స్త్రీలు |
కరక చతుర్థి వ్రతం
స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే 'కరక చతుర్థి' వ్రతాన్ని కార్తీక బహుళ చవితి రోజున చేస్తారు. సాధారణంగా కార్తీక పౌర్ణమితో కార్తీకమాస విశిష్టత పూర్తవుతుందని చాలామంది అనుకుంటూ వుంటారు గానీ.. ఇందులో నిజంలేదు. కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే సోమవారాలే కాదు.. మిగతా రోజులు కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఈ రోజుల్లో కూడా ఆచరించదగిన నోములు.. వ్రతాలు ఎన్నో చెప్పబడ్డాయి.
కార్తీక పౌర్ణమి రోజున అనేక దీపాలను వెలిగించి. శివయ్యకి ఆనందాల హారతులు పట్టిన తరువాత, 'కార్తీక బహుళ పాడ్యమి'. ' కార్తీక బహుళ విదియ'.. 'కార్తీక బహుళ తదియ' వస్తాయి.
కార్తీక బహుళ పాడ్యమి రోజున 'లావణ్యా వ్రతం'.. కార్తీక బహుళ విదియ రోజున 'అశూన్య వ్రతం' కార్తీక తదియ రోజున 'భద్రావ్రతం' చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది. ఇక ఆ తరువాత వచ్చే 'కార్తీక బహుళ చవితి' కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగివుంటుంది. స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే 'కరక చతుర్థి' వ్రతాన్ని ఈ రోజున చేస్తారు.
అత్యంత శక్తిమంతమైన... మహిమాన్వితమైన వ్రతాలలో ఒకటిగా కరక చతుర్థి వ్రతాన్ని భావిస్తుంటారు. ఈ కారణంగా చాలామంది ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ... ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, చంద్రోదయం వరకూ ఉపవాసం చేయాలి. శివ పార్వతులతో కూడిన గణపతిని పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది.