Yenki Paatalu |
యెంకి పాటలు
1. ముద్దుల నా యెంకి
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కూకుండనీదురా కూసింతసేపు !
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,
యెల్లి మాటాడిస్తె యిసిరి కొడతాదీ !
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది,
దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ !
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
యీడుండమంటాది యిలు దూరి పోతాది,
యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ !
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
మందొ మాకో యెట్టి మరిగించినాదీ,
పల్లకుందామంటె పాణమాగదురా !
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
2. వొనలచ్చిమి
జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని
సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె
మెల్లంగ వస్తాది నా యెంకీ !
సల్లంగ వస్తాది నా యెంకీ !
పచ్చన్ని సేలోకి పండు యెన్నెల్లోన
నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటె
వొయ్యారమొలికించు నా యెంకీ !
వొనలచ్చి మనిపించు నా యెంకీ !
యెంకి వస్తాదాని యెదురూగ నేబోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానె
కాలు కదపాలేదు నా యెంకీ !
కరిగి నీరౌతాది నా యెంకీ !
మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
గోనెపట్టా యేసి గొంగడీ పైనేసి
కూలాసగుంటాది నా యెంకీ !
కులుకు సూపెడతాది నా యెంకీ !
యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె
సెందురుణ్ణీ తిట్టు నా యెంకీ !
సూరియుణ్ణీ తిట్టు నా యెంకీ !
3. యెంకి ముచ్చట్లు
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు ?
దొడ్డి తోవ కళ్ళె తొంగి సూడంగానె
'తోటకాడే వుండు తొరగొస్త' నంటాది !
యెన్నాని సెప్పేది.........
యెంకి రాలేదాని యేటొ సూత్తావుంటె
యెనకాలగా వచ్చి 'యెవురు వో'రంటాది !
యెన్నాని సెప్పేది.......
'సిట్టీ సేబా'సాని నిట్టూరమేత్తుంటె
మాటా యినబడనట్టు మరియేటొ సెపుతాది !
యెన్నాని సెప్పేది.......
'కోడి గూసేసరికి కొంపకెల్లాలి, నీ
కోసరమె సెపుతాను కోపమొ'ద్దంటాది !
యెన్నాని సెప్పేది.....
'యెంత సేపున్నాను యిడిసి పెట్టాలేవు
తగువోళ్ళలో మనకి తలవొంపు'లంటాది !
యెన్నాని సెప్పేది.....
యెనకెనక సూత్తానె యెల్లుతావుంటాది,
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు ?
4. యెంకితో తిరపతి
యెంకీ, నాతోటీ రాయే !
మన యెంకటేశరుణ్ణి యెల్లీ సూసొద్దాము !
25. పంటసేలకే పయనం
యీయేపు నోయావు ఆయేపు నోయావు
జోడావులకు నడుమ నాయెంకి,
యీడు జోడుగా నిలుసుండె నాయెంకి,
ఆట
లాడతా కలిసుంటె నాయెంకి,
నన్నె
సూడు మన్నట్టుండు నాయెంకి !
ఈయేపు నోయేరు ఆయేపు నోయేరు
యేళ్ళ రెంటికి నడుమ నాయెంకి
తలను
పాలకడవెత్తుకొని నాయెంకి,
సేత
పూలు పుణుకుకొంట నాయెంకి,
పూల
బూరవోయిస్తానె నాయెంకి,
నన్నె
పోలుండుమంటాది నాయెంకి !
ఈకాడ నోకొండ ఆకాడ నోకొండ
కొండాకోనల నడుమ నాయెంకి,
పాల
కుండ దించుకోని నాయెంకి,
గుడికి
దండ మెడతావుంటె నాయెంకి,
సూడ
రెండే కళ్ళనిపించు నాయెంకి !
ఈసాయ నోసేను ఆసాయనో సేను
సేలరెంటికి నడుమ నాయెంకి,
పాలు
పూలు నా కందిచ్చి నాయెంకి,
'సొమ్ము
లేల మన'కంటాది నాయెంకి,
గుండె
జాలి పుట్టిస్తాది నాయెంకి !
26. సాటేలా ?
సాటేలా ? నీకు మాటేలా ? సిన్నతనమేలా ? సిగ్గేలా ?
ఆ సీమ యీ సీమ
అందరందాలు
తిన్నంగ నినుసూసె
దిద్దుకుంటారు !
సాటేలా ? నీకు మాటేలా ?......
