Swamy Ayyappa |
స్వామి అయ్యప్ప చరితం | పదకొండవ భాగం
అందుచేత మీరు జాగ్రత్తగా ఆలోచించి అతని అడ్డును పూర్తిగా తొలగిపోయేలా చేసుకోవాలి !శతృశేషం వుండటం మంచిది కాదని మీకు మాత్రం తెలియదా ? అన్నాడు ఆమె ముఖ కవళికలు గమనించడానికి ప్రయత్నిస్తూ ! ‘‘నాకేమీ పాలు పోవటంలేదు ! నేనేం చేస్తే నాకు , నా పుత్రుడికి మంచిదో మీరే చెప్పండి మంత్రిగారూ !’’* అడిగింది రాణి ప్రాధేయపూర్వకంగా ! ‘‘మీరు అడిగారు గనుక చెబుతున్నాను ! జాగ్రత్తగా వినండి !’’ అంటూ ఆమెను సమీపించి లోగొంతులో తన పథకం గూర్చి తెలియజెప్పాడు.
‘‘ఈ విధంగా చేయడంవలన ఎవరికీ మీ మీద అనుమానం రాదు ! ఇప్పటికి పట్ట్భాషేకం ఆగిపోతుంది ! కొద్దికాలం తర్వాత ఎట్లాగూ మీ పుత్రుడికే పట్టంగట్టక తప్పదు రాజుగారికి !’’ అన్నాడు. మొదట తటపటాయించినా చివరకు స్వార్థం , ఈర్ష్యాసూయలే గెలవటంతో మంత్రి చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంది రాణీదేవి ! ‘‘మరి నేను సెలవు తీసుకుంటాను ! మీరిక నిశ్చితంగా వుండండి !’’* అని చెప్పి లేచాడు మంత్రి !
మహారాణి అస్వస్థత
‘‘మహారాజా! మహారాజా !’’ అంతఃపుర పరిచారికలు పరుగు పరుగున రావటం గమనించి ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూసాడు రాజశేఖరుడు ! ‘‘మహారాణి విపరీతమైన శిరోభారంతో బాధపడుతున్నారు ! మిమ్మల్ని వీలైతే ఒకసారి రమ్మని కోరుతున్నారు !’’ అంటూ వాళ్లు చెప్పింది విని దిగ్గున లేచాడు రాజశేఖరుడు !
‘‘కొద్దిరోజుల క్రితం మణికంఠుడు , ఇప్పుడు మహారాణి - ఏమిటిలా అస్వస్థతలు సంభవిస్తున్నాయి రాజకుటుంబంలో ! కారణమేమై వుంటుంది ?’’ అనుకుంటూ అంతఃపురానికి బయలుదేరాడు. మణికంఠుడు కూడా ఆయన వెంట వెళ్లాడు. వాళ్లు వెళ్లేసరికి తల్పంమీద నొప్పితో మెలికలు తిరిగిపోతూ మూలుగుతున్నది రాణి ! పరిచారికలు ఆదుర్దాగా చూస్తున్నారు ! కొద్దిసేపటిముందే వచ్చిన రాజవైద్యుడు నాడి చూస్తూ ఆలోచిస్తున్నాడు !
‘‘ఏమైంది మహారాణికి ? రోగమేమిటి ?’’ అంటూ ప్రశ్నించాడు రాజశేఖరుడు రాజవైద్యుడిని !‘‘మహారాజా! ఇదొక ప్రమాదకరమైన రోగం ! తల , కడుపుతో ప్రారంభమై శరీరంలో అన్ని భాగాలు బాధతో నిండిపోయి , చలనం కోల్పోవడం , మరణం సంభవించడం జరుగుతాయి’’ చెప్పాడు వైద్యుడు. ‘‘మరి వెంటనే చికిత్స ప్రారంభించకుండా ఏమాలోచిస్తున్నారు ?’’ గద్దించాడు రాజు ! ‘‘క్షమించండి మహారాజా ! ఈ రోగానికి కావలసిన మందు మా దగ్గరలేదు ! అది బయట దొరకడం కూడా చాలా కష్టం ! కానీ అది లభిస్తే మాత్రం రోగం తగ్గడానికి అవకాశం వుంది !’’ జంకుతూ చెప్పాడు వైద్యుడు ! ‘‘ఊరికే సమయం వృధా చేయకుండా ఆ మందేమిటో చెప్పండి త్వరగా ! తెప్పించే బాధ్యత నాది’’ అన్నాడు రాజు అసహనంగా చూస్తూ ! ‘‘పులి పాలు ! పులి పాలు గనక తెప్పించగలిగితే , దానిలో మరికొన్ని మూలికలు కలిపి తాగిస్తే మహారాణికి ఉపశమనం లభిస్తుంది !’’ అన్నాడు వైద్యుడు. ‘‘పులి పాలా?’’ అంటూ ఆలోచిస్తూ నిలబడిపోయాడు రాజు !
‘‘పులి పాలు తేవడం మనుష్యులవల్ల జరిగే పనేనా ? ఎవరు ఆడపులిని సమీపించి పాలు పితికి తేగలుగుతారు ? అందుకు ప్రయత్నించి ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యం ! వైద్యులారా ! మీ శాయశక్తులా ప్రయత్నించండి ! దైవంమీద భారం వేసి ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నాడు విషాదంగా ! రాణి అరుపులు , మూల్గుడు ఎక్కువైనాయి. ఆమె బాధ చూడలేనట్లు అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు రాజు ! మణికంఠుడు మెల్లగా ఆయనను సమీపించి ‘‘నాన్నగారూ ! నేను వెళ్లి పులి పాలు తీసుకువచ్చి తల్లిగారి రోగం తగ్గిపోయేలా చేస్తాను ! మీరు ఆందోళన పడకుండా నేను అడవిలోకి వెళ్లడానికి అనుమతి ప్రసాదించండి ’’ అన్నాడు మణికంఠుడు ! అతను ఆ విధంగా అంటాడని ఊహించలేదు రాజు ! అందుకే కంగారుగా వారించాడు !
‘‘నీవు వెళ్లి పాలు తెస్తావా ? వద్దు నాయనా వద్దు ! అంతటి ప్రమాదకరమైన పనికి నిన్ను పంపలేను ’’ అన్నాడు ఆందోళనగా చేయి పట్టుకుని ! ‘‘తల్లి ఆరోగ్యం ముఖ్యం నాకు ! పని ఎంత ప్రమాదకరమైనా ఫర్వాలేదు ! నన్ను వెళ్లనివ్వండి ! ఆశీర్వదించి పంపండి ’’ అంటూ నమస్కరించాడు. రాజు ఎంత నచ్చచెప్పజూసినా మణికంఠుడు వినిపించుకోలేదు ! అంతవరకూ వౌనంగా చూస్తున్న మంత్రి ముందుకు వచ్చాడు గొంతు సవరించుకుంటూ ! ‘‘మహారాజా ! మీరు రాకుమారుని శక్తి సామర్థ్యాలను తక్కువగా అనుకుంటున్నారు. అతను తప్పక తీసుకురాగలుగుతాడు. ఆలస్యం చేయకుండా వెంటనే అనుమతిచ్చి పంపండి . మహారాణి ఎట్లా అల్లాడిపోతున్నారో చూడండి. సమయం మించిపోయాక విచారిస్తే లాభం వుండదు ’’ అన్నాడు. లోలోపల మణికంఠుడెక్కడ తన ఉద్దేశ్యం మార్చుకుంటాడోనని భయపడుతూ ! అతనివైపు చిరునవ్వుతో చూశాడు మణికంఠుడు ! రాజు కూడా మనసు దిటవు చేసుకున్నాడు.
