు , కారం , మసాలా దినుసులు లేని ఆహారం తినాలి ! అటుకులు , పాలు , పండ్లు స్వీకరించాలి !
- ముక్కు: వాసనను గ్రహించే జ్ఞానేంద్రియం ముక్కు ! దుర్వాసనలు వచ్చే అశున్ర వాతావరణంలో వుండకూడదు మనస్సుకు హాయిని , శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పూలతోటలలో తిరగడం , పూజకు పూలు సేకరించడం చేయాలి !
చర్మము:
- శరీరం అంతర్భాగాలను కప్పివుంచి , స్పర్శజ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానేంద్రియ చర్మం ! సౌందర్యం చర్మంవల్లనే కలుగుతుంది శరీరానికి !
- చల్లని నీటితో రోజూ మూడుసార్లు స్నానం చేయడంవల్ల చర్మం పరిశుభ్రమైన హాయిని ప్రసాదిస్తుంది ! చర్మానికి హాని కలిగించే తైలాలు, లేపనాలు వాడకూడదు !
- నలుగుపిండితో చర్మాన్ని శుభ్రపరచుకోవాలి !
- అందంగా కనబడటాని ప్రాధాన్యతనివ్వకూడదు !
- దీక్షాకాలంలో ముఖ క్షవరం , కేశఖండనం (జుత్తు కత్తిరించడం) గోళ్లు తీయడం చేయరాదు ! పాదరక్షలు వాడకూడదు !
- దీక్షాకాలంలో శవాలను చూడరాదు !
- బహిష్టు స్త్రీలను చూడరాదు ! పొరపాటున చూస్తే తలస్నానం చేసి , కర్పూరం వెలిగించి , శరణు ఘోష చేయాలి !
- వ్రత దీక్షాకాలంలో దీక్షలో వున్న ఇతరులను ‘స్వామి’ అని , చిన్నపిల్లలను ‘మణికంఠ’ అని , స్త్రీలను ‘భగవతి’ అని పిలవాలి !
- అయ్యప్ప స్వాములు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ముందు మూడుసార్లు ‘స్వామి శరణం’ అని చెప్పుకుని సంభాషణ పూర్తి అయిన తరువాత తిరిగి ‘స్వామి శరణం’ అని మూడుసార్లు చెప్పడం అలవర్చుకోవాలి !
- శ్రీ అయ్యప్ప పూజ ఎక్కడ జరుగుతున్నా , పిలవకపోయినా వెళ్లి భజన కార్యక్రమంలో పాల్గొనాలి ! దీక్షకాలంలో కనీసం ఐదు పూజా , భజన కార్యక్రమాలలో పాల్గొనాలి ! శబరిమల యాత్రకు వెళ్లేముందు కనీసం పదిమందికి అన్నసంతర్పణ కావించాలి ! అయ్యప్ప ఎవరుగానీ సద్ది , భిక్షలకు ఆహ్వానిస్తే నిరాకరించకూడదు. కుల , మత , తర తమ భేదాలు మరిచి అందూ కలిసి భుజించాలి !
- దీక్షలో వున్నపుడు మాంసము భుజించరాదు. తాంబూలం , ధూమపానం , క్షవరం , గోర్లు , కత్తిరించడం చేయకూడదు. చెడుఅలవాటులకు దూరంగా ఉండవలెను. మండల దీక్షాకాలంలో చెప్పబడిన నియమాలను సక్రమంగా పాటించడం వల్ల పంచేంద్రియాల వల్ల కలిగే ప్రలోభాలకు
- లొంగకుండా మనస్సును నిశ్చలంగా నియంత్రించడానికి తగిన సాధన లభిస్తుంది. అయ్యప్పస్వామి ఎక్కి వెళ్లిన పద్ధెనిమిది మెట్లను ఎక్కడానికి అర్హత ప్రసాదించడంలో పంచేంద్రియాల నియంత్రణ మొదటి ఐదు మెట్లను ఎక్కే సామర్థ్యతను కలిగిస్తాయి ! ఇంకా అష్టరాగాలనే 8 రాగాలు , త్రిగుణాలనే 3 గుణాలు , విద్య - అవిద్య అనే రెండు (మొత్తం 13) కూడ నియంత్రించబడితేనే మిగిలిన పదమూడు మెట్లు ఎక్కడానికి సమర్థత లభిస్తుంది !
అష్టరాగములు:
- అహంకారమనే మాయ పొర ఎప్పుడూ మనస్సును ఆవరించే వుంటుంది !
- అహంకారం నుండి మదం మొలకెత్తుతుంది !
- నేను, నాది, నావల్లనే సర్వం జరుగుతున్నది, నన్ను మా ఇంచినది మరొకటి లేదు అనబడే భావాలన్నీ అహంకారం నుండి పుట్టి మదంతో కలిసి పతనానికి దారితీసేలా చేస్తాయి !
- అహంకారం , మదంలను కలిపి అష్టరాగాలు లేక అష్టమదాలుగా వ్యవహరిస్తారు.
అవి - విద్యామదము, శీలమదము, రూప మదము, తపోమదము, కుల మదము, యవ్వనమదము, ధనమదము , రాజ్యమదము. దీక్షాకాలంలో ఈ ఎనిమిది మదాలు తలేత్తకుండా జాగ్రత్తపడాలి ! అహంకారానికి మూలమైన ఈ ఎనిమిది రాగాలవల్ల ప్రభావితం కాకుండా మనస్సును , భక్తి మార్గంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించాలి.
భక్తిమార్గము:
- సామాన్యులకు , దీక్షాధారులకు అందరికీ అనుసరించదగ్గ మార్గం భక్తిమార్గం !
- భగవంతుడు వున్నాడనే నమ్మకం, విశ్వాసం దృఢంగా కలిగివుండి, ఆ భగవంతుడిని ఎవరికి ఇష్టమైన రూపంలో వారు ఆరాధించడం భక్తిమార్గంగా తెలుపబడింది !
- ఈ మార్గంలో మండలకాలంలో దీక్షాధారులు రోజూ మూడు పూటలు అయ్యప్పస్వామిని పూజించి , భజనలు చేసి అందరిలో ఆ స్వామిని దర్శిస్తూ , సదా అయ్యప్ప నామస్మరణ చేస్తూ గడపడంవల్ల వాళ్ళకు సత్త్వ , రజో తమోగుణాలనే మూడు గుణాలను నియంత్రించే సామర్థ్యం లభిస్తుంది !
త్రిగుణాలు
- తమోగుణము: అజ్ఞానం , అలసత్వం , విపరీతమైన నిద్ర , కపటం , గర్వం , దురభిమానం , క్రోధం, కోపం , పౌరుషం ఈ గుణం లక్షణాలు ! దీక్షాకాలంలో వీటన్నిటినీ నియంత్రించి మనస్సు వాటివల్ల ప్రభావితం కాకుండా చూసుకోవాలి.
- రజోగుణము: రాగద్వేషాలను కలిగిస్తుంది ! కోరికలను రేకెత్తిస్తుంది ! దంభము , దురభిమానము , రాజసం , గర్వాహంకారాలు ఈ గుణంవల్ల ప్రకోపిస్తాయి. వీటిని దీక్షాకాలంలో అణచివేసి ప్రశాంతంగా వుండటం అలవరచుకోవాలి !
- సత్త్వగుణము: సత్యము , శౌచము , క్షమాగుణం , అనుకంప , శాంతి , సంతోషం మొదలైనవి సత్త్వగుణ లక్షణాలు ! వీటిని అలవరచుకుని దీక్షాకాలంలో మసలుకోవడం ప్రధానం ! మంచి గుణాలు అలవరచుకుని , చెడు గుణాలకు దూరంగా ఉంటూ భగవధ్యానంలో గడపాలి !
అవిద్య - విద్య
- అవిద్య అంటే అజ్ఞానం! మంచి విషయాలను తెలుసుకోవాలన్న కోరిక లేకపోవడం అవిద్యకు కారణం! అవిద్యవల్ల వివేచనా, తెలివితేటలు, బుద్ధి వికాసం లేకుండా నిస్సారమైన జీవితం గడపవలసి వుంటుంది ! విద్య నేర్పే గురువుల సహాయంతో అవిద్యను తొలగించవచ్చును ! మూఢుడైన శిష్యుడికి విద్యాబోధన చేసి మంచి విషయాలు తెలుసుకోవాలన్న కోరిక కలిగేలా చేస్తాడు గురువు ! అంతవరకు అతడు పశుప్రాయమైన జీవితం గడుపుతూ వచ్చిన విషయం శిష్యునికి తెలిసేలా చేస్తాడు !
- అవిద్య ప్రభావం నుండి బయటపడి విద్య నేర్చుకోవడానికి ఆసక్తి కలగడంతో గురువుగారి నాశ్రయించి విద్యనభ్యసిస్తాడు శిష్యుడు ! కొన్ని శాస్త్రాలలో నిపుణడౌతాడు ! భగవంతుని గూర్చిన విషయాలు పౌరాణిక గ్రంథాలను చదివి , గురువుగారి ఉపదేశాలు విని కొంతవరకు తెలుసుకోవడం జరుగుతుంది !
- విద్యావంతులు వేదాధ్యయనం చేసి భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ! వారికంతా తెలిసిపోయినట్లనిపిస్తుంది మొదట్లో ! అంతటితో భగవంతుని తత్వాన్ని గ్రహించి జ్ఞానులైపోయారన్న మిథ్యాజ్ఞానం కలుగుతుంది ! ఆ భావన నిజం కాదు ! అందుకే దాన్ని మిథ్యాజ్ఞానం అన్నారు. ఈ మిథ్యాజ్ఞానం వల్ల అహంకారం మొలకెత్తుతుంది !
- దీక్షాకాలంలో ఈ మిథ్యాజ్ఞానంవల్ల వచ్చే అహంకారాన్ని (విద్యామదం) అణచివేయాలి ! అందుకు భక్తిమార్గం సహకరిస్తుంది !
- అవిద్యను వదలి విద్యావంతుడైన భక్తుడు స్వామి సేవలో గడిపి ధన్యుడౌతాడు.
- శౌనకాది మునులారా ! అయ్యప్పస్వామి ఎక్కివెళ్లిన పద్ధెనిమిది మెట్లను ఎక్కి వెళ్లి ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి గురువు ద్వారా తీసుకోవలసిన దీక్ష , మాలధారణ , దినచర్య పాటించవలసిన నియమాల గూర్చి మీకు తెలియజెప్పాను ! ఆ నియమాలన్నీ పాటించడమంటే తపస్సుతో సమానమని గ్రహించండి ! విషయ వాంఛలనుండి ఇంద్రియాలను నిగ్రహించి , సత్కర్మలే ఆచరిస్తూ , సమతాభావంతో అయ్యప్ప ధ్యానంలో గడిపే మండల దీక్షాకాలం కఠోర తపస్సుతో సమానమైనది ! ముఖ్యంగా కలియుగంలో కలి ప్రభావానికి గురికాకుండా వుండటానికి , మానవులను సన్మార్గంలో నడిపించడానికి అయ్యప్పస్వామి ఈ విధమైన నియమాలను ఏర్పరచటం జరిగింది.
ఆ స్వామి మీద చెక్కు చెదరని విశ్వాసంతో మండల దీక్ష స్వీకరించాలన్న సంకల్పం కలిగిన భక్తులను స్వామే స్వయంగా నియామకాలను పాటించే శక్తి సామర్థ్యాను ప్రసాదిస్తాడు. నిజమైన భక్తి విశ్వాసాలు లేకుండా కేవలం ఆడంబరానికి దీక్ష స్వీకరించి నియమాలను సరిగా పాటించనివారు యాత్ర చేయలేరు ! ఏదోవిధమైన ఆటంకం ఏర్పడి మండల దీక్ష అసంపూర్తిగా ఆగిపోతుంది ! అందుకే భక్తివిశ్వాసాలతో , త్రికరణశుద్ధిగా (మనసా , వాచా , కర్మలచేత) నియమాలను పాటించి శబరిమల యాత్రకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ధన్యులవుతారు. మండల దీక్ష స్వీకరించిన స్వాములు ! అంటూ చెప్పటం ఆపారు సూతమహర్షి !
