కొల్హాపురి శ్రీమహాలక్ష్మీ దేవి |
Kolhapuri Sri Mahalakshmi
సకల దేవతా శక్తులకు, సర్వ జగత్తుకి మూలాథారమైన ఆదిపరాశక్తి, అఖిల లోకాశ్చర్యకరమైన సౌందర్యముతో, సకల మంత్ర అథిదేవతగా, ఓంకార స్వరూపిణిగా సృష్టిలోని ప్రతిజీవికి మాతృదేవతగా, సృష్టి, స్థితి, లయకారిణైన శ్రీ జగదంబ వివిధ ప్రాంతాలలో, వివిధ పేర్లతో, వివిధ రూపాలతో అశేష భక్తులచే విశేషముగా ఆరాధనలందుకుంటున్న ఆదిశక్తి శ్రీపీఠం పై కొలువు దీరి కొల్హాపురి శ్రీమహాలక్ష్మీ గా మూడడుగుల మూలవిరాట్ స్వరూపం శివలింగాకారంతో దర్శనమిస్తుంది.
చతురస్ర ఆసనం పై నిలబడి సింహ వాహినియై, పద్మవాసినియై, చతుర్భుజాలతో శోభిల్లుతూ చెఱుకు, విల్లు, మాతులుంగ ఫలం, డాలు, కలశం ధరించి కిరీట ధారిణియై శిరస్సుపై శేషపడగతో, శ్రీమహాలక్ష్మిగా మహారాష్ట్రంలో మీరాజ్ స్టేషన్కు 40 కిలోమీటర్ల దూరంలో కొల్హాపురిలో సాక్షాత్కరిస్తూంది.
మహాప్రళయానంతరంలో నీటిలో మునిగి పోయిన కాశీని పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఎత్తి రక్షించగా, అమ్మవారు తన గదతో కొల్హాపురిని రక్షించిందని పురాణ వచనము. కొల్హాపురినే కరవీర క్షేత్రమని కూడా అంటారు. నీటిలో మునిగిపోయిన క్షేత్రాన్ని మహాలక్ష్మి తన కరములతో పైకెత్తినందువల్లనే దీనికి కరవీర అని నామము వచ్చిందని నానుడి. ఈ క్షేత్రము అష్టాదశ శక్తి పీఠాలలో అతిముఖ్యమైనది. ఇచ్చట సతీదేవి త్రినేత్రాలు పడినట్లు ప్రతీతి.
కొల్హాపురి శ్రీమహాలక్ష్మీ దేవి ఆలయ స్థల పురాణము:
పూర్వము మహిషాసురుడనే రాక్షసుని చంపిన శ్రీమహాలక్ష్మి పద్మావతీ పురములో స్వయంభూగా వున్నది. పద్మావతీపుర పాలకుడైన కొల్హుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి యుధ్ధాలలో అపజయము లేకుండా తానే విజయము సాధించేటట్లు వరము పొందాడు. వరగర్వముతో ఇతర లోకాలను ఆక్రమించేందుకు బయలుదేరిన కొల్హుడు రాజ్యభారమును తన పెద్ద కుమారుడైన కరవీరునకు అప్పగించి మిగిలిన ముగ్గురు కుమారులను సహాయంగా నియమించాడు. కరవీరుడు తన రాజ్యములో ప్రజలను అనేక బాధలకు గిరి చేయడముతో, ప్రజల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు కరవీరుని, అతని సహోదరులను అంతమొందించినాడు. కుమారులను కోల్పోయిన కొల్హుడు రాజ్యమునకు తిరిగి వచ్చి దేవతలపైన పగను పెంచుకొని ఇంద్రలోకము చేరి దేవతలను హింసించసాగాడు. దేవతలందరూ శ్రీమహాలక్స్మిని శరణు వేడినారు. అంతట మహాలక్ష్మి కొల్హుడితో యుధ్ధమునకు సిధ్ధమయినది.
