
శివనాగులు

Nagula Chavithi
సరీసౄపాలలో నాగులపామును హిందువులు ఎంతో ఆరాధ్యంగా, దైవంగా పూజించుకుంటారు. కార్తీక శుద్ధ చతుర్థిని నాగులచవితి అంటారు. ఇది దీపావళి అమావాస్య తరువాత వస్తుంది. నాగులచవితిని కొందరు శ్రావణశుద్ధచతుర్థినాడు కూడా జరుపుకుంటారు. ఈ పండుగరోజు నాగేంద్రుడిని అర్చిస్తేశరీరంలో వున్న సర్వరోగాలు పోయి, సౌభాగ్యవంతులు అవుతారని భారతీయులు ప్రగాఢంగా నమ్ముతారు.
యోగాశాస్త్రం ప్రకారం మన శరీరంలో వున్న వెన్నెముక - కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘‘పాము’’ ఆకారంలో వుంటుందని తెలుపుతున్నారు. ఇది మానవునిలో సత్వగుణ సంపత్తిని తొలగిస్తూ వుంటుందంటారు. అప్పుడు నాగులచవితిరోజున విషసర్ప పుట్టలను ఆరాధించి, అందులో పాలుపోస్తే మానవునిలో వున్న విషసర్పం కూడా నశిస్తుందని నమ్ముతారు.
ఇలా ప్రతినాగులచవితినాడు స్త్రీలు ఆరాధిస్తే.. వారికి శుభప్రదమైన సంతానం కలుగుతుందని, ఆ పిల్లలు కూడా ఆచరిస్తే వారికి మంచి భర్తలు లభిస్తారని పలువురు విశ్వసిస్తారు. ఈ నాగులపంచమి ఈనాటినుంచి చేస్తున్న సంస్కృతికాదు.. పురాతనకాలాల నుంచి ఈ సంప్రదాయం నడుస్తూ వస్తోంది. దీంతో సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని, సంతానప్రాప్తి కలుగుతుందని పురాణాలలో కూడా ఎన్ని కథలున్నాయి.
నాగులపంచమి శ్లోకము
కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
అనే శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది.