Swamy Ayyappa |
స్వామి అయ్యప్ప చరితం | తొమ్మిదవ భాగం
భక్తిప్రపత్తులతో గురువుగారికి పాదాభివందనం కావించాడు మణికంఠుడు. వినయం వుట్టిపడుతున్నది. మాటలతో ఇట్లా అడిగాడు. ‘‘గురుదేవా ! విద్య నేర్పిన గురువుకు గురుదక్షిణ సమర్పించుకోకపోతే ఆ శిష్యుని జీవితం నిర్థకవౌతుంది ! మీకు నేను ఏమి సమర్పించినా అది మీరు నేర్పిన విద్యకు , నాపట్ల చూపిన వాత్సల్యానికి సరికాదు ! దయయుంచి నేనేమి ఇవ్వమంటారో మీరే సెలవిచ్చి నన్ను ధన్యుడిని చేయండి!’’ ఆ మాటలు విని కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు గురువు.‘మణికంఠుడు సామాన్య మానవ బాలుడు కాదనీ , కారణ జన్ముడని తన మనస్సు చెబుతున్నది ! నా తలపు తప్పుకాకపోవచ్చును ! ఈ విధంగా అడిగి చూస్తాను ఏం చేస్తాడో చూస్తే తన అంచనా నిజవౌతుంది!’* అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి లోపలకు వెళ్లాడు ! ఆశ్రమంలో ఒక మూలగా కూర్చుని వున్న పదేళ్ల కుమారుడిని చేయిపట్టి నడిపించుకుంటూ బయటకు తీసుకువచ్చాడు.
‘‘మణికంఠా ! ఈ నా పుత్రుడు మూగతనంతో , అంధత్వంతో , చెవిటితనంతో పుట్టి మాకు తీరని దుఃఖాన్ని ప్రసాదించాడు ! ఈ సంగతి నీకు కూడా తెలుసును గదా ! పూర్వజన్మలో చేసిన పాపానికి ఈ విధమైన శిక్షననుభవిస్తున్నాడీ జీవుడని తెలిసినా పుత్ర వ్యామోహం నన్నీ విధంగా అడగటానికి పురికొల్పుతున్నది ! నాయనా ! నా కుమారుని ఆరోగ్యవంతుని చేయగలవా?’’ అని అడిగాడు రుద్ధకంఠంతో ! చిన్నగా నవ్వి ఆ బాలుడి దగ్గరకు వెళ్లి కళ్లను , చెవులను, ముఖాన్ని తడిమి ‘‘నీ పాపాలు ఈనాటితో పరిహారమైనాయి. గురుపుత్రా! ఇలా చూడు’’* అన్నాడు మణికంఠుడు గంభీరంగా. గురుపుత్రుడు మణికంఠుని వైపు చూస్తూ నిలిచాడు ! అతనికి జ్యోతి రూపంలో కనిపించాడు మణికంఠుడు ! ఆ జ్యోతిలో నుండి ఓంకార నాద తరంగాలు గురుపుత్రుని చెవిలో ప్రవేశించాయి ! నోటినుండి అప్రయత్నంగా మాటలు వెలువడ్డాయి !
‘‘జ్యోతి రూపంలో దివ్యంగా ప్రకాశిస్తున్న పరమాత్మా నీకు నా ప్రణామాలు ! ఓంకారనాదం నీ నుండి వెలువడింది. ఆ నాదం నాకు స్పష్టంగా వినిపిస్తున్నది ! ఈ మాటలు నీ అనుగ్రహంవల్లనే నా నుండి వెలువడుతున్నాయి ! నాకు మీ దర్శనభాగ్యం , ఓంకార నాదాన్ని వినే భాగ్యం , మాట్లాడే సామర్థ్యం ప్రసాదించిన ఓ జ్యోతి స్వరూపా ! నీకివే నా కోటి కోటి ప్రణామాలు!’’* అంటూ నమస్కరించాడు.
గురువు ఆనందం వర్ణనాతీతం !
‘‘మణికంఠా ! నీవే పరమాత్ముడవు ! ఈ రూపంలో మా మధ్య వుంటున్న నిన్ను చూస్తూ నీతో కాలం గడిపే అదృష్టాన్ని అనుగ్రహించావా స్వామీ ! వేదాలు , పురాణాలు , శృతి శాస్త్రాలు అన్నీ నీలోనే నిక్షిప్తమై వుండగా నీకు నేను గురువుగా నేర్పాననుకోవడం భావ్యం కాదు ! నీవే అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని అందించగల సమర్థుడివి ! హే ! ఓంకార రూపా ! మాకు బ్రహ్మజ్ఞానం గూర్చి తెలియజెప్పి మమ్మల్ని అనుగ్రహించు!’’* అని వేడుకున్నాడు భక్త్యావేశంతో పులకించిపోతూ !
వాళ్లిద్దరి వైపు ప్రసన్నంగా చూసాడు మణికంఠుడు ! గురువు కోరినట్లు బ్రహ్మజ్ఞానం గూర్చి ఉపదేశించాడు !
