Arunachalam |
అరుణాచలలో భక్తునికి జరిగిన అత్యద్భుత శివలీల | Arunachala Leela
1800 సంవత్సరాల ప్రాంతంలో తమిళనాడు లోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తుండేది. భర్త పేరు సుందర రాజన్ , భార్య పేరు శాంభవి.సుందర రాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేసేవారు. తక్కువగా వచ్చే జీతంతోనే జీవితం గడుపు తుండేవారు. భార్యాభర్తలిద్దరూ దైవ భక్తులే.వారి ఇంటి దైవం అరుణాచల శివుడు.వారికి వివాహమై పది సంవత్సరాలైనా పిల్లలు కలుగలేదు.
సుందర రాజన్ సదా కొలిచే ఆ సదా శివుడ్నే సంతానం ప్రసాదించమని అర్ధించేవారు.ఒక సంవత్సరం వారిద్దరూ అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుడ్ని సంతానం కోసం ప్రార్దించారు.దర్శనం చేసుకుని బయటకి వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు.ఒంటి నిండా భస్మం రాసుకుని,చేతిలో డమరుకం పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తున్నాడు.ఆ భస్మధారుడు వీళ్ళను చూస్తూనే ఒక ఉదుటున లేచి " పళం యన్ పళం " అంటే " పండు ,నా పండు " అంటూ కొబ్బరి కాయలు అమ్మే కొట్టు మీదకు దూకి అక్కడ ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరి కాయ ఇచ్చి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఊహించని ఈ సంఘటనతో వాళ్ళూ , ఆ కొబ్బరికాయలు అమ్మే కొట్టు యజమానీ , అక్కడ ఉండే జనం అంతా నిశ్చేష్టులయ్యారు . వాళ్ళు ఈ దంపతులకు ఇలా చెప్పారు, ఆ భాస్మధారుడు ఎవరితోనూ మాట్లాడాడు , ఏమీ తినడు అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తీరుతుంది అని. ఇది జరిగిన సంవత్సరం లోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు.ఆ అబ్బాయికి " శివ శర్మ " అనే పేరు పెట్టారు.
అరుణాచల శివ |
శివ శర్మకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేసిన నెల రోజులకు సుందర రాజన్ కాలం చేసారు.పేదరికంలో జీవించే వారికి సుందర రాజన్ మాత్రమే ఆధారం.తండ్రి కాలం చేశాక శాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది.వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడకు ఊపిరితిత్తులు పాడయ్యి ఆరోగ్యం క్షీణించ సాగింది.శాంభవి శివ శర్మకు తరచుగా " నువ్వు అరుణాచలేశ్వరుని ప్రసాదం,మనకు ఆయనే దిక్కు "అని చెబుతుండేవారు.కొలది రోజుల్లోనే శాంభవి కూడా కాలం చేసారు.శివ శర్మకు నా అనేవారే లేక ఏమీ చేయలేని స్థితికి చేరాడు.ఆ దిక్కు తోచని స్థితిలో శివ శర్మకు నిద్రిస్తుండగా ఒక స్వప్నం వచ్చింది.ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు,ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు.అదొక శివాలయం,అప్పుడు శివునికి అభిషేకం జరుగుతోంది.దర్శనం చేసుకుని ఒక ప్రక్క కూర్చున్నాడు శివ శర్మ .అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది.ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివ శర్మకు తినిపించాడు.ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివ శర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతోంది.అంతటితో శివ శర్మకు మెలకువ వచ్చింది.శివ శర్మకు నిజంగానే కళ్ళు నీరుకారుతున్నట్లు అనిపించింది.అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు.ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలుపే అని గ్రహించి,ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలం బయల్దేరాడు.చుట్టూ చీకటి వలన భయం భయంగానే " అరుణాచల శివ అరుణాచల శివ " అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు.
అరుణాచల రాజ గోపురం - తూర్పు ద్వారం |
అప్పట్లో ఎడ్ల బండ్లు,జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు.తన దగ్గర డబ్బు లేదు కనుక వాటిలో ప్రయాణించడం అసాధ్యం అని భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు.తను ఊరు చివరకు చేరే సరికి ఇద్దరు వ్యక్తులు తనని అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమో అని వెతికి చూసారు.తన దగ్గర డబ్బు లేదు కానీ చెవులకి బంగారు ప్రోగులు ఉన్నాయి.ఉపనయనం అప్పుడు తనకు చెవులు కుట్టి ప్రోగులు వేసారు.అవి ఈ దొంగలు తన చెవుల నుండి లాగారు.చెవులు రెండూ తెగి రక్తం కారుతోంది,శివ శర్మ బాధతో అరవగానే వాళ్ళు భయపడి పారిపోయారు.అప్పుడే ఒక లాంతరు కట్టిన జట్కా బండి వచ్చి ఆగింది.అందులో నుండి ఒక పొడగాటి వ్యక్తి దిగి శివ శర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకుని,తన దగ్గర ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడి రెండు చేవులకూ పెట్టి,మేము కూడా అరుణాచలం వెళుతున్నాం,మాతో రా అంటూ జట్కాలో కూర్చోబెట్టుకుని, తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు.అవి తినగానే శివ శర్మకు నిద్ర పట్టేసింది.