‘‘మహర్షి ! మీ నోట తపస్సుతో సమానమైన అయ్యప్పస్వామి మండల దీక్ష , నియమాల గూర్చి విని ధన్యులమైనాము దీక్షా కాలం ముగిసాక చేయవలసిన శబరిగిరి యాత్ర గురించి కూడా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అడిగారు మునిబృందాలు ! ‘‘తప్పకుండా తెలియజెబుతాను ! ముందుగా ఒక్కసారి ఆ శబరిగిరీశుని మనస్సులో నిలిపి భక్తిపూర్వకంగా ధ్యానించండి !
‘‘ఓంకారమూలం జ్యోతి స్వరూపం
పంబానదీ తీర శ్రీ భూతనాథం
శ్రీదేవదేవం చతుర్వేదపాలం
శ్రీ ధర్మశాస్తారం మనసా స్మరామి
వందే మహేశ హరిమోహిని భాగ్యపుత్రం
వందే మహోజ్జ్వల కరం కమనీయ నేత్రం
వందే మహేంద్ర వరదం జగదేక మిత్రం.
వందే మహోత్సవ నటనం మణికంఠ సూత్రం" అంటూ కన్నులరమోడ్చి ధ్యానించి చెప్పసాగాడు సూతమహర్షి !
ఏడవ అధ్యాయము
శబరిగిరి (శబరిమల) యాత్ర వివరాలు యాత్ర అంతరార్థం:
జీవాత్మ ఒక దేహాన్ని వదిలి పైలోకాలకు ప్రయాణించే అంతిమ యాత్రను మహాప్రస్థానం అంటారు ! ఆ ప్రయాణంలో బంధువులెవరూ వెంట వెళ్లలేరు ! ఆ జన్మలో చేసిన పుణ్యపాప కర్మలు మాత్రమే వెంట వెళుతాయి ! తాను సంపాదించినవేవీ వెంట వెళ్లలేవు ! తాను చేసిన పుణ్యపాప ఫలితాలమీద తర్వాత వచ్చే జన్మ ఆధారపడి వుంటుంది ! జీవించి వుండగానే పవిత్రమైన (నియమాలవల్ల) జీవాత్మ , పరబ్రహ్మమైన అయ్యప్పస్వామిని దర్శించుకుని , పునర్జన్మ లేకుండా ఆ స్వామిలో లయం కావాలన్న కోరిక విన్నవించుకోవడానికి చేసే ప్రయాణమే శబరిగిరి యాత్ర ! స్వామి అనుగ్రహంతో జీవించి వున్నంతవరకు సత్కర్మలు , పుణ్యకార్యాలు ఆచరిస్తూ ముక్తిని పొందాలన్న అంతరార్థం కలిగివుంది శబరిగిరియాత్ర !
యాత్రకు తరలివెళ్ళే విధానం
మండల కాల దీక్ష పూర్తయిన మరునాడు దీక్ష స్వీకరించిన స్వాములకు ఇండ్లలో వాళ్లు (కుటుంబ సభ్యులు) భిక్ష వేసి హారతి ఇచ్చి , దిష్టికాయ కొట్టి యాత్ర సఫలంగా జరగాలని శుభాకాంక్షలు చెబుతారు ! ఇక తిరిగి వెనుదిరగకుండా గురుస్వామి దగ్గరకు చేరుకుంటారు దీక్షాధారులు ! గురుస్వామి వారి చేత ముందుగా ఇరుముడి కట్టించుతారు ! మాలధారణలాగే ఇరుముడి కట్టే కార్యక్రమం కూడా చాలా ముఖ్యమైనది !
ఇరుముడి ప్రాముఖ్యత
మణికంఠుడు తల్లికోసం పులిపాలు తేవడానికి అరణ్యానికి బయలుదేరినపుడు తండ్రి రాజశేఖరుడు ఒక వస్త్రంలో రెండు అరలుగా చేసి ఒక దాంట్లో మణికంఠునికి రక్షగా ఈశ్వరుని ధ్యానిస్తూ కొబ్బరికాయ , పూజాద్రవ్యాలు ఒక అరలోనూ , రెండవ దానిలో ప్రయాణపుదారిలో తినడానికి ఆహార పదార్థాలు పెట్టి , మూటగా కట్టి తీసుకువెళ్లమని కుమారునికి ఇస్తాడు ! తండ్రి మాటను కాదనకుండా ఆ మూటను తలమీద పెట్టుకుని వెళతాడు మణికంఠుడు ! ఆ మూటే ‘ఇరుముడి’ గా పిలువబడుతుంది ! (రెండు అరలు కలిపి ముడి వేసిన సంచి) మణికంఠుడు ఇరుముడిని తలమీద ధరించి వెళ్లినట్లే మండల దీక్ష ముగించి స్వాములు కూడా అదేవిధంగా నింపిన సంచులను తలమీద పెట్టుకుని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లడం శుభప్రదంగా భావింపబడుతున్నది !