మణికంఠుని ఉపదేశము
‘‘గురువర్యా ! గురుపుత్రా ! ఈ సృష్టి సర్వానికి మూలమైన భగవంతుడు నిరాకారుడు ! జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు జ్ఞాన నేత్రాలకు ! సృష్టి విస్తరణ కోసం ప్రకృతి పురుషులుగా ప్రకటితమై ప్రాణికోటిని సృష్టిస్తాడు బ్రహ్మరూపంలో ! ఆ ప్రాణకోటిని విష్ణువుగా పోషించి , పాలించి తిరిగి శివుని రూపంలో అంతం కావిస్తుంటాడు.
సృష్టి స్థితి లయలనే ఈ మూడు కార్యాలు మూడు రూపాలలో తానే నిర్వహిస్తుంటాడు నిర్గుణ పరబ్రహ్మయైన భగవంతుడు ! కర్మభూమి అయిన ఈ భూలోకంలో మానవ శరీరాలతో నిర్గుణ పరబ్రహ్మ జీవాత్మగా హృదయ స్థానంలో వెలుగొందుతాడు ! తల్లి గర్భం నుండి శిశువుగా జన్మించి క్రమంగా బాల్య , కౌమార , యవ్వన , వృద్ధాప్యం అనే నాలగు అవస్థలు అనుభవించి , కర్మలు ఆచరించి వాటికి అనుగుణంగా మరణానంతరం ఆ జీవిలోని ఆత్మ మరో శరీరాన్ని ధరాణ చేస్తుంది!
గురుపుత్రా ! బ్రహ్మజ్ఞానం పొందనీయకుండా మాయ అనబడే అరిషడ్వర్గాలుగల పొర (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు) జీవాత్మను కప్పి వుంచుతుంది ! అందుచేత వాటి ప్రభావానికి లోనై పరబ్రహ్మను చూసే అవకాశాన్ని , అదృష్టాన్ని పోగొట్టుకుంటాడు ! నీ విషయంలో జరిగిందదే ! అరిషడ్వర్గాలకు లోబడి పూర్వజన్మలో అనేకమైన పాపకర్మలు చేసి జ్ఞానం పొందలేకపోయావు ! నీలోనే వెలిగే ఆ జ్ఞానజ్యోతిని చూడలేకపోవటమే అంధత్వానికి కారణం ! మనస్సనే సరోవరంలో హంసరూపంలో వెలిగే జవాత్మ శరీరంలోని గుప్తమైన నాడీ స్థానాలలో ఆగుతూ పైకి శిరస్సువైపు ప్రయాణిస్తూ వుంటుంది ! అదే యోగమార్గం ! ఆ మార్గంలో మూలాధార చక్రం మీద కింకిణీనాదంగానూ , స్వాధిష్ఠాన చక్రం దగ్గర వేణుగానంగానూ , మణిపూరక చక్రం దగ్గర వీణానాదంగానూ , అనాహత చక్రం దగ్గర శంఖనాదంగాను , విశుద్ధ చక్రం దగ్గర మేఘనాదంగానూ (ఉరుము శబ్దం), ఆజ్ఞాచక్రం దగ్గర సముద్ర ఘోషలాగా , సహస్రార చక్రం దగ్గర తుమ్మెద ఝంకారంలాగానూ ఓంకారం తిరుగుతుంటుంది !
ఈ నాదం అజ్ఞానులకు వినిపించదు ! అదే ఏమీ వినిపించని చెవిటితనం ! ఇక ఈ రెండు కార్యాలు జ్ఞానేంద్రియాలు చేయడానికి సమర్థవంతం కానప్పుడు మూగతనం వస్తుంది ! భగవంతుని కీర్తించే అవకాశం వుండదు ! స్తబ్దుడుగా వుండిపోతుంది జీవాత్మ ! ఇంతకాలం నీవున్నది ఆ జడావస్థలోనే ! ఇప్పుడు వాటిలో చైతన్యం ప్రవహిస్తున్నది ! నీలోని జీవాత్మ అరిషడ్వర్గాలను జయించి పరమాత్మను చేరడానికి (మరు జన్మలేని ముక్తిని) యోగమార్గంలో సాధన చేయి ! ఓంకరాన్ని జపిస్తూ వుండు ! క్రమంగా బ్రహ్మజ్ఞానం అంటే అవగాహన ఏర్పడుతుంది !’’ అని ఉపదేశించాడు శాంత , గంభీర స్వరంతో !
‘‘ధన్యులం ఓంకారరూపా ! మణికంఠా ! మీ కివే మా కోటి కోటి ప్రణామాలు!’’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించారు గురు , ఆయన కుమారుడు ! గురువు అనుమతి తీసుకుని రాజధానికి తిరిగి వచ్చాడు మణికంఠుడు ! అప్పటికి పదేళ్ల వాడయినాడు ! తల్లిదండ్రుల కంటి వెలుగుగా , ప్రజల కష్ట , సుఖాలు స్వయంగా అడిగి తెలుసుకుంటూ జనరంజకంగా ప్రజాహిత కార్యాలు చేస్తూ ఆదర్శంగా పాలన జరుపుతున్నాడు ! ప్రయోజకుడైన కుమారుడికి పట్ట్భాషేకం చేసి తాను విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన కలిగింది రాజశేఖరుడికి !
