స్వామి అయ్యప్ప |
‘‘మహారాజా ! మీరీ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారా అని ఎదురుచూస్తున్నాం అందరం ! మణికంఠుని చల్లని పాలనలో సుఖశాంతులతో జీవించాలన్నదే అందరి ఆశయం’’ అంటూ సభలోని ప్రజాప్రతినిధులు కూడా చెప్పడంతో రాజు తృప్తిగా నిట్టూర్చాడు ! ‘‘మణికంఠుని పట్ట్భాషేకం ! హూ ! ఎట్లా జరుగుతుందో అదీ చూస్తాను!’’ పళ్లు పటపటలాడిస్తూ లేచాడు మంత్రి వీరబాహు !మహారాజు ఇతరులతో చర్చలో వుండటం గమనించి ఎవరూ గమనించకుండా మెల్లగా లేచి బయటకు వచ్చి రాణీదేవి భవనంవైపు సాగిపోయేడు.
ఇలా జరగబోయేదంతా ముందేఅనుకునే సరికి మంత్రికి చాలా బాధవేసింది. సరే నేను ఏమి చేసేది తరువాత ఆలోచిస్తాను. ముందు ఏమి జరుగుతుందో చూస్తాను. అనుకొని అటు వైపు చూచేసరికి ..ఆ రోజు ‘‘మహారాణి ! నీవు నారాయణుడిని , నేను పరమేశ్వరుని సంతానం కోసం ఎంతకాలంగా ప్రార్థిస్తూనే ఉన్నాము ! అయినా వారికింతవరకు మనమీద కరుణ కలగలేదు ! స్థితి , లయకారకులైన వారిద్దరు కొన్ని సందర్భాలలో పరస్పరం విరుద్ధమైన కార్యాలు చేస్తుంటారని మన గురుదేవులు చెప్పనే చెప్పారు గదా ! ఆ సంగతి నీకు గుర్తుంది కదూ ?
‘మహావిష్ణువు వృషభ రూపంలో వచ్చిన రాక్షసుడిని వధించాడు ! పరమేశ్వరుడు వృషభాన్ని (నందిని) తన వాహనంగా చేసుకొని ఆప్యాయంతో పెంచుకున్నాడు. ఏనుగును (గజేంద్రుని) విష్ణువు కాపాడితే , పరమేశ్వరుడు రాక్షసుడైన గజాసురుని వధించాడు ! తనవారిని రక్షించడానికి విష్ణువు కృష్ణుడై గోవర్థనగిరి నెత్తుతే పరమేశ్వరుడు వింధ్య పర్వతాన్ని లోకహితం కోరి క్రిందకు వంగేలా చేశాడు. విష్ణువు కృష్ణుడిగా కాళీయుడనే విషసర్పం పడగలమీద కాళ్ళతో తొక్కుతూ నాట్యం చేస్తే పరమేశ్వరుడు విషసర్పమై వాసుకిని మెడకు హారంగా చుట్టుకున్నాడు. ఈ విధంగా లోకరక్షణార్థం వారిద్దరూ కావించిన లీలలను ప్రస్తుతిస్తుంటారు మునిగణాలు వెండికొండమీద దర్శనమిచ్చే ఆ హరిహరులను ! అని ఈ విధంగా పరస్పర విరుద్ధమైన కార్యాలు ఆచరించే ఆ శివకేశవులను ప్రసన్నం చేసుకోవటానికి మనం తపస్సు చేయడానికి వెళితే మంచిదే కానీ రాజ్యభారాన్ని ప్రజా సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఎవరికి అప్పచెప్పాలా అని ఆలోచిస్తున్నాను!’’ అంటూ చెప్పాడు రాజశేఖరుడు పత్ని రాణీదేవితో , తన ఆలోచన గూర్చి ! ఆమె జవాబు చెప్పేలోపల ‘‘నారాయణ ! నారాయణ ! ఏమిటి రాజ దంపతులు ఏదో గంభీరమైన విషయం గూర్చి చర్చిస్తున్నట్లున్నారు?’’* అంటూ ప్రత్యక్షమైనాడు దేవర్షి నారదుడు! ‘‘దయచేయండి మునీంద్రా ! మీ రాకతో మా గృహం పావనమైంది ! ఆసీనులుకండి !’’* సంభ్రమంగా లేచి ఆయనకు భక్తి ప్రపత్తులతో పాద పూజ చేసి ఆ తీర్థాన్ని తలలమీద జల్లుకుని అతిథి మర్యాదలు జరిపారు రాజశేఖరుడు , ఆయన పత్ని !
‘‘త్రిలోక సంచారులైన మీకు మా గురించి తెలియకుండా వుంటుందా దేవర్షి ! సంతాన భాగ్యం కోసం ఇద్దరం మా ఇష్టదైవాలను ఎంతగానో ప్రార్థిస్తున్నాము ! వారి కరుణావృష్టి మా మీద ఎప్పుడూ ప్రసరింపజేస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నాము. మా నిరీక్షణ ఫలిస్తుందా మహర్షి?’’* అంటూ అడిగిన వాళ్లవైపు ప్రసన్నంగా చూసాడు నారదుడు ! ‘‘అతి త్వరలోనే ఫలిస్తుంది ! మీరెంతో అదృష్టవంతులు ! శివకేశవుల అనుగ్రహంతో మీరు మహిమాన్వితుడైన బాలుడికి తల్లిదండ్రులు కాగలరు ! ఆ శుభ సమయం కోసం వేచి వుండండి!’’ అంటూ వాళ్లను ఆనందభరితులను కావించాడు నారద మహర్షి ! ‘‘ధన్యులం మహర్షి ! ధన్యులం ! ఇక ఎంతకాలమైనా ఫరవాలేదు , ఆ శుభ సమయం కోసం వేచి వుంటాము ! మా హృదయభారం తీరిపోయింది మీ పలుకులతో ! మీకు మా కృతజ్ఞతలు!’’* అంటూ నమస్కరించారు రాజదంపతులు!
రాజశేఖరుడు వేటకు వెళ్లుట - దివ్య శిశువు దర్శనం
‘‘మహారాజా ! మన రాజ్యం సరిహద్దు ప్రాంతంలో అరణ్యాలలో క్రూర మృగాల బాధ ఎక్కువై ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ! ఈ విషయం మీకు విన్నవించి తమను కాపాడమని కోరడానికి అక్కడ నివసించే ఆటవికులు వచ్చి మీ దర్శనం కోరుతున్నారు!’’ అంటూ విన్నవించాడు మహామంత్రి ! నారద మహర్షి వెళ్లిన తర్వాత తేలికపడిన మనస్సుతో సభా భవనానికి వచ్చిన రాజశేఖరుడికి మంత్రి చెప్పిన వార్త ఆందోళన కలిగించింది ! ‘‘నా పాలనలో ప్రజలు ఆపదల పాలవటం నేను సహించలేను ! వెంటనే వేటకు సన్నాహాలు కావించండి ! నేను స్వయంగా బయలుదేరి వెళ్లి ఆ క్రూరమృగాలను సంహరిస్తాను’’ అంటూ ఆదేశించాడు. వేటకు వెళ్లడానికి అన్నీ సిద్ధమైనాయి ! కొంతమంది సైనికులు వెంటరాగా వడిగల గుర్రాలు పూన్చిన రథంమీద అరణ్యభూములలోకి దూసుకుపోయాడు రాజశేఖరుడు ! క్రూర మృగాలను గురి చూసి నిశితమైన బాణాలతో కూల్చుతూ ముందుకు సాగుతున్నాడు.