‘‘సరే ! ఇంతగా చెబుతున్నారు గనక అనుమతినిస్తున్నాను ! వత్సా ! మణికంఠా ! క్షేమంగా వెళ్లి పులి పాలు తెచ్చి మీ తల్లి ప్రాణాలు నిలుపు విజయోస్తు ’’ అంటూ ఆశీర్వదించాడు. నమస్కరించి బయలుదేరబోయాడు మణికంఠుడు ! అంతలో ఏదో గుర్తువచ్చినట్లు ‘‘ఆ ! ఒక్క క్షణం ఆగు ! అసలే భయంకర క్రూర మృగాలుండే అడవిలోకి ఒంటరిగా వెళుతున్నావు ! అదీ కాలినడకన ! నీ వెంట ఈ ఆహార పదార్థాలను తీసుకువెళ్లు కుమారా ! ఎక్కడైనా అలుపు , ఆకలి కలిగితే వాటిని ఆరగించు’’ అంటూ ఒక సంచీ తెప్పించాడు. లోపల రెండు అరలుగా ఏర్పాటుచేసి ఒకవైపు దాంట్లో ఒక కొబ్బరికాయనుంచాడు. ‘‘మన యిష్టదైవం పరమేశ్వరునికి ప్రతిరూపంగా ఈ కొబ్బరికాయను వుంచుతున్నాను నీకు రక్షగా ’’ అంటూ మూటగా కట్టాడు ! రెండవ వైపు అవసరమైన ఆహార పదార్థాలు వుంచి వేరుగా కట్టాడు ! ఆ మూటను మణికంఠుని తలమీద వుంచి భారమైన హృదయంతో వీడ్కొలిపాడు రాజు ! మణికంఠుడు భవనం నుండి బయటకు వచ్చి తనను వెళ్లవద్దని బ్రతిమాలుతున్న ప్రజలను సమాధానపరచి వడివడిగా అరణ్యమార్గంవైపు సాగిపోయాడు.
మణికంఠుని అరణ్య ప్రవేశం - మహిషి సంహారం
మణికంఠుడు అరణ్యంలో ప్రవేశించగానే అంతవరకు దట్టమైన వృక్షాలతో సూర్యరశ్మి చొరబడకుండా చీకటితో నిండి వుండే ఆ ప్రాంతమంతా దివ్యమైన కాంతితో నిండిపోయింది. ‘‘భూతనాథుడు మణికంఠునికి స్వాగతం ! స్వామీ ! నీకు మా ప్రణామాలు ! అంటూ పరమేశ్వరుడు పంపగా భూతగణాలు సాక్షాత్కరించాయి. మణికంఠుని ముందర !’’ ‘‘స్వామీ ! వీపర , వీరభద్ర , కూపనేత్ర , గండకర్ణ , కటుసబ్ద అనబడే మేము పరమేశ్వరుని భూతగణాలలోని వారిమి ! ఇకపై మీ సేవకులమై కొలవడానికి వచ్చిన మాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించండి !’’ అంటూ వేడుకున్నాను. ‘‘భూతగణాలులారా ! మిమ్మల్ని నా అనుచరులుగా స్వీకరిస్తున్నాను !’’ ప్రసన్నంగా వాళ్లవైపు చూస్తూ అన్నాడు మణికంఠుడు.
వారి వెంట పంబా నదీ తీర ప్రాంతానికి చేరుకున్నాడు. మణకంఠుడు ! స్వామి అక్కడకు వచ్చిన సంగతి నారదుని ద్వారా తెలుసుకుని దేవతలు , ఋషిగణాలు అక్కడకు చేరుకుని భక్తిపూర్వకంగా నమస్కరించారు. ‘‘హే ! హరిహరపుత్రా ! వరగర్వంతో మమ్మల్ని ఆరడిపెడుతున్న మహిషి ఈ ప్రాంతంలోనే ఒక గుహలో విశ్రమిస్తున్నట్లు మాకు తెలియవచ్చింది మీరిక్కడ కొంతసేపు విశ్రమించి , మా పూజలు స్వీకరించి మీ అవతార లక్ష్యమైన మహిషి సంహారం కావించవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’* అంటూ విన్నవించుకున్నారు. ఇంద్రుడు స్వర్ణమయమైన ఆలయాన్ని అక్కడ ఆవిర్భవింపజేశాడు ! అందులో బంగారు సింహాసనం మీద ఆసీనుడైనాడు మణికంఠుడు ! ఇంద్రుడు , దేవతలు , మునిగణాలు మణికంఠస్వామిని ధర్మశాస్తాను కీర్తిస్తూ పూజించారు.