మెలకువ వచ్చి కనులు తెరిచి చూడగానే తన ఒక ఆలయం అరుగు మీద పడుకుని ఉన్నాడు.రాత్రి జరిగినదంతా లీలగా గుర్తొస్తోంది.చెవులు రెండూ తాకి చూసాడు,ప్రోగులూ లేవు , నొప్పీ లేదు.చేతి వేళ్ళకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లు అనిపించింది.చూడగా మంచి పరిమళంతో కూడిన విభూతి.తనకు ఏమీ అర్ధంకాని స్థితిలో ఉండగా ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు వచ్చాడు.తను అచ్చం కలలో కనిపించిన వ్యక్తిలానే ఉన్నాడు.ఆశ్చర్యంతో నోట మాట రావడం లేదు.ఆ వృద్ధుడు శివ శర్మ చేయి పట్టుకుని ఆలయంలోనికి తీసుకు వెళ్తున్నాడు.అది శివాలయమే,అందులో నమక చమకలతో రుద్రాభిషేకం జరుగుతోంది.అది చూస్తూ ఒక ప్రక్కగా కూర్చున్నాడు శివ శర్మ.అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదం నోటిలో పెట్టాడు.మళ్ళీ శివ శర్మకు ఆనందంతో కళ్ళ నుండి నీరు కారుతోంది.ఆ వృద్ధుడు శివ శర్మ కళ్ళ నీళ్ళు తుడిచి అంతా ఈ అరుణాచలుని ఆదేశం ప్రకారమే జరుగుతోంది,ఈయన రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు.
అంతవరకూ మౌనంగానే జరుగుతున్నదంతా గమనిస్తున్న శివ శర్మకు అది అరుణాచలం అని అర్ధం అయ్యింది.మొదటి సారిగా అరుణాచల శివుడ్ని దర్శించుకున్నాడు.చాలా ఆనందం కలిగింది.కానీ ఆ వృద్ధుడు ఎవరు,తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు.చుట్టూ చూసాడు, కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నారు, కొందరు కుర్చుని ప్రసాదం స్వీకరిస్తున్నారు, కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు, కొందరు వెళుతున్నారు.ఏమిచేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు శివ శర్మ.తన చేతిలోని చీటీని తీసి చూసాడు. " నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు " అని వ్రాసుంది.
ఆలయం మొత్తం కలియజూసి బయటకు వచ్చి నిలుచున్నాడు. ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరకు వెళ్లి గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి అని అడిగాడు.అదిగో అక్కడ కొందరు అరుణాచలా అరుణాచలా అని పాడుతున్నారే వాళ్ళు గిరి ప్రదక్షిణలు మొదలు పెడుతున్నారు వాళ్ళతో వెళ్ళు అన్నాడు.శివ శర్మ వాళ్ళతో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాడు.పూర్తి ప్రదక్షిణ అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది.ఆలయం మూసివేసారు.అందరూ వెళ్ళిపోయారు.శివ శర్మకు బాగా ఆకలిగా, నీరసంగా ఉంది.ఆలయం అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.ఆ పూల వ్యాపారి " బాబు నువ్వొక్కడివే వచ్చావా,నీది ఏ ఊరు,నీ తల్లిదండ్రులు ఎవరు " అని ప్రశ్నించాడు.జరిగిన విషయమంతా చెప్పాడు శివ శర్మ.ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి,తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు.
అదేమిటంటే గిరి ప్రదక్షిణ చేసేప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి,వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే,తనకు రోజుకు ఒక అణా ఇస్తాననీ,తన దగ్గర ఉండవచ్చు అనీ చెప్పాడు.శివ శర్మకు ఈ పని ఎంతగానో నచ్చింది,ఈ పనితో పాటూ ఆ వృద్ధుడు ఆదేశించినట్లు ప్రతీ రోజూ గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు అనీ.కానీ నిజానికి అది చాలా కష్టమైనా పని,కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రతీ రోజు షుమారు 14 కిలోమీటర్ల దూరం ఎండన నడవడం సాధ్యమేనా.శివ శర్మకు మొదటి రోజునే కాళ్ళ వాచి పాదాలకు బొబ్బలెక్కాయి.అయినా ఈ పని చేయాలనే అనుకున్నాడు.తనకు వచ్చిన అణా కూడా అరుణాచలునికే సమర్పించాలి అని నిశ్చయించుకున్నాడు.
