Swamy Ayyappa |
స్వామి అయ్యప్ప చరితం | పన్నెండవ భాగం
అడవి దాటి వాటితో రాజ్య సరిహద్దులు చేరుకోగానే అక్కడ నివశిస్తున్న ప్రజలు భయభ్రాంతులై ‘‘అమ్మో ! ఎన్ని పులులో ! దండుగా మనమీదకే వస్తున్నాయి !పరుగెత్తండి ! పారిపోండి !’’* అని అరుచుకుంటూ పరుగులు తీయసాగారు ! అది గమనించాడు మణికంఠుడు ! వెనుదిరిగి ఆడ పులులను గర్జనలు ఆపమని ఆజ్ఞాపించాడు ! అన్నీ నిశ్శబ్దంగా నిలిచాయి.
‘‘ప్రజలారా ! నేనుండగా మీరు భయపడవలసిన అవసరం లేదు ! అవి మీకు హాని కలిగించవు ! భయపడకండి !’’ అంటూ మణికంఠుడు పెద్దగా చెప్పేసరికి తమ ప్రియతమ నాయకుని కంఠాన్ని గుర్తుపట్టి పరుగులు ఆపి ముందు ఠీవిగా పెద్ద పులి మీద కూర్చుని వున్న మణికంఠుని గుర్తుపట్టి ఆనందంగా చప్పట్లు చరిచారు జనాలు ! ‘‘అదుగో ! మన రాకుమారుడు , పులుల గుంపునే వెంట తీసుకువచ్చాడు , తల్లి అస్వస్థతను పోగొట్టడానికి ! అయ్యా , రాకుమారా ! నీకు స్వాగతం ! మా అందరి ప్రాణాలు లేచి వచ్చాయి నీ రాకతో !’’ అంటూ నమస్కరించారు. వాళ్లవైపు ప్రసన్నంగా చూసి ముందుకు కదిలాడు మణికంఠుడు ! పులుల మంద మధ్యగా మణికంఠుడు వెళుతూ వుంటే వెనకగా ప్రజలు జయజయ ధ్వానాలు చేస్తూ అనుసరించారు.
రాజ భవనం సమీపిస్తున్నారు రాణి శయ్యాగారం గవాక్షం దగ్గర నిలుచుని బయటకు చూసిన రాజు ఆశ్చర్యానికి అంతం లేకుండాపోయింది ! మంత్రి కూడా చూసి ఆశ్చర్యంతో ఆ మాట రాణికి తెలయజేశాడు ! ఇద్దరూ ఒకరిని మరొకరు చూసుకున్నారు భయంతో ! ‘‘రాకుమారుడు సామాన్య బాలుడు కాదు ! తాము ఆడిన నాటకం గూర్చి పసికట్టి వుంటే ఇపుడు అందరిముందర ఆ విషయం చెబుతాడేమో ! ఏం చేయాలి ?’’ అన్న ఆందోళన తొంగి చూస్తున్నది వాళ్ల ముఖాలలో !
రాజభవనం ముందర వాహనం మీద నుండి దిగి త్వరగా నడుస్తూ తండ్రిని సమీపించి నమస్కరించాడు మణికంఠుడు !
‘‘తండ్రీ ! తల్లిగారి అస్వస్థత తగ్గించానికి కావలసినన్ని పాలు పులులనుండి తీసుకోవచ్చును ! ఆ తర్వాత వాటిని అడవిలోకి పంపివేస్తాను ! మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు !’’* అన్నాడు మృదువుగా !రాజుకు మణికంఠుని చూస్తుంటే ఏదో దివ్యానుభూతి కలిగింది ! ‘‘నాయనా ! నీవు సామాన్యుడవు కాదు ! మాపై కరుణతో మాకు పుత్రుడివై ఆనందాన్ని పంచడానికి వచ్చిన భగవంతుడివి ! అవును ! నేనెంతటి అదృష్టవంతుడిని !’’* అంటూ దగ్గరకు తీసుకుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు !
ఆ కౌగిలిలో ఎనలేని ఆనందాన్ని పొందాడు ! మణికంఠుని చూస్తూనే దురాలోచనలతో అతనికి కీడు తలపెట్టడానికి పన్నాగం పన్నిన మంత్రి మనస్సులో పరివర్తన కలిగింది ! రాణి పరిస్థితి కూడా అలాగే వుంది ! వాళ్ళు వణుకుతున్న చేతులతో నమస్కరించి క్షమాభిక్ష వేడారు ! ‘‘ఇక ఏ పులి పాలు అవసరం లేదు ! దురాలోచనతో నటించిన పాపులం ! మమ్మల్ని క్షమించు కుమారా ! నీవు సామాన్య బాలుడివి కావనీ , మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దైవాంశ సంభూతుడివనీ తెలుసుకున్నాము. మమ్మల్ని క్షమించు పుత్రా !’’* అంటూ పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్న తల్లిని ఓదార్చాడు మణికంఠుడు ! మంత్రికి క్షమాభిక్ష ప్రసాదించాడు ! మంత్రి చేతిలో కీలుబొమ్మలై అసత్యం పలికిన రాజవైద్యుడు సేనాపతి కూడా తప్పులు ఒప్పుకుని క్షమాభిక్ష కోరడంతో వాళ్లను మన్నించాడు కరుణామూర్తి అయిన మణికంఠుడు ! అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు ! ‘‘మీరందరూ నన్ను గుర్తించటమే నాకు కావలసినది ! ఒక ప్రయోజనం కోసం నేను ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడపవలసి వచ్చింది ! రాక్షసత్వంతో దేవతలను బాధిస్తున్న మహిషిని మర్దించడమనే లక్ష్యంతో భూమిపై అవతరించిన భూతనాథుడను , హరిహర పుత్రునిగా నన్ను గుర్తెరగండి ! మీ అందరి మనస్సులలో జ్యోతిరూపంలో వెలుగుతూ ఇకపై మీ యోగక్షేమాలు చూసే పరమాత్మగా మీలోనే నిలిచి వుంటాను ! మణికంఠునిగా నేను వచ్చిన కార్యం పూర్తయినందువల్ల నేను ఈ మానవ రూపాన్ని ఉపసంహరించి మీ అందరి క్షేమాన్ని కోరి మీతోనే మీ మధ్య వుండటానికి నా అర్చారూపాన్ని నాకు ప్రతిగా అనుగ్రహిస్తున్నాను !రాజా ! నా అర్చారూపానికి దేవాలయాన్ని నిర్మించవలసిన బాధ్యత నీపై వుంచుతున్నాను ! నీ చేత నిర్మింపబడే ఆ దేవాలయంలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించాలో తెలియజెప్పడానికి ఒక మహర్షి త్వరలోనే మీ దగ్గరకు రాగలడు !’’ అంటూ మేఘ గంభీర స్వరంతో చెబుతుంటే నిశ్శబ్దంగా విన్నవాళ్లంతా ఒక్కసారిగా ఉద్విగ్నులైనారు !
ప్రజలందరూ ‘‘రాకుమారా ! మమ్మల్ని విడిచి వెళతావా ? వద్దు అయ్యా ! అంతటి కఠినత్వం చూపకు మా పట్ల ! మా ప్రాణంలో ప్రాణానివి నీవు ! నిన్ను ప్రత్యక్షంగా చూడలేకపోతే మా జీవితాలు వ్యర్థం ! అప్పా , మణికంఠస్వామి ! మా మొరాలకించు ! మా మధ్యనుండి వెళ్లిపోవాలని అనుకోకు !’’ అంటూ వేడుకోసాగారు. రాజశేఖరుని పరిస్థితి దయనీయంగా మారింది ! మణికంఠుని చూడకుండా వుండటం సాధ్యంకాదు తనకు ! వరపుత్రుడుగా లభించిన ఈ బంగారు కొండను నా నుండి వేరుగా భావించలేను ! ఆపాలి ! ఎలాగైనా నా కళ్లముందరే వుండేలా చూడాలి !’’ అనుకుంటూ మణికంఠుని చేయి గట్టిగా పట్టుకున్నాడు !
‘‘పుత్రా ! అంత కఠినంగా మాట్లాడకు ! నిన్ను , నీ మోహన రూపాన్ని చూడకుండా వుండటం మా వల్ల అవుతుందని ఎలా అనుకున్నావు ! వద్దు పుత్రా వద్దు ! నీ నిర్ణయాన్ని మార్చుకో ! మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోకు !’’* అన్నాడు రుద్ధమైన కంఠంతో ! మణికంఠుడు అందరి ప్రార్థనలు విన్నాడు ! చెరగని చిరునవ్వు ముఖంతో నిర్వికారంగా చూస్తూ వాళ్లకు జ్ఞానోపదేశం చేశాడు ! ‘రాజా ! నామీద పుత్రుడనే వ్యామోహంతో నీవు , తమను సదా కాపాడుతుండే ధర్మపరులైన పాలకుడిగా ప్రజలు భావిస్తూనా వియోగాన్ని భరించలేకపోతున్నారు ! నిజానికి ఇటువంటి బంధాలకు నేను అతీతుడిని ! నేను నాది అనే భావాలకు నాలో తావు లేదు ! నేను గుణాతీతుడిని , బంధముక్తుడిని ! అందుకే వ్యర్థంగా విచారానికి గురికాకండి ! నాకూ , నా అర్చారూపానికి ఏ విధమైన భేదం లేదు ! నా అర్చారూపాన్ని పూజించటంవల్ల నేను ప్రసన్నుడినై మీ సర్వాభీష్టాలు నెరవేరుస్తాను ! రాజా ! ఇలా చూడు ! ఈ రాజ భవనం నుండి నేను వదులుతున్న ఈ బాణం అక్కడ ఆ అరణ్య భాగంలో పడ్డ చోటు ఆలయ నిర్మాణం కావించి , నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించు ! మీ అందరి వెంట ఎప్పుడూ నా ఆశీర్వాదాలు వెన్నంటే వుంటాయి !’’* అని చెప్పి బాణం వదిలి అంతర్థానం చెందాడు ! రాజపరివారం , ప్రజలు కొంతసేపటి వరకు నోట మాటరాక అలాగే వుండిపోయారు.
చెప్పటం ఆపి అందరినీ కలియజూసాడు సూతమహర్షి ! ఏకాగ్రతతో కన్నులరమూసి మణికంఠుని పావన చరితలో తాదాత్మ్యం చెంది వింటున్న నైమిశారణ్యవాసులందరూ మెల్లగా కనులు విప్పి సూతమహర్షి వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశారు ! ‘‘మహర్షి ! మీ నోట హరిహర పుత్రుడు మణికంఠుని పావన చరితాన్ని విని ధన్యులమైనాము ! స్వామి బాణాన్ని విడిచి అంతర్థానం చెందిన తర్వాత ఏం జరిగింది ? పందల రాజు నిర్మాణం ప్రారంభించాడా ? ఆ వివరాలు కూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అన్నారు. ‘‘తప్పకుండా చెబుతాను , వినండి !’’ అంటూ సూతమహర్షి చెబుతుంటే శ్రద్ధగా వినసాగారు నైమిశారణ్యవాసులు !
నాలుగవ అధ్యాయము
రాజశేఖరునికి అగస్త్య మహర్షి ఉపదేశము
‘‘మణికంఠా ! పుత్రా ! ఎక్కడికి వెళ్లిపోయావు కుమారా ? పులిపాలు తెస్తానంటూ వెళుతుంటే నిన్ను ఆపలేకపోయిన అసమర్థుడిని ! మామీద కోపంతో వెళ్లిపోయావు కదూ ! నిన్ను పందల రాజ్య సింహాసనం మీద కూర్చుండబెట్టి , రాజఠీవితో నీవు వెలిగిపోతుంటే చూడాలని ఎంతగానో ఆశపడ్డానే , ఆ ఆశను నిరాశ చేసి వెళ్లిపోయావ్ ! నామీద ఎందుకంత కఠినత్వం చూపావు ? ఒక్కసారి నీ ముద్దు ముఖాన్ని చూపించు ! రాకుమారా ! ఇప్పుడే తప్పటడుగులు వేస్తూ నా ఒడిలో వచ్చి వాలి నేను తనివితీరా ముద్దాడే లోపల లేచి పరుగులు తీస్తున్నావు , పట్టుకోమని కవ్విస్తూ ! నీ వెంట పరుగులు తీసే శక్తి లేదు ఈ వృద్ధునిలో అని తెలిసీ నన్ను ఆరడి పెట్టవచ్చునా ? ఆగు పుత్రా ! నేనూ వస్తున్నాను నీ వెంట !’’* మంచంమీదినుంచి చటాలున లేచి ‘‘పుత్రా ! ఆగు !’’ అంటూ పరుగెత్తబోయిన రాజశేఖరుడిని అతి ప్రయత్నంమీద ఆపి తిరిగి పడుకోబెట్టారు రాణి , పరిచారికలు !
రాజవైద్యుడు నాడి చూసి ఏదో ఔషధాన్ని తీసి తాగించాడు !
‘‘రాకుమారుడు వెళ్లిపోవడంతో మానసికంగా చాలా క్రుంగిపోయినారు మహారాజు ! ఆ విచారం నుండి తేరుకోకపోతే పరిస్థితి విషమించవచ్చును’’* అని చెప్పడంతో ఇప్పుడేం చేయాలి ? ఎట్లా వారికి మానసిక చింతనను దూరం చేయడం ? ఎవరందుకు సమర్థులు ? ఆందోళనగా అడుగుతున్న ఆమెకు జవాబివ్వలేక వౌనంగా నిలిచాడు రాజవైద్యుడు ! సరిగ్గా అప్పుడే , ‘‘దయచేయండి మహర్షి ! సరైన సమయానికి వచ్చారు మీరు !’’ అని మర్యాదపూర్వకంగా చెబుతూ లోపలకు వచ్చాడు మంత్రి అగస్త్య మహర్షి వెంటరాగా !
సంభ్రంగా లేచి నమస్కరించింది రాణి ! ‘‘మహర్షులకు ప్రణామాలు ! మహారాజు మానసికంగా కుమిలిపోతున్నారు మహర్షి ! వారికి మీరే నచ్చచెప్పగల సమర్థులు ! ఈ సమయంలో మీరు ఇలా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను !’’ అన్నది రాణి భారమైన స్వరంతో ! రాజువైపు గంభీరంగా చూసి ఎదురుగా ఆసనంమీద కూర్చున్నాడు అగస్త్య మహర్షి ! ‘‘రాజా ! కన్నులు తెరువు ! లేచి కూర్చో ! నేను నీ పుత్రుని సందేశం తీసుకుని వచ్చాను నిన్ను చూడటానికి ! కలత తీరి కూర్చో రాజా !’’ అన్నాడు ! ఆ మాటలు మంత్రంలా పనిచేశాయి ! రాజు కన్నులు విప్పాడు ! ‘‘ఏడీ నా పుత్రుడు ? ఎప్పుడు వస్తున్నానని సందేశం పంపాడు ?’’ ఆత్రంగా అడుగుతూ లేచి కూర్చున్నాడు ! ఎదురుగా కూర్చుని తనవైపే నిశితంగా చూస్తున్న అగస్త్య మహర్షి కనిపించడంతో భక్తిపూర్వకంగా నమస్కరించి ‘‘స్వామీ ! మీరు నా మణికంఠుని సందేశం తీసుకువచ్చారా ? నిజమా ! నా చెవులు సరిగా విన్నయ్యా ఆ మాటలు ?’’ అడిగాడు అయోమయంగా చూస్తూ !
