స్వామి అయ్యప్ప |
స్వామి అయ్యప్ప చరితం | పదునాలుగవ భాగం
స్వామి చిరునవ్వుతో ఆ పద్ధెనిమిది దేవతల మీదుగా ఎక్కి వెళ్లి జ్ఞానపీఠమీద ఆసీనుడైనాడు ! స్వామి పాదస్పర్శతో పవిత్రమైన ఆ మెట్లను అధిరోహించడం అందరికీ సాధ్యం కాదు ! మనం ఇటునుండి వెళ్దాం పద ! అంటూ ప్రక్క మరో మార్గాన పైన వున్న ఆలయానికి చేర్చాడు వపర రాజును ! ‘‘కాంతులు వెదజల్లుతున్న ఈ కాంతి గిరి (కాంతిమల) మీద వెలసిన స్వర్ణమందిరంలోకి అడుగుపెడుతున్నాం ! అటు చూడు రాజా !’’ అని వపర చూపిన దిశగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు రాజు కళ్ళార్పడం మరచి !
మణిఖచిత సింహాసనం మీద గంభీరంగా కూర్చుని వున్నాడు మణికంఠుడు దివ్య తేజంతో ప్రకాశిస్తూ ! దేవతలు , మునిముఖ్యులు ప్రక్కగా నిలబడి స్తోత్రాలు చదువుతున్నారు ! గంధర్వులు పుప్పువృష్టి కురిపిస్తూ సామగానం ఆలపిస్తున్నారు ! యక్ష , కిన్నేర , కింపురుషాది వూర్థ్వలోక వాసులందరూ తమ తమ రీతులలో స్వామిని సేవిస్తున్నారు ! స్వామి దివ్య మంగళ రూపాన్ని చూస్తూ భక్తి పారవశ్యంతో అంజలి ఘటించాడు రాజు ! దేవేంద్రుడు చేస్తున్న స్తోత్రం వింటూ అలౌకికానందంతో పులకించిపోయాడు !
ధర్మశాస్తా స్తోత్రం
ఓంకార మూర్తి మార్తిఘ్నం దేవం హరిహరాత్మజం |
జ్ఞానపీఠ నిలయం శాస్తారం ప్రణతోస్మ్యహం ||
నక్షత్ర నాథ వదనం నాథం త్రిభువనావనం |
అమితాశేష భువనం శాస్తారం నౌమి హవనం ||
మన్మథాయుత సౌందర్యం మహాభూత నిషేవితం |
మృగయారసికం శూరం శాస్తారం ప్రణతోస్మ్యహం ||
శివప్రదాయనం భక్తదైవతం పాండ్య బాలకం |
శార్దూల దుగ్థ హర్తారం శాస్తారం ప్రణతోస్మ్యహం ||
వారణేంద్ర సమారూఢం విశ్వత్రాణ పరాయణం |
వేదోద్బాసి కరాంభోజం శాస్తారం ప్రణతోస్మ్యహం ||
యక్షిణ్యాభిమతం పూర్ణ పుష్కళా పరిసేవితం |
క్షిప్ర ప్రసాదకం నిత్యం శాస్తారం ప్రణతోస్మ్యహం ||
అంటూ స్తుతిస్తున్న దేవేంద్రుడి వైపు ప్రసన్నంగా చూస్తూ ‘‘ఇంద్రా ! మీ అందరి భక్తిశ్రద్ధలకు ప్రసన్నుడినైనాను ! మీ ఆరాధన నాకు ఆనందాన్ని ప్రసాదించింది ! ఇక నేను తిరిగి పంబళ రాజ్యానికి వెళ్లి వారికందరికి జ్ఞానబోధ కావించవలసి వుంది ! మీరందరూ పులులుగా మారి నా వెంట రావలసి వుంటుంది ! అని చెప్పడం కూడా రాజు కర్ణపుటాలలో నినదించింది ! ‘‘సాక్షాత్తూ పరబ్రహ్మ స్వయంగా వచ్చి తన అవతార లక్ష్యం వివరించినా తానే పుత్ర వాత్సల్యంతో సరిగా అర్థం చేసుకోలేకపోయాడు ! అందుకు ఆ స్వామి తనను క్షమిస్తాడా ?’’ పశ్చాత్తాపం నిండిన హృదయంతో దీనంగా స్వామివైపే చూస్తూ అనుకున్నాడు రాజు ! ఆయన అంతరంగం అవగతమైనట్లు ప్రసన్నంగా చూసాడు మణికంఠుడు రాజువైపు !
