Arasavalli Sri Suryanarayana Swamy |
అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం
శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది.
ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట.
150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది. ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి.అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి.
ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఇకపోతే... అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు.
ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. నేడు తుఫాను కారణంగా ఆకాశం మబ్బులు పట్టడంతో ఆందోళన చెందిన భక్తులకు సూర్యకిరణాలు మూడు నిముషాలసేపు మూలవిరాట్టు పాదాలపై పడడంతో భక్తుల ఆనందానికి అంతులేకుండా పోయింది.
సంప్రదించండి..
To
EXECUTIVE OFFICER
SRI SURYANARAYANA SWAMY VARI DEVASTHANAM
ARASAVALLI - 532 401
SRIKAKULAM
ANDHRA PRADESH
INDIA
PHONE : 08942-222421
గూగుల్ మ్యాప్