ధర్మశాస్త పంచరత్నం
- లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం, పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం
- విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభో ప్రియం సుతం, క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం
- మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం, సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం
- అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం, అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం,
- పాండ్యేశవంశ తిలకం భారతీ కేళి విగ్రహం, ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం
(జగదేకవీరుడు , మహాపూజ్యుడు సర్వరక్షాకరుడు , పార్వతీప్రియసుతుడు అయిన ధర్మశాస్తకు నమస్కరిస్తున్నాను ! బ్రాహ్మణులచే పూజింపబడేవాడు , విశ్వంలోని వారందరూ నమస్కరించేవాడు , హరిహర సుతుడు , కోరిన వెంటనే వరాలు ప్రసాదించేవాడు అయిన ధర్మశాస్తకు నమస్కారములు ! మత్తగజంలా నడిచేవాడు , కరుణామృత దృష్టి కలవాడు. విఘ్నాలను తొలగించేవాడయిన ధర్మశాస్తాకు నమస్కారాలు ! మా ఇలవేల్పువై , శతృవులను సంహరించి కోరిన కోర్కెలు తీర్చే ధర్మశాస్తాకు నమస్కారములు ! పాండ్య రాజు వంశానికి పేరు తెచ్చినవాడు , సర్వపాపాలు పోగొట్టేవాడు , ఆర్తులను రక్షించేవాడు అయిన ధర్మశాస్తాకు నమస్కరిస్తున్నాను)
ఫలశృతి:
పంచరత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే!
(ఈ స్తోత్రాన్ని ప్రతిదినం పఠించేవారి హృదయాలలో ధర్మశాస్తా ప్రసన్నుడై నివసిస్తుంటాడు.)
దేవతల ప్రస్తుతులకు ప్రసన్నుడైనాడు మణికంఠుడు ! అభయం ప్రసాదించాడు.
‘‘దేవతలారా ! ఋషిగణ ముఖ్యులారా ! మీరిక నిశ్చింతగా వుండండి ! లోకాలలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న మహిషిని ఇప్పుడే వధించి అవతార లక్ష్యాన్ని నెరవేరుస్తాను ! ఇప్పుడు ఆ మహిషి ఎక్కడుందో చెప్పండి’’ అన్నాడు. ‘‘స్వామీ ! ఈ పరిసర ప్రాంతంలోనే ఒక గుహలో నిద్రిస్తున్నదని తెలుసుకున్నాము ! మీరే దాన్ని వెలుపలికి రప్పించాలి !’’ చెప్పాడు ఇంద్రుడు. ‘‘సరే ! మీరందరూ ఇక వెళ్లండి ! నేను నా కార్యం నెరవేరుస్తాను అని చెప్పడంతో దేవతలు , మునిగణాలు నమస్కరించి అదృశ్యులైనారు ! మణికంఠుడు యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లుగా నోటితో సింహనాదాన్ని కావించాడు ! సింహగర్జన కన్నా ఎంతో ఎక్కువగా ఆ గర్జన ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది ! ఆ శబ్దానికి గుహలో నిద్రిస్తున్న మహిషి లేచింది.
‘‘ఎవరా ధ్వని చేసింది ? మహిషికి నిద్రాభంగం కావించే సాహసం చేసినవారెవరు ?’’ అని గర్జిస్తూ గుహ వదలి అరణ్యమార్గం వెంట రాసాగింది ! అందుకోసమే ఎదురుచూస్తున్న మణికంఠుడు తాను కూడా గర్జిస్తూ ఆమెను ఎదుర్కొన్నాడు ! ఒకరినొకరు ఢీకొంటూంటే ఆ శబ్దానికి అరణ్యమంతా ప్రతిధ్వనించసాగింది ! మహిషి , మణికంఠుల పోరు చూడటానికి పరమేశ్వరుడు నంది వాహనంపై వచ్చి ఆకాశ మార్గాన నిలిచి చూడసాగాడు ! పరమేశ్వరుని వెనుకగా నిలిచి దేవతలంతా కూడా చూస్తున్నారు ఉద్రిక్తతతో నిండిన హృదయాలతో !
