Tantra |
తంత్ర దర్శనము
శ్రీ చక్రము చతుర్భుజాకారము కలిగి, నాలుగు దిక్కులా ద్వారములు కలిగి ఉంటుంది. అందులో వృత్తాలు కలిగి ఈ వృత్తాలలో ఒకదానికి మరొకటి అనుసంధానించబడిన త్రికోణాలు ఉంటాయి. వ్యతిరేక దిశలో ఉన్న అతి పెద్ద త్రికోణాలు వ్యతిరేక శక్తులు. వీటి అల్లిక (సంగమం) యే అనంత సౌఖ్యానికి దారి. మధ్యన ఉన్న బిందువే పరమానందం. త్రిపుర సుందరి యొక్క ప్రతిరూపం.
ఆద్యంతాలు లేని అనంతమైన అల్లిక
“ తయోర్విరోధోయం ఉపాధికల్పితో
నవస్తావ: కశ్చిదుపాధిరేశా:
లీషాద్యమాయ మహదాదికారణం
జీవస్య కార్యం శ్ణృ పైంచకోశం ”
అనగా
ఆత్మకి మరియు పరమాత్మ కి మధ్య కేవలం వ్యక్తిగత పరిమితులు (ఉపాధి) మరియు వివిధ సామర్థ్యాలు మాత్రమే కలవు; అంతకు మించి వేరే ఏ భేదమూ లేదు. "నా లో ప్రాణము కలదు" అని పురుషుడు తెలుసుకొనేలా చేయటమే ప్రకృతి ధర్మము. ఓ మానవా! నీవు గుర్తుంచుకొనవలసినది ఇదే!!!
“ ఏతా ఉపాధి పర జీవయోస్తయో
సమ్యాగ్నిరసేన పర న జీవో
రాజ్యం నరేంద్రస్య భటస్య ఖేతక
స్తయోరపోహేన భటో న రాజ ”
అనగా
ఈ పరిమితులు, వివిధ లక్షణాలు ఆత్మలోనూ మరియు పరమాత్మలోనూ కలవు. ఈ భేదాలని కరిగించినచో, ఒక వ్యక్తి తన రాజ్యానికి తానే ఎలా రాజగునో, అలా ఆత్మయే పరమాత్మ అగును. ఈ భేదాలని తొలగించు. అప్పుడు ఆత్మ మరియు పరమాత్మ నీకు వేరుగా కనబడవు!!!
తంత్రం అనే పదానికి తెలుగులో అర్థం నేత, లేదా అల్లిక. ఈ నేత/అల్లికలు అనంతమైన స్పృహ (చైతన్యాని)కి సూచికలు. పరస్పర వ్యతిరేకాల అల్లికయే అనంత సౌఖ్యానికి దారి అని తంత్రము సూచిస్తుంది. గృహస్థుగా ఉంటూనే పరిపూర్ణతని ఎలా సాధించవచ్చునో, ఆధ్యాత్మిక శక్తిని ఎలా పొందవచ్చునో బోధిస్తుంది. ఆత్మ ని పరమాత్మ లో ఐక్యం చేయాలనే గృహస్థు యొక్క లక్ష్యాన్ని చేరుకొనటానికి ప్రకృతి లోని శక్తి ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తుంది. మోక్షం పొందటానికి సర్వసంగపరిత్యాగమొక్కటే దారి కాదనీ, సంసార సాగరం కూడా మోక్షమార్గమే నన్న రహస్యాన్ని ఛేదిస్తుంది. మోక్షమార్గంలో ఎదురయ్యే సమస్యలనీ, అడ్డంకులనీ మరియు భావోద్రేకాలనీ స్వీకరించి, వాటిని పరిష్కరించి ఎలా ముందడుగు వేయాలో తెలుపుతుంది. ఇది భారతదేశానికి చెందిన రహస్య సాంప్రదాయాలపై ఆధారపడినది. ఈ రహస్య ఆచార-సాంప్రదాయాలతో ప్రాపంచిక శక్తి అయిన కోరిక ను పరికరంగా ఉపయోగించుకొని, సృష్టి యొక్క (వ్యతిరేక) శక్తులని అనుసంధానించి, మానవశరీరాన్ని ఎలా పరివర్తింపజేయాలో నేర్పుతుంది. దీనికి హైందవ, బౌద్ధ మరియు జైన రూపాంతరాలు కలవు. భారతదేశంతో బాటు జపాన్, టిబెట్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, కొరియా, కంబోడియా, బర్మా, ఇండోనేషియా మరియు మలేషియాలలో తంత్రము యొక్క రూపాంతరములు కలవు.
స్థూలంగా తంత్రము ఈ క్రింది వాటిని బోధిస్తుంది
ఆత్మ మరియు పరమాత్మ ఒకదాని నుండి ఒకటి సుదూరంగా కనబడిననూ అవి నిత్యం ఒకదానికి ఒకటి అల్లుకొనబడే ఉంటాయి వేదము మరియు విజ్ఞానము వ్యతిరేకాలుగా కనబడిననూ అవి ఒకదానికి ఒకటి అల్లుకొనబడి ఉంటాయి (రెండింటిలోనూ సారాంశము ఒక్కటే) భౌతికతలోనే ఆధ్యాత్మికత నేయబడి ఉన్నది.అపవిత్రత లోనే పవిత్రత నిగూఢమై ఉన్నది.
సాత్త్వికము, తామసికము మరియు రజో గుణములు వేర్వేరు అని భ్రమింపజేసిననూ అవి మూడూ ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేనంతగా పెనవేసుకొని ఉన్నాయి.
తపమునాచరించే సర్వసంగ పరిత్యాగి, సంభోగించే సంసారి; ఇరువురూ మోక్షమార్గ బాటసారులే
నిశ్చలానందము మరియు సంసారము విడదీయలేనంతగా పెనవేసుకొని ఉన్నాయి. సంసార సాగర ప్రయాణం నిశ్చలానందమును చేరుకొనటానికి దారి సత్య మార్గము నుండి గృహస్థును దూరం చేసేందుకే మాయ సంసార బాధలనే అవరోధాలు సృష్టిస్తుంది. వీటిని గుర్తించి అధిగమించినపుడే అనంత సౌఖ్యం అతనిని వరిస్తుంది.
సర్వాంతర్యామి గృహస్థు హృదయాంతరాలలోనే అంతర్లీనమై ఉన్నాడు, ప్రతిబంధకాలే మోక్షమార్గమునకు పరికరాలు ఉనికి కలది ఏదైననూ దైవ సృష్టియే. కావున ఉనికి గల దేనినీ అసహ్యించుకొనరాదు. పరిత్యజించరాదు.
వాస్తవాన్ని గుర్తించటం, సహజత్త్వాన్ని అంగీకరించటమే బ్రహ్మానంద పథం, పురోగమనము, తిరోగమనాలు తాత్కాలితాలు. రెండూ అసంపూర్ణాలే. రెండింటి అనుసంధానమే శాశ్వతం. అదే అఖండ సత్యం వ్యతిరేక శక్తులు సంగమించినపుడే సమతౌల్యము. అదే సంపూర్ణ శక్తి. పరిపూర్ణ శక్తి సమాంతర వ్యవస్థలు, వ్యతిరేక భావాలు అన్నియు ఒకదానితో ఒకటి అల్లుకొనబడి ఉన్నాయి.
వ్యుత్పత్తి
తం అనగా విస్తరణ, వ్యాప్తి త్రం అనగా పరిరక్షించటం, జ్ఞానాన్ని విస్తరించటం, జ్ఞాన విస్తరణని పరిరక్షించటమే తంత్రం. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన్, ఇతి తంత్రం అనగా జ్ఞానాన్ని విస్తరించి, దానిని చరించువారు రక్షింపబడతారు అని అర్థం.
కామికాగమము ప్రకారం
తనోతి విపులన్ అర్థన్ తత్త్వమంత్రసమన్వితాన్
త్రానంచ కురుతే యస్మత్ తంత్రం ఇత్యభిద్యతే
అనగా తత్త్వముల లోని జ్ఞానమును మంత్రము లతో కలిపి మోక్షము వైపు నడిపిస్తుంది కాబట్టే దీనిని తంత్రము అంటారు అని అర్థం.
నిర్వచనము
డేవిడ్ గోర్డాన్ వైట్, తంత్రానికి గల నిర్వచనాలు అనేకమైనవి అని, ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అని సెలవిస్తూనే పరమాత్మ స్వరూపుడైన మనిషి లో శక్తిని నింపటానికి, కర్మని స్వీకరించి, ఆచరించి మరియు విముక్తిని పొందే ప్రయత్నానికి సంబంధించిన, ఆసియాలో ఉద్భవించిన సృజనాత్మక మార్గాలు, విశ్వాసాలు మరియు ఆచరణీయ పద్ధతులే తంత్రము. మనం అనుభూతి చెందే ఈ సృష్టి కేవలం దివ్య శక్తి యొక్క రూపాంతరమని, దైవ సృష్టి మరియు దైవ పరిరక్షణ చేసేది కూడా సృష్టియే అనే భావంపై ఇది ఆధారపడినది.అని నిర్వచించాడు.