ముందు మన పాపణ్ణి
కింద దిగనీరు,
యెంకి కో వంటారు
యెత్తుకుంటారు !
3. అణకువ
ఎంతెంత దూరాన
ఎందరిలొ నే నున్న-
సూటిగా నావెనుక చూసె నా యెంకి
చురికి నేతనవైపు తిరుగవలసినదే !
ఏటవల నేబోయి
యిల్లుచేరని రేయి-
ఏటదీపము పళ్ళ నిడినదా యెంకి
వెలుగులో నేనచట మొలవవలసినదే !
కథ నడుమ మాజోడు
నిదుర దోగిన నాడు-
కథ కొస తళుకుగోరి కల గనెన యెంకి
కలను నే జొరి కథలు తెలుపవలసినదే !
31.ముసుముసులు
ఎంకి జలకపు పలుకు లెచట నిడుకొందు ?
ఎంతదాచిన చెణుకు లెగురు నిందందు !
మడుగున జలకమాడ
మానీడ లలలపై
గోరంత మా నటన
కొండంత జేసెనట ! ఎంకి జలకపు....
నీలపై మా రహ
స్యాలగొని తీరతీ
రాల పరుగిడి, మమ్ము,
గాలె యెగతాళియట ! ఎంకి జలకపు....
మెరుపు మేఘుల మించు
సరసులను మముగాంచి
ఆకసమెవులికి మడు
గడుగున పడినదంట ! ఎంకి జలకపు....
రతనాల వేదికను
రవల చాందిని కింద
ముత్తెపు తలంబ్రాలు
ముసిముసుల పెళ్ళంట ! ఎంకి జలకపు...
32.దీపసుందరి
దీపసుందరి తోటి సాపత్యమా నాకు
దీప సుకుమారి దరిదాపు చనగలనా ?
రంగుకోక ధరించి
రాజురాక తపించు
నీడలను తెలివి విడ
నాడి కననుంకించు ! దీపసుందరి....
రెప్పవాల్పక మింట
లెక్కించు చుక్కలను
అలికిడికి వులికిపడు
నలుదెసల విరగబడు ! దీపసుందరి...
నిలువంత చెవిజేసి
పిలుపువిన నోరగిలు
కటి బిగించును శిరసు
కానిలెమ్మని విసురు ! దీపసుందరి...
కెవ్వుమని కిందబడు
నవ్వు నాలుక సాచు
'రాజా'యనుచు నెగిరి
'రారా' యనుచు కునుకు ! దీపసుందరి...
వేదన సుఖానమను
వెలుగుచు శుభాన చను ! దీపసుందరి....
33.జాలి
రాలురేలును పూలె జాలి నొలికెడురా ?
వేలుపే నీకంటె చాల సులభుడురా !
నా యలికిడి నేనె
రేయి కొండలనడల
శిఖర శిఖరమ్ము నీ
ముఖమె చూపునురా ! రాలు రేలును...
ఒక్కననె మళ్ళగని
చుక్కల మొయిళ్ళగొని
నీ కళ్ళె నీ నిలువె
నింగి రాయునురా ! రాలు రేలును...
పూలతలె నా వెతల
పోలిచి మెలికెలారి
వొళ్ళు ఝల్లన నిన్నె
కళ్ళ గట్టునురా ! రాలు రేలును....
ఏమియడుగకె గుడిని
సామికడ నే నిలిచి
హారతీయగ వెలిగె
మూర్తి నీదేరా !! రాలు రేలును...
వుసురుల పసలు చెల్లి
ఒంటినై యుంటగని ! రాలు రేలును...
34.మరపు
ఏటికోయి మనచెలిమి-నీట చిత్తరవుల కలిమి ?
కలయె తెలుపు మనమనసుల కలయికల నిజానిజాల !
అలక నలసి నేను కునుక
తెలివిని నను నీవు చెనక-
కనకె నీ సరాగసరణి
కల రెక్కల పరతుదివిని ! ఏటికోయి....
కనులుకునుక బొమలుకులుకు
నని నను తనివారక నెదు
యెరుగవింత కలలోనా
మరుగుమరులు తిరుగుతెరలు ! ఏటికోయి....
నీ యెద వూయల లీయెడ
పోయెద కల పలుపోకల-
కలలో కలగందు నొకట
తెలివి నిదుర లచట నచట ! ఏటికోయి....
యీ నందనమును నిను నను
ఆనంద సుఖమున మరతు !
కలలో నను చూతువేమొ
కత్తికెరను జేతువేమొ ! ఏటికోయి....
35.జయభేరి
కళలీను వనమె వెల-తెలలేల నోయీ ?
వనలక్ష్మి కనగాచు-కొను దినములేమో !
వుండుండి పూలటుల-వులికె నేమోయీ ?
కడుపులో పాప చ-క్కలిగింతలేమో !
చిలుక పావురము లటు-చిందులేలోయీ ?
ఆప్తమిత్రుని రాక కాత్రమో యేమో !
వురుములు మెరుపులాయె-దరికి రావోయీ ?
జయభేరితో వెలుగె దయసేయునేమో !
36.శివ శివా
తనివితీరలేదే ఆ తరుణ మాగిపోదే !
కార్తిక దీపాల గంగకలలె కందునే పదేపదే !
తలకిందుతపసున కాశి
నిలిచె గంగనను నీ పగ !
శంకరుడె యెరుగడింత
సావాసమ్మను నీ వగ ! తనివి...
నీలను మన వేలు వేలు
కీలింపగ వెదకు సుకము !
ననుతాకిన అలయె నిన్ను
పెనగొన నీ పులక తళుకు ! తనివి...
నీ కరముల వెలుగు గంగ
నా శిరమునె అభిషేకము !
'శివశివా' యనన్గ ప్రజలు
సిగ్గున మునిగెడు నీ భ్రమ ! తనివి...
ఉదయమె నా దోయిలి నీ
వుదక ధారలుంచు రక్తి
బిందు బిందు కోటి
సూర్యబింబము లొలికించు శక్తి ! తనివి...
37.బరిణె
కలవారిగని అలంకారాలు గొనుట
పులి బోలదలచి వాతలనింపుకొనుటె !
ఘనులు తమ సకియలను
మణులతో కైసేయ
ఆకులలములె యెంకి
కాయె నాయిడుసరులు ! కలవారి...
ఆకుల కులపుసరులె
వేకనులలో కదిలె
మెప్పునమెరిసె కనులు
నిప్పులగురిసె మణులు ! కలవారి....
పనితనమనగ సఖులు
పసలేదనగ ఘనులు
పలువాయి సమరాల
నలిగె నాకుల సరులె ! కలవారి...
వెలవోని మా సరులు
నిలువనీడనొసన్గి
స్వంతమటు దాచెనొక
వలపు పలుకుల బరిణె ! కలవారి....
ననుగూడ నటె దాచు
మని పొగిలె నా యెంకి ! కలవారి....
38.యెంకితనము
ఆ చిత్రముకు మెరుగు నీ చక్కదనమే !
యీ చిత్తమునకు వెలుగు నీ యెంకితనమే !
కొమ్మనొక చేయూని
గోవునొక చేయాని
వేళ్ళు కదిపితివా, నె
మళ్ళజత దిగియాడ ! ఆ చిత్ర...
చిలుక, పావురము, నీ
చే వ్రాల చెంపగొని
అంత ననుగని, వింత,
వంత, మీ మువురెగుర ! ఆ చిత్ర...
కోడె, పసిలేడి, నడి
కోన నిను పసిగట్టి
'నేను, నే'నని యురికి
నినుతాకి కనుమూయ ! ఆ చిత్ర...
యేట కనుచాటొసగ
తోట నీడల తెరలు
నాటి వెన్నెలనావ
నా,నీ, మరువ నీవ ! ఆ చిత్ర...
39.చిలుక పలుకు
ఎకసకె మెవరికి తెలుసు ?
ఎంకిచిలుక మనుసు గడుసు ! ఎకసకె...
'పేరంటము పిలిచి తోట
చూరవిడుతె' యని నేనన-
చిలుకను పురికొలిపి నన్ను
'బలిరాజా'యనిపించిన ఎకసకె...
గాయపడిన లేగకు నే
సాయమిడకె సాగిపోవ-
చిలుకను వుసికొలిపి నన్ను
'శిబిరాజా' యనిపించిన ఎకసకె...
కలలో తన సెలవులేకె
కానలబడి పోతినేమొ-
మెలకువగని చిలుక బిలిచి
'నలరాజా' యనిపించిన ఎకసకె....
పూలను గద్దియ నమరించి
పూలకిరీటము కూరిచి
'రాజా' యన తానెకోరు
'రాణీ'తన మనుకొంటిని ! ఎకసకె...