చిన్నగా మందహాసం చేసి ‘‘నీవు సరిగానే విన్నావు ! నీ దుఃఖాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించి కర్తవ్యోన్ముఖుడిని చేసే బాధ్యత నాపై పెట్టి పంపాడు హరిహరపుత్రుడు ! ఈ చరాచర సృష్టిని పాలించి , లయం చేసే హరిహరుల పుత్రుని , తారకబ్రహ్మను (అందరినీ తరింపజేసేవాడు) నీ పుత్రుడుగా భావిస్తూ నీ దగ్గరే వుండిపోవాలని ఆశించటం అవివేకం రాజా ! తారకబ్రహ్మ ధర్మాన్ని శాసించే ధర్మశాస్తా పూర్వం నీకిచ్చిన వరానికి కట్టుబడి ఇప్పుడు నీకు కుమారుడై ఇన్ని సంవత్సరాలు నీకు అంతులేని ఆనందాన్ని ప్రసాదించడం జరిగింది ! నా తపఃశక్తితో నీకు నీ గత జన్మ విషయాలు అవగతవౌతాయి ! చూడు’’ అంటూ దివ్యదృష్టిని ప్రసాదించాడు ! రాజశేఖరుడు కుతూహలంగా చూడసాగాడు !
రాజశేఖరుని గత జన్మ వృత్తాంతము - విజయుని కథ
‘‘హర హర మహాదేవ ! శంభో శంకర ! భవగతి భిక్షాందేహి !’’
బయటనుండి ఎవరో పిలుస్తుండటంతో లేచి వెళ్లి తలుపు తీశాడు విజయుడు ! కాషాయ వస్త్రాలు ధరించి , నుదుట విభూతిరేఖలు దిద్దుకుని , మెడలో రుద్రాక్ష మాలలతో నిలిచి ఉన్నాడు ఒక సన్యాసి ! ‘‘నాయనా ! కాశీ పట్టణానికి వెళుతున్నాను విశ్వేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి ! ఈ రోజుకు ఇక్కడ బస చేయడానికి చోటివ్వగలవా ?’’ అడిగాడు. ‘‘తప్పకుండా స్వామీ ! లోపలకు దయచేయండి ! నా భార్య అస్వస్థురాలు ! పుట్టింటికి వెళ్లింది ! నేను చేసిన ఉపాహారం ఉన్నది ! కూర్చోండి ! ఇప్పుడే తెస్తాను !’’ అని చాప పరచి సన్యాసిని కూర్చోమని లోపలకు వెళ్లాడు విజయుడు ! అడవికి సమీపంగా వున్న ఆ గ్రామంలో నివశిస్తున్న సామాన్య గృహస్థుడు విజయుడు ! సదాచార బ్రహ్మణ వంశంలో పుట్టి పౌరోహిత్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ! లోపలనుండి అటుకులతో చేసిన ఉపాహారాన్ని ఆకులో పెట్టుకుని తీసుకువచ్చాడు ! ‘‘ఇంతకంటే మీకు పెట్టడానికి ఏమీ లేనందుకు విచారిస్తున్నాను ! స్వామి ! ఈ అటుకులు , అరటిపళ్లు స్వీకరించండి !’’ వినయంగా చెప్పి ప్రక్కనే కూర్చుని విసరసాగాడు విజయుడు ! ‘‘నీ వినయం , నీవు చేస్తున్న అతిథి సత్కారం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి ! నీవెందుకో బాధపడుతున్నట్లుగా తోస్తున్నది నీ ముఖం చూస్తుంటే ! నీ భార్య అస్వస్థత గూర్చి చింతిస్తున్నావా ?’’ ఆదరంగా అడిగాడు సన్యాసి తినటం ముగించి !