ఇరుముడిలో పెట్టే వస్తువులు:
రెండు అరలుగా వున్న ఒక సంచీని తీసుకుని ముందు అరలో స్వామికి సమర్పించవలసిన వస్తువులను , వెనక అరలో ఆహార పదార్థాలను వుంచి తాడుతో మూట కట్టడంతో ఇరుముడి తయారౌతుంది ! ముందు అరలో ఆవు నేతితో నింపిన కురిడీ , విభూది , చందనం , పన్నీరు , ఊదివత్తులు , కర్పూరం , అమ్మవారికి సమర్పించడానికి వస్త్రం , పసుపు , కుంకుమలు , మిరియాలు , పటికబెల్లం , బియ్యం , పెసరపప్పు , దక్షిణగా సమర్పించడానికి నాణేలు పెట్టుకోవడానికి కావలసి ఉంటాయి ! వెనక భాగంలో మార్గంలో భుజించడానికి అవసరమైన పండ్లు , అటుకులు , ఇతర తినుబండారాలు పెట్టుకోవచ్చును.
ఇరుముడి కట్టే విధానం:
ఇరుముడి దేవాలయంలోగాని , గురుస్వామి ఇంటిలోగానీ కట్టడం జరుగుతుంది. ముందుగా కొబ్బరి కురిడీ లేక ముద్రను సిద్ధం చేస్తారు !
ముద్రను సిద్ధం చేసే విధానం:
శుభ్రమైన మంచి కొబ్బరికాయకు పీచు తీసి నున్నగా చేసిదాని కన్నులలో ఒక కన్నుకు రంధ్రం చేసి కాయలో వున్న నీటిని తీసివేయాలి ! ఆ కాయను కలశం మీద వుంచి దీక్ష పూర్తిచేసిన స్వామి చేత కొబ్బరికాయను ఆవు నేతితో నింపిస్తారు గురుస్వామి ! ఆ సమయంలో ఇద్దరూ మనస్సులో అయ్యప్పస్వామిని ధ్యానిస్తూ వుండాలి ! నింపిన తర్వాత గురుస్వామి రంధ్రాన్ని మూసివేయడం జరుగుతుంది ! కాబట్టి కొబ్బరికాయలోని నెయ్యి బయటకు రాకుండా జాగ్రత్తతీసుకుంటారు ! ఈ విధంగా నెయ్యితో నింపబడ్డ కొబ్బరికురిడీనే ముద్ర అంటారు !
ఈ ముద్రను ఒకవస్త్రంలో నాణాలతో కలిపి కట్టి దానిని ఇతర పూజా ద్రవ్యాలతో కలిపి సంచీ ముందుభాగంలో వుంచటం జరుగుతుంది. ఆ భాగాన్ని గట్టిగా కట్టివేసి , వెనక భాగంలో ఆహార పదార్థాలను వుంచి కట్టిన తర్వాత రెంటినీ కలిపి ఒకటిగా ముడివేస్తారు ! దీక్షాధారులు ఇరుముడిని తలమీద పెట్టుకుని ప్రయాణం చేయవలసి వుంటుంది !
కొబ్బరి కురిడీ ముద్ర అంతరార్థం
కొబ్బరికాయలకు మూడు కళ్లువుంటాయి ! వాటిలో రెండు కళ్లు గట్టిగా వుండి ఒకటి మెత్తగా వుంటుంది ! గట్టిగా వుండే రెండు కళ్ళు మనిషిలో పైకి కనిపించే రెండు కళ్లకు సంకేతాలు ! మెత్తని కన్ను మనిషి లోపలి జ్ఞాన నేత్రానికి సంకేతం ! జ్ఞాన నేత్రం మాత్రమే సాధనవల్ల భగవంతుని తనలోనే దర్శించగల సమర్థత కలిగివుంటుంది ! మెత్తని కన్నును తెరిచి నీరు తీసివేసి స్వచ్ఛమైన నేతితో నింపినట్లు జ్ఞాన నేత్రం అహంకారాన్ని వదిలి భక్తి భావంతో భగవంతుని దర్శించాలన్న సందేశం దాగి వుంది ముద్రను సిద్ధం చేయటంలో !
ఇరుముడికి పూజ:
కట్టడం పూర్తిచేసిన ఇరుముడిని భక్తితో పూజిస్తారు దీక్షాధారులు ! ఇరుముడి వల్ల కలిగే శక్తి యాత్రను సజావుగా శుభప్రదంగా సంపన్నం అయ్యేలాచేస్తుంది ! పూజ పూర్తయినాక ఇరుముడి కట్టించిన గురుస్వామికి నమస్కరించి , దక్షిణ సమర్పించి గురుస్వామి చేత మూటను పెట్టించుకుని అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని యాత్రసఫలం కావించమని ప్రార్థించాలి ! ఇరుముడిని స్వామి ప్రక్కన వుంచి పూలమాల వేసి నమస్కరించాలి ! ఈ విధంగా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరుముడులకు హారతి చూపి , శరణుఘోష చేస్తూ దీక్షాధారలందరూ ప్రయాణం ప్రారంభించి శబరిగిరి వైపు సాగిపోతారు ! ఇతరులు మేళతాళాలతో ఊరి పొలిమేరల వరకు వారి వెంట వెళ్లి వీడ్కోలు చెప్పి జయప్రదంగా యాత్ర ముగించుకు రావాలని శుభకాంక్షలు తెలిపి వెనుదిరుగుతారు !
ఇరుముడికి - జాగ్రత్తలు
- ఇరుముడి కట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇతరుల ఇండ్లకు వెళ్లగూడదు !
- దేవాలయాలు , సత్రాలలో తప్ప ఇతరుల గృహాలలో బస చేయకూడదు !
- స్వామివారికి అర్పించే పూజాద్రవ్యాలు , ముద్ర వున్న భాగం శిరస్సు ముందుభాగంలో వుండేలాగా , జారిపోకుండా జాగ్రత్త వహించాలి !
- యాత్రాకాలంలో కూడా రోజూ ఉదయం , సాయంత్రం ఇరుముడికి హారతి ఇచ్చి భజనలు చేయాలి !
- పద్దెనిమిది మెట్లు ఎక్కి వెళ్లి స్వామి సన్నిధానాన్ని చేరేవరకు ఇరుముడిని పవిత్రంగా చూసుకోవాలి !