‘‘రాజా ! నా సగుణ రూపాన్ని చూసి తృప్తి చెందావు గదా ! నిజానికి ప్రతి ప్రాణి శరీరం ఆలయమైతే ఈ ఆలయం హృదయ స్థానంలో నా పీఠం వెలసి వుంటుంది ! దానిమీద జ్యోతిరూపంలో వెలుగుతుండేది నేనే ! ఈ విషయాన్ని ఎన్నడూ మరవకు సుమా ! ఇక్కడ దేవతలచేత నిర్మింపబిన ఈ స్వర్ణదేవాలయం , నా సగుణ రూపం మానవుల సామాన్య దృష్టికి గోచరంకావు ! అందుకే భూలోకవాసులకోసం ఈ ప్రాంతం శబరిగిరి క్షేత్రంగా విలసిల్లాలని , ఇక్కడ నీవు నిర్మించే ఆలయం ఈ ఆలయాన్ని పోలి వుండాలని సంకల్పించాను ! అందుకే నిన్ను రప్పించి ఈ ఆలయాన్ని చూసే అవకాశం కల్పించాను ! అంతేకాదు ఆ ఆలయంలో నా విగ్రహ రూపం ఎలా వుంటుందో కూడా నీకు దర్శింపజేస్తున్నాను ! ఇలా చూడు’’ అన్నాడు మృదుమధుర గంభీర స్వరంతో ! రాజుకు స్వామి విగ్రహం బాలుని రూపంలో కుడి హస్తం ‘చిన్ముద్ర’ ను , ఎడమ హస్తం ‘అభయముద్ర’* ను ప్రదర్శిస్తూ వుండగా , కాళ్లు పట్టబంధంతో కట్టబడి ఎంతో విశిష్టంగా , ప్రత్యేకతతో దర్శనమిచ్చింది ! ఆ విగ్రహానికి రెండు చేతులు జోడించి భక్తిపూర్వకంగా నమస్కరించాడు !
‘‘స్వామి ! ఎంతో విశిష్టంగా ఉంది మీ విగ్రహరూపం ! మహిమాన్వితమైన ఈ రూపాన్ని ఎవరు ఇదేవిధంగా తయారుచేయగలుగుతారా ? అంతటి సమర్థులు ఈ సృష్టిలో వున్నారా ?’’ అడిగాడు రాజు సందేహంగా ! ‘‘నీకు ఆ సందేహం అవసరం లేదు ! అందుకు సమర్థుడిని నేను పంపుతాను ! విగ్రహ ప్రతిష్ట ఎవరుచేయాలో కూడా నేనే నిర్ణయించుతాను ! ఇక నీవు నిశ్చింతంగా తిరిగి వెళ్లు !’’ అని స్వామి చెప్పడంతో ఆందోళన దూరమై నిశ్చింతగా ఆనందభరితమైన హృదయంతో వపర వెంట శిబిరానికి తిరిగి వచ్చాడు రాజు. ‘‘రాజా ! ఇక నేను సెలవు తీసుకుంటాను !’’ అని అదృశ్యుడైనాడు వపర !
‘‘మహారాజా ! సూర్యోదయమైంది ! తమరు లేచి నిత్యకృత్యాలు ఆచరించి , పంబానదిలో స్నానం చేసివస్తే కొండపైకి వెళ్లి బాణం ఎక్కడ పడిందో కనుక్కోవచ్చు !’’ అంటూ మంత్రి సేనాధిపతులు వచ్చి లేపడంతో మెలకువ వచ్చింది రాజుకు కళ్లు విప్పి చూసిన రాజు మొదట అయోమయావస్థలో వుండిపోయాడు కొద్ది క్షణాలుపాటు ! తాను కొండమీద తారకబ్రహ్మ మణికంఠస్వామి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించడం , స్వర్ణ ఆలయం , రత్నఖచిత సింహాసనం వంటి జ్ఞానపీఠం , దానికి అమరివున్న మహిమాన్వితమైన మెట్లు , స్వామి ఉపదేశం తలచుకుంటూ వున్నరాజు ఆనందానుభూతిలోనుండి ఎట్లాగో వాస్తవంలోకి వచ్చి తాను స్వప్నంలో అవన్నీచూసినట్లు గ్రహించాడు !
