Subramanya swamy |
మార్గశిరమాసంలో సుబ్రహ్మణ్య షష్టి విశేషాలు:
సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి . ఇది దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు ఉన్న ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు చేస్తారు. ఆలయ సమీపంలో తీర్దాలు, జాతరలు ,తిరునాళ్ళు ఆధ్యాత్మిక వినోద కార్యక్రమాలు జరుపుతారు.
ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు.
శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు, సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.
దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది.
పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న "తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు.
ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు. అని తరుణోపాయం చెప్పాడు.
దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు.
ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా, ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తీకేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.
అంతట ఆ కుమార స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.
సుబ్రహ్మణ్యషష్ఠి పూజలు ఫలితాలు:
జాతకంలో కాలసర్పదోషం ఉన్న వారు,కుజ,రాహు,కేతు దశలు నడుస్తున్నవారు,కుజ దోషం ఉన్నవారు, సంతానంలేని వారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారు.
సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి, సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు ,తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామార్ద్యాలు కలిగి ఉంటారు. సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పుజలందుకోవటం జరుగుతుంది
సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు.
"శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గంథాలు పేర్కొంటున్నాయి.
సుబ్రహ్మణ్య షష్టి పండుగ విశేషాలు:
ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. "సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి" అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.
అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది.
కొన్ని ప్రాంతాల్లో, షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ. తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.
సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది. ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.
సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం
ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి. మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీక్కుతినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది. ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వత్రంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు.
శ్రీ శ్రీ శ్రీ షణ్ముఖస్తుతి
ధ్యానం:
ధ్యాయేత్షణ్ముఖమిందుకోటిసదృశం రత్నప్రభాశోభితం
బాలార్కద్యుతిషట్కిరీటవిలసత్కేయూరహారాన్వితం ॥ 1॥
కర్ణాలంబితకుండలప్రవిలసద్గండస్థలాశోభితం
కాంచీకంకణకింకిణీరవయుతం శృంగారసారోదయం ॥ 2 ॥
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం శ్రీద్వాదశాక్షం గుహం
ఖేటం కుక్కుటమంకుశం చ వరదం పాశం ధనుశ్చక్రకం ॥ 3 ॥
వజ్రం శక్తిమసిం చ శూలమభయం దోర్భిర్ధృతం షణ్ముఖం
దేవం చిత్రమయూరవాహనగతం చిత్రాంబరాలంకృతం ॥ 4 ॥
షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ |
రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౧ ||
జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ |
కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౨ ||
ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ |
శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౩ ||
సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ |
సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౪ ||
ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ |
గంగోద్భవం సర్వజనానురాగం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || ౫ ||
బ్రాహ్మణ్యం బ్రాహ్మణో తోయం కర్మణ్యం జనసంపదాం అగ్రగణ్య మహాధ్యక్షం సుబ్రహ్మణ్య ముపాస్మహే.
స్కందాయ కార్తికేయాయ పార్వతీ నందనాయచ మహాదేవ కుమారాయ సుబ్రహ్మణ్యయతే నమః
షణ్ముఖం చ గణాధీశం సాంబంచ పరమేశ్వరం మమదుఃఖ వినాశాయ సంతతం చింతయామ్యహం
తప్తచామీ కరప్రఖ్యం శక్తిబాహుం షడాననం మయూర వాహనారూఢం స్కంద రూపం శివం స్మరేత్ |
ఈ శ్లోకాన్ని పఠించితే శత్రు విజయం చేకూరుతుంది
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం.
దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం
స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం.
కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం ||
సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తప్పనిసరిగా పఠించాల్సిన మంత్రాలు, ఈ సుబ్రహ్మణ్య షష్టి కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యం.