- మొదటిసారి వెళుతున్న దీక్షాధారులు (కన్నిస్వాములు) తాము స్వయంగా ఇరుముడిని తలపై నుండి దింపటం తిరిగి ఎత్తుకోవడం చేయకూడదు ! ఆరు సార్లు వెళ్లి వచ్చినవాళ్ల సహాయంతో ఆ పని చేయాలి ! ఇరుముడిని అయ్యప్ప స్వామిగా భావిస్తూ పూజిస్తూ శబరిగిరి చేరుకోవాలి.
శబరిగిరి యాత్రకు
తీసుకువెళ్లవలసిన ఆయుధాలు
- మొదటి సంవత్సరం యాత్రకు వెళ్ళేవారు తమ వెంట ఒక బాణాన్ని తీసుకువెళ్లి శరణుగుచ్చిలో అర్పించాలి ! మొదటిసారిగా దీక్ష స్వీకరించే ఈ స్వాములను కన్నిస్వాములంటారు !
- రెండవ సంవత్సరం వెళుతున్న దీక్షధారులు కత్తిని సమర్పించాలి !
- మూడవ సంవత్సరం గంటను తీసుకువెళ్లి అర్పించాలి.
- నాలుగవ సంవత్సరం గదను
- ఐదవ సంవత్సరం విల్లును
- ఆరవ సంవత్సరం దీపాన్ని వెలిగించి అర్పించాలి!
- ఏడవ సంవత్సరం సూర్యప్రతిమను (సూర్యుని రాగి రేకు)
- ఎనిమిదవ సంవత్సరం చంద్రప్రతిమను (చంద్రుని రాగిరేకు)
- తొమ్మిదవ సంవత్సరం త్రిశూలాన్ని
- పదవ
- సంవత్సరం విష్ణుచక్రాన్ని
- పదకొండవ సంవత్సరం
- శంఖాన్ని
- పన్నెండవ సంవత్సరం నాగాభరణాన్ని
- పదమూడవ సంవత్సరం వేణువును
- పధ్నాల్గవ సంవత్సరం తామర పువ్వును
- పదిహేనవ సంవత్సరం శూలంని (కుమారస్వామి ఆయుధం)
- పదహారవ సంవత్సరం రాయిని
- పదిహేడవ సంవత్సరం ఓంకారంగల రాగిరేకును
- పద్ధెనిమిదవ సంవత్సరం కొబ్బరిమొక్కను తీసుకువెళ్లి సమర్పించాలి !
ఈ విధంగా పద్ధెనిమిది సంవత్సరాలు మండల దీక్షను స్వీకరించి పద్ధెనిమిదిమెట్లు ఎక్కివెళ్లి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆయుధాన్ని స్వామికి సమర్పించేవారికి అయ్యప్పస్వామి సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది ! వారి జన్మ ధన్యమై ఇహంలో సర్వాభీష్టాలు నెరవేరి చివరకు ముక్తిని పొందుతాడు ! ఏదీ, అందరూ ఒక్కసారి ముక్తకంఠాలతో ఆ స్వామిని మనోనేత్రాలతో దర్శించి నమస్కరించండి.
‘‘హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాధ్యపాదుకంహరి విమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయ్ !ఓం స్వామియే శరణం అయ్యప్ప’’
అంటూ స్తుతించారు సూత మహర్షి కన్నులరమోడ్చి , అంజలి ఘటిస్తూ ! ‘‘ఓం స్వామియే శరణం ! శరణం అయ్యప్ప !’’ అంటూ ముక్తకంఠాలతో మనులందరూ శరణుఘోష భజన చేస్తుంటే నైమిశారణ్య ప్రాంతమంతా భక్తిపూరిత వాతావరణం నెలకొన్నది !
శబరిమల మీద విగ్రహ రూపంలో వెలసిన అయ్యప్పస్వామి తర్వాత ఏం చేశారు ? ఎవరికైనా కనిపించారా ?
‘‘అయ్యప్పస్వామి జ్యోతిగా మారాక జరిగిన విషయాలు పురాణాలలో చెప్పబడలేదు ! భక్తులందరూ కాలినడకన అరణ్యప్రాంతంలో కష్టపడి ప్రయాణించి శబరిమలకు చేరుకుని స్వామి దర్శనం చేశాడు గదా ! క్రమంగా యాత్ర చేసే భక్తుల సంఖ్య పెరిగి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది శబరిమల ప్రాంతం ! అంతవరకే పౌరాణిక గాథ ! అయితే ఆ ప్రాంతంలో వుండే ప్రజలలో ఒక జానపద గాథ చాలా ప్రచారంలో వుండేది ! అది అయ్యప్పస్వామికి సంబంధించి వుండటంతో దాన్ని కూడా అయ్యప్ప చరితంలో భాగంగానే భావిస్తారు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ! చాలా ఆసక్తికరంగా వుంటుంది.
ఎనిమిదవ అధ్యాయం
అయ్యప్పస్వామి జానపద చరితం - స్వామి మహిమ
ధర్మశాస్తా పంచరత్నం
‘‘లోక వీర్యం మహాపూజ్యం
సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం
శాస్తారం ప్రణమామ్యహం
విప్ర పూజ్యం విశ్వవంద్యం
విష్ణుం శంభుప్రియసుతం
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం
ప్రణమామ్యహం!
మత్తమాతంగ గమనం
కారుణ్యామృత పూజితం
సర్వవిఘ్నహరం దేవం
శాస్తారం ప్రణమామ్యహం
అస్మత్ కులేశ్వరం దేవం
అస్మద్ శతృ వినాశనం
అస్మదిష్ట ప్రదాతారాం
శాస్తారం ప్రణమామ్యహం
పాండ్యేశ వంగ తిలకం
కేరళే కేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం
శాస్తారం ప్రణమామ్యహం!
పంచ రత్నాఖ్యమే తద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !
‘‘అయ్యప్పస్వామి ! నీవు శబరిమల మీద వెలసి మమ్మల్నందరిని కాపాడుతూ వుంటానని మాట ఇచ్చావు గదా ! మరి ఈ కష్టాలు మాకెందుకు కలుగుతున్నాయి స్వామీ ! పాండ్య వంశస్థుడైన రాజశేఖరునికి పుత్రుడివై పందల రాజకుమారుడిగా నీవు పాలించిన పందల రాజ్యం ఈనాడు ఉదయనుడే గజదొంగ దాడులతో ఛిన్నాభిన్నమైపోయింది ! ఆ వంశపు వాళ్లు ఇక్కడ కట్టించిన మీ దేవాలయంలో మీ పూజార్చనలు ఎంతో కష్టంమీద జరుపుతూ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం నేనూ , నా కుమారుడు !ధర్మదేవతను శాసించే హే ! ధర్మశాస్తా ! అయ్యప్పా ! ఇప్పుడు నామమాత్రంగా మిగిలిన ఈ చిన్న పందల రాజ ప్రభువు రాజశేఖరుడు కూడా మీ దయాదృష్టికోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాడు ! మా అందరి కష్టాలు తీర్చి మమ్మల్ని కాపాడుస్వామి !’’పందల రాజ్యంలోని ధర్మశాస్తా మందిరం పూజారి స్వామి విగ్రహం ముందు నిలుచుని దీనంగా మొరపెట్టుకున్నాడు !
ఆ సమయంలో కలి పురుషుని ప్రభావానికి లోనైన ఉదయనుడనే గజదొంగ కారణంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన పందల రాజ్యంలో కొంత కాలంగా అరాచకత్వం , బీభత్సం తాండవిస్తున్నాయి. ! ఉదయనుడు తనను ఎదిరించేవారు లేకపోవడంతో ఆ ప్రాంతమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించిన వారిని దారుణంగా చంపివేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుని వీరవిహారం సాగిస్తున్నాడు ! రాజైన రాజశేఖరుడికి అతడిని ఎదిరించే బలం లేకపోవడంతో భగవంతునిమీద భారం వేసి రోజులు భారంగా గడుపుతున్నాడు !
ఆ రోజు ధర్మశాస్తా మందిరంలో స్వామిని ప్రార్థిస్తున్న పూజారి వులిక్కిపడి లేచాడు గుర్రం డెక్కల చప్పుడు విని ! అతని గుండెలు దడదడమన్నాయి ! ‘ఉదయనుడే ఇట్లు వస్తున్నట్లున్నాడు’! ఈ ఆలయంమీద ఆ దుష్టుడి చూపు పడి లోపలకు రాడు గదా ! అనే ఆలోచన వచ్చేసరికి భయంతో గజగజలాడుతున్న పూజారి ప్రక్కగా దేవుడి పళ్లాల సవరిస్తున్న కొడుకు వైపు ఆందోళనగా చూస్తూ ‘‘జయవర్థనా ! నాయనా ! పరుగెత్తి వెళ్లి ఎక్కడైనా దాక్కో ! ఆ దుర్మార్గుడు గుడిలోపలకు వస్తాడేమో ! పారిపో , వాడి కంటబడకుండా !’’ అంటూ తొందరపెట్టాడు ! ‘‘మరి మీరో ?’’ తండ్రివైపు చూస్తూ అడిగాడు పన్నెండేళ్ల జయవర్థనుడు ! ‘‘నీవు ప్రాణాలు దక్కించుకో నాయనా , నా మాట విను ! నేను పరుగెత్తలేను ! ఇక్కడే మనం నమ్మిన స్వామి దగ్గరే వుంటాను ! ఏమైతే అది అవుతుంది ! వెళ్లు , ఆలస్యం చేయకు !’’ అన్నాడు పూజారి విష్ణుదత్తుడు !
జయవర్థనుడు ఇష్టం లేకపోయినా తండ్రి మరీ మరీ చెప్పడంతో బయటకు పరుగెత్తాడు ! అప్పటికే ఉదయనుడి గుర్రం ఆలయం ముందర వచ్చి ఆగింది ! దిగి లోపలకు వెళ్లాడు ! దేవుడి మెడలో మాల సవరిస్తున్న పూజారి వైపు క్రూరంగా చూస్తూ, ‘‘ఆ రాతి బొమ్మకేం వేస్తావు ? అసలు దేవుడిని నేను ! నా మెడలో వేయి !’’ అంటూ గద్దించాడు ! అతనట్లా గద్దించడంతో కోపం , అసహ్యం కలిగాయి పూజారికి ! అందుకే భయపడకుండా ‘‘పాపాత్ముడా ! ఇప్పటివరకు ఎన్నో పాపాలు చేసావు ! ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని ధర్మశాస్తా అయ్యప్పస్వామిని శరణు వేడుకో ! నిన్ను మన్నించి సద్బుద్ధి ప్రసాదిస్తాడు ఆ పరబ్రహ్మ , జ్యోతిరూపుడు’’ అంటూ హితవు చెప్పాడు. ఆ మాటలకు మరింత కోపంతో కళ్లనుండి నిప్పులు కురిపించాడు ఉదయనుడు ! ‘‘నాకు ఎదురు చెప్పే సాహం చేస్తావా , ముసలి బ్రాహ్మణుడా ! ఇప్పుడే నీకు తగిన శిక్ష విధిస్తాను చూడు !’’ అంటూ కత్తిని చర్రున దూసి పూజారి కడుపులో బలంగా గుచ్చాడు ఉదయనుడు ! ‘‘హా ! అయ్యప్పా ! స్వామియే శరణం!’’ అంటూ నేలకొరిగిపోయాడు పూజారి ! ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయాయి. ‘హా.. హ.. హ ! నాకే చెప్పే సాహసం చేస్తాడా ! తగిన శిక్ష విధించాను అనుకుంటూ అక్కడ వున్న పూజా ద్రవ్యాలన్నిటిని చిందరవందరగా విసిరేసి స్వామి విగ్రహాన్ని పెకలించి ప్రక్కకు విసిరేసి పెద్దగా నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయాడు ఉదయనుడు !
