Swamy Ayyappa |
స్వామి అయ్యప్ప చరితం | పదవ భాగం
జాగ్రత్తగా పరీక్షించి ‘‘ఇదేదో వింత వ్యాధి ! చికిత్సకు లొంగకపోవచ్చు ! అయినా మా శాయశక్తులా ప్రయత్నిస్తాం మహారాజా !’’ అంటూ ఔషధాలు ఇచ్చి చికిత్స ప్రారంభించారు వైద్యులు ! రెండు రోజులు గడిచాయి ! అంతకంతకు పరిస్థితి దిగజారుతున్నదే గానీ గుణం కనిపించలేదు ! రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు ! రాకుమారుని అస్వస్థత గూర్చి తెలిసి ప్రజలందరూ రాజభవనం దగ్గరకు వచ్చి ఆరోగ్యం కుదుటపడటానికి దైవప్రార్థనలు చేయసాగారు. ‘‘పరమేశ్వరా ! పరమ దయాళువు నీవు ! వరపుత్రుడిని ప్రసాదించి అంతలోనే మాకు దూరం చేస్తావా స్వామీ ? మా పుత్రునికి ఆరోగ్య భిక్షను ప్రసాదించు !’’ ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నాడు రాజశేఖరుడు.
ఆ సమయంలో... ఢమరు వాయిస్తూ ఒక వృద్ధుడు అక్కడకు వచ్చాడు ! మెడలో రుద్రాక్షలు ధరించి ముఖాన విభూది రేకలు మెరుస్తుండగా.. ‘‘బం.. భం.. భూతనాథుని శరణు వేడండి ! ఆపదలన్నీ తొలగిపోతాయి !’’ అన్నాడు గంభీరమైన స్వరంతో ! ఆ మాటలతో తేరుకుని భక్తిపూర్వకంగా ఆహ్వానించాడు రాజశేఖరుడు. ‘‘మహానుభావా ! మిమ్మల్ని ఆ పరమేశ్వరుడే మాకోసం పంపినట్లు భావిస్తున్నాను ! వింత రోగంతో తల్లడిల్లిపోతున్న మా కుమారుడిని స్వస్థుడిని కావించండి స్వామీ !’’ అంటూ ప్రార్థించాడు. ‘‘మేము వచ్చింది అందుకే గదా ! ఏదీ ! ఎక్కడున్నాడు మీ పుత్రుడు ? చూడండి !’’ అన్నాడు వృద్ధుడు సౌమ్య స్వరంతో. ‘‘దయ చేయండి !’’ అంటూ మణికంఠుని శయనాగారంకి తీసుకువెళ్లాడు రాజు ! ‘‘రాజా ! మీరందరూ బయటే వుండండి ! చికిత్స పూర్తయిన తర్వాత నేనే తలుపు తీసేవరకూ మీరెవ్వరూ లోపలకు రాకూడదు సుమా’’ అంటూ హెచ్చరించి లోపలకు వెళ్లి తలుపు మూసాడు వృద్ధుడు.
‘‘మణికంఠా ! పుత్రా ! భూతనాథా !’’ శయ్యమీద కళ్లు మూసుకుని పడుకుని వున్న మణికంఠుడు కళ్లు విప్పి ఎదురురగా నిలిచి వున్న పరమేశ్వరునికి భక్తిపూర్వకంగా నమస్కరించాడు ! పరమేశ్వరుడు నల్లబడి , ముడతలతో , వ్రణాలతో నిండి వున్న మణికంఠుని శరీరం వైపు ఒక్కక్షణం పాటు నిశితంగా చూసి తల పంకించాడు గంభీరంగా !
‘‘పుత్రా ! కొందరు దుష్టుల కుతంత్రం వల్ల దుష్టశక్తుల అభిచారానికి (చేతబడి) లోబడి ఈ విధంగా అస్వస్థుడైనావు ! ఈ పరిస్థితి నుండి నీకిప్పుడే ఉపశమనం కలిగిస్తాను !’’* అంటూ తను ధరించిన విభూదిని కొంత తీసి మణికంఠునిపై చల్లాడు ! మరుక్షణం బాధ మాయమై బంగారు మేనిఛాయతో ప్రకాశిస్తూ నిలిచాడు మణికంఠుడు ! ‘‘పరమేశ్వరా ! మీకు ప్రణామాలతో నన్ను స్వస్థుని చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ! స్వీకరించండి!’’ అన్నాడు వినయపూర్వకంగా. ప్రసన్నంగా చూసాడు పరమేశ్వరుడు.
‘‘కుమారా ! నీవు తలచుకుంటే ఆ దుష్ట శక్తులను నీపై ప్రభావం చూపకుండా అణచివేసి వాటిని నీపై ప్రయోగించిన వారిని కూడా శిక్షించి వుండవచ్చును ! కానీ మానవ రూపుధారణ చేసినందువల్ల మౌనంగా ఆ బాధను భరించావని గ్రహించాను ! ఇకపై ఏ దుష్టశక్తి నీపై ప్రభావం చూపకుండా వరం ప్రసాదిస్తున్నాను !’’ అన్నాడు. ‘‘కృతజ్ఞతలు’’ అన్నాడు మణికంఠుడు పాదాభివందనం కావించి !
పరమేశ్వరుడు తిరిగి వృద్ధుని రూపు ధరించి తలుపు తీశాడు ! బయట ఆతురతతో ఎదురుచూస్తున్న రాజ దంపతులు , ప్రజలు వృద్ధుని వెనుక పూర్ణారోగ్యవంతుడై వచ్చిన రాకుమారుడికి హర్షధ్వానాలతో స్వాగతం పలికారు ! ‘‘రాకుమారుడు స్వస్థుడైనాడు ! ఇక మనకే చింతా లేకుండా చూస్తాడు !’’ వాళ్ళలో వాళ్లనుకుంటుంటే చిరునవ్వు నవ్వి ‘‘అవును ! ఇక ఏ చింతా దరిచేరదు. మీ ప్రియతమ నాయకుడిని’’* అంటూ అందరిని ఆశీర్వదించి బయలుదేరుతున్న వృద్ధుడికి పళ్ళెరం నిండా బంగారు నాణాలు పోసి బహూకరించబోయాడు రాజు !
‘‘మహారాజా ! వాటిని మీ ప్రజలకే దానం చేయండి ’’* అని వడివడిగా నడుస్తూ వెళ్లిపోయాడు వృద్ధుడు ! విషయం తెలిసిన మంత్రి , సేనాపతులలో పరివర్తన కలగకపోగా మణికంఠునిపై ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైనాయి. అతనిని తుదముట్టించడానికి మరో పథకం ఆలోచించసాగారు. నేను ఆనాడు అనుకున్నట్టు చేస్తే అందరూ నాది దురాలోచన అనుకొంటారా ఏమి ఇపుడు ఏం చేయాలి... నేను అనుకొన్నట్టుగానే చేస్తాను.. ఏమి జరుగుతుందో చూస్తాను. మహారాణివారితో మాట్లాడుతాను.. అప్పుడే నిర్ణయించుకుంటాను. మెల్లగా మహారాణి భవనం వైపు మంత్రి నడక సాగింది. ‘‘మహారాణి ! మీ దర్శనం కోసం మహామంత్రి వచ్చి అనుమతి కోరుతున్నారు. చాలా ముఖ్యమైన విషయమేదో మీకు విన్నవించాలిట ! లోపలకు పంపమంటారా ’’ పరిచారిక వచ్చి చెప్పడంతో పంపమన్నట్లుగా సైగ చేసింది ముఖ్యకార్యమేమైవుంటుందా ఆలోచిస్తూ! ‘‘అభివాదాలు మహారాణి ! మీ ఏకాంతానికి అంతరాయం కలిగించినట్లున్నాను ! క్షమించాలి ’’ వంగి వినయం వుట్టిపడుతున్న కంఠంతో అన్నాడు మంత్రి !
‘‘పరవాలేదు , కూర్చోండి ! ప్రభువు మీతో ఏదైనా సందేశం పంపించారా ?’’ కూర్చోవడానికి ఆసనం చూపుతూ అడిగింది రాణి ! చిన్నగా నిట్టూరుస్తూ రెండు క్షణాలు వౌనంగా వుండిపోయాడు మంత్రి ! అతనివైపు పరీక్షగా చూస్తూ ‘‘చెప్పండి మంత్రిగారూ ! ఏమైనా గంభీరమైన విషయమా ?’’ అడిగింది రాణి కొద్దిగా ఆందోళన నిండిన స్వరంతో ! చిన్నగా దగ్గి గొంతు సవరించుకున్నాడు మంత్రి ! ‘‘గంభీరమైన విషయమే ! ప్రభువు చెప్పి రమ్మని పంపలేదు ! నేనే వుండలేక వచ్చేసాను ! మహారాణి ! ప్రభువు నిండు సభలో మణికంఠునికి పందల రాజ్య సింహాసనం కట్టబెట్టనున్నట్లు ప్రటించారు ! త్వరలో పట్ట్భాషేకం జరగబోతున్నది ’’ చెప్పాడు.
విషాదం నిండిన స్వరంతో. ‘‘ఎంత మంచి వార్త ! ఇది చెప్పటానికి సంకోచపడుతున్నారెందుకు ? ఈ శుభవార్త తెచ్చినందుకు మిమ్మల్ని సత్కరించాల్సిందే ’’ అంటూ మెడలోనుండి ఒక హారాన్ని తీయబోయింది రాణి ! కంగారుగా లేచి వారించాడు మంత్రి ! ‘‘మీలోని మంచితనం , అమాయకత్వం తెలిసే వాటిని ఆసరాగా తీసుకుని మహారాజు ప్రకటించిన వార్త మీకు విచారాన్ని కాకుండా ఆనందాన్ని కలిగిస్తుందని నేను ముందే ఊహించాను. అందుకే ఇది ఆనందకరమైన వార్త కాదని , మీకు మీ కుమారుడికి జరుగుతున్న అన్యాయమని చెప్పటానికే ఇలా రెక్కలు కట్టుకుని వచ్చి మీకు తెలియజేశాను ! మీ కానుకలకోసం ఆశపడేవాడిని కాదు మహారాణి గారు .