ఎంతటి దివ్యానుభూతిని అనుగ్రహించాడు స్వామి ! ఇక వెంటనే బయలుదేరి వెళ్లి బాణం పడిన తావును గుర్తిస్తాను ! అనుకుంటూ లేచి పంబా నదిలో స్నానం ఆచరించి పరివారం వెంట కొండమీదకు చేరుకున్నాడు ! బాణం పడిన తావును త్వరగానే గుర్తించాడు కొండమీద ఒక సమతల ప్రదేశంలో ! ‘‘ఇక్కడే ఆలయ నిర్మాణం ప్రారంభించాలి’’ అంటూ ఎవరికోసమో చూస్తున్నట్లుగా చూస్తున్న రాజుతో ‘‘మేము పని ప్రారంభిస్తాము మహారాజా ! మీరు అనుమతినివ్వండి’’ అంటూ ముందుకు వచ్చారు వెంట వచ్చినవారిలో నుండి కొందరు శిల్పులు ముందుకు వచ్చి ! ‘‘ఆగండి ! ఈ ఆలయం సామాన్యమైనది కాదు ! ఈ ఆలయాన్ని నిర్మించడానికి మన స్వామే కొందరు నిపుణులను పంపుతాడు !’’ అన్నాడు రాజు ! సరిగ్గా అప్పుడే విశ్వకర్మ , అగస్త్య మహర్షి అక్కడకు వచ్చారు ! ‘‘మహాత్ములారా ! ప్రణామాలు ! మీకోసమే ఎదురుచూస్తున్నాను ! దయచేయండి !’’ గబగబా ఎదురువెళ్లి నమస్కరిస్తూ అన్నాడు రాజు ! ఆయనవైపు ప్రసన్నంగా చూశారు విశ్వకర్మ , అగస్త్య మహర్షి ! ‘‘ఇక మేము ఆలయ నిర్మాణం ప్రారంభిస్తాము ! మీరందరూ వెళ్లవచ్చును !’’ అని చెప్పడంతో రాజు , పరివారంతో కొండ కిందికి దిగి వచ్చి శిబిరంలో కూర్చుని ఎదురుచూడసాగాడు ! ‘‘ఇంకా ఎప్పుడు స్వామి ఆలయాన్ని , విగ్రహాన్ని కళ్లనింగా చూసే సమయం వస్తుందో గదా’’ అనుకుంటూ ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఆయన నిరీక్షణ ఫలించింది , కొండ దిగి వస్తున్న వాళ్లను చూస్తూనే ! ఆ ఇద్దరి వెంట పరశువును భుజంమీద పెట్టుకుని గంభీరంగా నడిచి వస్తున్న మునిశ్రేష్ఠుడివైపు సంభ్రమంగా చూస్తూ గబగబా వాళ్ళను సమీపించి నమస్కరించాడు. ‘‘రాజా ! పరశురాములవారు స్వామి విగ్రహ ప్రతిష్ఠ కావించడానికి స్వయంగా రావడం నీ భాగ్య విశేషం ! పదండి ! దేవాలయాన్ని చూసి , స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కన్నులారా చూద్దురుగాని !’’ అని అగస్త్య ముని చెప్పడంతో అందరూ ఆనందోత్సాహాలతో వారి వెంట బయలుదేరారు.
అగస్త్య మహర్షి , పరశురాముడు , విశ్వకర్మ గురువులుగా ముందు నడస్తుంటే రాజు తన పరివారంతో వెనక అనుసరిస్తూ ఒక కొండ శిఖరాన్ని చేరుకున్నారు ! అక్కడ కనిపించిన ఆలయం సరిగ్గా తాను స్వప్నంలో చూసిన స్వర్ణదేవాలయాన్ని పోలి వుండటం చూసి ఆశ్చర్య చకితుడైనాడు రాజు, అగస్త్య మహర్షికి భక్తిపూర్వకంగా నమస్కరించి ‘‘నాకు కర్తవ్యోపదేశం కావించిన గురుదేవులు మీరు !మీ కృపా విశేషంవల్లనే తారకబ్రహ్మను స్వప్నంలో ఇటువంటిదే అయిన ఆలయంలో కొలువుతీరి వుండగా దర్శించే భాగ్యం లభించింది! గురుదేవా ! ఈ గిరి పేరేమిటి ? ఈ అరణ్యంలో ఈ ప్రాంతాన్ని ఏ విధంగా గుర్తించగలం ?’’ అని ప్రశ్నించాడు కుతూహలంగా చూస్తూ ! ‘‘రాజా ! ఇది శబరిగిరి ! ధర్మశాస్తా తన భక్తురాలైన శబరి నివసించిన ఈ గిరి శిఖరాన వెలిసి , ఈ ప్రాంతాన్ని మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా చేయాలని సంకల్పించారు! అందుకే ఈ గిరి శబరిగిరిగానూ , దానిపై వెలిసే తను శబరీశునిగానూ ప్రసిద్ధి చెందుతారని ఆమెకు వరం ప్రసాదించారు ! మాతో వచ్చిన మీకు మార్గాయాసం తెలియలేదు గానీ నిజానికి ఈ ప్రాంతమంతా ఘోరారణ్యాలతో , క్రూర మృగాలతో నిండిన ఎత్తయిన కొండలమధ్యగా వుంది! ఈ శబరిగిరిని చేరడానికి కొండలు , లోయలు దాటుతూ , ముళ్లదారులలో నుండి జాగ్రత్తగా నడుస్తూ ఎంతో దూరం ప్రయాణిస్తేగాని ఇక్కడికి చేరుకోలేరు మానవులు! కానీ తన దర్శనం కోసం అకుంఠిత దీక్షతో , నియమనిష్టలు పాటిస్తూ వచ్చే తన భక్తులను అయ్యప్పస్వామిగా వెలసిన మణికంఠుడు గురువుగా మార్గోపదేశం చేస్తూ , కష్టాలు దాటి తన సన్నిధానికి చేరుకునేలా చేస్తాడు !’’ అంటూ వివరించి చెప్పారు అగస్త్య మహర్షి! ‘‘అలాగా ! మరి ఆ నియమ నిష్ఠలేమిటో..?’’ అని అడగబోతున్న రాజును వారిస్తూ ‘‘ఆ విషయం తర్వాత ! ముందు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని చూడండి ! పరశురాములవారు నిర్ణయించిన ముహూర్తం దగ్గరపడింది’’* అని ఆ వైపునకు వెళ్లారు అగస్త్య మహర్షి !
పరశురాముని చేత అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ !
ఒక్కసారిగా మంగళవాద్యాల ఘోష వినవచ్చింది ! ‘‘భక్తులారా ! ఇది సూర్యుడు మకరరాశిలోకి సంక్రమణం చెందుతున్న పుణ్యకాలం. అత్యంత శుభప్రదమైనది ! గ్రహాలు , నక్షత్రాలు శుభప్రదంగా వున్న ఈ సమయంలో మణికంఠుడు భూలోకవాసులకోసం అయ్యప్పస్వామిగా అవతరించబోతున్నారు ! అందరూ చేతులు జోడించి ఆ స్వామిని ధ్యానించండి ! గంభీర స్వరంతో పలికి అగస్త్య మహర్షి ధ్యాన శ్లోకాలు పఠిస్తుంటే అందరూ శ్రద్ధగా వినసాగారు !
అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు
1. ఓంకారమూలం జ్యోతి స్వరూపం ;
పంబా నదీ తీర శ్రీభూతనాధం శ్రీ దేవదేవం చతుర్వేదపాలం ;
శ్రీధర్మ శాస్తారం మనసా స్మరామి !!
2. వందే మహేశ హరిమోహిని భాగ్యపుత్రం
వందే మహోజ్వలకరం కమనీయ నేత్రం
వందే మహేంద్ర వరదం జగదేక మిత్రం
వందే మహోత్సవ నటనం మణికంఠ సూత్రం !
3. భూయేత్ ఉమాపతిం
రమాపతి భాగ్యపుత్రం
నేత్రోజ్వలత్ కరతల భాసిరామం
విశ్వైక వపుషం మృగయా వినోదం
వాంఛానురూప ఫలదం వరభూతనాథం !
4. భూయేత్ అపార కరుణా కరుణాధివాసం
భస్మాంగ రాగ సుఘమం ప్రియభక్త వశ్యం
భూతాధిపం భువనవశ్యతరావతారం
భాగ్యోదయం హరిహరాత్మజం ఆదిమూర్తిం !!
అంటూ శ్రావ్యంగా ధ్యానించి అందరివైపు ప్రసన్నంగా చూస్తూ ‘‘స్వామి అయ్యప్ప అవతరించే శుభ ఘడియలు దగ్గర పడుతున్నాయి ! ఆ స్వామి మూలమంత్రాన్ని పలుకుతున్నాను ! అందరూ ఆ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో గొంతెత్తి పలకండి ! ఆ స్వామిని శరణువేడండి !’’ అంటూ స్వామి మూలమంత్రాన్ని పలికారు అగస్త్య మహర్షి !
స్వామి మూల మంత్రం
‘‘ఓం స్వామియే శరణం అయ్యప్ప !’’ అందరూ భక్త్భిరిత హృదయాలతో ‘‘ఓం స్వామియే శరణం అయ్యప్ప’’ అని గొంతెత్తి అంజలి ఘటించి పలుకుతుంటే శబరిగిరి ఆ శరణు ఘోషతో ప్రతిధ్వనించింది. దేదీప్యమానంగా దీపాలన్నీ వెలిగి కాంతులు వెదజల్లుతున్నాయి ! అందరికీ ఆ దీపాల కాంతిలో గర్భగుడి మధ్యలో స్వర్ణకాంతులు వెదజల్లుతున్న రత్న ఖచిత పీఠం కానవచ్చింది ! పరశురాములవారు పట్టువస్త్రాలతో కప్పబడ్డ విగ్రహాన్ని రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకుని వస్తుంటే ఆకాశంనుండి దేవదుందుభులు మ్రోగసాగాయి.