‘‘ఏమిటి ! ఉదయనుడు అంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడా ? పూజారిని చంపి గుడిని ధ్వంసం కావించాడా ? ఎంతటి ఘోరానికి సిద్ధపడ్డాడు ! ఎట్లా వాడి దుండగాలను అరికట్టడం ? ఎవరు ఆ కార్యం చేయగలరు ? అయ్యప్ప స్వామే పూనుకుని వాడిని అంతం చేయాలి ! ఆ స్వామిని ప్రార్థించడం మాత్రమే మనం చేయగలిగింది !’’ అంటూ తమ పూజా గృహంలోని అయ్యప్ప స్వామి విగ్రహానికి నమస్కరించి ధ్యానించాడు పంబరాజు !
‘‘తేజో మండల మధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్ప శరేక్షు కార్ముక లసన్మాణిక్య పాత్రాభయం
బిభ్రాణాంకరపంకజైర్ మదగజ స్కంధాది రూఢం విభుం
శాస్తారం శరణం భజామి సతతం త్రైలోక్య సమ్మోహనం!’’
(తేజోమండల మధ్యలో దివ్యాభరణాలతో , పట్టువస్త్రాలతో అలంకరింపబడి మూడు నేత్రాలతో ప్రకటితమై హస్తాలలో పుష్పం , చెరుకుగడ, శరాలు , విల్లు , మాణిక్య పాత్ర ధరించి భక్తులకు అభయముద్రను ప్రసాదిస్తూ , శతృవులను సంహరించడానికి మత్తగజాన్ని అదిరోహించి వస్తున్న ధర్మశాస్తా అయ్యప్ప స్వామిని మూడు లోకాలను తన దివ్య మోహన రూపంతో సమ్మోహితులను కావించే స్వామిని ఎల్లప్పుడూ భజిస్తూ వుంటాను) ఆయన మనోనేత్రం ముందు కదలాడిన దివ్యరూపాన్ని చూస్తూ పరవశించిపోయాడు ! ‘‘హే జ్యోతిరూపా ! పందళరాజకుమారుడివి నీవు ! ఈనాడు ఈ దుస్థితి నీ రాజ్యానికి ఉదయనుడనే దుర్మార్గునివల్ల సంభవించింది ! మా మీద దయతో అతడిని వధించి మమ్మల్ని కాపాడు ! మహిషి సంహారం కోసం అవతరించిన నీవు తిరిగి నీ భక్తులను ఉద్ధరించడానికి తరలిరా తండ్రీ !’’ అంటూ ప్రార్థించాడు ! రాజు ప్రార్థన స్వామిని చేరింది ! అందుకే శాంత గంభీర స్వరంతో పలికాడు !
‘‘రాజా ! ఉదయనుడి కాలం తీరడానికి మరికొంత వ్యవధి ఉన్నది ! ప్రస్తుతం కలిపురుషుని ప్రభావంతో అతడు కావిస్తున్న దుష్కర్మలు అంతం కావించడానికి త్వరలోనే నేను తిరిగి నీ వంశంలోనే అవతరిస్తాను ! రాజా ! మరికొద్దికాలంలో నీ దగ్గరకు ఒక బ్రాహ్మణ కుమారుడు వస్తాడు ! అతనికి నీ కుమార్తెనిచ్చి వివాహం కావించు !’’ ఆ పలుకులు అమృతపు జల్లులా కురిసాయి రాజు కర్ణపుటాలలో ! ‘‘మీరు చెప్పినట్లే కావిస్తాను ! నా మీద ఎంతటి కరుణ చూపావు తండ్రీ ! నీకు నా కోటి కోటి ప్రణామాలు !’’ అంటూ అంజలి ఘటించాడు రాజు !
‘‘జయవర్థనా ! లే ! వెంటనే బయలుదేరి పంబల రాజ్యానికి వెళ్లు ! అన్న పలుకులు స్పష్టంగా వినపడటంతో చప్పున లేచి కూర్చున్నాడు జయవర్థనుడు !
ఉదయనుడి నుండి తప్పించుకొని పరుగు తీసిన పూజారి కుమారుడు ఎట్లాగో మణికంఠుడు పులిపాలకోసం వచ్చిన అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నాడు ! ఆ ప్రాంతమంతటా స్వామి సంచరించినది కావడంతో పవిత్రమైంది ! దేవతల ప్రార్థనతో స్వామి విశ్రాంతి తీసుకున్న ప్రాంతం ‘పొన్నంబలమేడు’ గా పిలువబడుతూ ఆటవికుల నివాస స్థానమై వుంది జయవర్థనుడు అక్కడకు చేరిన సమయంలో ! ఆ పవిత్ర స్థానంవైపు ఉదయనుడు రాలేకపోవడానికి స్వామి మహిమే కారణంగా భావిస్తూ సురక్షితంగా అక్కడివారితో కలిసి కాలం గడుపుతూ వున్నాడు జయవర్థనుడు ! అప్పటికి కొన్ని సంవత్సరాలు గడిచాయి ! తనను ప్రబోధించినదేవరై వుంటారా అనుకుంటూ లేచి ఆశ్రమం బయటకు వచ్చాడు జయవర్థనుడు ! ఇంకా బ్రాహ్మీముహూర్తం కాలేదు ! ‘పంబలరాజ్యానికి వెళ్లమంటున్నదెవరు ? వెళ్లి ఏం చేయాలి ?’ అనుకుంటూ అక్కడే నిలబడ్డాడు ! ఆకాశంలో మెరుపు మెరిసినట్లయింది ! తేజోమండల మధ్యంలో పులిమీద ఆసీనుడై వున్న అయ్యప్పస్వామి దర్శనమిచ్చాడు !