ఎంతోకాలంగా మీ ఉప్పు తింటూ బ్రతుకుతున్నవాడిని ! మహారాజుకు నేను చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు ! అందుకే మిమ్మల్ని హెచ్చరించడం నా బాధ్యతగా భావించి వచ్చాను ’ అన్నాడు చేతులు కట్టుకుని నిలుచుని ! అతని మాటలు అర్థం కానట్లు చూస్తూ ‘‘మీరు చెప్పదలచుకున్నదేమిటో సూటిగా చెప్పండి !’’ అన్నది రాణి ! ‘‘చెబుతాను మహారాణి ! అది నా బాధ్యత ! మీరే నిదానంగా ఆలోచిస్తే నేను చెప్పేది నిజమని ఒప్పుకుంటారు ! ధర్మబద్ధంగా మీకు జన్మించిన పుత్రునికి మారుగా మహారాజు అడవిలో లభించిన అనాథ బాలుడికి పట్టం కట్టడం అన్యాయం కాదా ? అతనిపై వాత్సల్యానురాగాలు మొదటినుండీ ఎక్కువే మహారాజుకు ! స్వంత పుత్రుడిని పెంపుడు పుత్రునిగా చూస్తూ అతనికి న్యాయంగా రావలసిన సింహాసనంపై తమకిష్టమైన వారిని కూర్చోబెట్టాలని చూస్తున్నారు ! ఈ విషయం మీతో ముందుగా చెప్పకుండా సభలో ప్రకటించడం గమనిస్తే మీరందుకు అంగీకరించరన్న అనుమానం వారికి కలిగివుంటుంది ! అందుకే మాట మాత్రమైనా మీతో చెప్పకుండా వారే నిర్ణయం తీసుకున్నారు ! అమాయకుడు , ఉత్తమ రాజవంశంలో జన్మించిన మీ పుత్రుడిని భావి మహారాజుగా ఊహించుకుంటూ వచ్చా ఇంతకాలంగా ! ఇపుడు ఆ అడవిలో లభించిన తనకి మంత్రిగా సేవ చేయడం నాకు సమ్మతం కాదు. అందుకే నా పదవి త్యాగం చేసి మహారాజుకు చెప్పకుండా రాజ్యం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను ! మీకు , మీ పుత్రుడికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేని ఈ నిస్సహాయుడిని. ఎప్పుడూ మీ మంచే కోరే ఈ సేవకుడిని మన్నించి వెళ్లడానికి అనుమతి ప్రసాదించండి !’’* కళ్లనుండి జలజలా నీరు కారుతుంటే రుద్ధకంఠంతో అన్నాడు మంత్రి ! అతను ఊహించినట్లే అతి వినయం నటిస్తూ శ్రేయోభిలాషిలా అతను అన్నమాటలు రాణిమీద విపరీత ప్రభావం చూపాయి ! అంతవరకు మణికంఠుని పట్ల ఆమెకుండిన వాత్సల్యానురాగాల స్థానంలో కోపావేశాలు చోటుచేసుకున్నాయి. తన కుమారునికి రావలసిన సింహాసనాన్ని అతను అధిష్ఠించడం అన్యాయం , అక్రమం అన్న భావాలు బలపడ్డాయి !
అందుకే చివాలున లేచి అటూ ఇటూ పచార్లు చేస్తూ ‘‘వీల్లేదు ! నా కుమారునికి అన్యాయం జరగడం నేను సహించలేను ! మణికంఠునికి పట్ట్భాషేకం జరగనివ్వను !’’ అంటూ మంత్రివైపు చూసింది ! విచారం నిండిన ముఖంతో కళ్ళు వత్తుకుంటూ నిలిచిన మంత్రిని తమ మేలు కోరేవాడిగా తలచింది ! అతనివైపు సానుభూతితో చూస్తూ ‘‘మహామంత్రి ! మీ వంటి విశ్వాస పాత్రులు మా అండగా వుండటం నిజంగా మా అదృష్టం ! ఈ అనర్థాన్ని ఆపే ఉపాయం ఏదైనా వుంటే మీరే చెప్పాలి ! నాకు ఏమీ తోచటంలేదు ! కానీ ఎట్టి పరిస్థితిలోనూ మణికంఠుడు మాత్రం సింహాసనం అధిష్ఠించకూడదు !’’* అన్నది కఠినత్వం నిండిన స్వరంతో ! ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న మంత్రి ముఖం వికసించింది. ‘‘నా బాధను మీరు అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను మహారాణి ! ఇప్పుడు మీరు తలచుకుంటేనే ఆ పని సాధ్యవౌతుంది ! మీ మాట విని ఒకవేళ మహారాజు మనస్సు మార్చకుని మీ పుత్రుడికే పట్టం కట్టినా మణికంఠుడు కోపంతో మీ పుత్రునికి హాని కలిగించే అవకాశం వుంది.