దీపావళి - Deepavali |
దీపావళి
సంస్కృతం లో "వళి" అంటే వరుస, దీపావళి అంటే దీపాల వరుస.ఆశ్వీయుజ మాసం చివరి ఐదు రోజులు దీపావళి పండగను జరుపుకుంటాము. దసర పండగ నుండి 20 రోజుల తర్వాత దీపావళి వస్తుంది.
స్కందపురాణం లో చెప్పినట్లు, "శుక్లపక్షం లో అష్టమి తిది నుండి 12 రోజుల వరకు (దీపావళి దాక) "మహా శక్తి వ్రతం" చేస్తారు, దీనినే కేధారవ్రతం అంటాము.ఈ రోజున మహాశివుడు "శక్తి"ని (అమ్మవారిని) తన శరీరంలో అర్ధబాగం గా స్వీకరిస్తాడు. ఈ రూపమే "అర్ధనారీశ్వర రూపం". కలశంని 21 పోగులు గల దారం తో అలంకరించి, 21 నైవేద్యంల తో అమ్మవారిని 35 రోజులు పుజిస్తారు. (35 వ రోజు ) చివరిరోజు చేసే వ్రతాన్ని "కేధార గౌరీ వ్రతం" అంటారు. దీపావళి రోజు లక్ష్మి పూజను చేస్తాము.
దీపావళి ఎన్నెన్నో రకాలుగా, మరెన్నో విధాలుగా కూడా తరతరాలుగా ఆచరణలో కనిపిస్తుంది. ఆంధ్రదేశంలోను, దక్షిణభారతదేశం అంతటా ఈ పండుగను మూడు రోజులు జరుపుకోవటం కనిపిస్తుంది. ఆశ్వయుజ బహుళ చతుర్థశి, అమావాస్య, కార్తీకశుద్ధ పాఢ్యమి ఈ మూడునాళ్ళు ఎంతో పుణ్యప్రదంగా భావించుకుంటూ ఒక వ్రతవిధిని అవలంబిస్తూ ఆచరించటం కనిపిస్తుంది. ఉత్తరాన ఈ పండుగనే ఐదురోజులపాటు జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి, చతుర్థశి, అమావాస్య, కార్తీకశుద్ధ పాఢ్యమి, విదియ. ఈ ఐదురోజులు అక్కడ ఎంతో పర్వదినాలుగా భావిస్తారు. ధనత్రయోదశి (ధన్తేరస్ లేదా యమత్రయోదశి) నరక చతుర్థశి, దీపావళి, బలిపాఢ్యమి, భగినీహస్తభోజనం (భ్రాతృద్వితీయ) లేదా యమద్వితీయగా ఐదురోజులపాటు పండుగను చేసుకుంటారు.
వ్రత గ్రంథాలను పరిశీలిస్తే ఈ పండుగ జరుపుకునే తీరు తెలుస్తుంది. త్రయోదశినాటి రాత్రి అపమృత్యు నివారణకోసం నూనెతో దీపాన్ని వెలిగించి దాన్ని పూజించి ఇంటికి ఎదుట, వెలుపల భాగంలో ఉంచుతారు. దీన్నే యమద్వీపం అని కూడా అంటారు. ఆ మరునాడు నరక చతుర్థశిని జరుపుకుంటారు. లోకకంఠకుడైన నరకాసురుడు భగవానుడు చేతిలో హతమై లోకకల్యాణం జరిగిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ఈ పండుగ ఆనాటి నుంచి అలా ప్రజలంతా జరుపుకుంటున్నారు.
నరకచతుర్థశినాడు నూనెలో లక్ష్మి, నీటిలో గంగ ఉంటాయి కనుక నువ్వుల నూనెతో తలంటుకొని విధి విధానంగా సూర్యోదయానికి ముందే తలంటుస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి ఉత్తరేణు ఆకులు, మట్టిపెళ్ళలతో దిష్టితీయించుకొనే సంప్రదాయం ఒకటుంది. మినప ఆకులను తినటంకూడా అంటే వండించుకొని తినటంకూడ ఓ సంప్రదాయంగా ఉంది. ఆ మరునాడు దీపావళి అమావాస్య రోజున మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల బెరడులను నీటిలోవేసి ఆ నీటితో స్నానంచేయటం ఓ ఆచారం. ప్రదోషకాలల్లో దీపాలను వెలిగించి అనంతరం దారిద్య్రాన్ని పారదోలేందుకు, ఇంట ధనరాసులు నిండేందుకు లక్ష్మీపూజను చేస్తుంటారు. దీపాలను వెలిగించటం, బాణాసంచా కాల్చటం, ఆకాశ దీపాలంటివి అమర్చటం, పితృదేవతారాధన లాంటివి ఈ పండుగనాడు చేస్తుంటారు.
దీపావళి రాత్రి నిద్రపోకుండా జాగరణ చేసి, అర్థరాత్రి వేళ, దరిద్ర దేవతను ఇళ్ళనుంచి, ఊరినుంచి కొంతమంది తరిమేస్తుంటారు. స్త్రీలు చాటలు, తప్పెటలు వాయిస్తూ దరిద్రాన్ని తరమటం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటి ఆవరణలో చక్కగా శుభ్రంచేసి ముగ్గులు తీర్చిదిద్దుతారు. దీపావళి మరునాడు బలిపాఢ్యమిని జరుపుతారు. బలిచక్రవర్తిని వామనవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు పాతాళానికి పంపేటప్పుడు ఆయనను మళ్ళీ సంవత్సరానికి ఒకసారి భూమిమీదకు వచ్చి ఒక్కరోజు పాలించేలా వరమిచ్చిన సన్నివేశాన్ని ఈరోజున జరుపుకుంటారు. ఆ మరునాడు భ్రాతృద్వితీయ. ఈ రోజున సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతివంటను ఆరగించి వస్తారు. ఈ ప్రకారం దీపావళి దేశవ్యాప్తంగా ఆనంద ఉత్సాహాల నడుమ జరుగుతుంటుంది.
సంకలనం: గాయత్రి