ఇరువురి మధ్య ఘోరమైన యుధ్ధము జరిగినది. అనేక అస్త్రములతో కొల్హుడి శక్తిని క్షీణించే వరకు పోరాడి తుదకు సంహరించినది. జగన్మాత విశ్వరూపం చూసిన కొల్హుడు పశ్చాతాపము చెంది శ్రీమహాలక్ష్మిని తన రాజ్యములో కొలువు దీరి ప్రజలను నీ చల్లని చూపులతో కటాక్షించు తల్లీ అని కోరగా తధాస్తు అంటూ శ్రీమహాలక్ష్మి కొల్హాపురిలో స్థిరముగా నిలిచినది. కొల్హుణ్ణి సంహరింపబడిన ప్రాంతము కనుక అతని పేరుతో కొల్హాపురిగా ప్రసిధ్ధి కెక్కినట్లు స్థలపురాణము తెలుపుచున్నది.
కొల్హాపురి శ్రీమహాలక్ష్మీ దేవి ఆలయ విశిష్టతలు:
- భక్తిలే స్వయముగా శ్రీమహాలక్ష్మి అమ్మవారి గర్భాలయములొకి వెళ్ళి పూజలు చేసుకునే వీలు వుండటము ఈ ఆలయము లోని విశేషము.
- శ్రీమహాలక్ష్మి అమ్మవారి మూలవిరాట్ మూర్తి శివలింగాకృతి లో ఉంటుంది.
- దేవాలయము నల్ల రాతి కట్టడము, గుడి పైభాగములో ఐదు గోపురములుతో భాసిల్లుతోంది. గర్భగుడిపై శిఖరము ఎత్తుగా ఉంటుంది.
- గర్భాలయము వృత్తాకారములో శ్రీచక్రాకారములో కట్టుబడి ఉండతము విశేషము.
- ఆలయ ప్రాంగణములో 64 మంది యోగినీ దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు సాక్షి గణపతి ఆలయము పై సింధూర వర్ణములో దర్శనమిస్తారు. మన దర్శనానికి ఈతను సాక్షిగా ఉంటాడని నానుడి.
- గర్భగుడిలో ఆదిశంకరులచే ప్రతిష్ఠింపబడిన శ్రీయంత్రము కలదు.
- ఈ క్షేత్ర మహిమ కాశీఖండము, పద్మ పురాణము, దేవీభాగవతము, స్కాంధ పురాణము, మార్కండేయ పురాణములలో ప్రత్యేకముగా కొనియాడబడినది.
- మొట్టమొదట పరశురాముడు దేదేవాలయ ఉధ్ధరణ చేసినట్లు ప్రశస్తి.
- దీపావళి నుండి పూర్ణిమ వరకు శ్రీజగద్గురు ఆదిశంకరాచార్యులు, ఛత్రపతి శివాజి వారి ప్రీత్యర్థం ప్రత్యేక హారతులు ఇవ్వడం పరిపాటి.
- 13వ శతాబ్దములో శృంగేరీ శ్రీవిద్యాశంకరభారతీస్వామీ వారు ఈ క్షేత్రాన్ని దర్శించి పంచ గంగా తీరములో శ్రీ శంకర మఠము స్థాపించారు.
- మంగళ, శుక్రవారములలో అమ్మవారికి విశేషముగా ఆకారతి, పంచరతి, కాపూరతి హారతులు ఇస్తారు. అథిక సంఖ్యలో భక్తులు ఈ హారతులు తిలకించి ముక్తి పొందుతారు.
- ప్రత్యేక దినములగు త్ర్యంబులి జాతర, రథోత్సవము, అష్టమి జాతర, గ్రహణములు, గోకులాష్టమి, కిరణోత్సవ దినములలో విశేష పూజలతో హారతులు ఇస్తారు.