‘‘అవును స్వామీ ! సంతానం లేని బాధ ఆమెనెంతగానో క్రుంగదీస్తున్నది ! నాకూ ఆ బాధ వుంది కానీ బయటకు చెప్పుకోవటం లేదు. నిబ్బరంగా వుండటానికే ప్రయత్నిస్తున్నాను ! ఎవరేది చెబితే ఆ పూజా వ్రతాలు చేస్తూనే వున్నాము ! అయినా భగవంతుడికి మా మీద దయ కలగటంలేదు. ఈ జన్మకు సంతాన ప్రాప్తి లేదని నేను సరిపుచ్చుకుంటున్నాను గానీ నా భార్యే ఆ కొరతను మర్చిపోలేకుండా వుంది !’’ అంటూ మనస్సులోని బాధను సన్యాసిముందు వెళ్ళబోసుకున్నాడు.
అతని ముఖంలోకి కొన్ని క్షణాలు దీక్షగా చూశాడు సన్యాసి ! ‘‘ఊ ! ఆ విధంగా నిరాశ చెందవద్దు ! ఓంకార రూపుడైన పరమాత్మ అనుగ్రహిస్తే ఏ కోరికైనా ఫలిస్తుంది ! కానీ నిష్ఠతో గురువు ఉపదేశంపొంది ఓంకార రూపుని ధ్యానిస్తే తప్పక ఫలితం లభిస్తుంది ! ఇలారా !’’ అంటూ దగ్గరకు పిలిచి చెవిలో ప్రణవాన్ని *(ఓంకారాన్ని)* మూడుసార్లు వినిపించాడు సన్యాసి ! ‘‘ఓంకారం భగవంతుని నాదస్వరూపం ! ఈ ప్రణవనాదాన్ని నిష్ఠతో ఏకాగ్రతతో జపించు ! త్వరలోనే నీ కోరిక తీరే మార్గం లభిస్తంది !’’ అని చెప్పి మర్నాడు ప్రయాణామై వెళ్లిపోయాడు సన్యాసి ! ఆయన ఉపదేశించిన ప్రణవాన్ని నిర్మలమైన హృదయంతో ధ్యానించసాగాడు విజయుడు ! ఇతర కార్యాలు చూసుకోవలసి వుండటంతో రోజూ కొంతసేసపు ఆ ధ్యానంలో గడిపేవాడు !
ఒక రోజు అడవిలోనుండి కట్టెలు కొట్టి తెచ్చుకోవడానికి వెళ్లాడు ! అడవి మార్గంలో వెళుతున్న అతనికి చిన్న కుటీరం ముందు కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటున్న ఒక వృద్ధురాలు కనిపించింది ! అప్రయత్నంగా ఆమె వైపు అడుగులు వేశాడు విజయుడు! ‘‘మణికంఠా ! స్వామీ ! ఇంకా ఎప్పుడు నీకు నామీద దయ కలుగుతుంది ? ఎప్పుడు ఈ వృద్ధురాలిని చూడటానికి వస్తావు ?’’ తనలో తను గొణుక్కుంటున్న ఆమెను సమీపించాడు విజయుడు ! కళ్లు మూసుకుని ధ్యానిస్తున్నట్లుగా వున్న ఆ వృద్ధురాలిమీద భక్తి గౌరవాలతో నిండిపోయింది మనస్సు ! ‘తను ధ్యానిస్తున్న ఓంకారం సగుణరూపంతో తనకు దర్శనమిచ్చే మార్గం ఈమె చెప్పగలదేమో’ అని తోచడంతో ‘‘అమ్మా ! అమ్మా !’’ అంటూ పిలిచాడు మృదువుగా ! పలకరింపుకు మెల్లగా కళ్లు తెరిచి చూసిందామె ! సమీపంగా నిలిచిన అతని వైపు ఆప్యాయంగా చూస్తూ ‘‘ఎవరు నాయనా నీవు ?’’ అని అడిగింది !