‘‘జయవర్థనా ! నీవు పంబల రాజ్యానికి వెళ్లి ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు కుమార్తెను వివాహంచేసుకోవలసి వున్నది ! నీకు నీ తండ్రికి నాపట్లగల నిర్మలమైన భక్తి విశ్వాసాలకు ప్రసన్నుడినైనాను ! అందుకే నీకు పుత్రుడిగా అవతరించాలని సంకల్పించాను. ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరు ! అన్న ఆదేశం వినడంతో ఆనందంగా పందల రాజ్యం వైపు సాగిపోయాడు జయవర్థనుడు !
‘‘మహారాజా ! మహారాజా ! ఎవరో యువకుడు వచ్చి తమ దర్శనం కోరుతున్నాడు ! పంపమంటారా ?’’ పరిచారిక తెచ్చిన వార్త భయాందోళనలతో సతమతవౌతున్న రాజులో ఆనందాన్ని నింపింది !
స్వామి చెప్పిన యువకుడి రాకకోసం ఎంతో ఆత్రంతో ఎదురుచూస్తుండగానే కొన్ని సంవత్సరాలు తిరిగిపోయాయి ! ఉదయనుడు ఇతర రాజ్యాలమీదకు దండయాత్రలు సాగిస్తుండటంతో పంబల రాజ్యం వైపు రాకపోవడం కొంతవరకు ఊరట కలిగించినా , ఎప్పుడు వచ్చి విరుచుకుపడతాడోనన్న భయంతోనే కాలం గడుపుతున్నారు రాజు , ప్రజలు !
వాళ్ళు భయపడుతున్నట్లుగానే స్వయంగా ఉదయనుడే దండెత్తి రాకపోయినా అతని వద్దనుండి వచ్చిన వర్తమానం రాజును సంకటంలో పడేసింది ! ‘‘రాజా ! నీ కుమార్తె అందచందాల గూర్చి ఈమధ్యే విన్నాను ! ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను ! కొద్ది రోజుల్లో వస్తున్నాను ! వివాహానికి ఏర్పాట్లు కావించిసిద్ధంగా ఉండు !’’ ఉదయనుండి వ్రాలు ! అని అతడు వ్రాసి పంపిన సందేశం రాజు కుటుంబంలో కలవరాన్ని రేకెత్తిచింది ! ‘స్వామీ ! ఏమిటీ విపరీతం ! మీరు సెలవిచ్చిన బ్రాహ్మణ కుమారుడి జాడ లేదు. ఈ దుర్మార్గుడి నుండి ఇటువంటి వార్త వచ్చి పడింది ! నాకేమి చేయాలో తోచడంలేదు ! అయ్యప్పా ! నీదే భారం !’’ అంటూ ఏం చేయాలో తోచని పరిస్థితిలో సతమతవౌతున్న రాజు పరిచారిక తెచ్చిన వార్త విని సంభ్రమాశ్చర్యాలతో లేచి యువకునికి ఎదురువెళ్ళాడు ! సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు జరిపాడు !
‘‘కుమారా ! నీ కోసమే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాము ! ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది ! ఇక మాకే చింతా లేదు ! ఆ దుర్మార్గుడు ఉదయనుడి బారి నుండి మమ్మల్ని కాపాడాల్సిన భారం నీదే’’ అన్న రాజు మాటలకు చిన్నగా నవ్వాడు జయవర్థనుడు ! ‘‘అంతా అయ్యప్పస్వామి సంకల్పం ప్రకారమే జరుగుతుంది ! నన్ను మీ కుమార్తెను వివాహం చేసుకోవలసిందిగా ఆదేశించి పంపారు స్వామీ !’’ అన్నాడు.
‘‘అవును ! మాకు అటువంటి ఆదేశమే ఇచ్చారు స్వామి ! మీకు మా కుమార్తెను ఇచ్చి వెంటనే వివాహం జరిపిస్తాను ! ఎందుకంటే ఆ ఉదయనుడు ఏ క్షణంలోనైనా ఇక్కడకు రావచ్చును !’’ అంటూ అప్పటికప్పుడు ఏ ఆడంబరాలు లేకుండా అయ్యప్పస్వామి విగ్రహం ముందరే తన కుమార్తె శశికళను జయవర్థనుడికిచ్చి వివాహం జరిపించాడు ! ‘‘ఇక మేము మా ప్రాంతానికి తిరిగి వెళ్లడానికి అనుమతినివ్వండి మహారాజా ! ఆ ప్రాంతం అయ్యప్పస్వామి తిరుగాడిన పవిత్ర ప్రదేశం కావడంతో అటువైపు ఆ దుర్మార్గుడు రాలేడు !’’ అన్నాడు జయవర్థనుడు భార్యా సమేతంగా వెళ్లడానికి సిద్ధమై ! ‘‘అవును ! త్వరగా మీ ప్రాంతానికి చేరుకోవడమే మంచిది ! వెళ్లిరండి ! స్వామి దయతో సర్వశుభాలతో సంతోషంగా జీవించండి’’ అంటూ ఆశీర్వదించి వాళ్లు వెళ్లిపోయాక దీర్ఘంగా నిట్టూర్చాడు రాజు తేలిక పడిన హృదయంతో.
‘‘ఏమిటి ? నీ కుమార్తెకు ఎప్పుడో వివాహమైపోయిందా ? ఆమె నీ భవనంలో లేదా ? రాజా ! నీవు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు ! ఆమెనెక్కడో దాచి నా కంటబడకుండా చేసావు గదూ ? నిన్ను తేలిగ్గా వదిలిపెట్టను !’’ కోపంగా రాజును కొరడాలతో కొట్టించి కసి తీరక కారాగారంలో బంధించివేశాడు ఉదయనుడు ! రాజభవనమంతా వెతికించి రాకుమార్తె కనబడకపోడంతో నిరాశ కోపం ఆపుకోలేక అక్కడ అంతా ధ్వంసం చేసి పరివారాన్ని చంపివేసి తన ప్రతినిధులను రాజ్యపాలనకు నియోగించి వెళ్లిపోయాడు ఉదయనుడు !