శ్రీ వరలక్ష్మీ |
శుభప్రదం వరలక్ష్మీవ్రతం
శ్రీ వరలక్ష్మీవ్రత కథ
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.
పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనందసమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది.
అందుకా త్రినేత్రుడు ..దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి.... దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతల్లో ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.
కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్త్తూ ఉండేది.
వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి చాలా సంతోషించింది. హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది... అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది.
అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.
చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకుంది. (శక్తికొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.
శ్రీ వరలక్ష్మీ |
లక్ష్మీ కటాక్షం
మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లు ఘల్లున మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయ మానమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితలయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తువాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుంచి గజ తురగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమె వరలక్ష్మీవ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.
వారంతా ప్రతీ సంవత్సరము వరలక్ష్మీ వ్రతం చేస్తూ సకల సౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి, సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా... శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.
ఈ కథ విని, అక్షతలు శిరసుపె ౖఉంచుకోవాలి. ఆ తరువాత ముత్తయిదువలకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్ధ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసిన వారు కూడా తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి, రాత్రి భోజనాన్ని పరిత్యజించాలి.
॥మంగళం మహత్॥
సకల సంపదలిచ్చే వరలక్ష్మీ వ్రతవిధానం
సర్వశుభాలను, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణమాసంలో ముత్తయిదువలంతా భక్తి ప్రపత్తులతో ఆచరిస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ. ఈ సందర్భంగా నోము నోచుకొనే మహిళల కోసం సశాస్త్రీయమైన పూజా విధానం పాఠకులకు ప్రత్యేకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
(అని ముందుగా గణపతిని ధ్యానించి, తదుపరి ఆచమనం చేయాలి)
ఓం కేశవాయ స్వాహాః (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)
ఓం నారాయణాయ స్వాహా ః (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)
ఓం మాధవాయ స్వాహా ః (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)
ఓం గోవిందాయనమః (చేతులు కడుక్కోవాలి)
ఓం విష్ణవేనమః (కళ్లు తుడుచుకోవాలి)
ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివ్రిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః
ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥
(అనే శ్లోకాన్ని పఠిస్తూ నాలుగు అక్షతలను వెనక్కు వేసుకోవాలి. ఆ తరువాత ఈ కింది మంత్రం పఠిస్తూ ప్రాణాయామం చేయాలి.)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః
ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్
సవితుర్వరేణ్యుం, భర్గో దేవస్య ధీమహి ధియోయోనః
ప్రచోదయాత్, ఓం మాపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భవస్సురోమ్...
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య....... (శ్రీశైలానికి వ్రతం చేసేవారి ఊరు ఏ దిక్కులో ఉందో, ఆ దిక్కుని చెప్పాలి) ప్రదేశే, కృష్ణా, కావేరీ మధ్య దేశే (ఏ నదుల మధ్య ప్రాంతంలో వుంటే ఆ నదుల పేర్లు చెప్పాలి.
సొంత ఇల్లయితే స్వగృహే అని అద్దె ఇల్లయితే శోభనగృహే అని చెప్పాలి) సమస్త దేవతా, బ్రాహ్మణ, హరిహర సన్నిధౌ, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ నందన నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్ల పక్షే నవమ్యాం, లక్ష్మీ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ, శ్రీమత్యాః .... గోత్రస్య.... శర్మణః ధర్మపత్నీ శ్రీమతీ... గోత్రవతీ (గోత్రంపేరు)... నామధేయవతి (పేరు చెప్పుకోవాలి). అస్మాకం సహకుటుంబానాం క్షేమ,స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్యర్ధం, ధర్మార్ధ, కామమోక్ష చతుర్విధ ఫల పురషార్ధ సిద్యర్ధం, సత్సంతాన సౌభాగ్య ఫలాప్రాప్త్యర్ధం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య, శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన మావాహనాది షోషశోపచార పూజాం కరిష్యే (అంటూ కుడిచేతి మధ్య వేలుతో నీటిని తాకాలి).
కలశపూజ
(పూజకు మాత్రమే ఉపయోగించే ఒక గ్లాసును గానీ, పంచపాత్రను గానీ తీసుకుని అందులో నీరు పోసి, అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడు వైపులా గంధాన్ని రాసి, కుంకుమను పెట్టాలి. ఈ విధంగా చేసి, దానిపై కుడిచేయినుంచి కింది శ్లోకాన్ని పఠించాలి)
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పముతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యములపైన, పూజ చేయువారు తలపైన చల్లుకోవాలి.
(గమనిక: పూజలో అవసరమైన సమయంలో ఈ కలశంలోని నీటినే ఉపయోగించాలి. ఆచమనం చేసేందుకు ఉపయోగించే జలాన్ని పూజకు ఉపయోగించరాదు. అలాగే కలశంలోని నీటిని ఆచమనమునకు ఉపయోగించరాదు. ఏ వ్రతంలోనైనా, పూజలోనైనా ఇది తప్పనిసరిగా పాటించవలసిన నియమం) కలశపూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకుని, మండపంలో తమలపాకు పైనుంచి, వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి.