అది పవిత్రమైన పంబా నదీ తీరం ! పందల రాజ్యం సమీపంలోని దట్టమైన అరణ్యాల మధ్యగా ప్రవహిస్తుండే పంబా నదీ జలాలు ఆ ప్రాంత వాసులకు జీవనాధారాలు ! ఒడ్డున పచ్చని పచ్చిక ఆకులు పచ్చని తివాచీ పరిచినట్లు ఎవరి రాకకోసమో ఎదురుచూస్తున్నట్లున్నది. చల్లటిగాలి , గలగలమని పారుతున్న నదీ జలాలు , పూవులు జలజలమని రాలుస్తున్న వృక్షాలు - ప్రకృతి శోభాయమానంగా ముస్తాబై ఎవరికో స్వాగతం చెప్పడానికి ఆత్రుత పడుతున్నట్లుగా వున్నది. ఆ నిరీక్షణ ఫలించినట్లు ఆకాశం నుండి జ్వాజ్వలమానంగా వెలుగుతున్న జ్యోతి పుంజం సాక్షాత్కరించింది నదీ తీరాన ! అందులోనుండి హరిహరులు వారి మధ్యగా భూతనాథుడు ప్రకటితమైనారు !
హరిహరులు భూతనాథునివైపు ప్రసన్నంగా చూస్తూ ‘‘కుమారా ! నీవు మానవ రూపంతో భూమిమీద కావించవలసిన దుష్టశిక్షణకు నాంది పలకవలసిన శుభ సమయం ఆసన్నమైంది. ఇక్కడికి మరికొద్దిసేపట్లో మా భక్తుడైన పందల రాజు రాగలడు ! నీవాయనకు పుత్రుడివై ఆయన చిరకాల వాంఛితాన్ని నెరవేర్చు!’’ అన్నారు.
‘‘మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను!’’ అంటూ కళ్లు మూసుకుని ధ్యానించాడు భూతనాథుడు. మరుక్షణమే పొత్తిళ్లలో పాపడుగా మారి పచ్చికమీద సాక్షాత్కరించి కెవ్వుమన్నాడు ! హరిహరులు శిశువు తలమీద నిమిరి దీవించారు ! మహావిష్ణువు మెడలో మణిహారంతో ప్రకాశిస్తున్న శిశువువైపు ఆప్యాయంగా చూస్తూ ‘‘ఇకపై మణికంఠుడనే పేరుతో ప్రవర్థమానుడై ఈ ప్రాంత వాసులను తన లీలలతో ధన్యులను కావిస్తాడు భూతనాథుడు’’ అన్నాడు. ‘‘అవును ! మహిషిని సంహరించి ధర్మ సంస్థాపన కావిస్తాడు ధర్మశాస్తా !’’* పరమేశ్వరుడు ప్రసన్నంగా చూస్తూ అన్నాడు. దూరం నుండి కలకలం వినరావడంతో అంతర్థానం చెందారిద్దరూ!
‘‘సారథి ! ఆగు !’’ రథాన్ని ఆపించి దిగి చుట్టూ చూసాడు రాజశేఖరుడు ! చెవి వొగ్గి జాగ్రత్తగా విని ‘‘ఎవరో పసిపాపడి ఏడుపు వినిపిస్తున్నది ఆ ప్రక్కనుండి ! అటువైపు పోనివ్వు!’’* అంటూ ఎక్కి కూర్చున్నాడు. రథం పంబానది ఒడ్డుకు చేరింది ! దిగి చుట్టూ చూసిన రాజుకు పచ్చికమీద పొత్తిళ్లలో పడుకుని కెవ్వుమని ఏడుస్తున్న పసిపాపడు కనిపించడంతో గబగబా అటువైపు వెళ్లాడు !
అంతవరకు పడగ ఎత్తి పట్టి బాలుడి మీద ఎండ పడకుండా చూస్తున్న పాము రాజు వస్తుండటం చూసి చర్రున ప్రక్కకి జారిపోయింది.
‘‘ఆహా ! ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ! మెడలో ఆ మణిహారం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది ! ఎవరీ బాలుడు ? ఎవరీ విధంగా విడిచి వెళ్లుంటారు ! పాము పడగ ఎత్తి పట్టి కాపాడుతూ వుండిందంటే ఈ బాలుడెవరో మహత్తర జాతకుడై వుంటాడు ! ఈ చుట్టుప్రక్కల మనుష్య సంచారం లేదు ! ఆ పరమేశ్వరుడు తన కోసమే ఈ శిశువునిక్కడ వుంచి వుంటాడా ? సందేహం లేదు ! నారద మహర్షి చెప్పినట్లు తన కోసమే ఈ శిశువును అనుగ్రహించి వుంటాడు ఆ పరమేశ్వరుడు అన్న ఆలోచన రాగానే మనస్సులో ఆ బాలుని మీద పుత్ర వాత్సల్యం పొంగి వచ్చింది రాజశేఖరునిలో ! జాగ్రత్తగా రెండు చేతులలో ఎత్తుకుని రథంమీద ఒడిలో పరుండబెట్టుకుని కూర్చున్నాడు ! ఏడుపు మాని నవ్వుతున్నట్లు తనవైపే చూస్తున్న బాలుడి ముఖంలోకి తదేకంగా చూస్తూ ఈ చిన్నారి మోము మునుపెప్పుడో చూసినట్లనిపిస్తున్నది ! ఎక్కడ చూసి వుంటాను ?’ అనుకున్నాడు.
నామకరణ మహోత్సవం
చేతుల్లో పసివాడితో అంతఃపురంలో అడుగుపెట్టిన భర్తకు సంభ్రమానందాలతో ఎదురువచ్చింది రాణి ! భర్త చెప్పింది వింటూ పిల్లాడిని తన ఒడిలోకి తీసుకుంది. ‘‘మనం ఇంతకాలంగా ఎదురుచూసిన వరపుత్రుడు ఈనాటికి మన ఒడిని చేరాడు ! భగవంతుడు మనమీద కృపాదృష్టిని కురిపించాడు ! ఈ పసివాడినే మన పుత్రునిగా స్వీకరిద్దాము !’’ అన్నది పసివాడిని ముద్దులాడుతూ ! మెడలో మణిహారాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఈ హారాన్ని మీరు అలంకరించారా?’’ అడిగింది. ‘‘లేదు దేవీ ! నేను చూసినప్పుడే ఆ హారం మెడలో వుండినది. భగవద్దత్తంగా భావిచుకుందాము ! ఆస్థాన పురోహితులను రప్పించి నామకరణం , పుట్టిన దిన మహోత్సవాలను జరిపించవలసి వుంది ఎవరక్కడ?’’* అంటూ పరిచారికలను పంపి రాజపురోహితులను పిలిపించాడు రాజశేఖరుడు.
‘‘మహారాజా ! ఈ పసివాడు కారణ జన్ముడు ! మీ దంపతుల మీద కరుణతో హరిహరుల అనుగ్రహం ఈ పసివాడి రూపంలో మీకు లభించింది ! ఈ పసివానివల్ల మీకు ఆచంద్ర తారార్కమైన కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. మన రాజ్యంలో కూడా సుఖశాంతులు నెలకొంటాయి. ప్రజలు సర్వశుభాలు పొంది ఆనందంగా జీవించగలరు!’’ అంటూ పురోహితులు చెప్పిన విషయాలు మరింత ఆనందాన్ని కలిగించాయి.. రాజదంపతులకు ! ‘‘మా పుత్రుడికి తగిన పేరును , జన్మ తిథి నక్షత్రాలను మీరే గురించి చెప్పండి!’’ అని అడగటంతో పసివాడు లభించిన సమయం మొదలైనవి గుణించారు పురోహితులు.