రెండు రోజులకు శివ శర్మ కాళ్ళు బాగా వాచిపోయి, పాదం మొత్తం రక్తపు ముద్ద అయ్యింది.రెండవ రోజు రాత్రి శివ శర్మ కాళ్ళ నొప్పికీ,పాదాల రక్త స్రావానికీ ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలు అమ్మనూ,ప్రదక్షిణ ఎలా చేయనూ అనుకుంటూ పడుకున్నాడు.తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి,పాదాలకు ఏదో లేపనం వ్రాసి,కాళ్ళను నిమిరి వెళ్ళింది.మరుసటి ఉదయం లేచి చుసుకునేసరికి కాళ్ళ నొప్పులు తగ్గి,పాదాలు మృదువుగా అయ్యాయి.ఆశ్చర్యపోయాడు శివ శర్మ,ఇదంతా ఆ అరుణాచలుని అనుగ్రహమే అనుకుని వెళ్ళి శాష్టాంగపడ్డాడు.ఆ నాటి నుండి తను ప్రదక్షిణ చేసినా కాళ్ళ నొప్పులు కానీ , పాదాల పగుళ్ళు కానీ లేవు.ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు,శివ శర్మకు దైవానుగ్రహం అమితంగా ఉంది అని అర్ధం అయ్యింది.శివ శర్మను వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు.
కొన్నాళ్ళు పూలు అమ్మిన తరువాత శివ శర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది.అప్పటి నుండి పూలు అమ్మడం మానేసి ఎక్కువ సేపు ధ్యానంలో ఉండిపోతుండేవాడు.వ్యాపారం చేయకపోయినా ఆ పూల వ్యాపారి రోజూ శివ శర్మకు ఒక అణా ఇచ్చేవాడు,భోజనం పెట్టేవాడు. మెలకువగా ఉన్నంతసేపూ శివ శర్మ నిరంతరం అరుణాచల శివ నామం జపిస్తూనే ఉండేవాడు.
ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు,వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్లూ తిరుగుతూ అరుణాచలం చేరారు.వారి బాధను చూసి జాలిపడిన శివ శర్మ ఒక్క క్షణం ధ్యానంలో కుర్చుని,వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు,అతన్ని కొందరు నిర్బంధించారు,వాళ్ళు మూడు రోజులలో ఇక్కడకు వచ్చి కొందరు పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు,అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు,మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులవుతారు అన్నాడు.శివ శర్మ మతాల మీద నమ్మకముంచి వారు అరుణాచలంలోనే మూడు రోజులు గడిపారు.శివ శర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు.
అప్పటినుండి శివ శర్మ పట్ల అందరికీ భక్తి,నమ్మకము కలిగాయి.
తనకు కొందరు వ్యాపారులు పండ్లు,ఫలహారాలు పెట్టేవారు.వారికి విశేషంగా వ్యాపారం జరుగుతుండేది. తను ఏదైనా చెబితే అది జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉన్నది కనుక ప్రజలు తనని ప్రశ్నలు అడగడం,తన చేతితో ప్రసాదం,విభూతి వంటివి తీసుకోవాలి అనుకోవడం,తనను ఆశీర్వదించమని అడగడం చేస్తుండేవారు.అప్పటి నుండి శివ శర్మ రోజంతా ప్రదక్షిణ చేయడం,కొండ పైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తుండేవాడు.
శివ శర్మకు శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది.ప్రదక్షిణ చేయలేని స్థితికి చేరుకున్నాడు. ఒకనాడు ఉదయం శివ శర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి " నాతో రా , మనం చాలా దూరం ప్రయాణం చేయాలి " అని చెప్పి గిరి ప్రదక్షిణం మొత్తం చేయి పట్టుకుని చేయించి,చివరగా అరుణాచలం కొండపైకి తీసుకుని వెళ్ళాడు.ఆ తరువాత శివ శర్మ కోసం ఎంత గాలించినా ఎక్కడా కనిపించలేదు.
- శివ శర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికీ అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు.చూడటానికి వికారంగా కనిపిస్తూ ఎవరినీ వారి దరి చేరనివ్వకుండా తపస్సు చేసుకునే వారూ ఉన్నారు.మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పక అలాంటి వారి దర్శనం లభిస్తుంది.
- ఈ శివ శర్మ గురించిన గాధపూర్వం బహు ప్రాచుర్యం కలిగి, ఎంతో మందికి ప్రేరణగా నిలిచిందట.శేషాద్రి స్వామి వారు , భగవాన్ రమణులు , కావ్యకంఠ గణపతి ముని వంటి అవతార పురుషులు అరుణాచలం చేరి తరించారు.
ఇటువంటి భక్తుల గాధలు అందరూ తప్పకుండా తెలుసుకోవాలి .