నటరాజ! |
మహాశివరాత్రి
మాఘమాసం దేవయాణానికి అంకురార్పణ చేసింది, ఉత్తరాయణాన్ని దేవయాణం అని, దక్షిణాయనాన్ని పితృ దేవయాణం అని మన సంప్రదాయం చెబుతుంది. మాఘ మాసంలో పవిత్ర పర్వదినాలు వస్తాయి. వాటిలో మహాశివరాత్రి ఈ నెలలోనే వస్తుంది. ప్రతీనెల బహుళపక్షంలో 14వ రోజున మాసశివరాత్రి కాగా, మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది. పద్మ పురాణం, స్కాంద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, శివ సంబంధమైన ఈ మహాశివరాత్రి గురించి విశేషంగా వర్ణించాయి.
ఈరోజు శివారాధనం, శివసాన్నిధ్యంలో జాగారం జన్మ విహితాలయ్యాయి. ఈరోజున ఈశ్వరుణ్ణి అభిషేకాలతో, బిల్వపత్రాలతో, తుమ్మి పూలతో భక్తి శ్రద్దలతో విశేషంగా అర్చిస్తారు. ఖగోళ పంచాంగ విజ్హానం ప్రకారం నిర్దేశితమైన శివ వైభవాన్నిలా స్మరిద్దాం!
ధ్యాయేన్నిత్యం మహేశం రజితగిరినిభం చారు చంద్రావతంసం ।
రత్నకల్పోజ్జ్వలాంగం పరశు మృగ వరాభీతి హస్తం ప్రసన్నం ॥
పద్మాసనం సమం తత శ్రుత మమర గుర్వ్యాఘ్రు కృత్తివాసం ।
విశ్వాద్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం ॥
పన్నెండు మాస శివరాత్రులలోకి ప్రధానమైన పర్వదినం మాఘ బహుళ చతుర్దశి (అమావాస్యకు ముందు వచ్చేది). నేడు ఈశ్వరుడు సాకారము, నిరాకారము అయిన లింగాకారంలో స్వయం ప్రకటితమైన రోజు కాబట్టి, దీనికి ' మహాశివరాత్రి” అని పేరు.
శివరాత్రి పర్వకాల నిర్ణయ విషయంలో ఒక ముఖ్యమైన నియమాన్ని శాస్త్ర గ్రంథాలు తెలిపి ఉన్నాయి. అదేమిటంటే ఆరోజు బహుళ చతర్జుశి తిథి అర్ధరాత్రి వరకు ఉండాలి. అర్ధరాత్రి కనుక బహుళ చతుర్దశి లేని పక్షంలో అమావాస్య గనుక ప్రవేశించినట్లయితే అంతకు ముందు రోజునే శివరాత్రి పండుగ జరపాలి. రెండు రోజుల్లో ఏ రోజు చతుర్దశివుందో ఆ దినమే మహాశివరాత్రిగా పరిగణించాలి. దీనికి తోడు ఈ మహాశివరాత్రి గనుక మంగళవారం వస్తే అది అత్యంత ప్రశస్తం అని ధర్మ గ్రంధాలు చెబుతున్నాయి. /