ఆలయంలో అగస్త్య మహర్షి కబురందుకుని అక్కడకు చేరిన నారదాది మునులు , ఋషి గణాలు వేదాలు పఠిస్తున్నారు ! పుష్పవృష్టి కురుస్తున్నది పరశురాముడు పీఠాన్ని చేరుకుని దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠించి వస్త్రాన్ని తొలగించాడు ! అద్భుతం ! పరమాద్భుతం ! ఆ విగ్రహాన్ని చూస్తూనే అందరి నోటినుండి ‘స్వామియే శరణం అయ్యప్ప ! శరణం అయ్యప్ప’ అన్న మంత్రం వెలువడింది ! ఆ మంత్రాన్ని తన్మయత్వంతో పలుకుతూ చేతులు తడుతున్న అందరి కళ్లకు మరొక అద్భుత దృశ్యం కానవచ్చింది !
మణికంఠుని శక్తి | విగ్రహంలో లీనం చెందుట
పంబల రాజకుమారుడుగా అందరి మనస్సులలో ముద్రించుకుపోయిన రూపం మణికంఠస్వామి సుందర బాలరూపం ! పన్నెండు సంవత్సరాల బాలుడుగా ప్రజలెరిగిన ఆ రూపంలో చేతుల్లో విల్లంబులు ధరించి మెట్లలాగా పడుకున్న పద్ధెనిమిది మంది దేవతల మీదుగా నడిచి ఎక్కి వచ్చి ఆ విగ్రహంలో విలీనమైపోవటం చూసి భక్తి పారవశ్యంతో ‘మణికంఠస్వామికి జయము ! అయ్యప్పస్వామికి జయము !’’ అంటూ నినాదాలు చేశారు అందరూ !
‘‘మహిషిని మర్దించి లోకాలకు శాంతిని ప్రసాదించిన హరిహర పుత్రుడు మణికంఠుడు తన శక్తిని ఈ విగ్రహంలో ప్రతిష్ఠ చేసి మహిమాన్వితంగా, దివ్య శక్తి సమన్వితం కావించాడు ! ఆ స్వామి ఎక్కడానికి మెట్లుగా అమరిన పద్ధెనిమిది మంది దేవతలు తమ శక్తులను మెట్లలో లీనం కావించటంతో మీకు కనిపిస్తున్న ఈ మెట్లు కూడా ఎంతో మహిమాన్వితమైనాయి ! ఇక స్వామికి శాస్త్రోక్తంగా అభిషేకం , పూజార్చనలు జరుపబడతాయి !’’ అని ప్రకటించారు అగస్త్య మహర్షి !
పంచామృతాలతో అభిషేకం , పూజా కార్యక్రమం అగస్త్య మహర్షి , మునిగణాలు పరశురాముని ఆధ్వర్యంలో నిర్వర్తించారు ! పట్టు పీతాంబరంలో , దివ్యమైన ఆభరణాలమధ్య స్వామి మణిహారం వింత వెలుగులు వెదజల్లుతుండగా భువన మోహనంగా కానవచ్చింది స్వామి విగ్రహం !
అయ్యప్పస్వామి విగ్రహ వర్ణన - అంతరార్థం
స్వామి విగ్రహంవైపు తన్మయత్వంతో చూస్తున్న అందరివైపు ప్రసన్నంగా చూస్తూ గంభీరంగా ఆ విగ్రహంలోని అంతరార్థాన్ని వివరించారు పరశురాములవారు !