‘‘అమ్మా ! నా పేరు విజయుడు ! ఇక్కడే దగ్గర్లో వున్న గ్రామంలో వుంటున్నాను ! ‘ఓంకారం తారకబ్రహ్మ నాద తనువు ! ఆ ఓంకారాన్ని ధ్యానిస్తూ వుండు , నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది !’ అని ఒక సాధు పుంగవుడు నాకు ఉపదేశించాడు ! నేను సంసారిని ! అడవిలో ఏ చెట్టు క్రిందో కూర్చుని ఓంకారాన్ని ధ్యానిస్తూ తపస్సు చేసే అవకాశము , సామర్థ్యము లేవు ! రోజూ నియమంగా కొంతసేపు ధ్యానిస్తుంటాను ! దానితో తారకబ్రహ్మ సంతుష్టుడై నా కోరిక తీరుస్తాడంటావా ? తారకబ్రహ్మ అంటే ఎవరు ? నాకు చూడాలని వుంది ! ఆ అవకాశం లభిస్తుదంటావా ? అని అడిగాడు.
చిన్నగా మందహాసం చేసింది వృద్ధురాలు !
‘‘నా కోరికా అదే ! తారకబ్రహ్మ హరిహరుల పుత్రుడైన మణికంఠుడని , ఆయన భూలోక వాసులను ఉద్ధరించడానికి త్వరలోనే ఈ ప్రాంతానికి వస్తాడని నాకు మా గురువుగారు తెలిపారు. తారకబ్రహ్మ ఈ సృష్టికంతా మూలం ! ఆయన సంకల్ప మాత్రం చేత చరాచర సృష్టి జరిగింది ! తనను శరణువేడినవారిని సంసార సాగరంనుండి తరింపజేసి అనుగ్రహిస్తాడు గనక తారకబ్రహ్మగా ఆరాధింపబడుతున్నాడు ! ఆయనకు అనంతమైన నామాలున్నాయి ! ఏ నామంతో పిలిచినా ఆ స్వామికే చెందుతాయి ! జ్యోతిరూపంతో వెలిగే ఆ స్వామి మన వంటివారికోసమే రూపుధారణ కావిస్తాడు ! ఒక్కొక్క రూపుకు ఒక్కొక్క ప్రయోజనం వుంటుంది ! దుష్టశిక్షణ , శిష్టరక్షణే ప్రధాన లక్ష్యాలుగా తారకబ్రహ్మ ఆవిర్భవిస్తుంటాడు ! మరికొద్దికాలంలో దేవతలను బాధిస్తున్న ఒక రాక్షసిని వధించడానికి భూమిపై అవతరించబోతున్నాడని తెలిపి నన్నిక్కడే మహిమాన్వితమైన మణిహారాన్ని కంఠాన ధరించి , ధర్మరక్షణ కావించే ధర్మశాస్తాగా అవతరించబోతున్న ఆ స్వామి దివ్య రూపాన్ని ధ్యానిస్తూ ఉండమని ఆదేశించి హిమాలయాలవైపు సాగిపోపోయారు మా గురుదేవులు ! నేనిక్కడ ఆ స్వామి రాకకోసం ఎదురుచూస్తూ వున్నాను ! నా పేరు శబరి !’’* అని వివరంగా చెప్పింది శబరి అనే పేరుగల ఆ వృద్ధురాలు ! ‘‘శబరిమాతా ! నీవు చెప్పిన విషయాలు విని తారకబ్రహ్మను దర్శించాలన్న కోరిక నాలో మరింత అధికమైంది ! నా కోరిక తీరే మార్గం నీవే తెలియజేసి నన్ను ధన్యుడిని కావించు !’’ అంటూ వేడుకున్నాడు విజయుడు ! కొంతసేపు ఆలోచించి అన్నది శబరిమాత ! ‘‘నాయనా ! నాకు తెలిసిన దేవరహస్యం నీకు తెలుపుతున్నాను ! నిన్ను చూస్తుంటే అందుకు అర్హుడివేనని నా మనస్సుకు అనిపించటమే అందుకు కారణం !’’* అంటూ ఆమె చెబుతుంటే శ్రద్ధగా వినసాగాడు విజయుడు ! కళ్లు మూసుకుని గంభీరమైన కంఠంతో నెమ్మదిగా చెప్పసాగింది శబరి !.