శివభగవానుడు |
మంగళకారుడు - శివుడు
శ్లో: శం నిత్య సుఖమానందమకారః పురుషః స్మృతః
వకారశ్శక్తిరమృతం మేలనం శివ ఉచ్చతే
తస్మాదేవం స్వమాత్మానం శివం కృత్వాశ్చయేచ్చివమ్
అని ‘శివ’ శబ్దార్థాన్ని వివరించింది శివపురాణం. ‘శం’ అంటే శాశ్వతానందం,‘ఇ’ కారం పురుషుడు, ‘వ’ కారం శక్తి, అమృతం, వీటి కలయిక ‘శివ’ మనబడుతుంది. ఆ విధంగా ఏర్పడిన శివశబ్దానికి శుభము, మంగళప్రదము అనే అర్థాలున్నాయి.
అట్టి శివతత్త్వము మూర్తీభవించిన వాడు ‘శివుడు’. అనగా శుభప్రదుడు మంగళకరుడు అని అర్థం. అవ్యక్తుడైన పరమాత్మ బ్రహ్మది దేవతల కోరిక మీద వారు సేవించుకునేందుకు వీలుగా తన లింగ స్వరూపాన్ని వారికి అనుగ్రహించాడు. రూపాతీతమైన పరమాత్మ లింగ స్వరూపంగా ఆవిర్భవించిన రోజు శివుని పుట్టిన రోజుగా శివ పార్వతుల కల్యాణంగా శివరాత్రి జరుపుకుంటుంన్నాం.సమస్తమైన సృష్టి ఆ పరమాత్మ నుండే వెలువడింది. కనుక ఈ దృశ్యమాన ప్రపంచం అంతా శివ ‘స్వరూపమే’. శివారాధన అంటూ సకల చరాచర జగత్తునీ ఆరాధించి సమస్త జగత్తుతో అంతర్యామిగా ఉన్న దైవాన్ని అనుభూతి చెందటమే ఈ విషయాన్ని ప్రతిపాదించి ఆ దారిలో పయనించి భగవధనుభూతి మార్గానికి రాచబాట వేసింది. ‘రుద్రసూక్తం’ దీనినే వాడుకలో ‘రుద్ర నమకం’ అంటూ ఉంటాం.
యజుర్వేదంలో ప్రధాన మంత్ర భాగం అయిన నమకంలో సృష్టిలో ఉన్న అన్ని పదార్థాలకు నమస్కరించటం ఉంటుంది. అనగా ఆ రూపంలో ఉన్న దైవానికి నమస్కరిస్తున్నానని అర్థం. అటువంటి శివుని అర్చించే వారం తాము ‘శివ స్వరూపులుగా’ రూపొందాలి అంటే ‘శివ స్వరూపుడు’ మాత్రమే శివార్చనకు అర్హుడు.అ, ఉ, మ, బిందు నాదము ఉద్భవించిన క్రమంలోనే న, మ, శి, వా, య అనే అక్షరాలు ఉద్భవించి స్థూల పంచాక్షరిగా రూపుదాల్చాయి. సూక్ష్మ పంచాక్షరి నిరాకార సగుణ భగవానుని బోధిస్తుంది. ఈ పంచాక్షరిలోని ఒక్కొక్క అక్షరం నుండి ‘5’ వర్ణాలున్న ‘5’ వర్గాల అక్షరాలు జనించాయి. శిరోమంత్రమనే నాల్గవ పాదంతో సహ 3 పాదాల గాయత్రీ మంత్రం పుట్టింది, దాని నుండి సమస్త వేదాలు వాటి నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయని ఆయా మంత్రాల వల్ల ఆయా సిద్ధులు మాత్రమే లభిస్తాయనీ కాని వాటికి మూలమైన ప్రణవం వలన సర్వసిద్ధులు కలుగుతాయనీ ఈ ప్రణవం వలన ‘భోగమూ’ మోక్షము కూడా సిద్ధిస్తాయనీ శివపురాణం తెలుపుతుంది.
అవాజ్మానస గోచరుడైన పరమాత్మ ఓం కారమనే ఒకే ఒక అక్షరం చేత నిర్దేశించబడతాడు. ‘ఓం’ కారము నందలి ‘ఆ’కారం సృష్టికారకుడైన బ్రహ్మనూ, ‘ఉ’కారం స్థితికారకుడైన విష్ణువు అనీ, ‘మ’కారం శివుని నిర్దేశిస్తాయి. అంతేకాదు అకారం సృష్టికర్త ‘ఉ’కారం మోహింప చేసేది.‘మ’కారంసదా అనుగ్రహదాయకం. ఓంకారం నిర్గుణ పరబ్రహ్మను సూచిస్తే పంచాక్షరీ సాకారుడైన భగవానుని బోధిస్తుంది. పంచాక్షరిని నిత్యం జపించాలని ఉధయ సంధ్యలలో 1000 చొప్పున జనించినట్లయితే శివ పదం లభిస్తుందని చెప్పబడింది. ఈ పంచాక్షరి మంత్రం సర్వోపనిషత్తులకు ఆత్మస్వరూపం పరిపూర్ణ మంత్రం. శివుని అష్టమూర్తులు 1) శర్వుడు - భూతత్త్వం, 2) భవుడు - జలతత్త్వం, 3) రుద్రుడు - అగ్ని తత్త్వం, 4) ఉగ్రుడు - వాయు తత్త్వం, 5) భీముడు - ఆకాశ తత్త్వం, 6) ఈశానుడు - సూర్య తత్త్వం, 7) మహా దేవుడు - చంద్ర తత్త్వం, 8) పశుపతి - యజమాని క్షత్రజ్ఞుడు. శివుని అష్టమూర్తులు అష్టతత్త్వాలని సూచిస్తాయి.
.
ఓం నమః శివాయ..