హైందవ తంత్రము
శివ పార్వతుల మధ్య జరిగిన సంభాషణలే తంత్ర సూత్రములుగా వ్యవహరింపబడుతోన్నవి శివ పార్వతుల మధ్య జరిగిన సంభాషణలే తంత్ర సూత్రములుగా వ్యవహరింపబడుతోన్నవి. శివుడు పార్వతికి తెలిపినవి ఆగమాలుగా, పార్వతి శివుడికి తెలిపినవి నిర్గమాలుగా తెలుపబడుతోన్నవి.
ఈ తంత్ర సాంప్రదాయం నాలుగుగా విభజించబడినది. అవి
- జ్ఞానము
- యోగము
- క్రియ మరియు
- చర్య
హైందవ తంత్రములో శక్తి ముఖ్య దేవతగా కొలవబడుతుంది. ఈ సృష్టి, శివ-శక్తుల దివ్య సంగమముతోనే ఏర్పడినదని నమ్మబడుతుంది. తంత్ర సాంప్రదాయాలు, వైదిక సాంప్రదాయాలకి సమాంతరంగా ఉంటూనే, ఒక దానితో ఒకటి విడదీయరానివిగా ఉంటాయి. తంత్రము ఫక్తు సనాతన వైదిక నమ్మకములు గా ముద్ర వేయబడ్డవి. తాంత్రిక రచనలు విజ్ఞాన శాస్త్రానికి ఖండించే విధంగా ఉండవు, కానీ, వైదిక బోధనలు ఈ తరం అర్థం చేసుకొనే విధంగా ఉండవు. కావున ఈ తరముకి అర్థమయ్యేలా ఇవే సిద్ధాంతాలు విజ్ఞాన శాస్త్రం ద్వారా చేయబడ్డాయని కొందరు పాశ్చాత్యుల అభిప్రాయము. సనాతన బ్రాహ్మలు కూడా కొందరు తంత్ర శాస్త్రాన్ని ధిక్కరించి, విజ్ఞాన శాస్త్రానిదే పై చేయి అని చాటారు.
ఎన్ ఎన్ భట్టాచార్య ప్రకారం ఆధునిక రచయితలు తంత్ర సిద్ధాంతాలు వేదాధారితాలు అని తెలిపినప్పటికీ పరిశోధకులు వీటిలో వేదాలకి వ్యతిరేక లక్షణాలు కలిగినట్టు గమనించారు. స్వామీ నిఖిలానందుల ప్రకారం తంత్రాలు, వేదాలకి అవినాభావ సంబంధమున్నది. అంతేగాక ఉపనిషత్తులు, యోగము వంటి వాటిని తంత్రము బాగా ప్రభావితం చేసినది.
మత శాఖలలో తంత్రము
- శైవము లో తంత్రాన్ని శైవాగమము/మంత్రమార్గము గా వ్యవహరిస్తారు
- వైష్ణవము లో తంత్రాన్ని వైష్ణవాగమము/పాంచరాత్రముగా వ్యవహరిస్తారు
- శక్తి ఆరాధన లో తంత్రాన్ని కౌల/కౌలమార్గము/శాక్తాచారము గా వ్యవహరిస్తారు
- గాణపత్యము లో తంత్రాన్ని గణపతి తంత్రము/గణపతి ఆచారముగా వ్యవహరిస్తారు
- సౌర్యము లో తంత్రాన్ని సూర్య తంత్రము/సౌరాచారముగా వ్యవహరిస్తారు
- బౌద్ధ మతము లో తంత్రాన్ని వజ్రయానము గా వ్యవహరిస్తారు
అన్ని ఆరాధనలలోనూ వీటి ఆచరణ ఒక్కటే!
బౌద్ధ తంత్రము
యాబ్-యుం ల అనంత కౌగిలి. పురుష శక్తి కరుణ మరియు ఉపాయాలకి సంకేతము. స్త్రీ శక్తి ప్రజ్ఞకి సంకేతము. ఈ భంగిమ గురించి, ఈ భంగిమలో అనుసంధానించబడే వ్యతిరేక శక్తుల గురించి, దీనిని అవలంబంచటం లో పొందగలిగే సత్ఫలితాల గురించి నవ తంత్రము లో విస్తృతంగా చర్చించబడినది. అంతే కాక ఈ భంగిమ ద్వారా సాధారణ గృహస్థు లైంగిక పారవశ్యాన్ని ఎలా పెంచుకొనవచ్చునో కూడా నవ తంత్రము తెలుపుతుంది.