మహిషి మర్దనం
మహిషి రాక్షస రూపు ధరించి వేగంగావచ్చి మణికంఠుని తాకి కొమ్ములతో పొడవబోయింది !ఒడుపుగా ఆ కొమ్ములను పట్టి దాని వేగాన్ని నిరోధించి రెండు చేతులతో ఎత్తి గిరగిరా త్రిప్పి భూమిపైకి విసిరివేశాడు మణికంఠుడు. కఠినమైన బండరాళ్లమీద నుండి పడటంతో మహిషి శరీరమంతా రక్తసిక్తమై బాధతో విలవిలలాడసాగింది ! కళ్లనుండి ధారగా కన్నీళ్లు ప్రవహించసాగాయి ! ‘‘స్వామీ ! దానిపై కరుణ చూపవద్దు ! వధించివేయి !’’ అంటూ వేడుకోసాగారు దేవతలు ఆకాశమార్గం నుండి !
అందరూ చూస్తుండగా మణికంఠుడు మహిషి శరీరంపై ఎక్కి నిలిచి పాదాలతో మర్దిస్తూ నాట్యం చేయసాగాడు ! అప్పుడు మహిషి కళ్లకు తన శరీరాన్ని మర్దిస్తున్న స్వామి జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు ! తను బ్రహ్మదేవుని కోరిన వరం గుర్తుకు వచ్చింది ! హరిహరుల పుత్రుడు ఈతనే ! ఈ అసాధారణుని చేతిలోనే తాను చావును కోరుకున్నది అన్న స్ఫురణ కలిగింది ! అతి కష్టంమీద చేతులు జోడించి నమస్కరిస్తూ ‘‘స్వామీ ! నన్ను వధించవచ్చిన మహాకాలునిగా నిన్ను గుర్తించాను. నా ప్రణామాలు స్వీకరించు ! కరుణాసింధు ! నా పాపాలను మన్నించు. శాంతించి నాకు బాధనుండి ఉపశమనం ప్రసాదించు ! నీ పాద తాడనాలను భరించలేకుండా ఉన్నాను. నాపట్ల కనికరం చూపించు ’ అంటూ వేడుకుంది దీనంగా. అప్పటికే కళ్లనుండి ప్రవహిస్తున్న కన్నీళ్ళు అక్కడ ఒక నదీ ప్రవాహంగా ఏర్పడ్డాయి ! మహిషి ప్రార్థనలతో శాంతించాడు మణికంఠుడు ! నాట్యం ఆపు చేసి క్రిందికి దిగి తన అమృత హస్తంతో ఆమె శరీరాన్ని స్పృశించాడు. మణికంఠుని హస్త ప్రభావంతో మరుక్షణం మహిషి రాక్షస రూపు మాయమై లీలావతి నిలిచింది. ‘‘హరిహర పుత్రా ! పాహిమాం ! పాహిమాం !’’ అంటూ స్వామి పాదాల దగ్గర మోకరిల్లింది !
స్వామి పద్మాలపైనుండి పైకి సాగిన ఆమె చూపులు మణికంఠుని సుందరమైన ముఖంవరకు వచ్చి ఆ ముగ్ధ మోహన రూపాన్ని చూస్తూ పులకించిపోయాయి ! ‘‘లీలావతి ! అజ్ఞాన భూయిష్టమైన మహిషి రూపం పోయి నీ పూర్వ జన్మను తిరిగి పొందగలిగావు ! ఇకపై దేవతలవైపు వెళ్ళే సాహసం చేయకుండా వన భూములలో తపస్సు చేసుకుంటూ శేష జీవితాన్ని గడుపు !’’ అంటూ గంభీరంగా ఆదేశించాడు మణికంఠుడు ! లీలావతి స్వామివైపు దీనంగా చూసింది ! ‘‘స్వామీ ! మీ స్పర్శతో నన్ను పునీతురాలిని చేశారు ! నన్ను మీ పత్నిగా స్వీకరించి నా జీవితానికి పూర్ణత చేకూర్చండి’’ అని ప్రార్థించింది. ఆమె కోరిక విన్న దేవతలందరూ ఆందోళనగా చూస్తున్నారు మణికంఠుని సమాధానం ఎట్లా ఉంటుందోనని !