గణపతి పూజ
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
(అనంతరం స్వామివారి ముందు పండ్లుగాని బెల్లాన్ని గాని నైవేద్యంగా ఉంచాలి)
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం, భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్... (నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓం వ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనం సమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
వరలక్ష్మీ పూజ ప్రారంభం
ధ్యానం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహేసురాసురనమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి (అమ్మవారి కలశం ముందు పుష్పాలు ఉంచి నమస్కరించాలి)
ఆవాహనం
సర్వమంగళమాంగల్యే విష్ణువక్షస్థలాలయే అవహయామి దేవీత్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి
(కలశం ముందు అక్షతలు వేయాలి)
సింహాసనం
సూర్యాయుతాని భస్పూర్తేస్ఫుర ద్రత్న విభూషితం సింహాసనమిదం దేవీ స్థియతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)
అర్ఘ్యం
శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామితేదేవీ గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అమ్మవారికి చూపించి ముందున్న అర్ఘ్య పాత్రలో వేయాలి)
పాద్యం
సువాసితజలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)
ఆచమనీయం
సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధాచమనీయం సమర్పయామి (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)
పంచామృత స్నానం
పయోదధిఘృతో పేతం శర్కరా మధుసంయుతం పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృతస్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి)
శుద్ధోదక స్నానం
గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం శుద్ధోదకస్నాన మిదం గృహాణ విధుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి) స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)
వస్త్రం
సురార్చితాంఘ్రియుగళేదుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)
ఆభరణం
కేయూరకంకణే దివ్యేహారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి. (పుష్పాలు ఉంచాలి)
ఉపవీతం
తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం మిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి (దూదితో చేసిన సూత్రం చివర్లలో గంధం రాసి కలశానికి హారంలా అంటించాలి)
గంధం
కర్పూరాగరు కస్తూరీరోచనాది భిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతామ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి (కలశంపై గంధం చిలకరించాలి)
అక్షతలు
అక్షతాన్ ధవళాన్ దేవీ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి (అక్షత లు వేయాలి)
పుష్పం
మల్లికా జాజి కుసుమై శ్చంపకై ర్వకుళై స్తథా శతపత్రైశ్చరైః పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పైః పూజయామి (అమ్మవారి కలశం ముందు పుష్పం ఉంచాలి)
అధాంగపూజ
(పుష్పాలు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి) చంచలాయై నమః - పాదౌ పూజయామి, చపలాయై నమః - జానునీ పూజయామి, పీతాంబరాయై నమః - ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః - కటిం పూజయామి, పద్మాలయాయైనమః - నాభిం పూజయామి, మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠం పూజయామి, సుముఖాయైనమః - ముఖంపూజయామి, సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి, రమాయైనమః - కర్ణౌ పూజయామి, కమలాయైనమః - శిరః పూజయామి, శ్రీ వరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి. (ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
ఓం ప్రకృత్యై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హిత ప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ ప్రదాయై నమః, ఓం బుద్ధ్యె నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీపాయై నమః, ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం లోకశోకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖియై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మ గంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖీయై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్ర రూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యె నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం దారిద్ర నాశిన్యై నమః, ఓం ప్రీతా పుష్కరిణ్యై నమః, ఓం శాంత్యై నమః, ఓం శుక్లమాలాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వ నిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణసీమాశ్రితాయై నమః, ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణతమ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రపయామి ధూపందర్శయామి (అగరువత్తులు వెలిగించి ఆ ధూపాన్ని అమ్మవారికి చూపాలి)
దీపం
ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. (దీపం చూపించి ఉద్ధరిణెతో కొంచె నీటిని అర్ఘ్య పాత్రలో వేయాలి)
నైవేద్యం
నైవేద్యం షడ్రషోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్య పాత్రలో ఉంచాలి)
పానీయం
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్య పాత్రలో ఉంచాలి)
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి, (పండు, పుష్పంతో కూడిన తాంబూలాన్ని అమ్మవారి వద్ద ఉంచాలి)
నీరాజనం
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్తితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నీరాజనం సమర్పయామి (ఘంటానాదం చేస్తూ కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి)
మంత్రపుష్పం
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి)
ప్రదక్షిణ
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవం త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జగధారిణి శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి (ప్రదక్షిణలు చేయాలి)
నమస్కారం
నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి (అమ్మవారికి అక్షతలు వేసి నమస్కరించాలి)
తోరపూజ
తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ కింది విధంగా పూజించాలి. కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి, రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి, లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి, విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మీయై నమః - నవమ గ్రంథిం పూజయామి.
ఈ క్రింది శ్లోకములు చదువుతూ తోరము కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
వాయనం ఇవ్వడం
వాయనం ఇచ్చేటప్పుడు ఈ కింది శ్లోకం చదవాలి.
ఏవం సంపూజ్యకళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వైదదాతిచ
ఇందిరా తారకోపాభ్యాం ఇందిరాయై నమోనమః
(వాయనం ఇచ్చాక కథ చదివి అక్షతలు శిరసుపై వేసుకోవాలి)
వ్రతమునకు కావలసిన వస్తువులు
పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెవస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధానకు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యము, శనగలు మొదలైనవి.
పూజకు సమాయత్తం
వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో ఉంటే అక్కడ అందంగా అమర్చుకోవాలి. పూజా సామగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.
తోరం ఎలా తయారు చేసుకోవాలి?
తెల్లటి దారమును ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారమును ఉపయోగించి, ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరాలను తయారుచేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.