ఎగతాళియు ఎంతో సొగసు
ఎంకి చిలుక మనుసె మనుసు ! ఎకసకె...
4.చెర
కరములు సిరులు పరుల కారింపనా ?
ఎంకి
కనులెత్తెనా రాజు గతులెరుగునా ?
'నారాజు కగుశయ్య
రేరాజు చేరె'నని
శయ్య సదురును యెంకి
చంద్రుగని కనులార్చు ! కరములు సిరులు....
పానుపున మాజోటి
పవళింపు భావించు
వెచ్చవెచ్చని పాన్పు
వే విధుల లాలించు ! కరములు సిరులు....
తనను వెన్నెల సోక
తప్పువలె కోపించు
'రాజుపస గనురాజు
రాడ ?' యని తలయూచు ! కరములు సిరులు...
నేరాక తనుతరలు
నా రాక గని మరలు
కళ్ళలో చందురుని
కైదుగొని నిదురించు ! కరములు సిరులు....
దూరాల దొర,పై నిగారాల రాజు కీ
కరములు సిరులు పరుల గారింపనా
ఎంకి
కనులెత్తెనా రాజె గతులెరుగునా ?
41.రేవెలుగు
ఎవరైన యెపుడైన యేవాడనైన
యింత జాలి గనెర యెంకి చిత్రాలు ?
మొయిలు జొరె చంద్రుడని
భయపు మిష నా యెంకి
పూసెజ్జ నాపజ్జ
పోగుపడ-ఆరటము ! ఎవరైన యెపుడైన...
మబ్బు వెలువడు చంద
మామ గని, తన చీర
చెరగు మాటిడి నన్ను
జీరు సిగ్గరితనము ! ఎవరైన యెపుడైన....
'కళ్ళ ములుకులు దించె
కంఠపాశము లేసె
కిరణాలు నువులేని
తరి' యనెడు-ఆకులము ! ఎవరైన యెపుడైన...
'దృష్టి'తొలగగ తనను
తిలకముగ నేగొనిన
నెలవంక నా రాజు
తులయె యను-అతిశయము ! ఎవరైన యెపుడైన...
రేవెలుగు గీవెలుగు
నా వెనుకె యనుమతము ! ఎవరైన యెపుడైన...
42.ఉయ్యాల
ఎంకి వూగెను కొమ్మ వుయ్యాలా ! చంద్ర
వంక వూగెను బొమ్మవుయ్యాలా !
ఏటిపైకొమ్మ నూ
యెల యెంకి అమరించె
నీట బొమ్మవుయ్యాల
నెలవంక వెలయించె ..ఎంకి...
ఎంకి వన్నెలచీర
నెగిరె వెన్నెల పూలు
ఎండుటాకుల గొలుసు
వెండితీగలు చేరె ! ...ఎంకి...
సికపూలు, ముంగురులు
చిరుమువల మొలనూలు
ఒకచే సదురుకొనుచు
ఒయ్యారమే వూగె ! ...ఎంకి....
తీగల నడుమ నూగె
దీపమై, తిలకమై,
పీఠమై-ఎంకికి-కి
రీటమై,నెలవంక ! ..ఎంకి....
మున్నీటి యాజోడె
ఆనాటి కీనాడు ! ...ఎంకి....
43.తపస్సు
"సాగరుని సల్లాపమా అల
చందురుని యుల్లాసమా సిక
తాతలాల విలాసమా
ఆ పగిది బంధించు నీ కనుపాప నెయ్యది తాపసీ ?"
"కలదు నా పాలకుని కంటను
కడలి, కల దీ చందమామయు
అలల తలపై నాట్యమాడుదు
రచట దంపతు లెవ్వరో ?
ఆట కలరును సాగరుండును
అలల ననుకూలముగ నడుపును,
దంపతులు నింపుదు రతని రత
నంపు కాంతుల కాన్కలన్ !
బాలభక్తులవలె, నిలింపుల
లీల, శంపాలతికయన,గో
పాలు దరహాసాంచలమువలె
నటన సలిపిరి చిటుకలో !
ఆటలాడెడు నా సురూపమె
కోటి గుణితంబయ్యె త్రుటిలో
పాలకుడు తనుమరచి పరవశులీల
కన్నులు మూయగన్ !
సాగరుని సల్లాపమేలా
చందురుని యుల్లాసమేలా
సైకతంపు విలాసమేలా
లోకమిక నేలా ?"