మంత్రి కుతంత్రం
మణికంఠుని మీద రాజదంపతుల వాత్సల్యానురాగాలు , ప్రజల ప్రేమాభిమానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ! హు ! తన ఆలోచనలన్నీ తలక్రిందులైనాయి. ఎవరికో జన్మించి మహారాజు కళ్లబడి దత్తపుత్రుడుగా ఈ మణికంఠుడు వచ్చి తన మార్గానికి అడ్డుగా నిలబడిపోయాడు ! ఈ అడ్డును తొలగించుకుని రాజ్యాన్ని తన వశం కావించుకోవాలి ! ఏం చేస్తే తన మార్గం నుండి ఆ మణికంఠుడు తొలగిపోతాడు ?
తన ఇంట్లో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మంత్రి వీరబాహు ! పైకి విశ్వాసపాత్రుడుగా నటిస్తూనే రాజ్యాన్ని ఏ విధంగా తన హస్తగతం చేసుకోవాలా అని ఆలోచిస్తూ వుంటాడు మనస్సులో! రాజదంపతులకు సంతాన భాగ్యం లేదనీ , రాజ్యం ఆయన తదనంతరం తన వశం చేసుకోవాలనే దురాలోచనలో వున్న మంత్రికి మణికంఠుని రాక ఎంత మాత్రం నచ్చలేదు ! అందుకే అతడిని ఎట్లాగైనా తన మార్గం నుండి శాశ్వతంగా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘‘మహామంత్రీ! ఏమిటి ఏదో దీర్ఘాలోచనలో వున్నట్లున్నారు?’’* అంటూ సేనాపతి వచ్చి పలకరించాడు ! సేనాపతి కూడా మంత్రిలాగానే మణికంఠునిపై ప్రజల ప్రేమాభిమానాలు చూసి ఈర్ష్యాసూయలతో దహించుకుపోతున్నాడు.
ఇద్దరూ కలిసి ఎట్లాగైనా మణికంఠుని త్వరలో అంతం చేయాలని ఆ రోజు చాలాసేపు చర్చించుకున్నారు. ‘‘మహామంత్రి ! నాకొక ఉపాయం తోస్తున్నది ! మనమీద ఎవరికీ అనుమానం రాకుండా ఈ విధంగా చేస్తే.. ’’* అంటూ తనకు తోచిన పథకం చెప్పాడు సేనాపతి. అతను చెప్పింది విన్న మంత్రి ముఖం ఆనందంతో వికసించింది. ‘‘నేనూ సరిగ్గా అట్లాగే అనుకున్నాను ! స్వయంగా విచారించి తెలుసుకున్నాను. అటువంటి వాటిలో బాగా నిపుణుడని ! ఇంకా ఆలస్యం ఎందుకు ? పదా ! వెళ్లి కలుసుకుని విషయం చెప్పివద్దాం!’’* అంటూ లేచాడు ఉత్సాహంగా ! ఇద్దరూ వేషాలు మార్చుకుని రహస్య మార్గాన బయటకు వెళ్ళారు .
మణికంఠుని అస్వస్థత
‘‘ప్రభూ ! ప్రభూ ! రాకుమారుడు అస్వస్థులైనారు ! విపరీతమైన బాధతో శయ్యపైనుండి లేవలేకపోతున్నారు ప్రభూ!’’ అంటూ పరిచారికలు పరుగు పరుగున వచ్చి చెప్పడంతో ఆందోళనగా మణికంఠుని శయనాగారంలోకి వెళ్ళారు రాజదంపతులు ! ‘‘బాధ ! బాధ !’’ అంటూ సతమతవౌతున్నాడు మణికంఠుడు ! శరీరం శక్తి హీనమై కదలలేకపోతున్నాడు ! బంగారు మేనిఛాయ నలుపు రంగులోకి మారింది ! చర్మమంతా ముడుతలు పడి వ్రణాలతో రసి కారుతున్నది !
‘‘అయ్యో ! ఏమిటీ విపరీత పరిస్థితి ? రాత్రివరకు ఆరోగ్యంగా వుండిన నీకు హఠాత్తుగా ఇటువంటి రోగం ఏ విధంగా సంభవించింది ? పుత్రా ! మణికంఠా ! ఇతరుల బాధలు తీర్చే నీవు ఈ విధంగా బాధపడటం చూడలేకుండా వున్నాము ! మమ్మల్ని పరీక్షించకు ! త్వరగా స్వస్థుడవు అవాలి ! మా మాట వినిపించుకో కుమారా!’’* అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది రాణి మణికంఠుని తలను ఒడిలో పెట్టుకుని ! రాజు వెంటనే రాజవైద్యులను పిలిపించాడు.