కిరణోత్సవములు:
ప్రతి సంవత్సరము ఉత్తరాయణములో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలో, దక్షిణాయనములో నవంబర్ 7, 10, 11 తేదీలలో సూర్య భగవానుడు తొలి కిరణములతో అమ్మవారి మూలవిరాట్ పై కిరణోత్సవములు ప్రసరిస్తాడు. మొదటి రోజు పాదాల మీద, రెండొవ రోజు వక్ష స్తలము మీద, మూడొవ రోజు నుదిటి మీద కిరణములు ప్రసరిస్తాయి. దీనినే కిరణోత్సవములు గా ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
త్య్రంబులి అమ్మవారు
త్య్రంబులి అమ్మవారు శ్రీమహాలక్ష్మి ఆలయానికి తూర్పున కొండపై స్వయంభూవుగా చతుర్భుజాలతో శోభిల్లే తల్లి. అమ్మవారికి వెనుక వైపుగా అవతరించినది. కొల్హుడి కుమారుడైన కామాక్షుడు తపః శక్తితో యొగదండాన్ని పొంది రాజ్యము పైకి దండెత్తి వచ్చినప్పుడు మహాలక్ష్మి త్య్రంబులిని కామాక్షుడి పైకి యుధ్ధానికి పంపినది. త్య్రంబులి, కామాక్షుణ్ణి యుధ్ధంలో ఓడించి యోగదండన్ని పొందినది. మహాలక్ష్మి త్య్రంబులిని పిలవడం మరిచి విజయోత్సవములు జరుపుకొన్నది. దీనితో త్య్రంబులి దేవీ మహాలక్ష్మీ అమ్మవారిపై అలిగి వెనుకకు తిరిగి నిలుచింది. విషయము తెలుసుకొన్న శ్రీమహాలక్ష్మీ అమ్మవారు పశ్చాత్తాపడినా, ఎంత వేడుకున్నా త్య్రంబులీ దేవీని ప్రసన్నము చేయలేక పోయెను. తరువాత త్య్రంబులి దేవి ఆఙ్ఞ మేరకు ప్రతి పంచమినాడు తనను చూడడానికి వస్తానని శ్రీమహాలక్ష్మి మాట యిచ్చింది. నవరాత్రులలో అశ్వని పంచమినాడు శ్రీమహాలక్ష్మి పరిచారిక రూపములో త్య్రంబులి దేవి దర్శనము చేస్తారని నానుడి.
ఉప ఆలయములు:
ఈ క్షేత్రములోని ఆలయములు:
- శ్రీ సూర్యనారాయణాలయము
- శ్రీ విఠలాలయము
- శ్రీ రాధకృష్ణాలయము
- శ్రీ స్వామి సమర్థ ఆలయము
- నవగ్రహములు
- శ్రీ దత్తాలయము
- శ్రీ జగద్గురు ఆదిశంకరాచర్యాలయము
- శ్రీ లక్ష్మీనారాయణాలయము
- శ్రీ రామాలయము
ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కపిలేశ్వరుడు. ఇతన్ని దర్శించిన తరువాతే శ్రీమహాలక్ష్మిని దర్శించుట పరిపాటి.
శ్రావణమాసములో నవరాత్రి ఉత్సవములు కన్నుల పండుదగా ఉంటాయి. అమ్మవారిని లక్ష్మి, పార్వతీ, సరస్వతులుగా వివిధ వాహనాలతో పుర వీధులలో ఊరేగిస్తారు. ఆ వైభోగము చూసి తరించవలసినది. కోరిన వరాలిచ్చే కొంగు బంగారముగా భక్తిని, ముక్తిని ప్రసాదించే క్షేత్రముగా ప్రశంత వదనముతో చిరుమందహాసముతో తన వద్దకు వచ్చే భక్తులకు ఆ జగన్మాత శ్రీమహాలక్ష్మి అమ్మవారు చతుర్భుజాలతో అభయమిస్తూ కనిపిస్తుంది.
|| సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణ మస్తు ||
సంపాదకీయము: శ్రీ కనకదుర్గ ప్రభ