‘స్వామి మహిషిని కరుణించి పూర్వజన్మ రూపం ప్రసాదించకుండా వధించివేసి వుంటే బాగుండేది ! ఇపుడు తిరిగి ఎటువంటి అసాధారణమైన కోర్కె వెలిబుచ్చిందో చూసారా మహర్షి ! ఎంత మాత్రం జంకులేకుండా ?’’ ఇంద్రుడు లీలావతి వైపు కసిగా చూస్తూ అన్నాడు నారదునితో. ‘హరిహరుల అంశలతో జన్మించినవాడు కదా మణికంఠుడు ! కరుణారూపుడు ! శరణన్న స్త్రీ ని క్షమించడంలో ఆశ్చర్యమేముంది ? ఇప్పుడిక ఏం చేస్తాడో చూద్దాం ! తొందరపడకండి !’’ అంటూ సమాధానపరిచాడు నారదుడు !
లీలావతికి వరప్రదానం
లీలావతి కోరిక విని చిరునవ్వు నవ్వాడు మణికంఠుడు ! ‘‘ఓ స్త్రీ రత్నమా ! మహిషిగా అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న నీలోని బుద్ధిమాంద్యాన్ని , అహంకారాన్ని నిర్మూలించి నిన్ను పవిత్రురాలిని చేయడానికే నీ శరీరంపై నాట్యం చేశాను ! నీ బాధ చూడలేక నా హస్తస్పర్శతో ఉపశమనం కలిగించాను ! నీవు స్వతహాగా ఉత్తమురాలివి ! దేవీమాతల అంశలనుండి ప్రాదుర్భవించిన కాంతవు ! అయినా మాయామోహితురాలివై విషయవాంఛలకు లోనైనావు ! ఇకపై నీవు మాయకతీతురాలివై దైవత్వాన్ని పొంది నా భక్తుల చేత పూజింపబడేలా వరాన్ని ప్రసాదిస్తున్నాను !’’ అన్నాడు . లీలావతి దివ్య రూపంతో సాక్షాత్కరించింది ! మణికంఠుని వైపు భక్తి పూర్వకంగా చూస్తూ *‘‘స్వామి ! ఈ దైవత్వానికన్నా మీకు పత్నిగా మీ సాన్నిధ్యంలో వుండటాన్నే నేను కోరుకుంటున్నాను ! ఈ భక్తురాలి కోరిక మన్నించండి స్వామీ !’’* అని ప్రాధేయపడింది తిరిగి !
మణికంఠుడు తిరిగి కొద్దిసేపు ఆలోచనామగ్నుడైనాడు ! మహిషి , ఆకాశాన దేవతలు ఉద్విగ్నతతో చూస్తున్నారు !
ఏదో నిర్ణయానికి వచ్చినట్లు ఈ విధంగా పలికాడు !
‘‘ఈ అవతారంలో నేను బ్రహ్మచారిగానే ఉంటాను ! అందుచేత నీ కోరిక తీర్చే అవకాశం లేదు ! ఓ కాంతామణి ! మరికొద్దికాలంలో ఈ ప్రదేశమంతా పుణ్యక్షేత్రంగా మారుతుంది ! నాకు మారుగా ఇక్కడ నా శక్తిని విగ్రహరూపంలో విడిచివెళతాను ! ఆ నా యొక్క ప్రతిరూపాన్ని దర్శించడానికి ఎందరో భక్తులు తరలివస్తారు ! నీవు విగ్రహ రూపంలో నాకు ఎడమవైపుగా విడిగా ప్రతిష్ఠురాలివై భక్తుల ననుగ్రహించు ! మంచాంబిక , మాలికాపురత్తమ్మ అనే పేర్లతో పూజింపబడుతావు ! ప్రతి సంవత్సరం నా వ్రతదీక్ష స్వీకరించి కన్నె సాములు (మొదటిసారిగా స్వామి సన్నిధికి వెళ్లేవాళ్లు) ఎందరో వస్తారు ! వాళ్లందరి కోరికలు తీర్చడం నా బాధ్యత ! అందుచేత జ్యోతి రూపంలో మకర సంక్రమణ దినాన వాళ్లకు ప్రత్యక్షంగా దర్శనమిస్తుంటాను ! ఏనాడైతే కన్నే స్వాములు ఒక్కరైనా నా సన్నిధికి రాకుండా వుండటం జరిగితే తిరిగి ఈ రూపంలోనే దర్శనమిచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను ! అంతవరకు వేచి వుండు !’’ అని చెప్పాడు ! ఆ మాటలతో తృప్తిపడింది మంచాంబికగా మారిన లీలావతి ! మణికంఠునికి నమస్కరించి అంతర్థానం చెందింది ! ఆమె వెళ్లిపోవటటంతో దేవతలు , ఋషిగణాలు పరమేశ్వరునితోబాటు భూమిమీద సాక్షాత్కరించారు.
‘‘పుత్రా ! మహిషికి దైవత్వాన్ని ప్రసాదించి ధన్యురాలిని కావించి నీ ధర్మ నిరతిని అందరికీ తెలిపేలా చేసినందుకు ఆనందిస్తున్నాను ! నీవన్నట్లుగానే లీలావతిలో రజో తమోగుణాలు ప్రభావితం చెందడం చేత ఆమె నుండి వాటిని వేరు చేసి ఆమె శరీరం మనస్సు పవిత్రం చేయడానికే నీవు మహిషిని మర్దించావని గ్రహించాను ! ధర్మాన్ని శాసించే ధర్మశాస్తావు కావడం చేత ఆమెవల్ల తిరిగి అరాచకం ప్రబలకుండా దేవతలకు హాని , నష్టాలు సంభవించకుండా ఉండాలని దైవత్వాన్ని ప్రసాదించి నీ సన్నిధిలో వుండిపోయేలా చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను !’’ అని చెబుతూ పుత్రుని గాఢాలింగనం చేసుకున్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుని మాటలు విన్న దేవతలు భయం తీరి కృతజ్ఞతా పూర్వకంగా స్వామికి నమస్కరించారు ! ‘‘ఇక త్వరలో భూలోకాన్ని వదిలి నీ స్వస్థానానికి చేరుకోవలసింది’’ అని మణికంఠుని ఆలింగనం చేసుకుని కైలాసానికి తిరిగి వెళ్లిపోయాడు పరమేశ్వరుడు!
మూడవ అధ్యాయము
మణికంఠుని తిరుగు ప్రయాణం
ఇంద్రాది దేవతలు మహిషి బెడద తీర్చి స్వర్గాన్ని తిరిగి తమకు అప్పజెప్పిన మణికంఠుని బంగారు ఆలయంలో ఎతైన సింహాసనంమీద ఆసీనుడిని చేసి పరి పరి విధాలుగా ప్రస్తుతించారు.
హరిహరాత్మజ అష్టకం
‘‘హరి వరాసనం స్వామి విశ్వమోహనం
హరితధీశ్వరం స్వామి ఆరాధ్యపాదుకం
అరివిమర్దనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రీయేత్’’
(సింహాసనంపై ఆసీనుడై వున్న స్వామి విశ్వమోహనుడు , పూజింపదగిన పాదాలు గలవాడు , శతృవులను మర్దిస్తూ నాట్యం చేసేవాడు అయిన హరిహరపుత్రుని ఆశ్రయించాలి).
‘‘శరణ కీర్తనం స్వామి శక్తిమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసం!
అరుణ భాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రీయేత్’’
(శరణన్నవారికి కీర్తినీయుడు , శక్తిమానుడు, భక్తులకు ఇష్టుడు , నాట్యలోలుడు , అరుణవర్ణంతో ప్రకాశించేవాడు , హరిహరపుత్రుడు భూతనాథుడిని ఆశ్రయించాలి)
"ప్రణవ సత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణత కల్పకం స్వామి శుభ్ర భాజితం
ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రీయేత్’’
(ప్రణవరూపుడు , ప్రాణనాయకుడు , కల్పవృక్షంలా భక్తుల కోర్కెలు తీర్చే శుభ్రరూపుడు , ప్రణవమే మందిరమైనవాడు , కీర్తనలంటే ఇష్టపడేవాడైన హరిహరపుత్రుని ఆశ్రయించాలి)
‘‘తురగవాహనం స్వామి సుందరాననం
వరగదాయుధం స్వామి దేవ వర్ణితం
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రీయేత్’’
(గుర్రంపై స్వారీ చేసేవాడు , సుందరమైన ముఖంకలవాడు , గదాధారి , దేవతలచేత స్తుతింపబడేవాడు , కీర్తనప్రియుడు , కృపగల గురువు అయిన హరిహర పుత్రుని ఆశ్రయించాలి)
‘‘త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం
త్రినయం ప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదళ పూజితం స్వామి చింతితప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రీయేత్’’
(ముల్లోకాలవారిచేత పూజింపబడేవాడు, దేవతాత్మకుడు , మూడు కన్నులవాడు , అభీష్టదాత , ఉత్తమ గురువు అయిన హరిహర సుతుని ఆశ్రయించాలి!)