బౌద్ధ తంత్రము అయిన టావోయిజం (Taoism) లో వ్యతిరేక శక్తుల సంగమ సూచిక. అద్వైతానికి ప్రతీక. వెలుగునిచ్చే తెల్లని ఉష్ణ శక్తి యంగ్ క్రింది నుండి పైకి ఎగసిపడినట్లు ఉండగా; చీకటిమయమైన నల్లని శీతల శక్తి యిన్ పై నుండి క్రిందకు కురుస్తున్నట్లుగా ఉంటుంది. వీటి సంగమము దీర్ఘాయుష్షుని, అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మకము బౌద్ధము లో తంత్రము కొనసాగింపు తత్త్వాన్ని సూచిస్తుంది. టిబెట్ దేశ తంత్రానికి అర్థం జ్ఞాన విస్తరణ.
హైందవ తంత్రముతో పోలిక బౌద్ద తంత్రము లో శివుడు యాబ్ (Yab) గా సంబోధించబడగా, శక్తి యుం (Yum) గా సంబోధించబడినది. లక్ష్యములు బౌద్ధ తంత్రము యొక్క లక్ష్యములు మహాయాన బౌద్ధము యొక్క లక్ష్యములే. అజ్ఞానాంధకారాన్ని నశింపజేయటం జ్ఞానం మరియు కరుణలని పెంపొందించటం శూన్యశక్తి, పరివర్తన, సంసారం మరియు మోక్షాల యొక్క పరిపూర్ణ అవగాహన పొందటం లక్షణాలు.
బౌద్ధ తంత్రములో ఈ క్రింది లక్షణాలు కలవు అని ఆంటోని ట్రైబ్ తెలియజేశారు.
- దైవపూజలో కేంద్రీకృతమైన ఆచారాలు
- కేంద్రీకృతమైన మంత్రాలు
- దైవదర్శనము మరియు దైవంతో స్వీయ పోలిక
- దీక్షాదక్షత, గోప్యత మరియు రహస్యతల ఆవశ్యకత
- ఆచార్యుల ప్రాముఖ్యత
- మండల ఆచారములు
- అతిక్రమ చర్యలు
- శరీరం యొక్క పునర్మదింపు
- సృష్టిలో స్త్రీ హోదా మరియు పాత్రల పునర్మదింపు
- ఆత్మ మరియు పరమాత్మల గురించి సాదృశ్య ఆలోచనా విధానము
- ప్రతికూల మానసిక స్థితుల పునర్మదింపు
విభాగాలు
బౌద్ధ తంత్రము నాలుగుగా విభజించబడినది. అవి
- క్రియ తంత్రము
- చర్య తంత్రము
- యోగ తంత్రము
- అనుత్తరయోగ తంత్రము
అనుత్తర యోగ తంత్రము మరల మూడుగా విభజించబడినది.
- పితృ తంత్రము (పురుష శక్తి అయిన ఉపాయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది)
- మాతృ తంత్రము (స్త్రీ శక్తి అయిన ప్రజ్ఞకి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది)
- అద్వైత తంత్రము (పై రెండింటికీ సమాన ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది)
చైనాలో అవలంబించే తంత్రములో మిజోంగ్ అనే రహస్య సిద్ధాంతాన్ని వాడతారు. యోగముకి బదులుగా క్విగోంగ్ అనే రూపాంతరముని వాడతారు. చైనా తంత్రములో అదనపు మంత్రాలు కూడా కలవు.
ఆచార వ్యవహారాలు
తంత్రము ఒక ఏకీకృత వ్యవస్థ కాదు. తంత్రాన్ని పాటించే వారు విస్తృతంగా ఉండటం వలన దీని ఆచార వ్యవహారాలని ఖచ్చితంగా నిర్వచించటం కష్టతరమే.
లక్ష్యము
తాంత్రిక ఆచారాలు మనిషిలోని శారీరక/మానసిక/ఆధ్యాత్మిక శక్తులని వెలికి తీయటంతో బాటుగా ఆత్మని మరియు పరమాత్మని గుర్తిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారానే ఆత్మని పరమాత్మకి అనుసంధానిస్తూ మనం అతి సాధారణ చర్యలుగా భావించే దైనందిక చర్యలని దివ్య శక్తులుగా ఉపయోగించి వాటి ద్వారా దైవ సిద్ధిని పొందే ప్రయత్నం చేస్తాయి. వాస్తవాన్ని వ్యతిరేకించకుండా అంగీకరించి, వాస్తవానికి దైవత్వాన్ని ఆపాదించి ఉత్పతనత కి దారి తీస్తాయి. ఉత్పతనత ప్రక్రియ మూడు దశలలో జరుగుతుంది.