‘‘భక్తులారా మీకోసమే ఈ విలక్షణమైన రూపంలో ఆవిర్భవించాడు అయ్యప్పస్వామి ! జాగ్రత్తగా చూడండి , బాలుని రూపంలో స్వామి కూర్చున్న భంగిమను ! స్వామి కుడి చేయి ‘చిన్ముద్ర’ ను చూపుతున్నది ! గురుమూర్తిగా జ్ఞాన బోధ చేస్తూ చూపే ఆ ముద్రే చిన్ముద్ర ! అందులోని ఐదు వ్రేళ్ళు ఏమి బోధిస్తున్నాయో చెబుతాను ! బొటనవ్రేలు పరమాత్మకు చిహ్నము ! చూపుడు వ్రేలు జీవాత్మకు ప్రతీక ! మధ్యవ్రేలు తమోగుణానికి , ఉంగరపు వ్రేలు రజోగుణానికి , చిటికినవ్రేలు సత్వగుణానికి ప్రతీకలు ! ఆ మూడు వ్రేళ్ళను విడిచి (మూడు గుణాలను విడిచి) జీవాత్మ అయిన చూపుడువ్రేలు , పరమాత్మ అయిన బొటనవ్రేలు వైపు వంగితే జీవాత్మ పరమాత్మలో లీనం కావడానికి సాధ్యవౌతుంది అని చెప్పడమే చిన్ముద్రలోని అంతరార్థం ! స్వామి ఎడమ చేయి పాదాలను చూపుతున్నట్లుగా వున్నది ! అది పరమాత్మలో జీవాత్మ లీనం కావాలంటే ముందుగా స్వామి పాదాలను శరణు కోరాలని సూచిస్తున్నది ! అంటే స్వామినే త్రికరణశుద్ధిగా నమ్మి పాదాలవద్ద శరణాగతి చేయడంవల్ల జీవాత్మకు పరమాత్మను చేరే సమర్థత కలుగుతుంది ! ‘పట్టబంధము’ అనే సూత్రము స్వామి మోకాళ్ల క్రింది నుండి వాటిని కలుపుతూ కట్టబడి వుండటం గమనించండి. నిశ్చలంగా ఆ భంగిమలో కూర్చుని తనను నమ్మి వచ్చే భక్తుల కోర్కెలు తీర్చివారిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందేలా చేస్తానంటూ ప్రసన్నమైన ముఖంతో అభయం ప్రసాదిస్తున్నాడు అయ్యప్పస్వామి ! పట్టబంధము హరిహరుల అభిన్నత్వాన్ని సూచిస్తుంది ! ఇప్పుడు స్వామి దాల్చిన విలక్షణమైన రూపానికి అర్థం తెలుసుకున్నారు గదా ! ఇక మనసా, వాచా, కర్మణా (త్రికరణములు) ఆ స్వామినే శరణుకోరుతూ ప్రార్థించుదాం !’’
పరశురాములవారి ప్రసంగంతో స్వామి విగ్రహంలోని అంతరార్థాన్ని తెలుసుకోవడంతో భక్తి పారవశ్యంతో పులకించిపోతూ శరణు ఘోష కావించారు అందరూ ఋషి మునుల గానానికి వంత పలుకుతూ !
అయ్యప్పస్వామి శరణు ఘోష
- ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా శరణు అయ్యప్ప
- ఓం అనాథ రక్షకా శరణం అయ్యప్ప
- ఓం ఆపద్బాంధవా శరణం అయ్యప్ప
- ఓం ఆశ్రీత వత్సలా శరణం అయ్యప్ప
- ఓం ఆనంద రూపా శరణం అయ్యప్ప
- ఓం కాంతిగిరి వాసా శరణం అయ్యప్ప
- ఓం సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి శరణం అయ్యప్ప
- ఓం సర్వ మంగళదాయక శరణం అయ్యప్ప
- ఓం సద్గుణ రూపా శరణం అయ్యప్ప
- ఓం సద్గురు నాధా శరణం అయ్యప్ప
- ఓం పరంజ్యోతిరూపా శరణం అయ్యప్ప
- ఓం పూర్ణాపుష్కళనాథా శరణం అయ్యప్ప
- ఓం వేదాంత రూపా శరణం అయ్యప్ప
- ఓం భూతగణాధిపాయా శరణం అయ్యప్ప
- ఓం భక్తవత్సలా శరణం అయ్యప్ప
- ఓం శబరిగిరీశా శరణం అయ్యప్ప
- ఓం శాంతిమూర్తి రూపా శరణం అయ్యప్ప
- ఓం శ్రీ హరిహరపుత్రా శరణం అయ్యప్ప
- ఓం శ్రీ ధర్మశాస్తా రూపాయ శరణం అయ్యప్ప
- ఓం లోకరక్షకా శరణం అయ్యప్ప
- ఓం బ్రహ్మ స్వరూపా శరణం అయ్యప్ప
- ఓం బ్రహ్మాండ నాయకా శరణం అయ్యప్ప
శరణుఘోషతో శబరి గిరి ప్రాంతమంతా ప్రతిధ్వనించిపోయింది ! అంతా పవిత్ర వాతావరణం నెలకొన్నది ! గర్భగుడిలో (సన్నిధానం) ప్రతిష్ఠింపబడిన అయ్యప్పస్వామి విగ్రహం చిన్ముద్ర అభయ ముద్రలతో పట్టబంధంతో పీఠం మీద ఆసీనుడైవున్న భంగిమలో శరణుఘోష వింటూ ఆనందిస్తున్నట్లు ప్రసన్నంగా చూస్తూ దేదీప్యమానంగా వెలిగిపోతున్నది ! సాయం సంధ్య సమీపిస్తుండగా తిరిగి పంచలోహమయమైన ఆ సుందర మూర్తికి ఆవునెయ్యి , పాలు , పెరుగు , తేనె, గంధం , పన్నీరు , చక్కెర మొదలైన ద్రవ్యాలతో అభిషేకలు , షడశోపచారాలు జరిపి పూలమాలలతో దివ్యంగా అలంకరించి ధూప , దీప , నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతులిస్తున్నారు ఋషిగణాలు ! జేగంటలు మ్రోగుతున్నాయి !