‘‘మహారాజా ! మీకు లభించిన సమయాన్ని బట్టి అత్యంత శుభసమయంలో బాలుని ఆవిర్భావం జరిగి వుంటుంది , ఉత్తరా నక్షత్ర శుభ ఘడియలలో ! ఈవేళ ఫాల్గుణ శుక్ల పక్ష పంచమి , ఉత్తరా నక్షత్ర యుక్త శుభయోగంని జన్మదిన , జన్మ నక్షత్రాలుగా గణించాలి ! ఇక కంఠంలో మణిహారంతో మీకు లభించాడు గనుక మణికంఠుడనే నామం ఈ బాలునికి అన్ని విధాలా తగినది!’’* అని చెప్పారు! ‘‘మణికంఠుడు ! చాలా బాగుంది పేరు ! ఇకపై మా పుత్రుడు మణికంఠుడని పిలవబడతాడు. ప్రజాలారా ! ఇడుగో మీ యువరాజు ! కన్నుల కరువు తీరా దర్శించుకోండి మీ భావి మహారాజును’’* అంటూ చూడవచ్చిన ప్రజలకు పసివాడిని చూపించి అందరి సమక్షంలో మణికంఠుడని నామకరణం చేశాడు రాజశేఖరుడు పసివాడికి ! ‘‘యువరాజు మణికంఠునికి జయము ! జయము !’’ చూడవచ్చిన పందల రాజ్య ప్రజలందరూ ఉత్సాహంగా జయజయధ్వానాలు చేశారు ! రాజ్యమంతటా పుత్రోత్సవ వేడుకలు జరిపారు ! మణికంఠుడు వచ్చిన వేళా విశేషంవల్ల కొద్దికాలంలో పాడి పంటలతో తులతూగసాగింది పందల రాజ్యం ! ఈతిబాధలు లేవు. అన్నిటికన్నా ఆనందకరమైన విషయం మణికంఠుడు వచ్చిన కొద్దికాలానికే రాణి గర్భవతియై సకాలంలో పుత్రునికి జన్మనిచ్చింది ! రాజదంపతుల చిరకాల వాంచితం ఈడేరింది ! కానీ మణికంఠునిపై వాళ్ల ప్రేమ , వాత్సల్యం తగ్గలేదు సరికదా మరింత ఎక్కువైనాయి! ఇద్దరి పుత్రుల బాల్య చేష్టలు చూస్తూ ఆనందంగా గడపసాగారు!
మణికంఠుని గురుకుల వాసం
కాలం వేగంగా గడుస్తున్నది ! మణికంఠుడు దిన దిన ప్రవర్థమానుడౌతున్నాడు ! అక్షరాభ్యాసం , ఉపనయన సంస్కారం జరిపి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించాడు రాజు ! ఏక సంథాగ్రాహి అయిన మణికంఠుడు వేదాలు , శాస్త్రాలు కొద్దికాలంలోనే అభ్యసించి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు ! వాటితోబాటు క్షత్రియోచితాలైన విలువిద్య , కత్తిసాము , గుఱ్ఱపుస్వారి , మల్లయుద్ధం , శస్త్రాస్త్ర ఉపయోగ ఉపసంహరాలు గురుకులంలోనే వుంటూ నేర్చుకున్నాడు కొద్దికాలంలోనే విద్యాభ్యాసం పూర్తయింది ‘‘మణికంఠా ! ఎంతో త్వరగా అన్ని విద్యలలో ప్రవీణుడివైన నిన్ను చూస్తుంటే ఆనందం కలుగుతున్నది ! ప్రయోజకుడైన శిష్యుని చూసుకుని గురువు హృదయం తృప్తితో నిండిపోతుంది ! రాజకుమారుడివైనా ఇక్కడ ఇతరులతో అరమరికలు లేకుండా గడిపావు ! సామాన్యుడిలా సేవలు చేశావు ! అందరికీ ఆదర్శప్రాయంగా గడిపావు ! తిరిగి వెళ్లాక నీ ప్రజలను ధర్మంగా పాలిస్తూ సత్యవంతుడివై జీవించు’’ అంటూ బోధించి ఆశర్వదించాడు గురువు విద్యారణ్యుడు.