‘‘భవ భయాపహం స్వామి భావుకావహం
భువన మోహనం స్వామి భూతి భూషణం
ధవళ వాహనం స్వామి దివ్యచారణం
హరిహరాత్మజం స్మామి దేవమాశ్రీయేత్’’
(సంసార బంధాలు పోగొట్టేవాడు , ఉత్తమ భావాలు గల భక్తులను ఆదరించేవాడు , భువనమోహనుడు , విభూతిని ధరించినవాడు , తెల్లని గుర్రాన్ని వాహనంగా గలవాడు , హరిహర పుత్రుడైన స్వామిని ఆశ్రయించాలి)
"కలమృదుస్మితం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోహనం
కలభకేసరి స్వామి వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రీయేత్"
(చక్కని మందహాసంతో , సుందర వదనంతో కోమలంగా వుండేవాడు , చక్కని గళం కలవాడు , ఏనుగు , సింహం , గుర్రం వాహనాలుగా కలిగినవాడైన హరిహర పుత్రుని ఆశయించాలి)
"శ్రీత జనప్రియం స్వామి చింతితప్రదం
శృతి విభూషణం స్వామి సాధు జీవనం
శ్రుతి మనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రీయేత్"
(ఆశ్రీత వత్సలుడు , అభీష్టాలు తీర్చేవాడూ , శ్రుతులకు అలంకారమైనవాడు , సాధు జీవనుడు , గీతాలంటే ఇష్టపడేవాడు హరిహరులకు సుతుడైన స్వామిని ఆశ్రయించాలి)
వాళ్ళు చేసిన స్తుతులకు ప్రసన్నుడైనాడు మణికంఠుడు ! వాళ్ళవైపు చిరునవ్వుతో చూస్తూ ‘‘ఇంద్రాది దేవతలారా ! మీకు మహిషి నుండి రావలసిన మీ స్వర్గ్భోగాలు మీకు తిరిగి లభించాయి ! నా అవతార లక్ష్యం నెరవేరింది గనుక నన్ను తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నారు మీరు ! కానీ పన్నెండు సంవత్సరాలు పందల రాజకుమారుడిగా జీవించినందువల్ల రాజ కుటుంబం పట్ల , ప్రజలపట్ల నేను నెరవేర్చవలసిన బాధ్యతలు కొన్ని మిగిలి వున్నాయి ! వాటిని కూడా పూర్తిచేయాలి ! ఇప్పుడు నేను అడవిలోకి వచ్చింది తల్లి అస్వస్థత పోగొట్టే పులి పాలు తీసుకువెళ్లడానికి ! అందుకు మీరు నాకు సహాయపడవలసి వున్నది’’ అన్నాడు ! ‘‘అంతకంటే భాగ్యం మరొకటుంటుందా ? ఈ సేవకులను ఆజ్ఞాపించండి స్వామి ఏం చేయాలో !’’ అన్నారందరూ ఉత్సాహంగా ! ‘‘ఇంద్రా ! నీవు మగ పులివై నాకు వాహనం అవాలి ! దేవతలారా ! మీరందరూ ఆడ పులులై నా వెనకే కదిలి రావాలి !’’ గంభీరంగా చెప్పాడు మణికంఠుడు ! ‘‘మీ ఆజ్ఞానువర్తులం స్వామీ!’’ అంటూ అందరూ వ్యాఘ్రాలు (పులులు)గా మారి నిలిచారు ! మణికంఠుడు అన్నిటికన్నా పెద్దదైన మగ పులి మీద ఎక్కి కూర్చున్నాడు ! అది గర్జిస్తూ ముందు వెళుతుంటే వెనక పులుల మంద కూడా గర్జిస్తూ అనుసరించాయి.