మకరజ్యోతిగా అయ్యప్ప సాక్షాత్కారం
జేగంటల మ్రోతలో అందరూ భక్తి పారవశ్యంలో పులకించిపోతూ శరణుఘోష చేస్తుండగా పరమాద్భుతమైన దృశ్యం ఆకాశ వీధిలో దర్శనమిచ్చింది ! శబరిగిరికి ఎదురుగా కొద్ది దూరంలో వున్న కాంతిగిరి (కాంతిమల) (మహిషిని చంపడానికి ముందుగా దేవతల చేత మణికంఠుడు పూజింపబడిన గిరి) శిఖరాన ఒక కోటి సూర్య ప్రభలు వెదజల్లుతున్న జ్యోతి ప్రకటితమైంది !అందరూ ఆ జ్యోతినే చూస్తూ వుండిపోయారు కొద్ది క్షణాలపాటు !
‘‘నా ప్రియభక్తులారా, మీ అందరికి భక్తి విశ్వాసాలకు ప్రసన్నుడినై మీకు జ్యోతిరూపంలో నా దర్శనాన్ని ప్రసాదిస్తున్నాను! నా జ్యోతి రూపాన్ని చూసే శక్తి మీ నేత్రాలకు అనుగ్రహిస్తున్నాను ! ఇకపై ప్రతి సంవత్సరం ఈ మకర సంక్రమణ పవిత్ర దినాన సూర్యాస్తమయానంతరం నా జ్యోతి రూపం నక్షత్రంలాగా వెలుగుతూ ఆకాశ మార్గాన దర్శనమిస్తుంది ! దానిని మకరజ్యోతిగా గ్రహించి , దర్శించి, సర్వ శుభాలు పొందురుగాక!’’ అని మేఘగంభీర స్వరంతో స్వామి విగ్రహం నుండి వెలువడిన పలుకులు విని అందరూ అలౌకానందంతో తన్మయులైనారు ! ‘‘స్వామీ ! నీ కృపాదృష్టి కురిపించి మా జీవితాలకు ధన్యత్వం ప్రసాదించావు ! నీకు కోటి కోటి ప్రణామాలు ! స్వామి ! నీ చరణాలే మాకు శరణం ! మా పట్ల ఎప్పుడూ దయాదృష్టితో వీక్షిస్తూ మాకు అండగా వుండాలి స్వామి !’’ అంటూ రాజు , పంబల ప్రజలు , ఋషిగణాలు అందరూ ముక్తకంఠాలతో ప్రార్థించారు ! ‘‘భక్తులారా ! మకర జ్యోతిగా దర్శనమివ్వడంలో అయ్యప్ప స్వామి ఇచ్చిన సందేశాన్ని మీకు వివరిస్తాను ! మకరకంటే మొసలి ! ఆకాశాన శింశుమార చక్రమనే జ్యోతి చక్రం తిరుగుతూ వుంటుంది ! ఈ జ్యోతిశ్చక్రం పరబ్రహ్మరూపమే ! ఆ పరబ్రహ్మరూపాన్ని దర్శించడానికి నిర్మలమైన హృదయం, సాధన , భక్తి విశ్వాసాలు కలిగివుంటేనే సాధ్యవౌతుంది ! ఇప్పుడు మొదటగా మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామిని వచ్చే సంవత్సరం తిరిగి దర్శించడానికి తగిన సాధనతో తరలిరావాలి ! స్వామి జ్యోతి రూపాన్ని దర్శించి ధన్యులు కావాలి !’’ అంటూ వివరించారు అగస్త్య మహర్షి !