- పవిత్రతని చేకూర్చటం
- విధానాన్ని అవలంబించటం మరియు
- సద్భావనతోనే అనంత సౌఖ్యం కలుగుతుందనే నమ్మకము కలుగజేయటం
తంత్రాన్ని అవలంబించేవాడు ప్రాణము ను (అనగా సృష్టిలోని తన శరీరం గుండా ప్రవహించే శక్తిని) ఉపయోగించుకొని జీవిత (ఆధ్యాత్మిక లేదా/మరియు భౌతిక) లక్ష్యాలని చేరుకొంటాడు.
శ్రీ చక్ర యంత్రము
న దేవో దేవం అర్చయేత్ అంటే నీవు దైవము కాలేకపోతే దైవముని నీవు అర్చించలేవు అని అర్థం. మానవుడు దైవముచే సృష్టించబడిన, దైవముచే నడిపించబడుతున్న ప్రపంచములో జీవిస్తున్నాడు. మానవుడికీ, దైవముకీ మధ్యన ఉన్న ఒక సారూప్యములో అతీంద్రియ శక్తులు విస్తరించి ఉంటాయి. తాంత్రిక ఆచారాలతో మానవుని శరీరం సృష్టి నుండి ఈ సారూప్యతని స్వీకరించేలా చేస్తాయి.
తాంత్రిక పద్ధతులను అవపోసన పట్టటానికి ఒక గురువు క్రింద దీర్ఘకాలిక శిక్షణ అవసరమౌతుంది. ఆధ్యాత్మిక శక్తిని సాధించటానికి, ధ్యానాన్ని కేంద్రీకృతం చేయటానికి వివిధ పరికరాల అవసరం అవుతుంది. అవి
యోగము: మనోశక్తి మరియు శారీరక శక్తుల సమతౌల్యం సాధించటానికి ప్రాణాయామం మరియు ఆసనాలు. ఆత్మని పరమాత్మతో అనుసంధానించటానికి ధ్యానం ముద్ర
మంత్రము: ఇష్ట దైవాన్ని స్మరించుకోవటానికి మరియు జీవంలో శక్తిని నింపటానికి మండలము
యంత్రము: ధ్యానాన్ని కేంద్రీకరించటానికి దైవముతో పోలిక గుహ్యసమాజ తంత్రము ప్రకారం - కష్టతరమైన, అసహజమైన ఆచారాలతో ఎవరూ మోక్షాన్ని పొందలేరు. కోరికలన్నింటినీ తీర్చుకొంటేనే మోక్షము ప్రాప్తిస్తుంది.
వర్గీకరణ
దక్షిణాచారం మరియు వామాచారం ల విధివిధానాలలో భేదాలు ఉన్ననూ, అవలాన్ (1918) ప్రకారం తాంత్రిక ఆచారాలని రెండు విధాలుగా విభజించవచ్చును. అవి
- సాధారణ ఆచారం
- పవిత్ర ఆచారం
- సాధారణ ఆచారం
పూజ వంటివి సాధారణ ఆచారాలు. పూజలో ఈ క్రింది అంశాలు ఉండవచ్చును.
- మంత్రము,
- తంత్రము,
- యంత్రము
- న్యాసము
ప్రధాన వ్యాసం: యంత్రము (తంత్రము) ఇతర హైందవ, బౌద్ధ సంప్రదాయాల వలె, తంత్ర శాస్త్రములో మంత్రము, తంత్రము, యంత్రము మరియు న్యాసము ముఖ్య పాత్ర పోషిస్తాయి.
- మంత్రము అనగా జపం
- తంత్రము అనగా తత్త్వము/వేదాంతము
- యంత్రము అనగా పరికరము
- న్యాసము అనగా మంత్రానికి అనుగుణంగా స్పర్శించవలసిన శరీర భాగము
శివుడు, శక్తి మరియు కాళి వంటి దైవాలను ప్రసన్నం చేసుకొనటానికి మంత్రము మరియు యంత్రము పరికరాలుగా ఉపయోగపడతాయి. ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకొనటానికి ధ్యానాన్ని సంబంధిత యంత్రము పై గానీ, మండలము పైగానీ కేంద్రీకరించవలసి ఉంటుంది. న్యాసము మానవ శరీరములో దైవాన్ని జాగృతం చేయటానికి ఉపయోగపడుతుంది.