‘‘తప్పకుండా వస్తాం ! మకర జ్యోతిని దర్శించుకుంటాం !’’ అందరూ ఉత్సాహంగా ఎలుగెత్తి పలికారు ! వాళ్ల జవాబు విని చిన్నగా నవ్వారు అగస్త్య మహర్షి ! ‘‘ఆ విధంగా దర్శించడానికి ఆచరించవలసిన నియమ నిష్ఠల గూర్చి భక్తులందరూ తెలుసుకోవాలన్నదే అయ్యప్పస్వామి ఉద్దేశ్యం కూడా ! అందుకే ఆ బాధ్యత నాపై వుంచారు ! ఆ విషయాలన్నీ స్వయంగా నాకు తెలియజెప్పి , వాటిని సమర్థులైన వారి ద్వారా సామాన్యులలో వ్యాప్తికావించమని ఆదేశించారు ! అటువంటి సమర్థులే ఇకపై ఈ ఆలయంలో విధి విధానంగా అభిషేకాలు , పూజార్చనలు నిర్వహించగలరు ! వారిని పరశురాములవారు పరీక్షించి, ఈ కార్యానికి యోగ్యులుగా నిర్ణయించారు ! మరికొద్దిసేపట్లో వారిక్కడికి రాగలరు !’’ అని అగస్త్య మహర్షి చెప్పింది విని అందరూ వారికోసం ఎదురుచూడసాగారు !
ప్రధాన అర్చకుల నియామకం
మకరజ్యోతిని దర్శించిన తృప్తి , ఆనందాలతో ఆ రాత్రి మిగిలిన కార్యక్రమాలు అందరూ భక్తిశ్రద్ధలతో చూస్తుండగా ఇద్దరు అర్చకులు గబగబా నడుచుకుంటూ వచ్చి అగస్త్య మహర్షికి , పరశురాములవారికి నమస్కరించారు ! ‘‘గురువర్యులకు ప్రణామాలు ! మీ సందేశం అందుకుని వెంటనే బయలుదేరాము ! మా ప్రాంతంలో పవిత్ర గోదావరి నది పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! స్వామి కార్యమని నమస్కరించి విన్నవించాము ! ఆ నదీమతల్లి కరుణతో రెండు పాయలుగా చీలి మాకు దారి ఇచ్చింది ! త్వరగా దాటి ఇలా మీ సన్నిధికే వస్తున్నాము ! ఆలస్యానికి మన్నించండి !’’ అంటూ విన్నవించుకున్నవారు ఆ ఇద్దరు వ్యక్తులు ! పరశురాములవారు వాళ్ల వైపు ప్రసన్నంగా చూసారు !
‘‘పరవాలేదు ! మేము అర్థం చేసుకున్నాము !’’* అంటూ రాజును , ప్రజలను ఉద్దేశిం ‘‘భక్తులారా ! ఇకపై వీరే ఈ ఆలయ బాధ్యతలన్నీ నిర్వహిస్తారు ! రేపటి నుండి స్వామికి వేదోక్తంగా పూజావిధులు జరుపుతారు ! వీరు తపస్సంపన్నులు ! తారక బ్రహ్మ అయ్యప్ప స్వామి భక్తులు ! గోదావరి నది తీర ప్రాంతంలో హరిహరుల దేవాలయంలో అర్చకులైన వీరు ఇక్కడ స్వామిని సేవించడానికి అర్హులని నిర్ణయించి ఇక్కడకు రప్పించడం జరిగింది ! వీరి పేర్లు తాయమన్ సోదరులు ! ఇప్పటినుండీ వీరు , వీరి తర్వాత వీరి వంశస్థులు అయ్యప్పస్వామి ప్రధాన అర్చకులుగా ఈ ప్రాంతంలోనే నివసించగలరు ! మేము వారికన్నీ వివరంగా తెలిపి వెళుతాము ! మీరందరూ తిరిగి వెళ్లి రేపు ఉదయం వచ్చి దర్శించుకోండి ! ప్రధాన తంత్రులు (అర్చకులు) అయిన వీరే గురువులుగా మీకు స్వామి ఆరాధనా విధులు తెలియజెబుతారు ! అందరూ భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధించి జీవితాలు ధన్యం చేసుకోండి !’’ అని తెలియజెప్పారు ! ‘‘మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాము ! మీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము! స్వీకరించండి గురుదేవులారా !’’* అంటూ పరశురాములవారికి అగస్త్య మహర్షికి ప్రణామాలు అర్పించి కొండ దిగి వచ్చారు రాజు , పరివారం , పందల రాజ్య ప్రజలు ! మర్నాడు వారందరూ తిరిగి కొండమీదికి వచ్చేసరికి ప్రధాన తంత్రులు స్వామికి అభిషేకార్చనలు , అలంకారం , పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ! అవన్నీ చూసి పులకించిపోయారు రాజు, పరివారం !